అంతరాల ఆలింగనం
మనిద్దరి మధ్య
ఎంత దూరముందో ఎవరికీ తెలియదు.
అయినా
నీ ప్రతి ఉదయాన్నీనా ఒడిలోనే మోస్తాను.
నీ మీద వెన్నెల పరచేది నేనే
నీ చీకటిని నక్షత్రాలతో పలకరించేది నేనే.
నువ్వు
నా వైపు చూసినప్పుడల్లా
నీ కళ్లలోనా అనంతం కనిపిస్తుంది.
నేను
నీ వైపు చూసినప్పుడల్లా
నీ మౌనంలో నా ప్రతిబింబం కనిపిస్తుంది.
నువ్వు ఎండిపోతే
నా మేఘాలను పంపుతాను.
నీ పెదవుల మీద మొదటి చినుకై జారుతాను.
నీ గర్భంలో
దాచుకున్న విత్తనాలు
మెలకువ రావాలనివర్షమై కురుస్తాను.
నువ్వు పచ్చబడితే
నేను ఇంకాస్త నీలమవుతుంటాను
నీ అడవుల ఊపిరిలో
ఓ గాలిగా తిరుగుతాను.
నీ సంతోషాల నదుల ప్రవాహంలో
నేను మేఘాల జ్ఞాపకమై ఉంటాను.
ఎన్ని అడుగులు పడినా
ఎన్ని గాయాలు చేసినా
ఎన్ని రహస్యాలు పాతిపెట్టినా
నీ ఒడిని
ఎప్పుడూ మూసుకోలేవు
నాకు హద్దులు లేవు.
నా నీలిమలో
ఎన్నో తుఫాన్లు పుడతాయి.
ఎన్నో మేఘాలు
ఒకదానినొకటి ఢీకొంటాయి.
మెరుపులు
నా నిశ్శబ్దాన్ని చీల్చేస్తుంటాయి
ఆ క్షణాల్లో
నువ్వెంతగా వణుకిపోతుంటావో.
భయంతోనో,
భయపెట్టాలనో
నీ గుండెల్లో
అగ్నిపర్వతాలు ఎగసిపడతాయి.
నీ ఆవేశాన్ని నేను నిందించను.
నీ లోపల మండే అగ్ని
నా మెరుపులకే మరో రూపమేననుకుంటాను
నీ మీద పడే
ప్రతి వాన చుక్కలో
నా కన్నీటి రహస్యం దాగుంటుందని తెలుసా.
నీ మీద విరిగే
ప్రతి మెరుపులో నా ఆవేశమూ కనిపిస్తుందిని
నీ మీద తేలే
ప్రతి సంతోషపు మేఘంలోనూ
ప్రశాంతంగా ఆశ్వాదించే ఆనందముంటుంది
నువ్వు
నన్ను ఆక్రమించలేవు.
నువ్వు నన్ను అందుకోలేవు
అందరూ నువ్వూ నేనూ
పరిస్వంగమనుకుంటారు
నేను
నిన్నూ ముద్దాడలేను
అయినా
మనిద్దరి మధ్య
ఒక అనంతమైన సంభాషణ
నడుస్తూనే ఉంటుంది.
నీ నదులు
సముద్రం వైపు పరుగెడుతుంటే
నా మేఘాలు
నీ కొండల వైపు వస్తుంటాయి.
నీ నుంచి ఆవిరైన దుఃఖమైనా
నీనుంచి పొంగిపొర్లే
సంతోషమైనా
నా దగ్గరకే చేరుతుంది.
నా దగ్గర పుట్టినదీ
మళ్లీ నీ దగ్గరకే చేరుతుంది
ఇదే మన బంధం.
కలవకుండా
కలవడమే
మన బంధంలోని విచిత్ర తాదాత్మ్యం.
దార్ల వెంకటేశ్వరరావు 8.8.2026


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి