కళా స్వేచ్ఛా, విశృంఖలత్వమా ?

ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ అనగానే అతనొక గొప్ప చిత్రకారుడనేవాళ్ళున్నారు. మరి కొంతమంది సినీ నటి మాధురీ దీక్షిత్‌ అభిమాని అనేవాళ్ళున్నారు. ఇంకొంతమందైతే హిందు దేవతల నగ్న చిత్రాల్ని వేసిన ముస్లిం చిత్రకారుడని చెప్తారు. నిజానికి చిత్రకళలో తనదైన ప్రత్యేకతను సంతరించుకున్న కళాకారుడు ఎం.ఎఫ్‌. హుస్సేన్‌. అమెరికా నుండి వెలువడే ‘ఫోర్బ్స్‌’ అనే పత్రిక ఈయన్ని ‘భారతీయ పికాసో’ గా అభివర్ణించింది. ఈయన భారత ప్రభుత్వం నుండి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో పద్మశ్రీ (1955), పద్మభూషణ్‌ (1973), పద్మవిభూషణ్‌ (1991)లను పొందడమేకాకుండా,1986లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు.

ఈయన గౌరవార్ధం భారతీయ తపాలా శాఖ 1982,1988 సంవత్సరాల్లో రెండు స్టాంపుల్ని కూడా విడుదల చేసింది. ఆయన చిత్రాతోనే ఆ స్టాంపుల్ని ముద్రించడం విశేషం. ఇవన్నీ భారతీయు డిగా, కళాకారుడిగా ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ని గౌరవించాయనడానికి నిదర్శనాలు.పుట్టింది పేదవాడిగా, భారతీయుడిగానే అయినా, చనిపోయింది మాత్రం అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందిన కళాకారుడిగా, పరాయిదేశంలోనే! ఎవరైనా తాను పుట్టిన దేశంలోనే చనిపోవాలనేమీ లేకపోయినా, వివాదాల సుడిగుండమైన ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ ఈ విషయంలో చాలా చర్చనీయాంశమైయ్యారు. హిందువుల మనోభావాల్ని కించపరిచినందుకు ఈయన పరాయిదేశం పారిపోవాల్సివచ్చింది. తొమ్మిది పదులు దాటిన ముసలి వయసులో కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక నశించి, తన మాతృదేశమైన భారత దేశం రావాలనుకున్నా రాలేక పరాయి దేశంలోనే చివరి శ్వాస వదిలేశారు.
 ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ పూర్తిపేరు మఖ్బుల్‌ ఫిదా హుస్సేన్‌. మహారాష్ర్టలోని పండరీపురంలో 1915 సెప్టెంబరు17న జన్మించారు. మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ, మదర్‌ థెరీసాల చిత్రాలతో బాటు రామాయణ, మహాభారతాల్లోని విశేషాల్ని చిత్రించారు. 2010లో ఖతార్‌ దేశ పౌరసత్వాన్ని స్వీకరించారు. 2011 జూన్‌ 9న లండన్‌లో చనిపోయారు. చిత్రకారుడిగా, సినీ నిర్మాతగా, ఫొటో గ్రాఫర్‌గా, అన్నిం టికీ మించి స్వేచ్ఛగా బతికారు. కార్లంటే ఎంతో ఇష్టపడే ఈ కళాకారుడికి సొంతంగా ఆర్ట్‌ స్టుడియో లేదనీ, రోడ్ల మీదా, హోటళ్ళలోను, తనకి నచ్చిన ఏ చోటనైనా తన చిత్రాల్ని చిత్రించే కళాకారుడిగా పేరుపొందారు.
ఏడాదిన్నర వయసులోనే తల్లి చనిపోయారు.

తండ్రి వేరే వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రుల అనురాగానికి దూరమైన దశ. చిత్రకళను అభ్యసించడానికి1935లో పాఠశాలలో చేరి,చిత్ర కళల్లోని రీతుల్ని శాస్త్రీయంగా గమనించారు. బతుకు తెరువు కోసం సినిమా హోర్డింగ్స్‌పై చిత్రాల్ని వేసేవారు. ఆ తర్వాత కాలంలో సూరత్‌, బరోడా, అహ్మదాబాదు నగరాల్లో స్వయంగా చిత్రాల్ని వేసి సంపాదించడం మొదలు పెట్టారు.ఆ తర్వాత 1947లో ఫ్రాన్సిస్‌ న్యూటన్‌ సౌజా స్థాపించిన ప్రోగ్రెస్సివ్‌ ఆర్టిస్ట్స్‌ గ్రూపులో చేరి, ఆధునిక చిత్రకళా రీతుల్ని అధ్యయనం చేశారు.

దీంతో ఈయన ఆలోచనల్లో వచ్చిన మార్పు ఆయన చిత్రాల్లో కనిపించసాగింది. అంతవరకున్న సంప్రదాయ కళారీతులకు భిన్నంగా, అప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆదరణలో ఉన్న ఆధునిక చిత్రకళారీతుల్లోని క్యూబిజం శైలిలో తన చిత్రాల్ని వేశారు. ఇలా చిత్రకళ, శిల్పకళారంగాల్లో వచ్చిన ఈ మార్పులే సాహిత్యరంగంలో కూడా ప్రభావం చూపాయి. వీటి ఫలితమే ప్రతీక, భావచిత్ర వాదాలతో పాటు, అథివాస్తవిక ధోరణులతో సాహిత్యం కనిపిస్తుంది. ప్రసిద్ధ చిత్రకారుడు పాబ్లో పికాసో (1881-1973) తన చిత్రాల్ని క్యూబిజం శైలిలో చిత్రించారు.

పికాసో వేసిన చిత్రాల్లో గుయెర్నికాను కళా విమర్శకులు గొప్ప కళాఖండంగా పేర్కొంటారు. 1937లో జర్మనీ, దాని మిత్ర పక్షాలు గుయెర్నికా రాజధాని బాస్క్‌ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో గుయెర్నికా అనే చిత్రాన్ని వేశారు. బలవంతుల దౌర్జన్యాలు ఎలా ఉంటాయో ఆ చిత్రంలో క్యూబిజం శైలిలో చిత్రించారు. దీనిలో ఎద్దులు- కిరాతక సైనికులకు, దౌర్జన్యానికీ ప్రతీకగా, గుర్రాల్ని- ఎదురు తిరిగిన ప్రజాసమూహానికీ, సాత్వికత్వానికీ చిహ్నంగా చిత్రించారని ఆ చిత్రం విశేషాల్ని కళావిమర్శకులు వివరిస్తున్నారు.

ఇటువంటి వివరణలు పెద్దగా ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చిత్రాలకు కనిపించడం లేదు. కానీ, పికాసోతో ఈయన్ని పోల్చడానికి ప్రధానకారణం క్యూబిజం శైలిలో తన చిత్రాల్ని చిత్రించడం కావచ్చు. ఈయన వేసిన కొన్ని చిత్రాలకైతే ఎలాంటి పేర్లు లేకపోవడంతో ప్రేక్షకులే వాటిలోని రసత్వాన్ని ఊహించుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ చిత్రాల్ని జాగ్రత్తగా చూస్తే, రేఖలు, రంగుల కంటే, కోణాకృతులకి ప్రాధాన్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇలా కోణాల (క్యూబ్స్‌)తో చిత్రాల్ని గీయడం వల్ల చిత్రాన్ని కేవలం ఒకే కోణంతో కాకుండా, భిన్నకోణాల్లో పరిశీలిస్తే, విభిన్న భావాల సంగమం ఆ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ శైలిలో ఒక యువతి యొక్క చిత్రాన్ని చిత్రించేటపడు, ఆమె సౌందర్యానికంటే, ఆమెను చిత్రించిన కోణాల్ని పరిశీలించడం ముఖ్యమౌతుంది. అపడు ఆమె బాహ్య సౌందర్యం కంటే, ఆమె ఆలోచనా రీతిని ఆ చుట్టూ వేసే వివిధ సంకేతాలు, రేఖలతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ పద్ధతిలోనే ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ వేసిన ‘భారత మాత’ చిత్రాన్ని గానీ, ఇతర చిత్రాల్ని గానీ చూడాల్సి ఉంటుంది.
కేవలం పికాసో శైలిలో మాత్రమే కాకుండా, క్యూబిజంలో కనిపించే మరింత ఆధునిక ధోరణిలో ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చిత్రించారని కళావిమర్శకులు వ్యాఖ్యానించారు. ఈ పద్ధతిలో అంతవరకు అంగీకరిస్తున్న శైలికి భిన్నంగా, ప్రయోగాత్మకంగా ఉంటూనే, రాడికల్‌గా కనిపిస్తుంది. అందుకనే, భారతీ యులకు అందంగా, అంగీకరించే రీతిలో కనిపించే రాజా రవివర్మ చిత్రించిన దేవుళ్ళ పటాలతో పోల్చుకుని, ఈయన్ని నిరాకరించే వరకూ వెళ్ళారు.

తన చిత్రాల్ని ఆర్ట్‌ ఎగ్జిషన్‌లో పెట్టడం ద్వారా డబ్బు, పేరు ప్రఖ్యాతుల్ని పొందడమెలాగో తెలుసుకుని, భారతీయ చిత్రకళాకారుల్లో అత్యధిక పారితోషికం పొందిన కళాకారుడుగా నిలవగలిగారు హుస్సేన్‌. ఆ్చ్ట్టజ్ఛూ ౌజ ఎ్చ్చ ్చఛీ ఒ్చఝఠ్చ: ్చజ్చిఛజ్చిట్చ్ట్చ 12 పెయింటింగ్‌ సుమారు1.4 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు వేలం పాటలో అమ్ముడుపోయింది. అయితే, ఈ వేలం పాట సందర్భంలోనే న్యూయార్క్‌ లోని క్రిస్టీ భవనం బయట నిరసన ప్రదర్శనలు జరిగాయి. హుస్సేన్‌ హిందువుల మనోభావాల్ని గాయపరుస్తున్నందున, ఆయన పెయింటింగ్స్‌ని ప్రదర్శించ డానికి వీల్లేదని ఆందోళన కారులు ధ్వజమెత్తారు.

కానీ, కళ- సంస్కృతులను రక రకాలుగా వ్యాఖ్యానించుకోవచ్చనీ, మత చిహ్నాలను వ్యక్తీకరించడం, వ్యాఖ్యానించడం, పునర్‌ వ్యాఖ్యానించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అనీ, కళల్ని నియతి మార్గంలోనే కొనసాగించాలని శాసించలేమనే ప్రకటనతో నిర్వాహ కులు హుస్సేన్‌ చిత్రాల్ని ప్రదర్శనకు పెట్టారు. 21 వ శతాబ్దానికి కూడా ఆయన చిత్రాలు సమకా లీనతను కలిగి ఉంటాయని, ఆ విలువల్ని గుర్తించలేకనే, ఆ చిత్రాల్లో నగ్నత్వాన్ని మాత్రమే చూసి నిరసనలు తెలియజేయడం సరైంది కాదని వ్యాఖ్యానించిన వాళ్ళున్నారు.

హుస్సేన్‌ వేసిన చిత్రాల్లో ఏ భావాలున్నాయో తెలియకపోయినా- ఈయన ఒక ప్రభావిత వ్యక్తిగా మారడం వల్లనే ప్రపంచంలో ప్రజల్ని, కళాకారుల్ని అత్యధికంగా ప్రభావితం చేయగల ప్రముఖులైన 500 మంది ముస్లిం ప్రముఖులలో ఒకనిగా రాయల్‌ ఇస్లామిక్‌ స్ట్రాటజీస్‌ సెంటర్‌ గుర్తించింది. మరి ఇంత ప్రభావితం చేయగల గల కళాకారుడు వేసిన చిత్రాలలో- సరస్వతీదేవిని నగ్నంగా చిత్రించటం, భారత మాతను, కాళికా దేవిని, లక్ష్మీ దేవిని, రామాయణంలోని కొన్ని పాత్రల్ని స్ఫురించేటట్లున్న వాటిలో- నగ్నత్వాన్ని కావాలనే చిత్రిస్తున్నారనే ప్రచారం జరిగింది. పైగా ముస్లిం, క్రైస్తవ చిత్రాల్ని ఇలా చిత్రించకపోవడంతో హిందువుల మనసుల్ని గాయపరుస్తున్నారనే వాదనకి బలం చేకూరింది.

దేవాలయాలపై ఉండే నగ్న శిల్పాలకీ, వీటికీ వ్యత్యాసం ఉందనే వాళ్ళున్నారు. తాపీధర్మారావు, ఆరుద్ర వంటి వాళ్ళు అలాంటి వాటి గురించి సుదీర్ఘంగానే చర్చిం చారు. అక్కడ కనిపించని నగ్నత్వం ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చిత్రాల్లోనే కనిపించిందనడానికి ఆయన ఒక ముస్లిం కావడమనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కళాకారునికి ఉండే స్వేచ్ఛ, ఆ ధోరణులు, నూతనత్వం, ప్రయోగాలు తెలియనివాళ్ళు ఇలాంటి చిత్రాల్ని విమర్శించడాన్ని పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదనే భావనతో వాటిని పట్టించుకోని కళావిమర్శకులు కూడా ఉన్నారు.

హిందూ దేవతలను నగ్నంగా చిత్రించడాన్ని తట్టుకోలేక, ఆయన చిత్రాల గురించి ఒక కవి ఇలా కవిత్వీకరించారు- ‘జీవిత మర్మాల్ని గాక చర్మాల్ని చూడాలన్నావు..../ అందరూ పిల్లల్ని స్నానం కోసం దిగంబరం చేస్తే/ నువ్వు స్త్రీ మూర్తుల్ని ప్రదర్శన కోసం దిగంబరం చేశావు /అందరూ నీలి చిత్రాల వైపు చూపిస్తే, / నువ్వు పురాణాల కల్పనల వైపు, ఖజురహో శిల్పాల వైపు / వేలు చూపించావు’ - అని. ఆ విధంగానే ఈ చిత్రకారుణ్ణి అర్ధం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.

కళాకారుడిగా తాను చేసే ప్రయోగాలు సామాన్య ప్రజలకు అర్ధంకానప్పుడు, సాహిత్య, కళా రంగాల్లోనూ రాజకీయాలు ప్రవేశించినప్పుడు, పైకి కనిపించకపోయినా ఆ కళాకారుల కుల, మత ప్రభావాలు నిరసనల్లోనూ ప్రతిధ్వనిస్తుంటాయి. అప్పుడు అత్యధికులైన వారి ఆందోళనలకే తల ఒగ్గవలసి వస్తుంది. తమ సృజనలో హేతువు ఉన్నా, కళాత్మక విలువలే ఉన్నా, కళాకారుడు కోరుకునేది స్వేచ్ఛే అయినా అది- విశృంఖలత్వం అనిపించినప్పుడు- కొన్నిసార్లు నిరాదరణకూ, నిరసనకూ, నిషేధానికీ దారితీయవచ్చు. ఇదే ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ చివరి దశలోనూ ఎదురైంది. ఇదే- ఆయతో నిరసనకారులకు క్షమాపణ చెప్పించడానికీ, మాతృదేశం వదిలి పరాయిదేశంలో తలదాచుకోవడానికీ కారణమయ్యింది.
-Dr.Darla Venkateswara Rao,

Assistant Professor,

Dept .of Telugu,

University of Hyderabad, (Central University),

Gachibowli, Hyderabad-500 046

e-mail: vrdarla@gmail.com

Ph: 040-23133563 (O), Mobile: 09989628049,

-డా॥దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు,
తెలుగుశాఖ, సెంట్రల్‌యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు-46
ఫోన్‌: 9989628049

రహస్యం విప్పిన చిలుక!


నిన్నటిదాకా నా సీతాకోక చిలుక
రెక్కలు తొడిగినట్లుండే
కోటి సోయగాల కోనసీమ
సంక్రాంతి ముగ్గుల్లో
పారాణింకా ఆరని సిగ్గు మొగ్గల్లో
దీపావళి కాంతుల నిత్యసింగారిణి!
గుండెల్లో కొలస్ట్రాల్ పేల్చిన పేలుళ్ళకో
నమ్మిన మనసు దహించిన బ్లోఅవుట్లకో
‘మారక’ద్రవ్యమై
హాస్పటల్ బెడ్‌పై వాలిపోయింది!
చూపులన్నీ నిర్జీవాలు
కోప తాపాలన్నీ బలవంతపు ప్రయత్నాలు
మాటల్లో వేదాంతం
చేతల్లో విధ్యుక్తం
క్షణక్షణాల్లో జీవితం
వరం పొందాకే నిర్వేదం!
నీటిబుడగలో, మట్టి కుండలో
కొవ్వొత్తి వెలుగులో
ఆకాశ నక్షత్రాల్లో...
‘గీత’ బోధలో తెలుస్తున్న జీవ రహస్యం!
- దార్ల వెంకటేశ్వరరావు 
(ఆ మధ్య ఆపోలో ఆసుపత్రిలో చేరినప్పుడు రాసిన కవితని ఆంధ్రభూమికి పంపాను. అది వచ్చిందో లేదో నేను చూసుకోలేదు. ఆఫ్సర్ గారు ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు దాన్ని రెగ్యులర్ గా చూడ్డమే కాదు, అప్పుడప్పుడూ రాసి ఆయనకి ఇచ్చేవాడ్ని. ఆయన ఎంతగానో ప్రోత్సహించేవారు. ఈ మధ్య దానికి రాయకపోవడమే కాకుండా, రెగ్యులర్ గా చూడలేకపోతున్నాను. ఈ రోజు ఎందుకో నా పేరు గూగుల్ లో శోదిస్తే, ఈ కవిత ఆంధ్రభూమిలో ఆగస్టు,15, 2010, ఆదివారం సంచికలో ప్రచురించినట్లు తెలుసుకొని, చాలా రోజుల తర్వాత నిజమైన సంతోషాన్ని అనుభవించాను. ఆ కవిత ఇది....దార్ల)

శ్రీశ్రీ పై వివాదాలు వ్యక్తిగతమా ?


శ్రీశ్రీ అనే రెండు అక్షరాలు తెలుగు సాహిత్యంలో తెచ్చిన సంచలనం ఇంతా అంతా కాదు. ఒక సందర్భంలో తానే యుగ కవి నని ప్రకటించుకోవడం, దానితో అనేక వివాదాలకు కేంద్రం కావడం కూడా శ్రీశ్రీ వంతైంది. కేవలం ‘యుగకవి’ అని ప్రకటించుకోవడమే కాదు, ఆయన సాహిత్యంలో ఉన్న అనేక అంశాలు కూడా వివాదాస్పదమవ్వడానికి కారణాలైయ్యాయి. సాధారణంగా రచయితలు వివాదాస్పదులు కావడానికి రెండు కారణాలుంటాయి. అవి వ్యక్తి కేంద్రంగా గాని, ఆ రచనల సాహిత్య కేంద్రంగా గాని జరుగుతుంటాయి. ఇలా తెలుగులో వివాదాస్పదులైన రచయితలు చాలామంది ఉన్నా, శ్రీశ్రీ, చలం తర్వాత విశ్వనాథసత్య నారాయణ, దిగంబర, స్త్రీవాద, దళిత, ముస్లిం కవుల్ని, ప్రాచీన సాహిత్యంలో శివకవుల్నీ ప్రముఖంగా పేర్కొనవచ్చు. బహుశా త్వరలోనే ‘సింగిడి’ కవులు కూడా ఈ జాబితాలో చేరే అవకాశం కనుపిస్తోంది.


విశ్వనాథ సత్యనారాయణ, చలం, శ్రీశ్రీ లది పైకి భావజాల పరమైన వివాదంగా కనిపించినా, అది ప్రధానంగా వ్యక్తుల్ని ఆశ్రయించుకున్నదే. నన్నయకు ముందో, ఆ తర్వాతనో పుట్టవలసిన వాడు విశ్వనాథ సత్యనారాయణ అయితే, ఇరవై ఒకటో శతాబ్దాన్ని ముందే తీసుకొచ్చిన వాడు చలం. వీళ్ళకి అతీతమై, తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడు శ్రీశ్రీ. అలాగే శివకవులు, దిగంబర, దళిత, స్త్రీవాద కవుల వివాదాల్ని చూస్తే, అవి పూర్తిగా భావజాలాశ్రీతాలు. విశ్వనాథ సత్యనారాయణని అనేక సాహితీ సంస్థలు సన్మానించినా, ఆయన భావజాలాన్ని కొనసాగించే సంస్థలుగా మారినా, ఆయన సాహిత్య సంస్థల వల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో లేదు.

ఆయనే ఓ సంస్థగా ప్రచారం పొందాడు. దీనికి అనేక పరిస్థితులు దోహదపడ్డాయి. వాటిలో ఆయన పుట్టిన కులం, ఆయనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు, పాండిత్యం ప్రధానమై, అనేక సన్మానాలకీ, పదవులకీ కారణాలై ఉంటాయి. శ్రీశ్రీ పరిస్థితి అలాంటిది కాదు. పుట్టింది పండిత కులమే అయినా, విశ్వనాథ సత్యనారాయణకు వారసత్వంగా లభించినన్ని ఆస్తిపాస్తులు శ్రీశ్రీ కి లేవు. కానీ, శ్రీశ్రీని కూడా ఆయన కులం చాలా వరకూ కాపాడుతోంది. అది నేటికీ శ్రీశ్రీని వెనకేసుకొచ్చేవాళ్ళలో అత్యధికులెవరున్నారో గమనిస్తే స్పష్టమవుతుంది.

శ్రీశ్రీ చిన్నప్పుడే కొన్ని భావ గీతికల్ని రాసుకుని ‘ప్రభవ’గా ప్రచురించినా, వాటికి ప్రాచుర్యం రాకపోవడానికి పేదరికమే ఒక ప్రధాన కారణం (నిజానికి ప్రభవ కవితల్ని సాహితీవేత్తలు గుర్తించింది ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాతనే). ఆ పేదరికమే తెలిసో, తెలియకో ఆయన ఎలా రాసినా, ఆ రచనల్లో మార్క్సిస్టు భావాల్ని పలికించేలా చేసింది. అలాంటి భావాలే ఆ భావజాలాన్ని ప్రచారం చేసే సాహిత్య సంస్థల్లోకి ప్రవేశించడానికీ కారణాయ్యాయి.ఆ సంస్థల్లో ‘పని’ చేయడం వల్లేనేనేమో ఆ భావజాలం ఉత్సాహంతో రాస్తున్న తొలిదశలో ఆ సిద్ధాంత చట్రంలో ఒదగని అంశాల్ని రాయలేక పోయాడు. దానిలో ఒకటి కులం వాసన రాకుండా, శ్రామిక వర్గం చట్రంలోనే రచనలు చేయడం. రెండవది తెలంగాణకు బదులు సమైక్యాంధ్రనే సమర్థించడం జరిగాయి. అందుకనే 
‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం 
జాలరి పగ్గం, సాలెల మగ్గం 
శరీర కష్టం స్ఫురింపజేసే
 గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు’ వర్గంగానే కనిపించాయి.

1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ, 1972లో వచ్చిన ప్రత్యేకాంధ్ర ఆందోళనను శ్రీశ్రీ వ్యతిరేకిస్తూ కవిత్వాన్ని రాశాడు. ‘తెలంగాణ జెండా మీద ద్వేషం లేదు నాకు/ అది అఖిలాంధ్రపతాకం అయితే మరీ ఆనందిస్తాను’ అని వర్ణించాడు. అంతే కాదు, ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ.....
ఆంధ్రులకే ఆంధ్ర అనే నినాదం అందంగానే ఉండొచ్చు
నెత్తురు పీల్చే చక్రవడ్డీ వ్యాపారస్తుల్ని తరమగలిగితే
ఉ...హు! డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటున్నారు వీళ్ళు
ఆ సంగతి మాత్రం అడగొద్దంటారు ఆ స్వేచ్ఛా వ్యాపారప్రవక్తలు
అక్కడే పొరబడుతున్నారు/ డబ్బు సంచుల్తో అమ్మని కొనలేరు
అభిమానాన్ని కొనలేరు
 ఆత్మల్ని అసలు కొనలేరు...’ ఇలా కొనసాగుతుంది ఆ కవిత. ఇలాంటి కవితల్ని ప్రత్యేకించి విశ్లేషిస్తే, రంధ్రాన్వేషణ చేస్తున్నారనే వాళ్ళున్నారు. ఇప్పటికే దళితులు, మైనారిటీలు, స్త్రీవాదులు శ్రీశ్రీని అస్తిత్వదృక్పథంతో విమర్శిస్తున్నారని, వాటిని ఖండిస్తూ అనేక వ్యాసాలు వెలువడ్డాయి.

అస్తిత్వ నేపథ్యంతో 
‘క్షమించండి, నా స్నేహితుల్లారా!
వక్రీకరణకి వత్తాసుగా
పదబంధాన్ని సృష్టించి
నన్ను వెక్కిరించడానికి వెనుదీయని
మహాకవినీ నేను మన్నించలేన’ని ‘కసాయిబు’ వంటి పదాల్ని సృష్టించడాన్ని వ్యతిరేకించారు. అలాగే శ్రీశ్రీ పదజాలంలో బ్రాహ్మణీయ పదజాలమే అత్యధికంగా కనిపిస్తుందనే విమర్శ కూడా వచ్చింది.
‘దొంగ లంజ కొడుకులసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకుపోయావా నేస్తం...’ అంటూ కొంపెల్ల జనార్దనరావు గురించి వర్ణించే సందర్భంలో ఒక ప్రయోగం చేశాడు శ్రీశ్రీ. ఇలాంటప్పుడు, ఆ యా వర్గాల వాళ్ళు ఆ సాహిత్యాన్ని చదువుకొనేటప్పుడు సహజంగానే తనకి తగిలే గాయాన్ని వ్యక్తీకరిస్తారు. మరికొంతమంది దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

పునర్మూల్యాంకనం, అస్తిత్వం పేర్లతో శ్రీశ్రీ సాహిత్యాన్ని విమర్శించేవాళ్ళున్నారు. అందువల్ల సాహిత్యానికుండే సార్వకాలిక పరిధుల్ని, రచయితల బలహీనతల్నీ వారి సామాజిక జీవిత నేపథ్యాల నుండి కూడా చూడాల్సిన అవసరం ఉంటుందని ఒప్పుకుంటే తప్పేముంది? నిజానికి స్త్రీవాదం ఉధృతంగా నడుస్తున్న సమయంలోనే దేవాలయ ప్రవేశం చేశాడని బలవంతంగా దళితుడి చేత మలం తినిపించినందుకు ఆగ్రహాన్ని పట్టలేక ఒక దళిత కవి- మగాణ్ణి తిట్టడానికి కూడా ఆడదాన్ని అడ్డం పెట్టుకోవాల్సి వస్తున్నందుకు క్షమించు తల్లీ- అంటూ కవిత్వీకరించాడు.

ఇంకా చాలా మంది నేటికీ ‘ఛండాలంగా ఉంది’, ‘ఆడదానిలా గాజులు తొడుక్కున్నావా?’ వంటి ప్రయోగాల్ని చేస్తున్నారు. సినిమాల్లో అయితే ‘ఛండాలం’ పదం వాడ్డం పెద్ద ఫ్యాషనైపోయింది. ఇటువంటివి సాధారణంగానే కనిపించినా, ఆ యా వర్గాల వాళ్ళ మనసుల్ని గాయపరిచే చాలా సీరియస్‌ విషయాలు. అందుకే వాళ్ళు రియాక్ట్‌ అవుతుంటారు. వాళ్ళ మానసిక గాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, వీళ్ళని కూడా పోస్టుమోడర్నిస్టులు గానో, ప్రపంచీకరణను సమర్దించే వాళ్ళు గానో, కమ్యూనిస్టు భావజాలాన్నే తిరస్కరించేవాళ్ళుగానో పొరపడాల్సిన పన్లేదు.

ఒక దశవరకూ శ్రీశ్రీ రచనలు ఆ వ్యవస్థ పరిధిలో, ప్రణాళికలో కొనసాగినట్లనిపించినా, తన ప్రతిభతో చేసిన ప్రయోగాలవల్ల ఆ భావజాలాన్ని ఇష్టపడేవాళ్ళెందరినో తనని ఆరాధించేలా చేసుకోగలిగాడు. ఆ ఆరాధనతోనే ఆయన రాసిన రచనలన్నింటినీ భుజాన వేసుకుని, సమర్ధించేవాళ్ళ వల్ల మరికొందరు కొన్ని విమర్శలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీశ్రీ గానీ, ఇతరులు గాని కొన్ని సాహితీ సంస్థల పరిధుల్లో రాసినంతవరకూ ‘స్వేచ్ఛ’ ఉంటుందో లేదో గానీ, ‘రక్షణ’ మాత్రం ఉండొచ్చు! అలాంటి రక్షణే శ్రీశ్రీ వ్యక్తిగతంగా రాసిన వాటిని కూడా నేటికీ వెనకేసుకొస్తోంది.

శ్రీశ్రీ శతజయంతి ( 30-4- 1910 నుండి 30-4-2011 వరకు) సందర్భంగా ప్రత్యేక సంచికలు, గ్రంథాలు వెలువడ్డాయి. వీటిలో ఇలాంటి వాదోపవాదాలు కనిపిస్తున్నాయి. వీటిలో తెలకపల్లి రవి రాసిన ‘శ్రీశ్రీ జయభేరి జీవిత ంసాహిత్యం రాజకీయాలు’ గ్రంథాన్ని శ్రీశ్రీ ఛాయా చిత్రాలతో పాటు, విషయ వివరణలతో సహా చక్కగా అందించారు. ఇలాగే చాలా మంది వివిధ వ్యాసాలతో ప్రత్యేక సంచికల్ని అందించారు. మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లా కవులు ప్రత్యేకంగా శ్రీశ్రీపై కవిత్వాన్నే రాసి ప్రచురించారు.అప్పటికే శ్రీశ్రీ ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య స్థితిగతుల్ని బాగా అవగాహన చేసుకున్నాడు.

సంస్కృత పదభూయిష్టమైన శబ్దజాలాన్ని వాడుకుంటున్నా, దాన్ని తనకి దాసోహం అయ్యేటట్లు చేసుకోగలిగాడే తప్ప, దానికి తాను దాసోహం కాలేదు. అది అర్థమైనా, కాకున్నా, దాని ఊపు సామాన్యుల్ని సైతం ఆకర్షించగలిగింది. ఆధునిక కవిత్వం అర్థం కావాలంటే, ఆధునిక జీవితం అర్థం కావాలన్నది నిజమే కావచ్చునేమో కానీ, శ్రీశ్రీ కవిత్వసౌందర్యమంతా అవగాహన కావాలంటే మాత్రం చాలా కవితలకి వ్యాఖ్యానం కూడా అవసరమే. అది శ్రీశ్రీ మొదట్లో రాసిన ‘ప్రభవ’ (ప్రచురణ,1928) నాటి కవితల్లోను, ‘మహాప్రస్థానం’ (ప్రచురణ,1950) కూర్చిన తొలినాళ్ళ కవితల్లోను ఈ స్వభావం కనిపిస్తుంది.
అయితే, భారతీయ ఆలంకారిక సూత్రాల అవగాహనతో సైద్ధాంతిక విభేదాన్ని కవిత్వీకరించడంతో పండితుల్ని సైతం శ్రీశ్రీ కవిత్వం ఆకర్షించగలిగింది. ‘కవితా ఓ కవితా’ పూర్తిగా అలాంటిదే. శ్రీశ్రీకి గల పాశ్చాత్య సాహిత్య అవగాహన కూడా తెలుగు కవిత్వాన్ని ముందుకు నడిపించేందుకే దోహదపడింది. అందరికీ ఉన్నట్లే శ్రీశ్రీ సాహిత్యానికీ కొన్ని పరిమితులున్నాయి. అయినా, అవి మాత్రమే ఆయన సాహిత్యాన్ని ఆటంక పరిచేవనుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే, శ్రీశ్రీ సాహిత్యంలో కనిపించినంత కమ్యూనిస్టు భావజాలం, సామాన్యుణ్ణి సైతం ఉర్రూతలూగించగల శబ్దవిన్యాసం మరో కవిలో కనిపించకపోవడమే శ్రీశ్రీ సాహిత్యం నేటికీ ఒక వర్గం వారికి ఆదరణీయమవడానికి కారణం. ఈ పరిధుల్లోనే శ్రీశ్రీది వ్యక్తిగతమైన వివాదమైనా వ్యవస్ధీకృతంగా కనిపిస్తోంది. 
-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com 
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,


-డా॥దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు,
తెలుగుశాఖ, సెంట్రల్‌యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు-46
ఫోన్‌: 9989628049

( జూన్ 15, శ్రీ శ్రీ వర్ధంతి )