సాహిత్య సృజనలో పరిశోధన ఉంటుందా?

 
Courtesy : Surya Literary Special 22-11-2010



‘‘ కవిత్వానికి కూడా సైన్సుకి వలే
కావాలి రీసెర్చ్‌ ఎక్సెపెరిమెంటూ
కాని దాని పరమార్ధం
పలాయనం కాదు ప్రజాక్షేమం’’ - ఇది ఆరుద్ర ‘‘సాహిత్యోపనిషత్‌’’ లో శ్రీశ్రీ మాటలుగా చెప్పాడు. ఇక్కడ ‘‘ కవిత్వం’’ అని చెప్పినా, అందులోని విషయాలు అన్ని సృజన ప్రక్రియలకూ వరిస్తాయి. కవులు వాస్తవాన్ని యథాతధంగా చెప్పకుండా తమ అనుభవాన్నీ, అనుభూతినీ, భావుకతనూ జతచేసి సృజనాత్మక రచనల్లో అందంగా అందిస్తారు. కేవలం కాల్పనిక అంశాలే సృజనాత్మక రచనలు కాదు.కానీ, సృజనాత్మక రచనల్లో కాల్పనిక అంశాలెక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక కవితో, కథో, నవలో, నాటకమో, గేయమో రాయాలంటే రచయితకి కేవలం సృజనాత్మక ప్రతిభ ఉంటే సరిపోతుందా అనేది ఒక చర్చనీయాంశం. దీన్నే ఆరుద్ర కవిత్వం ద్వారా మనముందు చర్చకు పెట్టాడు.
కవిత్వం లేదా సాహిత్య ప్రయోజనం గురించి నేటికీ చర్చ కొనసాగుతునే ఉంది. కానీ, కవిత్వానికి రీసెర్చ్‌ ఎక్స్పెరిమెంటు ఉండాలనడంలో మరే ఆంతర్యం లేదా? మార్క్సిస్టు సాహిత్యం వచ్చిన తర్వాత సాహిత్య విమర్శలో కొన్ని భావనలు బలంగా చర్చలోకొచ్చాయి. వాస్తవికత, సామాజికస్పృహ, నిబద్దత అలా చర్చలోకొచ్చిన వాటిలో ముఖ్యమైనవి. ఇవి సృజన సాహిత్యాన్ని ఒక విధంగా లోక పరిశీలన వైపు, ఇంకా చెప్పాలంటే పరిశోధన చేసి తెలుసుకున్న తర్వాతనే రాయాలనే ఆలోచనని చాలా వరకూ కలిగించాయి. వీటి కంటే మరింతలోతుల్లోకి తీసుకెళ్ళిన భావన మరొకటి స్త్రీవాద, దళిత సాహిత్య సృజనతో మొదలైంది. నిమగ్నత అనేది ఈ సాహిత్య సృజనకు, దాన్ని అవగాహన చేసుకోవడానికీ అవసరం. ఇది ఆధునిక సాహిత్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికున్న విమర్శసూత్రం. ఇలాంటి సృజన రచనల్లో పరిశోధనతో పాటు, జీవితానుభవాలు రచనకు జీవితాన్నిస్తాయి. అలాగని ఇవే వాస్తవాలనో, ఇవే పరిశోధనలనో ప్రజలు భ్రమ పడ్డానికి వీల్లేదు. ప్రతి రచయితకూ తనదైన ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. ఆ దృక్పథంతో సాహిత్య సృజన చేస్తాడు. ఒక వాస్తవాన్ని  చెప్పడానికి సృజన రచనను చేస్తున్నాడా? ఒక వాస్తవిక సత్యాన్ని అనేకమందికి అనుభవంలోకి తెస్తున్నాడా ? ఈ రెండు ప్రశ్నల కొచ్చే సమాధానాలే సృజనాత్మక సాహిత్యంలో ఉండే పరిశోధన మౌలికతత్త్వాన్ని పట్టిస్తాయి.
కవులు కొన్ని కావ్యాల్ని రాసేముందు ఆ వస్తువుకి సంబంధించిన విషయాన్ని సేకరించతప్పదు.రచయిత తాను సేకరించిన ఆధారాల్ని తన సృజనాత్మక రచనకు సహాయంగా తీసుకొంటాడు.కానీ, తారీఖూ, దస్తావేజుల్లా రాయకుండా చారిత్రక సత్యాన్ని కళాత్మక సత్యంగా మారుస్తాడు. యస్‌.టి.జ్ఞానానందకవి ‘‘ఆమ్రపాలి’’ అనే పేరుతో ఒక చారిత్రక కావ్యాన్ని రాశారు. షోడషజనపథాల పాలనలోని వికృతస్వభావాన్ని చెప్పడానికి ఆ కావ్యాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ కావ్యంలో బుద్దుడు, బింబిసారుడు, ఆమ్రపాలి మొదలైన పాత్రలన్నీ చారిత్రకాలే. అయినా వాళ్ళ గురించే చదువుకోవాలంటే చరిత్ర గ్రంథాలున్నాయి. షోడషజనపథాలకు చెందిన వైశాలినీ గణతంత్రరాజ్యంలో ఉండే గణభోగ్య ఆచారాన్ని ఈ కావ్యంలో వర్ణించారు. ఆమెను పెంచిన తల్లిదండ్రులు పడిన ఆవేదన కవి అద్భుతంగా వర్ణించారు. ఆ వర్ణనతో పాఠకుల హృదయం ద్రవించిపోతుంది. అలాంటి రసాత్మక స్థితిని కలిగించడమే సృజనాత్మక రచనల ప్రధాన లక్ష్యం. అందుకే ఈ కావ్యానికి సాహిత్య అకాడమీ బహుమతి కూడా వచ్చింది.
               అమరావతి రాజధానిగా పాలించిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దారిదోపిడీలు, దొంగతనాలు చేస్తున్న సుమారు 500 మంది చెంచుల్ని ఊచకోత కోసి హత్యచేశాడు. అధికారిక గణాంకాల ప్రకారం ఐదువందలమంది. నిజానికి అంతంకంటే ఎక్కువ మంది ఉంటారనేది జనపథం మాట. అది 1794లో జరిగిన ఘోరసంఘటన. చెంచుల్ని చంపొద్దని రాజుతో వాదించిన వాడు ఆ ఆస్థానంలో సైన్యాధ్యక్షుడుగా ఉన్న భుజంగరాయుడు. అతడు ఒక మాదిగ జాతికి చెందిన వ్యక్తి. అతడు  సేనానిగా, మంత్రిగా వెంకటాద్రినాయుడి దగ్గరుండి ప్రజలకు సేవలందించాడు. అతడ్ని చరిత్ర గుర్తించవలసినంత స్థాయిలో గుర్తించలేదు. దానికి కారణం అతడు కింది వర్ణానికి చెందిన వాడు కావడమే ఒక ప్రధాన కారణం. కానీ, భుజంగరాయుడి చరిత్రను తవ్వుకుంటూ వెళ్ళితే అద్భుతం కలిగించే విషయాలు బయటపడతాయి.వీటిని డా చిలుమూరి శ్రీనివాసరావు ‘‘ మాదిగల చరిత్ర ` సంస్కృతి’’లో సవివరంగా ప్రకటించారు.
మన ఆంధ్రప్రదేశ్‌ రాజలాంచనంలో పూర్ణకలశం ఉంటుంది. ఇది అమరావతీస్తూపం మీద ఉండే పూర్ణఘటం. ఆంధ్రుల తొలిపాలకులు శాతవాహనుల కాలం నాటిది. దీనికి బౌద్ధమతశిల్పరీతిని జోడించి అమరావతీస్తూపంపై ఉంచారు. ఈ పూర్ణఘటం రూపశిల్పి పేరు విధిక. విధిక తండ్రి నాగన. ఆ కుటుంబానికి చెందినవాడే భుజంగరాయుడు. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ‘‘ ఆదిఆంధ్రుడు’’ పేరుతో రాసిన చారిత్రక కావ్యంలో ఇతివృత్తం అదే. భుజంగరాయుడి చరిత్రను ఊహకుతెస్తూ, ఎవ్వరి మాటా వినని చెంచులతో నిరాయుధుడిగా వెళ్ళి రాయబారం నిర్వహించడంలో భుజంగరాయుడి ధైర్యసాహసాల్ని వీర, అద్భుత రసాల్లో కవి వర్ణించిన సన్నివేశాలు శాశ్వతంగా పాఠకులకి గుర్తుండిపోతాయి.
ఇలాగే అల్లూరి సీతారామరాజు, తాండ్రపాపారాయుడు మొదలైన వాళ్ళ గురించి చారిత్రక కావ్యాలు వచ్చాయి. వీటిని కావ్యంగా రాయాలంటే చారిత్రక అంశాల్ని తెలుసుకోవడానికి రచయితకు పరిశోధన తప్పదు.అయినా వీటిని పరిశోధనలు అనలేం. ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఒకటుంది. సృజనాత్మకరచనలో పరిశోధన ఉన్నా, దాన్ని మించిన అనుభూతి, భావుకతలే శాశ్వతంగా నిలిచిపోతుంటాయి. దానిలో వర్ణించిన పాత్రలూ, సన్నివేశాలూ నిజం కాదు. అవి కవి అపరబ్రహ్మగా మారి సృజించిన అంశాలు. సృజనాత్మక రచన చేయడానికి పరిశోధన దృష్టి అవసరమే, కానీ అదే పరిశోధన అనిపించుకోదు. కవిత్వం రాసేవాళ్ళకు విమర్శదృష్టి ఉన్నా, వాళ్ళలోను విమర్శకులు ఉన్నా, అవసరమైతే నియమాల్ని వ్యతిరేకించడానికీ వెనుకాడరు. అందుకనే నియతికృత నియమరహితాం, హ్లాదైకమయీ మనన్యపరతంత్రానామ్‌, నవరసరుచిరాం నిర్మతి మాదధతీ భారతీ కవేర్జయతి’’ అని మమ్మటుడు తన కావ్యప్రకాశంలో కవికి బ్రహ్మకంటే ఉన్నతమైన స్థానం ఇస్తున్నట్లు కనిపిస్తుంది.
చెప్పాల్సిన సందేశం ఇంచుమించు ఒకటే అయినా స్థల, కాలాల్ని, పాత్రలు, సన్నివేశాల్ని మార్పుచేసి మానవజీవితాన్వేషణ తత్త్వాన్నీ హెమింగ్వే ‘‘ ది ఓల్డ్‌ మ్యాన్‌ అండ్‌ సీ’’లోను, కేశవరెడ్డి ‘‘ అతడు అడవినిజయించాడు ’’ నవలికల్లో ఉదాత్తంగా వర్ణించారు. ఒక నవలికలో ముసలివాడు సొరచేప చంపడానికొస్తున్నా, దాన్ని పట్టుకొని ఒడ్డుకి తేవాలనుకుంటాడు. మరోనవలికలో ముసలివాడు రక్షించడానికి వెళ్ళినా, అదే తనని దగ్గరకు రానివ్వకపోయినా, దాన్నెలాగైనా కాపాడాలనుకుంటాడు. ఇంచుమించు ఇలాగే వినుకొండనాగరాజు రాసిన ‘‘ ఊబిలో దున్న ’’ నవల్లోనూ కనిపిస్తుంది. ఊబిలో నుండి దున్నను రక్షించిన తర్వాత అదే తనపై తిరగబడటం ఒక విషాధం. ఇవి రాయాలంటే కూడా రచయితలు పరిశోధన చేయాల్సిందే. కానీ, ఆ పరిశోధన సృజనముందు కనిపించదు. ఇలాంటివే గురజాడ అప్పారావు రాసిన ‘‘ కన్యాశుల్కం’’ నాటకం, ఆరుద్ర రాసిన ‘‘ కాటమరాజుకథ ’’ నాటకం వంటివి ఎన్నో ఉన్నాయి. 
               అయోధ్యలో బాబ్రీమసీదు కూలగొట్టిన తర్వాత చెలరేగిన మత సంఘర్షణల్ని తస్లిమా నస్రీన్‌ ‘‘లజ్జ’’ నవల్లో వివిధ పాత్రల పరంగా వర్ణించారు. నవల సగం వరకూ పాత్రలుగా కనిపించినా, తర్వాత  చారిత్రక నేపథ్యాన్ని చదువుతున్నట్లనిపిస్తుంది. ఒక పరిశోధన గ్రంథమేదో చదువుతున్న అనుభూతి కలుగుతుంది. పాకిస్తాన్‌ కుట్రని భగ్నం చేయడానికి భారత ప్రభుత్వం రాజనీతజ్ఞతను ఉపయోగించి బెంగాల్‌ రెండుగా విడిపోయి, దానిలోని కొంత భాగం బంగ్లాదేశ్‌ అనే దేశంగా ఏర్పడినా ఫర్వాలేదనుకుంది. ఆ వ్యూహంలో భాగంగానే బంగ్లాదేశ్‌ ఏర్పడింది. అప్పుడు  అక్కడి ప్రజలు తమ మాతృదేశం ఇండియాను వదిలి మరోదేశంగానో, మరోదేశంలోనో ఉండాల్సి వస్తుందని ఫీలయినట్లు రచయిత్రి నవల్లో వర్ణించారు. ఆ పరిస్థితుల్ని వర్ణించడంలో సరిహద్దు ప్రజల మానసిక సంఘర్షణ పాఠకుల్ని ఎప్పటికీ మరిచిపోకుండా చేయగలిగారు. 
ఇండియా వదిలి బంగ్లాదేశ్‌ వెళ్ళిపోయిన ముస్లిం, హిందూ జీవితాల్లో బాబ్రీమసీదు సంఘర్షణ తెచ్చిన విషాదం ఒకచోట మెజారిటీగా ఉన్న వాళ్ళు మరోచోటికి వెళ్ళేసరికి ఎలా మైనారిటీగా మారిపోయి దాడులకి గురవుతుంటారో ఈ నవల్లో తెలుస్తుంది. ఈ నవల ఇండియాలోని ముస్లిముల కంటే, బంగ్లాదేశ్‌లోని హిందువుల మైనారిటీభావనని లోకానికి చెప్పడానికి బాగా ఉపయోగపడింది. ఈ నవల్లో రెండు పరిశోధనాంశాలున్నాయి. బాబ్రీమసీదు చారిత్రక పరిణామాన్ని పాఠకులకి వివరించడం, రెండవది మైనారిటీ, మెజారిటీ భావనల్లో కనిపించే అభద్రత. ఆ భద్రతాభావం పుట్టుకొచ్చే పరిస్థితులు. కానీ, వీటిని శాస్త్రీయ నిరూపణల కంటే, మానసిక స్పందనాత్మక అనుభూతులకే ప్రాధాన్యతనిచ్చారు. ఇదే సృజనాత్మక రచనకు కావాల్సింది.
ఉన్నవలక్ష్మీనారాయణ ‘‘మాలపల్లి’’ నవల్లో 1922 నాటి భారత స్వాతంత్య్రోద్యమకాలం నాటి అనేక పరిస్థితుల్ని వర్ణించారు. సాంఘికపరిస్థితుల్ని వర్ణిస్తున్నా, కింది వర్ణాలుగా చెప్తున్న వాళ్ళలో చాలా తక్కువ మందిలో ఉండే శ్రీవైష్ణవమతాచారాల్ని ఆసరాగా చేసుకొని, దాన్ని జనరలైజ్‌ చేసి నవల ద్వారా క్రైస్తవప్రాబల్యానికి అడ్డుకట్టవేయాలనుకున్నారు. అందులో చాలా అంశాలున్నా, దాన్ని నాటి ప్రభుత్వం నిషేధాన్ని విధించడంలో అత్యంత ప్రభావాన్నేసిన అంశం మతపరమైందే! దానిలో తక్కెళ్ళజగ్గడు తిరుగుబాటు తత్త్వమో, జాతీయోద్యమాన్ని రగులు గొల్పడమనే అంశాలున్నా, మతపరమైన అంశాలతో పోలిస్తే  వీటి స్థాయి తక్కువే.
పరిశోధనలో అన్వేషణ ప్రధానం. కొత్త అంశాన్ని కనుక్కోవడం ముఖ్యం. ఇంకా లోతుల్లోకెళితే కొత్త విషయాల్ని కనిపెట్టడం పరిశోధనలో ఉండాలి. సాహిత్య పరిశోధనలో సత్యాన్ని అన్వేషిస్తారు. జీవితసత్యాల్ని రచనలతో సమన్వయిస్తారు. తొలినాళ్ళలో ‘‘సేకరణ’’ కూడా పరిశోధనగానే భావించేవారు. అందుకే తాళపత్రగ్రంథాల్ని సేకరించడం, లభించిన కావ్యాల్లోని పాఠాంతర భేదాల్ని గమనించి, సరైనదాన్ని గుర్తించడం పరిశోధనలో భాగంగా ఉండేది. సి.పి.బ్రౌన్‌ తన పండితుల ద్వారా అనేక తెలుగు కావ్యాల్ని సేకరించగలిగారు. ఆయన దగ్గర పని చేస్తున్న పండితులు కూడా బయటకు రాకుండా తొక్కి పెట్టడానికి ప్రయత్నించిన కవి వేమనను ప్రపంచానికి తెలిసేలా చేశాడు బ్రౌన్‌. సంస్కరణవాదిగా పేరు ప్రఖ్యాతులున్న కందుకూరి వీరేశలింగం చాలా మంది కింది వర్ణాల రచయితల్ని చేర్చకపోయినా, ‘‘ఆంధ్రకవుల చరిత్ర’’  రాయడానికి చాలా విషయాన్ని సేకరించాల్సి వచ్చింది. తాను రాసిన అన్ని సృజనాత్మక రచనలకంటే ఎక్కువగా శ్రమపడి రాసిన రచనగా తన ‘‘ ఆంధ్రకవుల చరిత్ర’’ గురించి చెప్పుకున్నాడు. నేటికీ ఇలాంటి పరిశోధన కొనసాగుతున్నా, దీనికంటే పరిశోధన పరిథి విస్తరించింది. సృజనాత్మకరచనల్లోని ‘‘సత్యాన్ని’’ శోధించే దిశలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
వివిధ భాషలు, కావ్యాలు, ప్రక్రియల్ని తులనాత్మకంగా పరిశీలించడం పెరిగింది. ఇప్పుడు సాహిత్య పరిశోధన కేవలం ఆధ్మాత్మిక సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, సామాజిక, సాంస్కృతిక దృక్పథం వైపు పయనిస్తోంది. సాహిత్య పరిశోధనలో స్త్రీ వాద, దళిత,బహుజన, ముస్లిం ధోరణులు ప్రవేశించి, సాహిత్యం కూడా ఇతర శాస్త్రాల మాదిరిగానే విజ్ఞానాంశాల్ని బోధిస్తాయనే స్ఫృహని కలిగించగలుగుతున్నాయి.
 ‘అంటరానివసంతం’’లో చరిత్ర చెప్పాలని నవల రాశారా? చరిత్రని అనుభవానికి తేవాలనుకున్నారా? దీనిలో ఆదిమసమాజం నుండి ఆధునిక సమాజం వరకూ అంటరానివాళ్ళ జీవితాల్లోని అనేకపార్శ్వాల్ని అనుభూతిలోకి తెచ్చేప్రయత్నం చేశారు. బోయిజంగయ్య ‘‘జాతర’’ నవల్లో దేవుడి పేరుతో అమాయకులపై జరుగుతున్న దారుణాల్ని ఎండగట్టారు. ఈ నవలలు ఒకటి కోస్తా నుండి మరొకటి తెలంగాణ నుండి వచ్చాయి. భిన్న సమస్యల్ని శోధించే రాసినా, వీటిలో పరిశోధన కంటే, అనుభూతి ప్రధానమైంది.
మన తెలుగు సాహితీ విమర్శకులు, పరిశోధకులు సృజనాత్మక విమర్శ, సృజనాత్మక పరిశోధన అనే పదాల్ని అక్కడక్కడా ఉపయోగిస్తున్నారు. వచనరచన కళాత్మకంగా ఉండడాన్నే సృజనాత్మకమనే అనుకుంటున్నారా? సృజనాత్మక తత్త్వాన్ని గుర్తించే ఈ పదాల్ని ప్రయోగిస్తున్నారా? అనేవి అధ్యయనం చేయాల్సిన అంశాలు. ఇప్పటికే హెన్రీ లూయీబెర్గసన్‌ ( 1859 - 1941) ‘‘క్రియేటివ్‌ ఎవల్యూషన్‌’’ అనే గ్రంథంలో ఉనికిలో లేనిదాన్ని సృష్టించడం సృజనాత్మకత అంటూనే జీవశక్తి ( వైటాలిటీ) దీనికి కారణం అన్నారు. పాల్‌ డావ్‌సన్‌ ‘‘ సృజనాత్మక సాహిత్యం ’’ భావనలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ కూడా పొందాడు. ఇతడు సాధన చేస్తే ఎవ్వరికైనా సృజనాత్మక శక్తి వస్తుందంటాడు. కానీ, సాహిత్యంలో, పరిశోధనలో ఉండేది కళా? సృజనాత్మకతా? అనే విషయాల్ని లోతుగా చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. 
ఒకసారి మా యూనివర్సిటీకి ఒక ఆర్టిస్టు వచ్చాడు.వేలాది రకాల పక్షుల్ని  కలర్స్‌లో అందంగా గీసిన పెద్ద ఆల్బమ్‌ ఒకటి పట్టుకొని వచ్చాడు. ‘‘ఇన్ని రకాల పక్షుల్ని గుర్తించి, వాటి బొమ్మల్ని వేశాను. అయినా ఏ యూనివర్సిటీ డాక్టరేట్‌ ఇవ్వడం లే’’దన్నాడు. ఆ పక్షులున్నాయో లేదో గానీ, అంత చక్కగా ( ఊహించి ) వేసినందుకు అభినందిస్తున్నామనీ అన్నారట. మరికొన్ని యూనివర్సిటీల్లో చూపిస్తే, ఆ భావుకతకు డాక్టరేట్‌ కి సిఫారసు చేయొచ్చన్నారట. ఇది పరిశోధననీ, సృజనాత్మకతల్లోని భేదాన్ని గుర్తించడానికి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది.
-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com 
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,

కాంక్రీటు పిచ్చుగ్గూళ్ళలో ...!

అమ్మని నా దగ్గరే పెట్టుకుని
అన్నీ నేనై సాకాలనుందన్నాను
రెక్కలు కట్టుకున్న అమ్మ
ఆ పల్లె నుండి
ఈ నగరానికెగబాకిన తీగను తాకింది

ఒకప్పుడు కొంగు పట్టుకుని వేలాడిన చిట్టిచేతులే
తినమని నోట్లో ముద్దలు పెడతాయనుకుంటే
రూపాయిల కట్టలతో పాటు
అన్నీ పళ్ళెంలో పోసి
అన్నీ అమ్మ ముందు పెట్టేసి
హడావిడిగా ఆఫీసుకేవో
మోసుకుపోతుంటాయ్‌
బరువు బరువుగా

సద్దిపెట్టెలో అన్నీ పెట్టాం
ఇంట్లో రంగుల టి.వి.,
మాట్లాడాలంటే ఫోను
కాంక్రీటు పిచ్చుగ్గూళ్ళల్లో
చుట్టూ జన సంద్రం
పలకరించే మనిషి తప్ప!

మెట్లెక్కుతాను
అర్థరాత్రో, అపరాత్రో
ఆమే, నేనూ చెరో చేత్తో
బిర్యానీ ప్యాకట్టో,
పూర్తి చేయాల్సిన ఆఫీసు ఫైలో!

గుర్తుకొస్తాయ్‌
చల్లారిపోయిన పదార్థాలు ముందున్నప్పుడు
అమ్మ వేడి వేడిగా వడ్డించిన
అమృత రుచులు! అమ్మపై తొక్కిన చిందులు!

వచ్చిన నిమిషమింకా కాకుండానే
రింగున రింగున మోగే కర్ణభూషణం
అమ్మతో మాట్లాడామనుకున్నంతలోనే
కొంపలు మునిగిపోయేలా
మనసుని వికలం చేసే సంభాషణేదో సాగిపోతుంది
నెట్‌ వర్క్‌ అందనట్లు
మధ్య మధ్యలో
‘‘ఆ... ఏంటమ్మా ... ఇందాకేదో అన్నావ్‌...’’
మళ్ళీ రింగు రింగుల కర్ణభూషణం
పొద్దున్నుండీ మాట్లాడాలనుకున్న
ప్రవాహాన్నంతా గొంతులేనే కూరేసుకుంటూ
మనసెరిగిన అమ్మ మౌనిలా మారిపోతుంది


అలాంటప్పుడు అమ్మను చూడాలంటే భయం
అలాంటప్పుడు అమ్మతో మాట్లాడాలంటేనే భయం
అలాంటప్పుడు అమ్మను ఇంటికి రమ్మనాలంటేనే భయం!!

ఇవేనా ఒకప్పుడు వదిలి ఉండలేనని
మారాం చేసిన చిట్టి పొట్టి పాదాలు?
ఇవేనా ఒకప్పుడు
పెద్దయ్యాక కార్లో ఊళ్ళన్నీ తిప్పుతాననీ
ఊయల్లో ఊపుతాననీ
ఉద్యోగం చేసి కష్టాలన్నీ తీర్చేస్తాననీ
పువ్వుల్తో దేవతలా పూజిస్తాననీ...
తీయని కబుర్లెన్నో చెప్పిన తేనె కార్చిన పెదవులు?
- డా.దార్ల వెంకటేశ్వరరావు
( ముంబై వన్ పత్రికలో ప్రచురితం)

ప్రపంచ సాహిత్యమంటే ఏమిటి?



surya telugu daily 8-11-2010

ప్రపంచ సాహిత్యమంటే ఏమిటి?
 శాస్త్ర,సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచం చిన్నదైపోతుందని పరిశీలకులంటున్నారు. అందుకే ప్రపంచమిప్పుడు ఒక గ్లోబల్‌విలేజ్‌. ప్రపంచంలో ఏ మూల్లో ఏమి జరిగినా వెంటనే తెలిసిపోతుంది. తెలిసేవేమిటీ, తెలియాల్సినవి నిజంగా తెలుస్తున్నాయా అనే అనుమానాలూ ఉన్నాయి. ఇలా తెలిసిన విషయాల్ని అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ మార్చుకునేవాళ్ళున్నారు. ఇది మానవ స్వభావం. ఇక్కడ మనం సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచం గ్లోబల్‌విలేజ్‌గా మారడం వల్ల సాహిత్యంలో కొత్త భావాల్ని అందుకోవడానికి, అందించడానికీ మంచి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు  దీన్ని మానవుడు స్థానికత నుండి విశ్వమానవుడుగా ఎదగడానికి సాహిత్యాన్ని ఒక మార్గంగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయోమో చూడాలి.
సాహిత్యంలో ‘‘ప్రపంచసాహిత్యం’’ అనే మాటొకటి విన్పిస్తుంది. దీన్ని మొట్టమొదటి సారిగా 1827లో గెథే (Goethe)గా ప్రసిద్ధి చెందిన జర్మన్‌ సాహితీవేత్త యోహాన్‌ వుల్ఫ్‌గాంగ్‌ వాన్‌ గెయిథే ప్రయోగించాడని పరిశోధకులంటున్నారు. ఆయన తర్వాత అటువంటి భావననే కారల్‌ మార్క్స్‌ & ఏంగిల్స్‌ శ్రామికవర్గ చైతన్య దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో ద్వారా అందించారనీ అంటున్నారు. ప్రపంచసాహిత్యం అంటే ఏమిటో చర్చలోకి తీసుకొస్తూ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ డామ్రోశ్చ్‌ ‘‘వాటీజ్‌ వరల్డ్‌ లిటరేచర్‌?’’ అనే గ్రంథాన్ని రాశాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రచనను, లేదా ప్రపంచాన్ని మార్చగలిగే గొప్ప ఆలోచనలున్న రచనను ప్రపంచసాహిత్యంగా గుర్తించవచ్చనేది ఈ గ్రంథంలోని ప్రధాన ప్రతిపాదన. ఈ గ్రంథం రాకముందే అనేక సంవత్సరాల పాటు ప్రపంచసాహిత్యం గురించిన చర్చ జరుగుతోంది. సాంకేతికంగా వస్తున్న మార్పుల వల్ల ఇటీవల దీనికి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. మన భారతీయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇప్పుడు ‘‘వరల్డ్ లిటరేచర్‌’’ అనేది ఒక ప్రత్యేకపాఠ్యాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని చర్చించుకోవడం అవసరం.
జీవితానుభవాల్ని కళాత్మకంగా సృజనీకరించే అనుభూతి వ్యాపారం సాహిత్యం. తాను దర్శించిన సత్యాన్ని అనుభూతిగా అక్షరీకరించే స్వభావం సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. ఈ అనుభూతి పూర్తిగా తనదే కాకపోయినా, తనలాంటి వారి అనుభూతి కావడం వల్లనో, జీవితంలో అలాంటి సంఘటనలు తనకీ ఎదురవ్వడం వల్లనో పాఠకుడు ఆ రచనను తనదిగా భావించుకుంటాడు. అప్పుడు రచనలో ఉండే వస్తువు తనదే కాకపోయినా, పూర్తిగా తన అనుభూతికి దూరంగా ఉందని చెప్పలేడు. దీనికి భాష అడ్డంకి కాదు. ఆ భావాలతో తాదాత్మ్యం చెందడానికి మూలరచనను చదవలేకపోయినా, దాన్ని  అనువాదంలో చదివినా చాలు. అందువల్లే ఎప్పుడో క్రీ.పూ 8, 9 శతాబ్దాలలో హోమర్‌ రాసిన ‘‘ ఇలియడ్‌’’ ‘‘ ఒడిస్సీ’’ లు గ్రీకు సాహిత్యానికి చెందినవైనా, ప్రపంచవ్యాప్తంగా చదువుకోగలుగుతున్నారు. అందులోని వీరత్వాన్ని, అద్భుతాల్నీ పాఠకులు హాయిగా ఆస్వాదించగలుగుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఈ సాహిత్యం ప్రపంచసాహిత్యంగా గుర్తింపుపొందింది. షేక్‌స్పియర్ సాహిత్యానికి కూడా ఇలాంటి ప్రచారమే లభించడం వల్ల దాన్నీ ప్రపంచసాహిత్యంగానే చెప్తున్నారు. ఆ దృష్టితో చూసినప్పుడు భారతదేశంలో వెలువడిన రామాయణ, మహాభారతాలు కూడా ప్రపంచసాహిత్యమే అవుతుంది. వీటినే కాదు, ప్రపంచ సాహిత్యానికి ప్రధానమైన లక్షణం ప్రాచుర్యం కావడమే ప్రధానమైతే, అనేకభాషల్లోకి అనువాదం పొంది, అత్యధికులకు అందుబాటులోకొస్తే ప్రపంచసాహిత్యమైపోవాలి. కానీ, ప్రపంచసాహిత్యమనిపించుకోవడానికి అలా ప్రాచుర్యం మాత్రమే సరిపోదు. కళాత్మక విలువలతో పాటు, ప్రపంచానికి తెలియని ఒక కొత్తవస్తువు సృజనవ్యాపారంగా మారాలి. అలా మారగలిగింది కాబట్టే, అలెక్స్‌హెలీ రాసిన ది రూట్స్‌’’ ప్రపంచ సాహిత్యమైంది. బానిస సంకెళ్లను తెంచుకోవడానికి జరిగిన ప్రయత్నం ఆ నవల్లో వర్ణితమైంది. మానవుల్లో కనిపించే పీడన, పీడిరపబడటం పాఠకుల్ని అనుభూతితో నింపేసింది.అనుభూతి సాంద్రతలో భేదాలనేవి భావజాలాన్ని బట్టీ ఉండొచ్చు. ఎలాంటి భావజాలమైనా అనుభూతి అత్యంత ప్రధానం. అలాంటివే జాన్‌ మిల్టన్‌ ‘‘పారడైజ్‌ లాస్ట్‌’’, ఇలియట్‌ ‘‘ ది వేస్ట్‌లాండ్‌ఇలా ఎన్నో చెప్పొచ్చు.
సాహిత్యానికున్న ప్రధానగుణం అనుభూతి. పాత్రల పేర్లు, స్థలాలు వేరైనా వాటిలో పాఠకుడు తనని ఊహించుకుంటాడు. వాటితో తాదాత్మ్యం చెందుతాడు. కాబట్టి రచనకు భాష,స్థల, కాలాల కంటే సామాన్యీకరించడమనే గుణం చాలా ముఖ్యం.ఇలా సామాన్యీకరించడమనేది కళాత్మక గుణమే అయినా, చాలా సందర్భాల్లో ఇది కుదరకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల జాతుల వాళ్ళున్నప్పుడు, రకరకాల సంస్కృతులు కూడా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి సమస్యల్లో తేడాలుంటాయి. అందువల్ల అన్నింటినీ సామాన్యీకరించడం కుదరకపోవచ్చు. అందుకనే సార్వజనీనం, సార్వకాలీనం, సార్వదేశికం అనే భావనలను పూర్తిగా అంగీకరించలేమనే వాళ్ళున్నారు. దీనికి కారణం సాహిత్యాన్ని తన అస్తిత్వం నుండి పరిశీలించడం కావచ్చు. సాహిత్యానికి ఉన్నదనుకున్న ప్రయోజనం సామాజిక సమస్యల్ని పరిష్కరిస్తుందని నమ్మడమవ్వచ్చు. దీనికి ప్రపంచసాహిత్యంలో నిలవదగిన భారతీయసాహిత్యాన్ని చెప్పుకోవాలంటే, కచ్చితంగా రామాయణ, భారతాలు ఉంటాయి.కనుక, వీటి గురించి కొద్దిగా చర్చిద్దాం.
