ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహితీ సప్తాహంలో భాగంగా 7.7.2025 వతేదీన శ్రీత్యాగరాయ గాన సభ, శ్రీ కళా సుబ్బారావు కళావేదిక, హైదరాబాదులో జరిగిన సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆచార్య కొలకలూరి ఇనాక్ అనేక ప్రక్రియల్లో రచనలు చేశారనీ, కథల్లో ఊరబావి, తలలేనోడు, అస్పృశ్యగంగ, తాకట్టు మొదలైన కథలు ఆయన పేరు చెప్పగానే గుర్తొస్తాయని వాటిని వివరించారు. అలాగే, కవిత్వం విషయంలో వచన, పద్య కవిత్వాలను రచించిన ఇనాక్ గారు ‘ఆదిఆంధ్రుడు’ పద్య కావ్యం ఆయన ఛందోబద్ద పద్య రచనకు నిదర్శనం అన్నారు. నాటకాంతం హి సాహిత్యం అనే నానుడిని నిజం చేస్తూ ఆయన రచించిన ‘మునివాహనుడు’ నాటకంలో వస్తువు, సన్నివేశ కల్పన, పాత్రచిత్రణ, సంభాషణా చాతుర్యం, సందర్భోచితంగా పెట్టిన పాటలు, పద్యాలు ఆయన ప్రతిభను తెలియజేస్తాయన్నారు. ఆయన నూతన ప్రక్రియ ‘గాథ’ను ప్రవేశపెట్టారనీ, అది పాడుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. విమర్శరంగంలో ఆయన ‘ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం’ గ్రంథంలో ‘నిబిఢిత’ అనేది ఆధునిక సాహిత్యానికి నూతన సూత్రంగా చెప్పుకోవచ్చని చెప్పారు. పరిశోధన చేయడంలో ఎంతో విలువైన పరిశోధన ‘ తెలుగు వ్యాసపరిణామం’ గురించి ఆయన ఎన్నో కొత్త విషయాలను చెప్పారని ప్రశంసించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి