అడివి బిడ్డల ఆత్మకథల ప్రతిఫలనమే ‘కొండకబుర్లు’ కథలు
- డా.దార్ల వెంకటేశ్వరరావు,
- ప్రొఫెసర్, పూర్వ అధ్యక్షులు,
- తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాద్. ఫోన్: 9989628049
బిలావత్ ధేనుకా నాయక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివాడు. తర్వాత మరికొన్ని నగరాలు వెళ్ళి మరికొంత ఉన్నత విద్యనభ్యసించాడు. తానెక్కడికి వెళ్ళినా తాను వచ్చిన జీవితాన్ని మరిచిపోలేదు. తన ప్రాంతాన్నీ మరిచిపోలేదు. తాను పనిచేస్తున్న నగరాలు, పట్టణాల్లో కనిపించే తన అడవిబిడ్డల నైపుణ్యమెలా తగినంత విలువ సంపాదించుకోలేకపోతుందో ఆవేదన పడి ఉంటాడు. అటువంటి నగరాల నుండి, ఆ సంస్కృతి నుండి తాను పుట్టి పెరిగిన అడవితల్లిని ముద్దుపెట్టుకొంటూ, తాను కోల్పోయి బాల్యాన్నీ, తాను కష్టాల కొలిమిలోనే బంగారంలా తయారైన బాల్యాన్నీ, ఆ మనుషులను తలచుకొని ఉంటాడు. అవన్నీ తన ఆత్మకథలా రాయొచ్చు. కానీ, అది ఒక వ్యక్తి జీవితం నుండి సమాజాన్ని చూడాలి. దానికి కొన్ని పరిమితులుంటాయి. తాను అందరికీ చెందిన ఒక పాత్రగా చెప్తే అనేక కల్పనలు చేసుకోవచ్చు; అనేక జీవితాల్ని అక్షరీకరించవచ్చనుకున్నాడేమో, ఆ అడవి బిడ్డల జీవితాలన్నింటినీ ఆత్మాశ్రయంగా తన కథే అన్నట్లుగా ఇరవై భాగాలుగా రచించాడు. అవి ఒక అంతర్జాల పత్రికలో ధారావాహికగా రాశాడు. అవి రాసేటప్పుడు, తర్వాత పుస్తకంగా తీసుకొచ్చేటప్పుడు వాటిని చదివి, నా అభిప్రాయాలను అతనితో పంచుకునేవాడిని. ఒకరోజు తాను వాటన్నింటినీ ఒక పుస్తకంగా తీసుకొస్తున్నాని, ముందుమాట రాసివ్వమని అడిగాడు. మూడొంతులు రాసి, ఏదో అర్జెంటు పనుల వల్ల దాన్ని పూర్తిచేసి పంపించలేకపోయాను. తర్వాత ప్రచురించిన పుస్తకం online లింక్ పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి చేత పుస్తకం పంపించాడు. అప్పుడు రాసిన దాన్నిప్పుడు పూర్తిచేసి మీ ముందకి ఆ కథలను పరిచయం చేయాలనుకుంటున్నాను.
‘కొండకబుర్లు’ను ‘కథలు అనొచ్చా’ అంటే అనొచ్చు. కథాలక్షణాలతోనే తూకం వేసేవాళ్ళయితే అనకూడదంటారేమో. కానీ, వాటి నిండా జీవితం ఉంది. వాటినిండా సంప్రదాయ గిరిజన జీవన విజ్ఞానికీ, ఆధునిక శాస్త్రసాంకేతిక మారక విలువలకు మధ్య ఒక అవినాభావ సంఘర్షణ ఉంది. అవన్నీ తనకు తెలిసిన రూపంలో చెప్పాలనుకున్నాడు. తాను సాహిత్యం చదువుకున్న విద్యార్థి కాదు. కానీ, సాహిత్యాన్ని స్వయంగా చదువుకున్నాడు. ఒక్కొక్క చోట అద్భుతమైన వర్ణన కనిపిస్తుంది. మరొకచోట తల తిరిగిపోయే తాత్విక సత్యం మనల్ని ప్రశ్నిస్తుంది. మొత్తం మీద పుస్తకంలోని ‘కథ’లన్నీ చదివాక ఒకే సమాజంలో ఉన్నట్లనిపించినా, మనం ఎన్ని పొరల్లో జీవిస్తున్నామో అర్థమవుతుంది. సమాజంలో కొన్ని జాతుల మధ్య తారతమ్యాలెంత వ్యత్యాసాన్ని కలిగిస్తున్నాయో కళ్ళముందు దృశ్యం దృశ్యంగా కనిపిస్తుంది. అలా తాను రచించినవన్నీ 'కొండకబుర్లు' (ప్రకృతి నేర్పిన పాఠం) పేరుతో పుస్తకంగా ప్రచురించాడు.
కొండకబుర్లులోని ఈ కథలు చదువుతుంటే అడవి బిడ్డల ఆత్మకథల్లా అనిపిస్తుంది. అడివి బిడ్డల కటిక పేదరికం, ఆత్మాభిమానం అమాయకత్వాన్ని ప్రతిబింబించే ఎన్నో హృదయవిదారకమైన, భావోద్వేగభరితమైన మాటలు, వర్ణనలు చదివాక మనం మళ్ళీ మామూలు మనిషిగా కావాలంటే చాలా సేపు పట్టేలా చేస్తుంది. చదువరుల మనసులను కదిలించి, కళ్ళు చెమ్మగిల్చేలా చేసే అటువంటి కొన్ని విశిష్టమైన భావోద్వేగ సందర్భాలెన్నో ఈ ‘కథ’ల్లాంటి కథల్లో ఉన్నాయి. ఇవన్నీ గిరిజనుల జీవితాలకు, వారి కన్నీళ్లకు, ఆశలకు, పోరాటాలకు సజీవ సాక్ష్యాలు. ఈ కథలన్నింటినీ వాటి ఇతివృత్తాలు లేదా వస్తు స్వామ్యాన్ని బట్టి ప్రధానంగా ఐదు విభాగాలుగా వర్గీకరించవచ్చునుకుంటున్నాను. ఈ వర్గీకరణ ద్వారా గిరిజనుల జీవితం, వారి సంస్కృతి, వారు ఎదుర్కొంటున్న సంఘర్షణలు ఎలా ప్రతిఫలించాయో విశ్లేషించవచ్చో వివరించే ప్రయత్నం చేస్తాను.
1. పేదరికం, శ్రమ, వలస జీవనం:
గిరిజనుల బతుకుదెరువు, కరువు కాటకాలు, ఆకలి బాధలు ఈ విభాగంలోని 'తప్పి పోయిన మేక', 'నిశీధి నడక', 'వలస', 'ఆ దీపావళి' కథల్లో ప్రధానంగా కనిపిస్తాయి. 'తప్పి పోయిన మేక' కథలో చిన్న వయసులోనే ఒక బాలుడు మేకల కాపరిగా మారడం, కష్టాన్ని అనుభవించడం కనిపిస్తుంది. కరువు కారణంగా ఊరు విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లి పరిగ ఏరుకోవడం, అడవిలో వెదురు నరకడం వంటి పనులు చేయడం ద్వారా గిరిజనుల దయనీయ స్థితి 'వలస' కథలో ఆవిష్కృతమైంది. 'నిశీధి నడక' కథలో జొన్నలు విసురుకోవడానికి చీకట్లో అడవి మార్గంలో పడే పాట్లు వారి దైనందిన శ్రమకు నిదర్శనం. 'తప్పి పోయిన మేక' కథలో మొదటిసారి వేరే వ్యక్తి దగ్గర జీతగాడిగా చేరినప్పుడు ఎదురైన అవమానాన్ని బాలుడు వ్యక్తపరిచిన తీరు చూడండి."ఒక్కసారి ప్రపంచం అంత నిశబ్ధం. అంతా ఆగిపోయినట్టుగాఅనిపించింది. మా నాన్న నన్ను గాసానికి వదలి వెళ్ళినప్పుడు కూడా అంత బాధ పడలేదు. నాకు ఏ సంబంధంలేని వాడు నాపై చేయి చేసుకోవడం నాకు చాల అవమానంగా అనిపించింది. తిరిగి వాడ్ని ఎలా కొట్టాలన్న ఆలోచన కూడా నాకు తట్టనే లేదు. అంతలా కుంగిపోయాను. సాయంత్రానికి నా లేత బుగ్గలపై వాడి నాలుగు వేళ్లు వాతలు తేలాయి." 'మా బడిలో భోజన సౌకర్యాలు ఉత్తమంగా ఉండేవి' (పుటః 11)
'ఉదయాన్నే సంగటి. దాంట్లోచింతపండు రసం, ఒకపచ్చి ఉల్లిపాయ, అది కడుపు నిండా తింటే సాయంత్రం దాకా ఆకలేయదు. ఆకలెందుకు వేయదు? వేస్తుంది. కానీ, మధ్యాహ్నం తినడానికి ఏమీ ఉండదు కదా! ' (పుటః 15) ఈ మాటలు చదవగానే, మానవత్వం ఉన్నవాళ్ళకు ఒక్కసారిగా కళ్ళు చేర్చకమానవు. 'మా ఊరి తిరునాలా' కథలో బాల్యంలో ఎంతో కష్టపడి సోడాలు అమ్మి, తన జీవితంలోనే అత్యధికంగా పదిహేను రూపాయలు సంపాదించి తెచ్చి అమ్మ చేతిలో పెట్టినప్పుడు ఆ తల్లి పడే అంతర్మథనం గురించి చెప్తూ.. "తడుముకోకుండా సోడాలు అమ్మానమ్మా, అని గర్వంగా చెప్పాను. అమ్మ మోము ముభావంగా ఉండిపోయింది. ఎందుకిలా చేస్తున్నాడనో? ఎందుకిలా చేయిస్తున్నాననో? ఈ కటిక పేదరికం మాకే ఎందుకనో? ఏమో నాకు ఆ క్షణం అమ్మ తప్ప ఈ ప్రపంచం శూన్యంగా గోచరించింది." అని వర్ణించాడు.
'వలస' కథలో పెన్ను పట్టుకోవాల్సిన వయసులో గొడ్డలి పట్టుకుని శ్రమిస్తున్న ఒక బాల పౌరుడి ఆర్తి, చదువు ఆగిపోతుందనే వేదనను వర్ణిస్తూ "వెదురు నరికి నరికి నా చేతులకు కాయలు కాసాయి. అంటే అరచేయి మొద్దుబారిపోయిందని స్పర్శ ఇదివరకులాగా ఉండదు. పెన్ను పట్టుకోవాల్సిన నాచేతులతో గొడ్డలిపట్టుకొని ఈ పనేంటని నాకు నేను ప్రశ్నించుకునేవాడిని... వలస మూలంగా నేను ఒక భయంకరమైన నిస్సహాయక స్థితిలోకి నెట్టివేయబడ్డాను. ఒక గుర్తింపును కోల్పోయాను. దాంతో సిగ్గు బిడియం నశించి 'నేను' అనేది మర్చిపోయాను." అని వర్ణించాడు. 'అమ్మకోసం' కథలో అమ్మ కొండ పనికి వెళ్ళినప్పుడు, ఇంట్లో కొర్రన్నం వండి కూర లేకపోయినా అడవిపై పెట్టుకున్న అమాయకమైన భరోసాను ఇలా చెప్పాడు. "సాయంత్రానికి ఇంట్లో ఉన్న కొర్రలను దంచి, కొర్రన్నం వండేశాను, కానీ అందులో కూర ఏమీ లేదు. అయినా అమ్మ కొండకి వెళ్ళింది కదా! ఏదోకటి తీసుకొస్తుంది అని నా గట్టి నమ్మకం. ఎందుకంటే అడవి మాకొక సూపర్ మార్కెట్ లాంటిది. మాకేం అవసరం వచ్చినా అడవికేసి చూస్తాం, అడవికెళ్ళి తెచ్చుకుంటాం." 'అమ్మ తత్వం' కథలో ముల్లు గుచ్చుకుని ఏడుస్తున్న బిడ్డ కన్నీళ్లు తుడుస్తూ, సమాజం ముందు బిడ్డను బలహీనుడిగా చూపించకూడదనుకునే ఒక ధీరమాత మాటలు చూడాలి."అప్పుడు అమ్మ నా కన్నీళ్లు తుడుస్తూ ఒక విషయం చెప్పింది .'నీకు బాధ ఉన్నా కూడా నాముందు ఏడ్వకు, నా బిడ్డ ఏడుస్తున్నాడని ఎవరికి తెలియకూడదు.' అప్పుడే నేను ఏడవడం ఆపేశాను... నేను ఏడవకుండా ఉండటానికి అమ్మ ఈ లోకంలో లేదంటున్న భావన మెరిసింది. అమ్మ నాలో నింపిన ధైర్యం ఒక్కసారిగా ఆవిరైపోయింది" అంటాడు. ఆ పసివయసులో పడిన వేదనను మనం ఎలా మరిచిపోగలుగుతాం.
2. దోపిడీ, అణచివేత, తిరుగుబాటు
గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పెత్తందారులు, దళారులు వారిని ఎలా వాడుకుంటారో, దానికి వారు ఎలా ఎదురుతిరుగుతారో 'నివురుకప్పిన నిప్పు', 'అగ్ని పిలుపు', 'బానిస స్వతంత్రియం', 'మాయమైన పొలం' మొదలైన కథలు స్పష్టం చేస్తాయి. 'బానిస స్వతంత్రియం'లో లాఖ్య అనే కాపరి భూస్వామి దౌర్జన్యాన్ని ఎదిరించి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాడు. 'నివురుకప్పిన నిప్పు'లో నాటు సారా వ్యాపారం వెనుక ఉన్న పెద్దల మోసాన్ని ఎదిరించిన మంగ్లు అన్నదమ్ముల తెగువ కనిపిస్తుంది. 'అగ్ని పిలుపు'లో మంగ్యా తన ఊరి హక్కుల కోసం భూస్వామి మీసాలయ్యతో పోరాడి ప్రాణత్యాగం చేయడం గిరిజనుల వీరత్వానికి ప్రతీక. ఈ కథ చదువుతుంటే గిరిజనులకే కాదు, మానవత్వం ఉన్న ఎవరికైనా రక్తం ఉడుకిపోతుంది. మంగ్యా వీరత్వానికి సలామ్ చేయాలనిపిస్తుంది. అలా తన జాతి కోసం మరణించడం కూడా మహోన్నతమైన గౌరవమనిపిస్తుంది. ఈ పాత్ర ద్వారా తన గిరిజన జాతిలోని వీరత్వాన్ని, అమరత్వాన్నీ ప్రతీకాత్మకంగా వర్ణించాడనిపిస్తుంది. అభివృద్ధి పేరుతో భూములు లాక్కోవాలని చూస్తే లస్కరి అనే గిరిజనుడు చేసిన పోరాటం 'మాయమైన పొలం'లో కనిపిస్తుంది. 'బానిస స్వతంత్రియం' కథలో భూస్వామ్య పెత్తందారుడిని నిలదీస్తూ గిరిజన కాపరి లాఖ్య పలికిన పదునైన, భావోద్వేగభరితమైన మాటలు చూడండి."నువ్వు డబ్బున్నోడివి కావచ్చు. అది నీ ఇంట్లోనే, నీ ఒంట్లోనే, చూపించుకో. ఇది మా వూరు. మాకంటే నీకు ఎక్కువేముంది ధనం తప్ప. ప్రతి విషయం లో నీకు లొంగి ఉండాలంటే ఎలా? నీవు కూడా తెల్ల దొరల కింద ఉన్నవాడివే కదా? నీకు తెలీదా? బానిసత్వానికి ఒక అంతముంటుందని. నీకు 1947 లోనే తీరింది. అయినా మావూరిని మమ్మల్ని పీడిస్తున్నావు. దీనికి అంతమే నేడు." ఇలా గిరిజనుల ఆత్మగౌరవాన్ని పలికించాడు కథకుడు.
