నాగప్పగారి సుందర్ రాజు సాహిత్యం
ఓ ధిక్కార స్వరం.
తెలుగు సాహిత్య చరిత్రలో దిగంబర, విప్లవ కవిత్వాల తర్వాత అస్తిత్వ చైతన్యానికి, కుల వివక్షపై పోరాటానికి దళిత, బహుజన సాహిత్య ఉద్యమాలు ఒక బలమైన ధిక్కార స్వరాన్ని అందించాయి. ఈ ధిక్కార స్వరాలను తన కథల ద్వారా మాదిగ సాహిత్యం ద్వారా కొత్త స్థాయికి తీసుకెళ్లిన నాగప్పగారి సుందర్ రాజు, 1968 మే 31న కర్నూలు జిల్లా మొలగవెల్లి కొట్టాలలో రంగన్న, పెద్దనర్సమ్మ దంపతులకు జన్మించాడు. మొలగవెల్లి కొట్టాలు, గుంతకల్లు, పత్తికొండ, అనంతపురంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఎ., ఎం.ఫిల్. పిహెచ్.డి. పట్టాలను పొందాడు. పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలపై, రాయలసీమ కథలపైనా పరిశోధనలు చేసిన సుందర్ రాజు, తన రచనల ద్వారా మాదిగల అస్తిత్వాన్ని చాటిచెబుతూ, భూస్వామ్య వ్యవస్థలోని దురాచారాలను నిశితంగా విమర్శిస్తూ దళిత సాహిత్య రంగంలో మాదిగ అస్తిత్వం కోసం ప్రత్యేకంగా ప్రస్తావించుకోదగిన సాహితీవేత్తగా పేరొందాడు.
దళిత బహుజన సాహిత్యాన్ని కొత్త ప్రమాణాలతో చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పి, మాదిగ సాహిత్యాన్ని ఒక వాదంగా ప్రారంభించిన నాగప్పగారి సుందర్ రాజు, కేవలం 32 ఏళ్ల ప్రాయంలోనే జూలై 17, 2000న కన్నుమూశాడు. ఆయన మరణించిన రోజు కారంచేడు దళితుల హత్యాచారం జరిగిన రోజే కావడం ఒక విషాదకర యాదృచ్ఛికం. తన అల్పాయుష్షులోనే తెలుగు సాహిత్యంలో మాదిగ గొంతుకను అత్యంత బలంగా వినిపించిన సుందర్ రాజు, నేటికీ దళిత సాహిత్య అధ్యయనకారులకు ఒక గొప్ప స్ఫూర్తిప్రదాతగా నిలిచిపోయాడు.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కాలంలో కూడా, నాగప్పగారి సుందర్ రాజుకు మాదిగ సాహిత్యం పట్ల ఉన్న అచంచలమైన నిబద్ధత ఆయన రాసిన లేఖల ద్వారా స్పష్టమవుతుంది. 2000 జనవరిలో రాసిన లేఖలో, ‘మిలీనియం మాదిగ కవిత్వం’ సంకలనాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలనే తపనతో, కవితల సేకరణ, డి.టి.పి , ముద్రణ విషయాలపై ఆయన అత్యంత ఆసక్తిని చూపించాడు. ఈ ప్రయత్నం ఆయన మాదిగ సాహిత్యాన్ని ఒక స్వతంత్ర అస్తిత్వంతో ప్రపంచానికి పరిచయం చేయాలనే బలమైన ఆకాంక్షకు, తన లక్ష్యం పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తుంది.
సుందర్ రాజు తొలుత "సువార్త" అనే కలం పేరుతో కథలు రాశాడు. తన తొలి కథ "అక్క చచ్చిపోయింది". ఇది 1995లో దళిత రాజ్యం అనే పత్రికలో అచ్చయింది. చండాల చాటింపు (1996), 1997 ఫిబ్రవరిలో మాదిగోడు (1997), 1997 డిసెంబర్‌లో మాదిగ చైతన్యం(1997), మాఊరిమైసమ్మ (1999) మొదలైనవి ఈయన సొంతరచనలు. గుండెడప్పు కవితా సంకలనానికి తానొక సంపాదకుడుగా వ్యవహరించాడు. అది 1995లో ప్రచురించారు.
సెంట్రల్ యూనివర్సిటీలో డి.ఎస్.యు (DSU) అనుబంధంగా ‘మాదిగ సాహిత్య వేదిక’ను స్థాపించి, మాదిగ ఉద్యమ స్ఫూర్తితో స్వతంత్ర అస్తిత్వం కోసం ‘మాదిగ చైతన్యం’ కవితా సంకలనాన్ని, నాగప్పగారి సుందర్ రాజు పట్టుదలతో ‘మాదిగోడు’ కథల సంపుటిని తీసుకురావడం వెనుక ఓ నేపథ్యం ఉంది. మాదిగ సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో సుందర్ రాజు నాయకత్వంలో కవితలను, కథలను ఎంపిక చేసి, వాటిని సంపాదకవర్గం చర్చల అనంతరం ప్రచురించారు. ఈ ప్రక్రియలో కవితా సంకలనానికి ‘మాదిగ చైతన్యం’ అని, కథలకు ‘మాదిగోడు’ కతలు అని పేర్లు పెట్టి, డా॥ కొల్లూరి చిరంజీవి, ఆచార్య కొలకలూరి ఇనాక్, డా. కోయి కోటేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు వంటి వారి ముందుమాటలతో ఈ పుస్తకాలను ఉద్యమ చైతన్యానికి నిదర్శనంగా తీర్చిదిద్దారు.
ఈ ‘మాదిగ చైతన్యం’ కవితా సంకలనంలో ఎం. గౌరి, ఆచార్య కొలకలూరి ఇనాక్, డా॥ ఎండ్లూరి సుధాకర్, డా॥ శరత్ జ్యోత్స్నా రాణి, సురేష్, జాజుల గౌరి, మాష్టార్జీ, కత్తి కళ్యాణ్ చంద్ర, తాళ్ళూరి భానుప్రతాప్, దార్ల వెంకటేశ్వరరావు, సంగీతపు రాజలింగం, కొలికపూడి శ్రీనివాసరావు, వేముల ఎల్లయ్య, ఆశావాది శశాంక మౌళి, చిత్రం ప్రసాద్, శంబుక, కనకయ్య, ఎం. జాన్సన్, రావినూతల ప్రేమకిషోర్, దర్శనం గౌతమ్, పి.జె. రత్నం, ఆనంద్, కాశీం మాదిగ, తుడి మహేందర్, , నాగప్పగారి సుందర్ రాజులు కవితలు రాశారు.
'మాదిగ చైతన్యం' (1997) ఒక బలమైన సామాజిక ఉద్యమ పునాదిపై వెలువడిన మాదిగల తొలి కవితాసంకలనం. ఇది మాదిగల జీవితాలు, విశ్వాసాలు, ఆచారాలు, వారి పోరాట తత్వాన్ని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరించడమే కాకుండా, దళిత సమాజంలోని అంతర్గత వివక్షను, ఆధిపత్య వర్గాల కుట్రలను నిర్భయంగా ఎండగడుతూ, సమతా సమాజ స్థాపన కోసం సాగుతున్న ఒక చారిత్రక నిరసన గళంగా నిలుస్తుంది.
జాతికే తన రచనల అంకితం:
తన పుస్తకాలను అంకితమిచ్చిన విధానం అతనికి మాదిగ జాతిపట్ల ఉన్న ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది. ‘చండాలచాటింపు’ కవితాసంపుటిని ‘మాదిగ జాతి అవిశ్రాంతంగా అభివృద్ధికి పరిశ్రమించే నిస్వార్థపరులకు...’ అంకితం చేశాడు. ‘మావూరి మైసమ్మ’ అనే రెండు దీర్ఘకథల సంపుటిని ‘ఈ శతాబ్దంలో మాదిగ ఉద్యమం ఓ మైలు రాయి. డెబ్బై లక్షలమంది మాదిగల ఆత్మగౌరవం ఆవిష్కరించడానికి నిస్వార్థంగా నిన్ను నీవు ఆహుతి చేసుకున్న ఓ అమరుడా ! తాడిపత్రి మాదిగరవి’ అని అతనికి అంకితం చేశాడు. ‘‘ఆకలి, అంటరానితనం ఆడతనం అడుగడుగున వెంటాడి వేటాడి వేధిస్తున్నా.... ఆమె! ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు. అగ్రకుల పురుష అహంకార విషనాగుల నడుమ మానానికై.... అభిమానంతో ఆఖరిదాక పోరు చేసి అసువులు బాసిన అమరజీవి మద్దికెర మాదిగ మార్తమ్మ’ కు అంకితం చేశాడు. సెంట్రల్ యూనివర్సిటిలో మాదిగ సాహిత్య వేదిక ఏర్పడకపూర్వం దళిత సాహిత్య వేదిక, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు ‘గుండెడప్పు’ కవితాసంకలనాన్ని ప్రచురించారు. అప్పుడు పిహెచ్.డి. చేస్తున్న పట్టేటి రాజశేఖర్, నాగప్పగారి సుందర్ రాజు ఇద్దరూ సంపాదకులుగా వ్యవహరించారు. దీన్ని ‘సమసమాజ స్థాపనకై అసువులు బాసిన దళిత వీరులకు’ అంకితం చేశారు.
గుండెడప్పు, మాదిగ చైతన్యం, దళిత మ్యానిఫెస్టో, చండాల చాటింపు కవితా సంకనాలలో కొన్ని కవితలను రాశాడు. ముందుగా వాటిని యూనివర్సిటీ గోడలపై పోస్టర్ పోయిట్రీగా అతికించేవాడు. సుందర్రాజు ప్రచురించుకున్న తన మొట్టమొదటి కవితా సంపుటి చండాల చాటింపు. దీన్ని 1996 లో ప్రచురించాడు.
నాగప్పగారి సుందర్ రాజు రాసిన ‘మాదిగోడు’ కథా సంపుటిలోని కథలు, రాయలసీమ మాదిగల జీవితాలను, వారి యాసను, ఆచార వ్యవహారాలను , వారు ఎదుర్కొనే వ్యవస్థాగత అణచివేతను అత్యంత సహజంగా చిత్రించాయి. ‘బోడెద్దు కత‘ లో పశువును కోసి తోలు తీసే వృత్తిని, దాని చుట్టూ ఉన్న కుల వివక్షను, ఆ పని చేసే దళితుడి పట్ల సమాజం చూపే ఛీత్కారాలను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపాడు. ‘గుండేలక్క కత‘లో అడ్డుపేర్లు (నిక్ నేమ్స్) పెట్టడంలో సమాజానికి ఉన్న వికృతానందాన్ని, ఒక అమాయకమైన పాత్రను ఎలా అవమానిస్తారో ఈ కథలో చూడవచ్చు. ‘సట్టకాళ్ళు సద్దుగుణుము కత’లో ఒక చిన్న శారీరక లోపాన్ని లేదా సామాజిక హోదాను అడ్డుపెట్టుకుని దళితుడిని ఎలా హేళన చేస్తారో ఈ కథ వివరిస్తుంది.‘ సెలివోడి కత’లో విద్య , అస్తిత్వం కోసం దళిత పిల్లలు పడే కష్టాలను, ఆధిపత్య వర్గాల పాఠశాలల్లో వారు ఎదుర్కొనే వివక్షను కవి/రచయిత తనదైన శైలిలో రాశారు.‘జోరేసావు కత’ అప్పుల బాధ, సామాజిక అణచివేత వల్ల ఒక సాధారణ మనిషి ఆత్మహత్యకు ఎలా పురిగొల్పబడతాడో ఈ కథలో గుండెలు పిండేలా ఉంటుంది.‘పోడేపోడు’ లో సామాజిక కట్టుబాట్లు, ప్రేమ, అపార్థాలు , దళితవాడల్లోని సామాజిక సంబంధాలను ఈ కథ ప్రతిబింబిస్తుంది.‘ ఈరారెడ్డి మనుమురాలు మింద మొనుసుండాది’లో వర్ణ వ్యవస్థలోని అడ్డుగోడలను దాటిన అనాలోచిత ప్రేమా, దాని పర్యవసానాలను ఇది విశ్లేషిస్తుంది.‘ పీర్లపండగనాడు యేమయ్యేద్నంటే!’ లోఆచారాలు, సంప్రదాయాల ముసుగులో జరిగే అణచివేతను, దళిత వర్గాల ఆత్మగౌరవ పోరాటాన్ని ఇందులో చర్చించారు.‘ మద్దికేరి మారమ్మ కత యంతమందికి తెలుసప్పా!’ లోదళిత మహిళలు తమ మానానికై, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని ఈ కథ గుర్తు చేస్తుంది.
నాగప్పగారి సుందర్రాజు రచించిన ‘మా ఊరి మైసమ్మ’ అనే రెండు దీర్ఘకథల సంపుటి, దళిత సమాజంపై భూస్వామ్య వర్గం , ఆధిపత్య శక్తులు సాగించే సాంస్కృతిక, లైంగిక దోపిడీని అత్యంత కఠినంగా ఎండగడుతుంది. ‘మా ఊరి మైసమ్మ’ కథలో ఒక యువతిని జోగినిగా మార్చి ఆమెపై జరిగిన లైంగిక దాడులను, ఆ తర్వాత ఆమె మరణాన్ని మూఢనమ్మకాలతో ముడిపెట్టి స్వార్థపరులు ఎలా సొమ్ము చేసుకుంటారో వివరిస్తే, ‘బొంబొయ్యెడు గండజోగమ్మయ్యేడ్య’ కథలో దళిత బహుజన సంస్కృతిలో భాగమైన జోగిని వ్యవస్థను భూస్వాములు తమ ఆధిపత్యం కోసం ఎలా దుర్వినియోగం చేస్తారో, ఒక యువకుడి జీవితాన్ని ఎలా ఛిద్రం చేస్తారో కళ్లకు కట్టినట్లు చిత్రించారు. మొత్తంమీద ఈ రెండు కథలు దళితులపై సాగే అమానుషమైన సాంస్కృతిక ముద్రలను, మూఢనమ్మకాల వెనుక దాగి ఉన్న ఆర్థిక, లైంగిక దోపిడీని వాస్తవిక దృక్పథంతో విశ్లేషిస్తూ, వ్యవస్థలోని లోతైన రుగ్మతలను బట్టబయలు చేస్తాయి
నాగప్పగారి సుందర్ రాజు అకాల మరణం కలిగించిన సాహిత్య శూన్యాన్ని పూరించాలనే నా దృఢ సంకల్పంతో, 2007లో 'ఒక మాదిగ స్మృతి' (నాగప్పగారి సుందర్రాజు పరిచయం) పుస్తకాన్ని రచించి ప్రచురించాను. సుందర్ రాజు జీవిత విశేషాలతో పాటు, ఆయన కథల విమర్శనాత్మక పరిశీలన చేస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించాను. రాయలసీమ దళిత వాడల వాస్తవికతను, మాండలిక సొగసును , సామాజిక రుగ్మతలపై ఆయన వినిపించిన ధిక్కార స్వరాన్ని భావితరాలకు పరిచయం చేయడమే నా ప్రధాన ఉద్దేశ్యం. ఒక గొప్ప సాహిత్య ప్రస్థానాన్ని భద్రపరచాలనే నా ఆకాంక్షే ఈ స్మృతి గ్రంథానికి పునాది.
(జూలై 17 వతేదీన నాగప్పగారి సుందర్ రాజు వర్థంతి సందర్భంగా )
- డా. దార్ల వెంకటేశ్వరరావు,
ప్రొఫెసర్, పూర్వ శాఖాధ్యక్షులు, తెలుగు శాఖ,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
ఫోన్: 9989628049
(సృజనకాంతి దినపత్రిక, 12 7.2026 వ తేదీ సాహిత్య అనుబంధం ‘సృజనసాహిత్యం’ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి