"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

21 April, 2007

బహుజనకెరటాలు ప్రత్యేక సంచిక విడుదల


దళితఉద్యమం, సామాజిక న్యాయం, కింది కులాల , పీడిత వర్గాల సమైక్య స్పూర్తి తో రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ఆ భావస్పూర్తిని అందించే నిబద్దతతో వెలువడుతున్న బహుజన కెరటాలు మాసపత్రిక ఈ నెల( ఏప్రిల్ -2007) సంచికను డా.బి.ఆర్ . అంబేద్కర్ జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక గా వెలువరించారు. ఈ సంచికను మంచి వ్యాసాలు, కవితలతో దాచుకోదగినట్ల్లుగా రూపొందించారు. కలేకూరి ప్రసాద్ రాసిన సంపాదకీయం సమకాలీన సమాజంలో అంబేద్కర్ ని ప్రతివాళ్ళూ ఎలా స్వంతం చేసుకోవడానికి ప్రయత్న స్తున్నారో విశ్లేషణాత్మకంగా వివరించింది. అయితే, ఎస్.సి వర్గీకరణ ప్రభావాన్ని కనీస మాత్రంగా కూడా స్పర్శించక పోవడం సంపాదకీయానికి చిన్న లోపంగానే కనిపిస్తుంది. డా.పి. కేశవకుమార్ రాసిన వ్యాసంలో మాల- మాదిగల మధ్య నలుగుతున్న వర్గీకరణ విషయాన్ని కూడా స్పర్శించగలిగారు. పత్రికకు ఈ వ్యాసం ఒక హైలెట్ . డా.బి.ఆర్ . అంబేద్కర్ బౌద్ద్గాన్ని స్వీకరించవలసిన అవసరం, ఆ నేపథ్యాలను వివరిస్తూ కత్తిపద్మారావు రాసిన పరిశోధనాత్మక వ్యాసం ప్రతిఒక్కరూ చదవదగినది. దళిత సాధికారత, భూసంస్కరణలు , అంబేద్కరిజం పరిధులను గురించి ఇంకా మంచి వ్యాసాలున్నాయి. దేవీదయాల్ హిందీలో రాసిన అంబేడ్క్ ర్ దినచర్యను డా.జి.వి. రత్నాకర్ తెలుగులోకి అనువాదం చేశారు. దాన్ని డా.దార్ల వెంకటేశ్వరరావు సమీక్షించారు. అలాగే ' ముస్లింలు - అంబేద్కర్ ' గురించి ఆంగ్లంలో డా.ఆనంద్ తేల్ తుంబ్డే రాసిన గ్రంధాన్ని చంద్రిక తెలుగులోకి అనువాదం చేశారు. దాన్ని బత్తుల కాంతయ్య సమీక్షించారు. ఈరెండు గ్రంథాలూ అంబేద్కర్ ని కొత్త కోణంలో చూపించగలిగాయి.నేతల ప్రతాప్ కుమార్ రాసిన ' అన్నం గిన్నె ' కవిత ఆర్థ్రం గా ఉంది. " అన్నం గిన్నెలో ఎప్పుడూ/ఆ విగ్రహమే కనపడుతుంద" ని డా.బి.ఆర్ . అంబేద్కర్ విగ్రహం చూసినప్పుడల్లా దళితుడు పొందే అనుభూతిని వర్ణించగలిగారు. " ఆత్మ గౌరవప్రతీక "గా అభివర్ణిసూ డి.సిద్దార్థ రాసిన కవిత కూడా దళి తులు అంబేద్కర్ విగ్రహాన్ని చూసినప్పుడు కలిగిన భావాలనే అక్షరీకరిస్తుంది. కవిత్వమైతే బాగానే ఉంది గానీ..." విగ్రహాన్ని" కవిత్వీకరించుకోవడంలో హిందువులు చేసే విగ్రహారాధనకు దగ్గరగా దళితులు చేరుకుంటున్నారేమో గుర్తెరిగి వర్ణంచ వలసి ఉంది. అయితే, హిందువులు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి, దాన్ని పవిత్రీకరిస్తారు. అంబేడ్కరిష్టులు విగ్రహంలో ఒకచారిత్రక వ్యక్తి సాధించిన విజయస్పూర్తిని గుర్తిస్తారు. రెండింటికీ గల భేదాలను గ్రహించలేక సామాన్యులు ఒకటే అనుకొనే ప్రమాదం ఉంది. అందువల్లనే దీన్నీ విగ్రహారాధనగా పొరపడుతుంటారు. అయినా విగ్రహారాధన పట్ల దళితులు జాగ్రత్త వహించవలసి ఉంది. లేక పోతే అది చాలా చెడు ప్రభావాలను కలిగిస్తుంది. ఇప్పటికే బుద్దుడినీ, అంబేద్కర్ నీ ( ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అంబేద్కర్ ని దశావతారాల్లో కలిపే ప్రయత్న చేశారు)అవతారాలుగా కీర్తించే ఒక సంప్రదాయం మొదలయ్యింది. దాన్ని ఆదిలోనే ఆపుకోక పోతే అనేక అనర్థాలకి దారితీస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సంచికలో డా ఎండ్లూరి సుధాకర్ గారి కవిత అలతి అలతి పదాలతో అనంతమైన అర్థాన్నిస్తుంది.
"అతడు జాతి బువ్వ

అతడు వెలుగు తొవ్వ

అతడు వాడ మువ్వ

అతడు నిప్పు రవ్వ" ఇలా సాగిపోయిందా గేయ కవిత. డా. చల్ల పల్లి స్వరూపారాణి, ఖాజా, వినోదిని, డా.బద్దిపూడి జయరావు ల కవితలు బాగున్నాయి. డా.జి.వి.రత్నాకర్ అనువాద కవిత కూడా చాలా బాగుంది. ఖాజా కవిత దళితుల్లో తయారవుతున్న కొత్త వర్గాన్ని వర్ణించింది.తమలో ఉన్న అంతర్గత లోపాలను కూడా సరిదిద్దు కొని ఉద్యమం ముందుకి పోవడానికి ఇలాంటి రచనలు అవసరం కూడా దళితులు గుర్తించవలసి ఉంది. సంచికలో గోరేటి వెంకన్న, మద్దూరి నగేష్ బాబు లు రాసిన రెండు ఉన్నాయి. గోరేటి వెంకన్నపాటలో సంస్కృత శబ్దాలెక్కువయ్యి, పాట తనానికేదో లోపం ఏర్పడినట్లని పించింది. అంబేద్కర్ భావజాలాన్ని వివరించే కథలను కూడా ప్రచురించి ఉంటే సంచిక మరింత బాగుండేది. ఏది ఏమైనా ఓ మంచి ఆశయంతో వెలువరించిన ఈ సంచిక అందరూ కొని చదవదగిది.
పత్రిక వివరాలు :
బహుజన కెరటాలు ( మాస పత్రిక )
ఎడిటర్, బుద్దకోటి
వర్కింగ్ ఎడిటర్ , నూకతోటి రవికుమార్
కడియం నాగమణి ( Publisher & Owner)
c/o. ఎస్ .ఆర్ .పల్నాటి.
రాజగృహ, 4/15/ఆర్. టి. సి. స్తాఫ్ కాలనీ.
సత్యనారాయణ పురం,ఒంగోలు -2
ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
ఏప్రిల్ 2007 ప్రత్యేక సంచిక వెల : రూ/10.00
సంవత్సర చందా : రూ/ 150.00
జీవిత చందా : రూ/ 2500.00




No comments: