నన్ను ఓ ఉద్యమంలా బతకనివ్వు!
అన్యాయం ఎదురైతే
నాలోని అక్షరాలు
అగ్నికణాలై రగలాలి
అవమానం ఎదురైతే
నా ఆత్మగౌరవం పిడికిలై బిగుసుకోవాలి!
నేను నడిచే దారి
పూలతో పరచిన బాట కావాల్సిన పనిలేదు
ముళ్ల అడుగున
నలిగిన పాదాల రక్తచరిత్ర నాకు తెలుసు!
నేను ఒక ప్రశ్నగానే పుట్టాలి
నిశ్శబ్దాన్ని చీల్చే గొంతుకనే కావాలి
నేను ఒక జ్వాలగానే వెలగాలి
చీకటి కోటల పునాదుల్ని కదిలించాలి!
నా వెనుక
వేల సంవత్సరాల
అవమానాలున్నాయి
నా ముందు
వేల తరాల విముక్తి స్వప్నాలున్నాయి
నా చేతిలో
చరిత్ర మార్చిన
మహనీయుల ఆలోచనలున్నాయి!
నన్ను ఆపాలని చూసే గోడలకు
నా అడుగులే సమాధానం కావాలి
నన్ను అణచాలని చూసే సంకెళ్లకు
నా సంకల్పమే పిడికిలి కావాలి!
నేనిప్పుడు ఒక్కడినే కావొచ్చు
నా ఆలోచనే ఒక సైన్యం
నా గొంతిప్పుడు ఒక్కటే కొవొచ్చు
దాని ప్రతిధ్వనే ఒక మహా జనసముద్రం!
నా కలం కత్తి కావాలి
నా కవిత నినాదం కావాలి
నా ప్రయాణం పోరాటం కావాలి
నా గమ్యం సమానత్వం కావాలి!
నాకు పదవుల పీఠాలు వద్దు
ప్రజల కన్నీళ్లు తుడిచే చేతులు కావాలి
నాకు కీర్తి కిరీటాలు వద్దు
కూలిన మనిషిని నిలబెట్టే భుజాలు కావాలి!
నా జీవితం
నా ఒక్కరి చరిత్రగా మిగలకూడదు
నాతో నడిచిన
ప్రతి మనిషి ఆత్మగౌరవ చరిత్రలో
ఒక అక్షరం కావాలి!
నేను అలసిపోయినా
ఉద్యమం అలసిపోకూడదు
నేను ఆగిపోయినా
ఆశయం ఆగిపోకూడదు
నా అడుగులు ఆగిపోయినా
నా అడుగుజాడలు మాత్రం
మరో తరం విముక్తి వైపు నడవాలి!
— దార్ల వెంకటేశ్వరరావు
17.7.2025

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి