హైదరాబాదులో నేను గమనించిన సాహిత్య, సాంస్కృతిక సమావేశాలు
హైదరాబాదులో నిత్యం ఏదో ఒక స్థలంలో సాహిత్య సమావేశాలు, సభలు జరుగుతూ ఉంటాయి. ఆ సభల వివరాలు సమావేశానంతర వార్తలు చాలా కొద్ది మంది మాత్రమే పత్రికలకు ఇస్తుంటారు. కొన్ని పత్రికలు అయితే వాటికి అసలు ప్రాధాన్యాన్ని ఇవ్వవు. జాతి సంస్కృతి, వారసత్వం, విలువల పరిరక్షణకు సాహిత్య సమావేశాలు చాలా ముఖ్యం. వీటిని గమనించిన పత్రికలు వాటికి సముచిత ప్రాధాన్యాన్ని ఇస్తుంటాయి. కొన్ని పత్రికలు కేవలం వాళ్ళ సంపాదకులు లేదా వాళ్లకు కావాల్సిన వాళ్ళు పాల్గొన్న సమావేశాల వివరాలు మాత్రమే ప్రచురిస్తుంటాయి. సమావేశాల్లో పాల్గొని, పూర్తిగా విని రాసే విలేఖర్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. కొంతమంది కరపత్రాన్ని చూసి న్యూస్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. సమావేశాన్ని నిర్వహించడం ఎంత ముఖ్యమో దాన్ని పత్రికలకు పంపించడం కూడా అంతే ముఖ్యమని భావించేవాళ్ళు ఆ నివేదికను సంక్షిప్తంగా పత్రికలకు పంపించే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అయితే పెయిడ్ న్యూస్ లాగా కవర్లో డబ్బులతో పాటు వార్త వివరాలు ఉంటేనే ఆ సమావేశం వివరాలు పత్రికలో వస్తాయి. సామాజిక మాధ్యమాలు విస్తృతమైన తర్వాత మరి కొంతమంది అయితే, అక్కడ సమావేశం జరుగుతుండగానే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వివరాలు ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ఉంటారు. ఈమధ్య శ్రీ త్యాగరాయ గాన సభ వంటి సాంస్కృతిక సమావేశాల నిర్వాహకులు ప్రతి సమావేశ మందిరంలోనూ లైవ్ కెమెరాలు పెట్టేసి యూట్యూబ్ టీవీలు, స్థానిక ఛానెల్స్ లలో సభ నంతటిని ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. సామాజికమధ్యమని సమర్థవంతంగా ఉపయోగించుకొనే కొంతమంది సాహితీవేత్తలు ఫేస్బుక్ లలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా చేస్తున్నారు. దీన్ని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ నిర్వహించేవాళ్లు కొన్ని ముఖ్యమైన సమావేశాలకు వచ్చి రికార్డ్ చేసి వాటిని ప్రసారం చేస్తూ ఆ నిర్వహకులను సంప్రదించి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. తాము తీయమని చెప్పలేదని చెప్పినా వినకుండా డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఆ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న సాహితీవేత్తలు కొంతమందిని ఇంటర్వ్యూ లేదా కొద్దిగా పరిచయం చేసి ఆ క్లిప్పులను వేసి, వాళ్ల ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఇవన్నీ హైదరాబాద్ సాహిత్య సమావేశాల్లో గమనించిన కొన్ని అంశాలు. వీటితో పాటు మన సాహిత్య సమావేశం చేయడానికి కొంత డబ్బులు తీసుకుని ఆ సమావేశాలు నిర్వహించే సాహితీ, సాంస్కృతిక సంస్థలు కూడా ఉన్నాయి. మనం ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ సమావేశం జరుగుతుంది. సత్కారాలు, పురస్కారాలు కూడా కొన్ని సంస్థలు డబ్బులు తీసుకునే ఇస్తూ ఉంటాయి. కొన్ని సాంస్కృతిక సమావేశాల వేదికలు ఉచితంగా సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఇస్తుంటాయి. కానీ, అవన్నీ తెలిసిన వాళ్ళకి లేదా పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రమే లభిస్తుంటాయి. నామాత్రంగా ఒకరిద్దరికి మాత్రం ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తుంటారు.
కొన్ని సమావేశ మందిరాలు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని కూడా ఇస్తుంటాయి. అందువల్ల కొంతమందికి హైదరాబాదులో సాహితీ సాంస్కృతిక సమావేశాలు నిర్వహించుకోలేని స్థితి ఏర్పడుతుంది.
నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోడానికి వచ్చిన తర్వాత మా విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థి సంఘాల వల్ల కొన్నింటిని ప్రత్యక్షంగా గమనించగలిగాను. ఆ మీటింగ్ నిర్వహించడానికి హాల్ బుక్ చేయడానికి నేను కూడా వెళ్లేవాడిని. అప్పుడు వీటిలో కొన్ని గమనించాను. ఆ తర్వాత మా గురువుగారు జ్యోత్స్నా మేడమ్ గారి పేరుతో ఉన్న ఒక సాంస్కృతిక సంస్థ ద్వారా వీటిని మరింత లోతుగా నిశితంగా పరిశీలించే అవకాశం ఏర్పడింది. కొన్ని పురస్కారాల సభలు చూస్తే, కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టేటంతమంది మంది కూడా ఉండరు. ఇంచుమించు ఈ హైదరాబాద్ సాహిత్య సమావేశాలు, సభలలో ప్రేక్షకులుగా కూర్చున్న వాళ్లు మరి కొన్ని సభల్లో వేదికల మీద ఉంటారు. వేదిక మీద కూర్చున్న వాళ్ళు కింద ప్రేక్షకులుగా ఉంటారు. జనం రావడం లేదా రాబట్టుకోవడం కోసం ముందుగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కొంతమంది అయితే కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తారు. ఎక్కువ సమావేశాలు అనుకున్న సమయానికి ప్రారంభం కావు. అలాగే, ముగించడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటారు. కొంతమంది మైకాసురులు సమావేశాలలో ప్రత్యక్షమవుతుంటారు. వాళ్లని నిర్వాహకులు గాని దాంట్లో పాల్గొన్న వాళ్లు గాని భరించడం కష్టం. ఇంకొంతమందైతే,ఆ సమావేశంలో ద్వారానే తమ జ్ఞానాన్ని అంతా బయట పెట్టుకోవాలని భావిస్తున్నారు ఏమో అనిపిస్తుంది. మరి కొంతమంది అయితే ప్రేక్షకులకు అందరికీ తనకు తెలిసిందంతా చెప్పేసుకోవాలనే కుతూహలం కనిపిస్తుంది. సభ నిర్వహించేవాళ్లు, సభకు అధ్యక్షత వహించే వాళ్ళే ఎక్కువగా మాట్లాడే వాళ్లు కొంతమంది అయితే, కేవలం పేరు మాత్రమే పిలిచి ఊరుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఆ సభల్లో పాల్గొన్న కొంతమంది ప్రవర్తన కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటుంది. తమకి అస్సలు ఖాళీ లేనట్టు, అస్సలు సమయం లేనట్లు వాళ్ళే ముందుగా మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది మాట్లాడి వెళ్లిపోయిన వెంటనే ప్రేక్షకులు కూడా లేచి వెళ్ళిపోతుంటారు. సాహిత్య సమావేశాల్లో, ముఖ్యంగా పుస్తకావిష్కరణలు జరిగేటప్పుడు ఆ పుస్తకాలను తమకు ఉచితంగా ఇస్తుంటే వాటిని తీసుకోవడానికి ఎగబడే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళంతా నిజంగా పుస్తకం చదివేస్తారేమో అని ఫీలింగ్ కనిపిస్తుంది. రవీంద్ర భారతి, శ్రీ త్యాగరాయ గాన సభ, హరిహర కళాభవన్, తెలుగు విశ్వవిద్యాలయం కళాతోరణం వంటి వాటిలో సీరియస్ ప్రేక్షకులు కంటే టైంపాస్ కి వచ్చే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. సినీ నటులు పాల్గొనే కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కువగా పాల్గొంటారు. రాజకీయవేత్తలు కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళు మాట్లాడేసిన తర్వాత వాళ్లతో పాటు వాళ్ళ కార్యకర్తలు కూడా సమావేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారు. సాహిత్య సమావేశాల్లో సాధారణంగా పొగడ్తలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది మాత్రమే అతిథులకు పాల్గొన్న వాళ్ళకి టీలు నీళ్లు అందుబాటులో ఉంచుతారు. కొంతమంది అయితే పాల్గొన్న అతిథులకైనా మంచినీళ్లు కూడా ఇవ్వరు. మరి కొంతమంది ముఖ్యంగా జీవితంలో ఒకటి రెండు సమావేశాలు నిర్వహించుకునే వాళ్ళు అయితే ఒక విందు కార్యక్రమంలో చేస్తారు.
ఎందుకో హైదరాబాద్ సాహిత్య సంస్కృతి సమావేశాల గురించి రాయాలనిపించింది. నేను గమనించిన కొన్ని విషయాలు ఇక్కడ రాసే ప్రయత్నం చేశాను.
దీని తర్వాత నేను పాల్గొన్న, చూసిన ఒకటి రెండు సమావేశాలు జరిగిన తీరుతెన్నుల గురించి కూడా రాసే ప్రయత్నం చేస్తాను.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 29.7.2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి