"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

05 మే, 2008

త్వరలో డా.ద్వానాశాస్త్రి గారికి షష్టి పూర్తి !


ఈ మధ్య నన్నొకాయన చాలా సీరియస్ గా ఒక మాట అడిగాడు. "నీకు బ్రాహ్మణులంటే ద్వేషమా?" అని!
నాకు బ్రాహ్మణులే కాదు, ఎవరిమీదా వ్యక్తిగతంగా ద్వేషం లేదు" అన్నాను.
మరి నీ మాటల్లో, ప్రసంగాల్లో, రాతల్లో బ్రాహ్మణ వ్యతిరేకత కనిపిస్తుంది కదా!" అని అనుమానంగా నా వైపు చూశాడా పెద్దమనిషి.
నన్నింత బాగా అర్థం చేసుకున్నందుకు ఆయనకేమి చెప్పాలో నాకర్థం కాలేదు- కాసేపు!
ఆయన ఏ విషయాన్నెలా అర్థం చేసుకుంటాడో కదా అని కాస్త జాలీ కలిగింది.
అయినా... మనం ప్రతి మనిషినీ ఏదో ఒక్కోణం నుండే చూస్తాం. కొన్ని సార్లు ముందే ఎవరో చెప్పిన అభిప్రాయాల్ని అన్వయించుకొంటూ, మనం మళ్ళీ అదే మార్గం లో అంచెనా కొస్తుంటాం. మన సొంత ఆలోచనలు పక్కకి పోతుంటాయి. వ్యక్తిగతం, వ్యవస్థీకృతం వేర్వేరు. అవి రెండూ ఒక్కోసారి కలిసిపోతుంటాయి. వాటిని విడిగా అర్థం చేసుకోలేనప్పుడు మనం అలాగే అవగాహన చేసుకుంటాం. నేనూ సామాన్య మానవుణ్ణే! నాకూ కొన్ని అనుభూతులుంటాయి. కులమే అన్నింటికీ ప్రాతిపదిక కాదు. కానీ, కులమే చాలా వాటికి కారణమవుతుంది.వ్యక్తిగతమైన సంబంధాలు, వ్యవస్థకంతటికీ ముడిపెట్టలేం. కనుక, ఆ ద్వేషం వ్యవస్థపైనా? వ్యక్తిపైనా ? అనేది గుర్తించుకోవాలి. నా విషయంలోనే వ్యక్తిగతంగా చూస్తే నేనీ స్థాయిలో ఉండడానికి ఎంతోమంది బ్రాహ్మణులు కూడా కారణమయ్యారు. అలాంటి వారిలో డా.ద్వా.నా. శాస్త్రి ( ద్వాదశి నాగేశ్వర శాస్త్రి ) గారొకరు. ఇప్పుడు ఆయన గురించి నా మాటల్లో... అదే నా రాతల్లో..!
***
నేను ఇంటర్మీడియెట్ నుండి డిగ్రీ వరకూ స్పెషల్ తెలుగు ఒక ప్రత్యేకాంశంగా అమలాపురంలో చదువుకున్నాను. అక్కడో గొప్ప కాలేజీ ఉంది. దాని పేరు శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజ్. దాన్నిపొడి అక్షరాల్లో ఎస్. కె. బి. ఆర్. కాలేజ్ అని పిలు్స్తారు. ఆ పరిసర ప్రాంత విద్యార్ధినీ విద్యార్ధులకి ఆ కాలేజీలో సీటొచ్చిందంటే గొప్ప ఆనందం. అప్పుడే జీవితంలో ఏదో సాధించామనే ఫీలవ్వుతుంటారు. ఆ కాలేజీలో చదవడం ఒక అదృష్టం అన్నవాళ్ళను చూశాను. అందులో చదువుకోవడం గొప్పవరంగా భావించే వాళ్ళనీ చూశాను. దానికి వాళ్ళు రకరకాల కారణాల్ని చెప్తుంటారు.
నన్ను అడిగినా నేనూ అలాగే చెప్తాను. అయితే, ఆ కాలేజీలో చేరాలనుకున్నది మాత్రం ఒక గొప్ప రచయిత దగ్గర చదువుకోవాలనుకోవడమే ప్రధాన కారణమని చెప్తాను.
ఆయనే డా// ద్వానాశాస్త్రి గారు!
ఆ కాలేజీలో చేరక ముందే ఆయన గురించి నాకు కొద్దిగా తెలుసు. పత్రికల్లో తెలుగు సాహిత్యం గురించి విస్తృతంగా రాసే రచయితగా తెలుసు. ఆ కాలేజీలో చేరేవరకూ నేను ఆయన రూపాన్నెప్పుడూ చూడలేదు. ఆయన మాటల్ని కూడా అంతకు ముందెప్పుడూ విన్లేదు. పత్రికల్లో ఆయన రాసే రచనలను బట్టే ఆయన తెలుసు. తెలుగు సాహిత్యాన్నిఅందరికీ అందిచడానికి ఆయనేదో నడుముకట్టారనిపించేది.
మా కోనసీమ కేంద్రం అమలాపురంలో విస్తృతంగానే సాహిత్య సభలు జరుగుతుంటాయి. ఆ వార్తలను పత్రికలు కూడా ఫోటోలతో సహా ప్రముఖంగానే ప్రచురిస్తుంటాయి. వాటిని బాగా గమనిస్తుండేవాడ్ని.
ఆ సాహిత్య వార్తల్లో నేను కూడా ఒక వ్యక్తిని కావాలనిపించేది!
ఆ కాలేజీలో చేరకముందు మా సామాజిక వర్గంలో ఎవరూ సాహిత్యం రాసిన వారు లేకపోవడం గమనించాను. హైస్కూల్లో చదివేటప్పుడు తెలుగు మాష్టారు శ్రీకంఠం లక్ష్మణమూర్తి, సోషల్ మాష్టారు ఆతుకూరి లక్ష్మణరావు గార్లు నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఇద్దరూ బ్రహ్మణ కులానికి చెందినవాళ్ళే! అయినా నన్ను ఎంతగానో ఇష్టపడేవారు. నాకూ వాళ్ల వృత్తులూ, ప్రవృత్తులూ బాగా నచ్చేవి.
అందులో ఒకరు శ్రీకంఠం లక్ష్మణమూర్తి తెలుగు సాహిత్యాన్ని గొప్పగా చెప్పేవారు.
మరొకరు ఆతుకూరి లక్ష్మణరావు గారు స్థానిక సమస్యల పరిష్కారం గురించీ ఆలోచించేవారు. రోడ్లు బాగుండక పోయినా, వీధి దీపాలు వెలగకపోయినా పత్రికల ద్వారా ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేవారు. పత్రికల్లోని వార్తలను స్కూల్లో బ్లాక్ బోర్డ్ పై రాయించేవారు. అలా రోజూ వార్తలను పత్రికల నుండి సేకరించి, వాటిని ఆయనకు చూపించిన తర్వాత మా చేతనే బోర్డ్ పై రాయించేవారు. మంచి వార్తలను సేకరించగలిగిన వాళ్లకు, రెగ్యులర్ గా వార్తలను సేకరించే వాళ్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా ఇచ్చేవారు. ఆ విధంగా ఆ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని బహుమతి సాధించడం కోసమైనా పత్రికలను చదవడానికి ఆసక్తి చూపించే వాళ్ళం. నాకు ఎనిమిదో తరగతిలో ప్రథమ బహుమతి వచ్చింది. అప్పుటి నుండే పత్రికల్లో డా//ద్వానాశాస్త్రి గారి పేరు ఎన్నోసార్లు చదివాను. ఆయన రాసిన వ్యాసాల్ని కూడ వార్తలుగా మా మాష్టారు దగ్గరకు రాసికెళ్ళి పట్టుకెళ్ళి చూపించేవాడిని. వాటిని సాహిత్య వ్యాసాలంటారనీ, వాటినీ వార్తాంశాలుగా పెట్టవచ్చంటూ చెప్పేవారు. అలా ఆయన నన్ను ఆ సాహిత్య పేజీలను కూడా చదివించేటట్లు ప్రోత్సహించేవారు. ఆ విధంగా పత్రికలు చదవడమే కాకుండా, స్థానిక సమస్యల గురించీ రాసేవాడిని. కథలు, వ్యాసాలు చదివి వాటిపై నాకు తోచిన అభిప్రాయాలనూ పత్రికలకు రాసి పంపించేవాడ్ని.
నాకు కూడా పత్రికల్లో పేరు చూసుకోవాలనీ, అదీ సాహిత్యం పేజీల్లో నా వ్యాసాలు రావాలనీ అనుకొనేవాడ్ని. ఎలా రాస్తే పత్రికల్లో వ్యాసాలు వస్తాయో డా// ద్వానాశాస్త్రి గార్ని అడిగితే బాగుంటుందనీ అనుకుంటుండేవాడ్ని! అందుకోసమైనా ఆ కాలేజీలో చేరాలనుకున్నాను.
నేను అనుకున్నట్లే, ఇంటర్మీడియెట్ చదువుకోవడానికి ఎస్.కె.బి.ఆర్. కాలేజీలో సీటొచ్చింది. అప్పుడు కాలేజీ షిప్టు సిస్టమ్‌ లో నడిపేవారు. మాకు ఉదయమే క్లాసులు జరిగేవి. మొదట్లో ఆ క్లాసులకు డా// ద్వానాశాస్త్రి గారు వచ్చేవారు కాదు.
కొన్ని రోజులు జరిగి పోయాయి.
డా// ద్వానాశాస్త్రి గార్ని కలవలేకపోయాను.
లెక్చరర్స్ ని కలవాలంటే భయం కదా!.
దానికి అనేక కారణాలు.
మా కాలేజీలో వార్షిక సంచికకు విద్యార్థి ప్రతినిథులను సృజనాత్మక పోటీల ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్ ఫస్టియర్ లో ఉండగా నిర్వహించిన వ్యాస రచన పటీల్లో నాకు ప్రథమ బహుమతి వచ్చింది.సంపాదక వర్గంలో తెలుగు ప్రతినిథిగా నన్ను ఎంపిక చేశారని కాలేజీ వాళ్ళు నోటీసు పంపించారు. అది చూసి,డా// ద్వానాశాస్త్రి గారు నాకు కబురు పెట్టి మరీ అభినందించారు.
ఎవరి కోసమైతే కాలేజీలో చేరానో, ఆయనే నన్ను దగ్గరకు పిలిచి మరీ అభినందించే సరికి నా ఆనందానికి అవధుల్లేవు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన కూడా మాకు పాఠాలు చెప్పడానికి వచ్చేవారు. కేవలం పాఠాలే కాకుండా, వక్తృత్వ పోటీలకు శిక్షణ కూడా ఇచ్చేవారు. ఇతర కాలేజీలకు తీసుకెళ్ళేవారు. మా గురువు గారి అబ్బాయి కూడా అదే కాలేజీలో బి.ఎస్సీ., చదువుతుండేవాడు. అతను కూడా పోటీల్లో పాల్గొనేవాడు. అయినా గాని గురువు గారు నాకూ అనేక మెళకువలను చెప్పేవారు. ఆ పోటీల బృందంలో నేను ఒక్కడినే దళితుడ్ని కా వడం వల్ల సహజంగానే కొంత బిడియ పడుతుండే వాణ్ణి. అలాంటి సమయంలో నన్ను మా గురువు గారు, వాళ్ల అబ్బాయి, మిగతా వాళ్ళు నన్ను దళితుడ్ననే స్పృహ రానివ్వకుండా కలిసి మెలిసి ఉండేవారు. ఇతర ప్రాంతాల్లోని కాలేజీల్లో పోటీలకు వెళ్లేటప్పుడు అక్కడకి వెళ్ళి అందరం కలిసే పడుకొనేవాళ్లం. కలిసే తినేవాళ్లం. అప్పుడే నాకు ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా పరిశీలించగలిగే అవకాశం కలిగింది. వాళ్ళు సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చి కూడా నా పట్ల ఎప్పుడూ వివక్షను ప్రదర్శించకపోవడం నేటికీ ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది.
మా గురువు గారు నన్ను సాహిత్య సభలకు పిలిచి మరీ తీసుకెళ్ళేవారు. నేను డిగ్రీలో ఉండగా రాజమండ్రిలో భారతీయ సాహిత్య పరిషత్ సభలు జరుగుతుంటే వాళ్ళ అబ్బాయితో పాటు నన్ను కూడా తీసుకెళ్ళారు. దారి ఖర్చులు కూడా ఆయనే పెట్టుకున్నారు. ఆ సభలు మూడు రోజులు జరిగాయి. గొప్పసాహితీ వేత్తల్ని ఎందర్నో అప్పుడే చూశాను. వాళ్లకి నన్ను పరిచయం చేసేవారు. కవిత్వం రాస్తాడనీ, మా విద్యార్థేననీ వాళ్లకి నా గురించి చెప్పేవారు. ఆ మాటలు నాకెంతో టానిక్కులా అనిపించేవి. ఆచార్య ముదిగొండ శివప్రసాద్, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర ఆజాద్ వంటి వాళ్ళనెందరినో ఆ సభల్లోనే మొట్ట మొదటిసారిగా చూశాను. వాళ్ల ప్రసంగాల్లో ఏదో గొప్ప శక్తి ఉందనిపించేది. చదివితే తెలుగు సాహిత్యమే చదవాలనిపించేది. వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్లతో మాట్లాడడం ఒక గొప్ప థ్రిల్లుగా అనిపించేది. తర్వాత వాళ్ళ పేర్లతో ఏదైనా రచన కనిపిస్తే దాన్ని చదివి లేఖలు రాసేవాడిని. చంద్రశేఖర ఆజాద్ గారి కథలు చాలా ఆసక్తిని కలిగించేవి. బాల సాహిత్యాన్ని బాగా రాసేవారాయన. వాటిని చదివి నా అభిప్రాయాలను కార్డ్ పై రాసేవాడ్ని. గుండ్రని అక్షరాలతో సమాధానాలు రాసేవారాయన. అలా చాలా మందితో పరిచయాలు ఏర్పడడానికి మా గురువు గారు డా//ద్వానాశాస్త్రి గారే ప్రధాన కారణం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో చేరిన తర్వాత కూడా మా గురువు గారు డా//ద్వానాశాస్త్రి గారితో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేవి. అప్పుడప్పుడూ నా కవితలు పత్రికల్లో వస్తుండేవి. వాటి గురించి గురువు గార్కి ఉత్తరాలు రాసి అభిప్రాయం చెప్పమనేవాడ్ని.అనేక సలహాలిచ్చేవారు. ఆయన రాసిన తెలుగు సాహిత్య చరిత్ర లో నా గురించి కూడా రాశారు. హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఫోను చేసేవారు. కలిసేవాడ్ని. పుస్తకాలు ఎలా సేకరించుకోవాలో నేర్పారు. ఆదివారం హైదరాబాదులో అబిడ్స్ పరిసరాలన్నీ పాత పుస్తకాలతో కళ కళ లాడతాయనీ, అందులో చాలా విలువైన పుస్తకాలు దొరుకుతాయనీ చెప్పేవారు.
అలా నాకు ఎంతగానో గుర్తుండి పోయే అనేక సంఘటనలను స్మృతి పథం నుండి అక్షర రూపమివ్వడానికి వారి షష్టి పూర్తి సందర్భంగా అవకాశం కలిగించినందుకు కృతజతలు తెలియజేస్తున్నాను.
మా గురువు గారు ఆయురారోగ్యాలతో సంపూర్ణమైన జీవితాన్ని ఆనందమయంగా గడపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

దార్ల గారు,బ్రాహ్మణులలోనే బ్రహ్మద్వేషి అని ముద్రపడ్డవాళ్ళున్నారు.దళితులగురించి,ఇతర బలహీనవర్గాల గురించి మాట్లాడే మీ వంటి వారిని అలాఅనటం కొందరికి చాలా సహజం.మీరు నమ్మిన దారిలో మీరు సాగిపోండి,మీ గురువు గారి లాంటివాళ్ళు ఎందరో మీకు సహకరిస్తారు.