               మహాభారతమంతా చెప్పిన తర్వాత ఉగ్రశ్రవసుడు ( సూతుడు) చివరలో ‘‘యదిహాస్తి తదన్యత్ర, యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌అని చెప్తాడు.  దీన్లో ఉండేదే ఎక్కడైనా ఉంటుందనీ, దీన్లో లేనిదెక్కడా ఉండదనీ చెప్తున్న మహాభారతం ప్రపంచ ప్రసిద్ధం. అలాగే రామాయణంలో రాముడు ఆదర్శపురుషుడుగా కీర్తించబడ్డాడు. ఇక్కడే కొన్నిప్రశ్నలు మొదలవుతాయి. ప్రపంచసాహిత్యం అనగానే డేవిడ్‌ డామ్రోశ్చ్‌ ఎదుర్కొన్న ప్రశ్నల వంటివే ఈ మహాకావ్యాల విషయంలోనూ ఎప్పుడో ఎదురయ్యాయి. ‘‘భారత రామాయణాదులు అన్ని జాతులకు, అన్ని భాషలకు, అన్ని కాలాలకు, అన్ని దేశాలకు శాశ్వతంగా ఉపయోగపడతాయనటం వెనుక స్వార్థశక్తుల ప్రయోజనం నిక్షిప్తమయి ఉందని సాహిత్య విమర్శకులన్నారు.
సంస్కృత మహాభారతం ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమైంది. అయితే ఆ అనువాదం మూలంలో ఎలా ఉంటే అలా వెళ్ళిందా? లేదా? అనేదొక సమస్య. మన ఆంధ్రమహాభారతాన్నే తీసుకుందాం. 11 వ శతాబ్దంలో నన్నయ దీన్నెంతో సాహసంతో తెలుగులో అనుసృజన చేశాడు. ఈ కావ్యప్రయోజనాన్నిలా వర్ణించాడు
 ‘‘బహుభాషల బహువిధముల
బహుజనముల వలన వినుచు భారత బద్ధ
స్పృహులగు వారికి నెప్పుడు
బహుయాగంబుల ఫలంబు పరమార్థమిలన్‌ దీన్ని విన్నవాళ్ళకీ, దీనిలో చెప్పిన దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళకీ అనేక యజ్ఞ యాగాదులు చేస్తే వచ్చే ఫలితం చేకూరుతుందన్నాడు. కాబట్టి ఇది గొప్పకావ్యమే అనుకుందాం. ఈ కావ్యంలోనే కవి మరోచోటిలా అన్నాడు.  ‘‘ ..సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ మహామహిమతో రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజరాజనరేంద్రుల వారి ఆఙ్ఞను అనుసరించి  మహాభారతాన్ని తనదైన బుద్ధిబలంతో తెలుగులో రాశానన్నాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షించడమంటే, ఆ యా వర్ణాల వాళ్ళు వాళ్ళకు నిర్దేశించిన విధుల్ని ఇష్టమున్నా లేకున్నా నిర్వర్తించవలసిందే కదా! ఆజ్ఞను మీరితే రాముడు శంబూకుడ్ని వధించినట్లు రాజు ‘‘ధర్మాన్ని’’ నిర్వర్తించాల్సిందే కదా! మరి ఇది ప్రపంచ సాహిత్యమైతే, ఈ ప్రపంచసాహిత్యంలో అందరికీ భాగస్వామ్యముందని భావించవచ్చా? ఇప్పుడు సంస్కృత మహాభారతాన్ని ప్రపంచసాహిత్యంగా పరిగణించాలా? ఆంధ్రమహాభారతాన్ని పరిగణించాలా?
 సంస్కృత, రామాయణ, మహాభారతాల విషయంలో కూడా ఒక విమర్శ ఉంది. ఆర్య, ద్రావిడ ఆధిపత్యపోరాటంలో భాగంగానే ఆ సాహిత్యం వచ్చిందనేది ఆ విమర్శ సారాంశం. అలాగని ఆ సాహిత్యాన్నంతటికీ ఏవో కొన్ని కారణాల వల్ల కొట్టిపారేయలేం. పక్కన పెట్టేయలేం. వాటిలోనూ భిన్న దృక్పథాల్లో వచ్చిన సాహిత్యం ఉందని గుర్తించాలి. మరి అలాంటి గుర్తింపే వివక్షను ప్రశ్నిస్తూ వస్తున్న సాహిత్యానికీ దక్కాలి. ఆ కోణాన్నుండి ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకుంటారు. ‘‘ప్రపంచ సాహిత్యంలో కొన్ని మైలు రాళ్ళవంటి సాహిత్య నిర్మాణాలు ఎప్పటికీ నిలిచి ఉన్నట్లు అనిపిస్తుంది. నిలిచి ఉండటం కంటే నిలిపి ఉంచటం గుర్తించాలి. నిలపటం అవసరార్థం జరుగుతుంది. ఆ అవసరం వ్యవస్థదయితే మేటి, వ్యక్తులదైతే కీడు’’ అనేది విమర్శకుల నిర్ణయం. అందువల్ల ప్రపంచసాహిత్యంగా చలామణీ కావాలంటే డేవిడ్‌ డామ్రోశ్చ్‌ భావించినట్లు అనువాదంలో మూలభాష, సాహిత్య సంస్కృతుల్ని విస్మరించకూడదు.
ప్రపంచంలో వాళ్ళందరికీ అర్థం కావాలనో, అర్థం కాదనో స్థానిక, దేశీయ మూలాల్ని అనువాదకులు నిరాకరించడమో, నిర్లక్ష్యం చేయడమో, విస్మరించడమో సరైంది కాదనేది కూడా ‘‘ప్రపంచసాహిత్యం’’ కావాలనుకునే వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే ప్రపంచసాహిత్యమనే భావన బాగా వ్యాపించాలంటే వివిధ భాషా, సాహిత్యాల్లో తులనాత్మక అధ్యయనం పెరగాలి. ప్రపంచసాహిత్యంలో కొన్ని భాషలకే ప్రాచుర్యం ఉండడం వల్ల మరికొన్ని భాషల్లో వెలువడే ఉత్తమసాహిత్యం అత్యధికులకు అందడం లేదు. అనువాదకుల్లో  ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాల కంటే ఉత్తమ సాహిత్యాన్ని అందించాలనే కృతనిశ్చయం కూడా ప్రపంచసాహిత్య భావనను మరింత ముందుకి తీసుకెళ్ళగలుగుతుంది.
ప్రపంచ సాహిత్యం ఎలా ఉండాలో విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూరు కవిత అందంగా చెప్తుందనిపిస్తుంది. 
‘‘ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడో
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో
ఎక్కడ విరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ  విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో
తలపులో, పనిలో, నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనసు పయనిస్తుందో  
` ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, తండ్రీ! నాదేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించుఇది గీతాంజలిలోది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచంలోని ఎన్నో భాషల్లో దీన్ని చదువుకుంటున్నారు. టాగూరు రాసిన దీనికే నోబుల్‌ బహుమతి కూడా వచ్చింది. ఈ కవిత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి దీన్ని ప్రపంచసాహిత్యంలో భాగంగా చెప్పాలా? ప్రపంచసాహిత్యంగా చెప్పాలా? రెండు ప్రశ్నలూ ఒకటి కాదు! 
-డా దార్ల వెంకటేశ్వరరావు
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com
Ph: 040-23133563 (O), Mobile: 0998962804




తెలుగు సాహిత్యంలో మహోన్నత శిఖరం ఆచార్య ఇనాక్‌

-డా దార్ల వెంకటేశ్వరరావు
                సృజన, పరిశోధన, విమర్శన రంగాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారికి సి.పి.బ్రౌన్‌ అకాడమీ పురస్కారాన్ని ప్రకటించి, సాహిత్య విలువల్ని పెంపొందించడంలో ముందువరుసలో నిలిచే ప్రయత్నం చేసింది. తెలుగు భాషా,సాహిత్యాలకు సి.పి.బ్రౌన్‌ చేసిన సేవ అభ్యుదయమార్గంలో సాగింది. అంతవరకూ నిర్లక్ష్యానికి గురైన వేమన సాహితీ ప్రపంచానికి తెలిసాడంటే దానిక్కారణం సి.పి.బ్రౌన్‌. నిఘంటువుల్ని రూపొందించడంలోను, తెలుగు ప్రబంధాల్ని సంపాదించి, వాటికి వ్యాఖ్యానాల్ని రాయించి, అందరికీ అందించడంలోను ఆయన చేసిన సేవ విస్మరించలేనిది. అలాంటి మార్గంలోనే పయనించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్‌.
సి.పి.బ్రౌన్‌ పుట్టుకతోనే ధనవంతుడైతే, ఆచార్య ఇనాక్‌ దీనికి పూర్తి వ్యతిరేకమైన ఆర్థిక, సామాజిక పరిస్థితుల నుండి వచ్చినా, ఇరువురూ క్రైస్తవమతం భావాల్ని ఆచరించే కుటుంబం నుండి రావడం విశేషం. అందుకేనేమో తాము చేసే ప్రతి పనినీ దైవసమానంగా భావించటం ఇరువురిలోను కనిపిస్తుంది.
బ్రౌన్‌ కాలేజీ గా పండితుల్ని ఒక బృందంగా పరిశోధన చేయించడం, తానూ చేయడం సి.పి.బ్రౌన్‌లో కనిపించినట్లే, ఆచార్య ఇనాక్‌ గారిలోనూ ఇలాంటి పరిశోధక లక్షణం కనిపిస్తుంది. వీరి పర్యవేక్షణలో సుమారు 24 మంది పిహెచ్‌.డి., 18 ఎం.ఫిల్‌., పరిశోధనలు చేసి, డిగ్రీలు తీసుకున్నారు. సుమారు 198 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాల్ని సమర్పించారు. సమారు 180 పరిశోధన పత్రాలు ప్రచురించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘‘ తెలుగు వ్యాస పరిణామం’’ పై పరిశోధన చేశారు. అదే విశ్వవిద్యాలయానకి వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించడం ఒక చారిత్రక సన్నివేశం. నన్నయ నుండి ఆధునిక పత్రికా రచయితల వరకూ తెలుగు వ్యాసపరిణామం కొనసాగిన తీరు తెన్నుల్ని విశ్లేషిస్తూ, సాహిత్య విషయాలకే మన రచయితలు అధిక ప్రాధాన్యాన్నిచ్చారని సూత్రీకరించారు. వ్యాసం ఆలోచన కలించడంతో పాటు, అనుభూతిని రగిలించడానికి సహకరించినప్పుడు అందరినీ అలరించగలుగుతుందని, దానికెలాంటి లక్షణాలను కలిగి ఉండాలో వేలాది వ్యాసాల్ని పరిశీలించిన అనుభవంతో సిద్ధాంతీకరించారు.నేటికీ చాలా మందికి దొరకలేదంటున్న పురాణం సూరిశాస్త్రి లాంటి వారు రాసిన వ్యాసాల్ని కూడా ఆనాటికే సంపాదించి, వాటిపై కూడా నిర్ణయాల్ని ప్రకటించడం పరిశోధకునికగా ఆచార్య ఇనాక్‌ గారికున్న అన్వేషణ, శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనం.

డాక్టరేట్‌ సాధించిన గ్రంథం రిఫరెన్సు గ్రంథం కావడం పరిశోధనకు నిజమైన గుర్తింపనుకోవచ్చు. అలాంటి గుర్తింపు వీరి తెలుగు వ్యాసపరిణామం గ్రంథానికి లభించింది. ఈయన చేసిన మౌలికమైన పరిశోథనలో కలికితురాయిగా చెప్పుకోదగింది వసుచరిత్ర ప్రబంధకారుడు శుభమూర్తిపై చేసిన పరిశోధన. ఇది పరిశోధన గ్రంథమైనా, విమర్శక దృక్పథం ఉండటం వల్ల దీని పరిశోధనాత్మక విమర్శ గ్రంథంగా పిలవడం సమంజసం.               
పరిశోథనలో అన్వేషణ, కొత్తవిషయాల్ని బయటపెట్టడం, సిద్ధాంతాన్ని స్థాపించడం లేదా ఒక విషయాన్ని సూత్రీకరించడం ముఖ్యం. వీటిలో అంతర్భాగంగానే కనిపిస్తున్నా, గుణ,దోష విశ్లేషణ, నిర్ణయ ప్రకటన విమర్శలో ప్రధానంగా చూడాలి. పరిశోధనలో కనిపించే అన్వేషణ, సమాచార సేకరణ విమర్శలో అంతగా కనిపించవు. లభించిన సమాచారాన్ని విశ్లేషించి, తులనాత్మకంగా పరిశీలించి, తనదైన దృష్టితో వ్యాఖ్యానించి, అది గుణమో, దోషమో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం విమర్శ స్వభావం. ఈ రెండు స్వభావాలు సంతరించుకుంటే దాన్ని పరిశోధనాత్మక విమర్శ అనొచ్చు. అలా రెండు లక్షణాల్ని సంతరించుకున్న గ్రంథం ‘‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’’. తన పేరు శుభమూర్తి, మూర్తికవి అని వసుచరిత్రకారుడు చెప్పుకున్నా, అతణ్ణి భట్టుమూర్తి, రామరాజభూషణుడు అని నాటి నుండి నేటి వరకూ పండితలోకం పిలవడంలో ఒక శూద్రుణ్ని కవిగా గాని, అతని పేరుతో గాని పిలవడానికిష్టపడని వర్ణాధిక్యాన్ని సోదాహరణంగా నిరూపించారు. శుభమూర్తిలో కవిలోకం పట్ల దళిత, బహుజనులు అలవరుచుకోవలసిన ప్రతిఘటన చైతన్యాన్ని గుర్తించేలా గ్రంథాన్ని సాధికారికంగా రాశారు. ఇంతవరకూ దీన్నెవరూ ఖండిరచకపోవడం దీనిలో ప్రతిపాదించిన పరిశోధనాంశాల్లోని శాస్త్రీయతకు నిదర్శనం.
ఇటువంటి పరిశోధనాత్మక స్పర్శతో  రాసిన విమర్శ గ్రంథం ‘‘ఆధునిక విమర్శ సాహిత్య సూత్రం’’   తెలుగు వ్యాసం గురించెవరైనా ప్రస్తావిస్తే, ఈ రంగంలో చేసిన ఇనాక్‌ గారి వ్యాసపరిణామాన్ని ఎలా పేర్కొంటారో, అలాగే ఆధునిక సాహిత్యాన్ని విమర్శించేందుకున్న నూతన సూత్రాల్ని ప్రతిపాదించిన గ్రంథమిది.  అటు పూర్తిగా మార్క్సిజం గాని, ఇటు మానవతావాదంతో గాని విమర్శించడానికి వీల్లేని పూర్తి దేశీయ విమర్శ పద్ధతిలో మాత్రమే విమర్శించదగినవి దిగంబర, స్త్రీవాద,దళితసాహిత్య ధోరణులు. వీటిని చాలా శ్రద్ధగా తాను పరిశోధన చేస్తూ, విద్యార్థుల చేత చేయిస్తూ వస్తున్న క్రమంలో వెలువడిన ఆణిముత్యాల్లాంటి విమర్శపద్ధతుల్ని ప్రతిపాదించారు. సాహిత్యవిమర్శకు తెలుగు సాహిత్యం అందించిన మహోన్నత వారసత్వసంపదగా దీన్ని చెప్పుకోవడానికి వీలున్న విమర్శపద్ధతులివి.
               సాహిత్య విమర్శలో ఆంగ్లేయుల ఇమేజినేషన్‌ నే తనదైన పద్ధతిలో చెప్పి, దానికి సామాజిక కోణాన్ని అందించి కట్టమంచి రామలింగారెడ్డి విమర్శకు ఆధునికతను ఇచ్చాడు. మళ్ళీ విమర్శకు అంతటి గౌరవాన్నిచ్చిన పరిస్థితి ఆచార్య ఇనాక్‌ గారికే చెందుతుంది. మార్క్సిజంలోని ఆర్థికాంశాల్ని, దేశీయతాభూమికతో రూపొందిన అంబేద్కర్‌ కులనిర్మూలనా చైతన్యాన్నీ మేళవించి సాహిత్యాన్ని సమన్వయించినప్పుడే స్త్రీవాద, దళిత సాహిత్య విలువల్ని శాస్త్రీయంగా అంచెనా వేయగలమని నిరూపించారు.
అంతవరకూ చర్చలో కొచ్చిన వస్తు, రూపాలు, నిబద్ధతలతో పాటు నిమగ్నత, నిబిడితలను ప్రతిపాదించారు. తాను రాసే రచనల్లోని జీవితానికి వ్యతిరేకమైన జీవితం ఉంటే రచయితకు నిబద్దత ఉన్నట్లు కాదు. రాసే వస్తువుతో తాదాత్మం చెందడమనే నిమగ్నత సాహిత్యానికి విలువల్ని అందిస్తుంది. తాను రాసే వస్తువుకీ, తన జీవితానికీ అవినాభావ సంబంధమున్నట్లైతేనే నిబిడితతో కూడినట్లవుతుంది. ఈ మూడు లక్షణాలు సమ్మేళనంతో సాహిత్య విమర్శ చేయడమనేది ఇనాక్‌ గారితోనే ప్రారంభమైంది. ఆ సూత్రమే ప్రధానకేంద్రంగా స్త్రీవాద, దళిత సాహిత్య విమర్శ చేయగలిగితేనే అది శాస్త్రీయమైన విమర్శపద్ధతి అవుతుంది. లేకపోతే స్త్రీవాద, దళిత సాహిత్యాల్ని సంస్కరణ, మానవతావాద, మార్క్సిస్టు పద్ధతుల్లో విమర్శించించినట్లే అవుతుంది.
ఇలా పరిశోధనలోను, విమర్శలోను ఒక మైలురాయిగా నిలవదగిన స్థాయిలో కృషిచేసిన ఇనాక్‌ గారు సృజనాత్మక సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేయగలిగారు. తెలుగులో చక్కని, చిక్కని, చిన్న చిన్న వాక్యాల్లో అందంగా రాయడమెలాగో తెలుసుకోవాలంటే, ఇనాక్‌గారి వచనం చూడాల్సిందే. సృజనాత్మక రచనల్లో మునివాహనుడు, ఊరబావి, తలలేనోడు, కులవృత్తి వంటి రచనలు ఆయన తప్ప మరెవరూ రాయలేరనిపిస్తుంది. మొత్తం మీద రచనలన్నింటిలోనూ ఉండే గుణం మానవీయ విలువల్ని  మహోన్నత పతాకం చేయాలనే మహోన్నత సాహిత్య శిఖరం ఆచార్య కొలకలూరి ఇనాక్‌.
( ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారు సి.పి.బ్రౌన్‌ అకాడమీ పురస్కారాన్ని 30`10`2010 వ తేదీన అందుకుంటున్న సందర్భంగా రాసిన వ్యాసం.)