"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

23 March, 2007

స్ఫూర్తినిచ్చే 'అంబేడ్కర్ దినచర్య'

దార్ల వ్యాసాలు దగ్గరకు దారి

"ఏ పనైనా చేయాలంటే మనిషిలో సంకల్పం, సంయమనం, మరియు ఏకాగ్రత ఖచ్చితంగా కావాలి. నేను, సంకల్పం, సంయమనం లేనివారిని అసహ్యించుకుంటాను." - ఈ మాటలు అన్నది ఎవరో కాదు, డా. బి.ఆర్. అంబేడ్కర్‌. ఆయన గురించి దళిత చైతన్యం ఉన్న ప్రతి రచయితా ఏదో ఒక రూపంలో రాశారు. సీతారాముల కథను తెలిపే రామాయణాన్ని మళ్ళీ మళ్ళీ రాయటం తమ జీవన్ముక్తికి మార్గంగా చాలా మంది భావిస్తారు. మళ్ళీ మళ్ళీ రామాయణాన్ని రాయవలసిన అవసరం ఏమిటో విశ్వనాథ సత్యనారాయణ గారు "మరల నిదేల రామాయణంబన్నచో" పద్యంలో విశదీకరించారు. రామాయణం రాయడం హిందువులకు పవిత్రదాయకమైతే అంబేడ్కర్ గురించి చెప్పటం, రాయటం దళితులకు విముక్తి మార్గంగా భావిస్తారు. దీనిలో భాగంగానే దేవీ దయాళ్ అంబేడ్కర్ గారి దినచర్య హిందీలో ఒక పుస్తకంగా రాశారు. దాన్ని డా.జి.వి. రత్నాకర్ "అంబేడ్కర్ దినచర్య" పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు.

దేవీ దయాళ్ 1943 నుండి 1951 వరకు అంబేడ్కర్ ఇంటిలో లైబ్రరీ బాధ్యతలు నిర్వహించేవారు. అంబేడ్కర్ గారిని దగ్గరుండి పరిశీలించిన విషయాలను ప్రధానంగా ఆయన దినచర్యకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు డైరీలో రాసుకుంటుండేవారు. వాటిని 1987 తర్వాత హిందీలో ఒక పుస్తకంగా రాశారు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు అంతకుముందు ఎక్కడా కనిపించవని ముందుమాటల్లో ఆయా రచయితలు చెప్పారు.

ఈ పుస్తకం చాలా మంది రాసుకునే దినచర్యల్లా పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకు జరిగిన సంఘటనల సమాహార క్రమాన్ని వివరించే పద్ధతిలో ఉండదు. డా. అంబేడ్కర్ ఇంటిని,ఆ పరిసర వాతావరణాన్ని,ఆయన పడుకునే పడక గది స్థితిగతుల్ని, కథలో చెప్పుతున్నట్టుగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. నిజానికి ఈ దినచర్య ఒక కథ చెప్పుతున్నట్లు ఆసక్తిదాయకంగా సాగింది. సాధారణంగా దినచర్య ఉత్తమ పురుషలో ఉంటుంది. కానీ ఇది అలా లేదు. అంబేడ్కర్ దినచర్యను మరొకరు చెప్పటమే దానికి ప్రధాన కారణం. ఆయన జీవితంలో సమయ పాలన, క్రమశిక్షణ, విజ్ఞాన సాధనలో జీవనాన్ని ఆనందమయంగా చేసుకోవటం అనేవి ప్రముఖంగా కనిపిస్తాయి. పత్రికలను ఆసాంతం చదవటం, అవసరమైన క్లిప్పింగులను భద్రపరిచేటట్లు చెయ్యటం, వాటిని తన రచనల్లో ఉపయోగించుకోవటం వంటివి అంబేడ్కర్ చేసేవారు.సందర్భోచితంగా మంచి దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపేవారు. ఎక్కువకాలాన్ని చదవడానికి, రాయడానికి వినియోగించుకునేవారు. అవసరమైతే టాయిలెట్‌లోనూ,టిఫిన్‌ తినేటప్పుడూ, ప్రయాణంలోనూ చదువుకునే వారు. ఆరోగ్యం విషయంలో యోగా కూడా చేసేవారు. తన భార్య ఉన్నంత కాలం మంచి ఆహారాన్ని తినడానికి ఇష్టపడే అంబేడ్కర్ తర్వత కాలంలో వంటవాళ్ళు ఏది పెట్టినా పట్టించుకునే వారు కాదు. నవలలు, కథలు చదవడానికి ఇష్టపడేవారు కాదు. వేదాలు, స్మృతులు వంటివి కష్టమైనా వాటి అనువాదాల సహాయంతో విజ్ఞానార్జనకు కష్టమైన సాహిత్యాన్ని చదవడమే తనకిష్టం అనేవారు. తాను చదివిన దాన్ని నిరంతరం రాసుకుంటుండేవారు.

వీరి దినచర్యనంతా గమనించినపుడు, జ్ఞానాన్ని సంపాదించడం, క్రమశిక్షణలో ఉండటం, సమాజ హితం కోసం తమ జీవితాల్ని ఫణంగా పెట్టడం అనే ఈ మూడింటిని ఏ మనిషైతే జీవన లక్ష్యాలుగా చేసుకుంటాడో అతడు సంపూర్ణమైన జీవితాన్ని గడిపినట్లు, అప్పుడు అతడు దుఃఖితుడు కానట్లు అంబేడ్కర్ భావించినట్లు స్పష్టమవుతుంది. కేవలం అంబేడ్కర్ రోజువారీ కార్యకలాపాలే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని కూడా దేవీ దయాళ్ విశ్లేషణాత్మకంగా స్ఫూర్తిదాయకంగా వివరించగలిగారు.

మొత్తం మీద పుస్తకమంతా అనువాదంలా కాక తెలుగు రచనే అన్నట్లు ఉంది. అయితే, కొన్ని చోట్ల గౌరవ ఏకవచనం మరి కొన్ని చోట్ల ఏకవచన సంబోధనతో రచన కొనసాగింది. మూలం ఎలా ఉందో తెలియదు కానీ, ఒకే పద్ధతిలో ఈ సంబోధన ఉంటే మరింత బాగుండేది. అంబేడ్కర్ జీవిత చరిత్రలలో ఎండ్లూరి రాసిన గ్రంథం చాలా మందిపై ప్రభావాన్ని చూపింది. మళ్ళీ అంతటి ప్రభావాన్ని ఈ పుస్తకం కలిగిస్తుందనడంలో సందేహంలేదు.

"అంబేడ్కర్ దినచర్య " తెలుగు అనువాదం - డా.జి.వి. రత్నాకర్ (మూల రచన : దేవీ దయాళ్), పుటలు : 64, పుస్తకం ఖరీదు : రూ. 30/-, ప్రతులకు -సమాంతర బుక్ సెంటర్, 11-6-868, మొదటి అంతస్తు, లకిడికాపూల్, రెడ్ హిల్స్ రోడ్, హైదరాబాద్ - 04, ఫోన్‌ : 9246586254.

దార్ల వ్యాసాలు దగ్గరకు దారి


1 comment:

రవి వైజాసత్య said...

ఇది చాలా ఆసక్తికరమైన పుస్తకములా ఉంది. తెలియజేసినందుకు గురువుగారికి కృతజ్ఞతలు. నేను తప్పకుండా దొరకబుచ్చుకొని చదువుతాను.