3. విద్య, చైతన్యం, అస్తిత్వ పోరాటం:
చదువు పట్ల గిరిజనులకు ఉన్న ఆసక్తి, మారుతున్న కాలంతో పాటు వారిలో వస్తున్న సామాజిక చైతన్యం ‘మా (నా) గురుకులం', 'ఉనికి', 'పుట్ట మన్ను', 'మలుపు', 'మా ఊరికి బస్సు'. కథల ఇతివృత్తంగా చెప్పుకోవచ్చు. 'మా (నా) గురుకులం'లో చదువు కోసం గిరిజన విద్యార్థులు పడే తపన, వారి జీవితాలను తీర్చిదిద్దే గురువుల అంకితభావం కనిపిస్తుంది. హాస్టల్స్ లో పెట్టే భోజనం కోసమే చాలామంది చదువుకోవడం కోసం చేరతారనీ, ఆ భోజనం ఎంతో బాగుంటుందనే మాటలు సామాజిక ఆర్థిక సత్యాన్ని ఆవిష్కిరిస్తున్నాయని చెప్పొచ్చు. 'ఉనికి' కథలో భీక్య ద్వారా గిరిజనులు ఓటరు కార్డు ప్రాముఖ్యతను గ్రహించి, ముఠా నాయకుల మోసాల నుండి బయటపడి తమ అస్తిత్వాన్ని చాటుకుంటారు. అడవుల వరకు కూడా వెళ్ళిన రాజకీయాలు, ప్రజాస్వామ్యం అడవుల్లో జీవించే గిరిజనులనెలా మోసం చేయడానికి ఉపయోగించుకుంటున్నారో తెలుపుతుంది. కనీస రవాణా సౌకర్యాల కోసం వారు చేసిన నిరీక్షణ 'మా ఊరికి బస్సు' కథలో వ్యక్తమైంది. 'బానిస స్వతంత్రియం' కథలో పశువుల కాపరి అయిన లాఖ్య, భూస్వామి కొడుకు అక్రమాలను అహింసా మార్గంలోనే ఎదిరించి తన సమాజానికి బానిసత్వం నుండి విముక్తి కల్పించడాన్ని రచయిత చూపించాడు. ఈ కథలన్నింటిలోనూ పేదవాడి ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఉప్పెనలా మారే వారి కోపాన్ని, వ్యవస్థీకృత అన్యాయాలపై గిరిజన సమాజం సాధించిన సామాజిక చైతన్యాన్ని రచయిత ఎంతో పదునైన శైలిలో విశ్లేషించాడు. 'వలస' కథ తన వస్తువు పరంగా సమాజంలోని ఒక చేదు నిజాన్ని చూపిస్తూనే, కథన పద్ధతుల ద్వారా పాఠకుడిలో ఆశావహ దృక్పథాన్ని, ఆత్మాభిమానాన్ని, స్వగ్రామంపై మమకారాన్ని రేకెత్తిస్తుంది.
4.ప్రకృతితో మమేకం, సంస్కృతి, నమ్మకాలు:
గిరిజనులకు అడవి, పశువులు, ప్రకృతితో ఉన్న అవినాభావ సంబంధం, వారి ఆచార వ్యవహారాలు 'మా ఊరి తిరునాలా', 'సెలయేటి పండుగ', 'మోగని గుడి గంట' మొదలైన కథల్లో ప్రతిఫలిస్తాయి. 'సెలయేటి పండుగ'లో నీటిని దేవుడిగా పూజించే వారి సంస్కృతిని, ఆ పవిత్ర వనరులను వ్యాపారవేత్తలు దోచుకోవడాన్ని వివరించారు. 'మోగని గుడి గంట'లో అపరిచితులు వచ్చి మత ప్రచారం చేయబోతే, తమ మట్టి, తమ బంధాలు, ఆచారాలే తమకు స్వర్గం అని గిరిజనులు చాటిచెప్పిన తీరు వారి సంస్కృతీభిమానాన్ని తెలుపుతుంది. జాతరల సమయంలో గిరిజన బాలలు పడే సంతోషం 'మా ఊరి తిరునాలా'లో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
‘సెలయేటి పండుగ’లో గిరిజనులు నీటిని కేవలం వనరుగా మాత్రమే కాకుండా దేవుడిగా కూడా పూజిస్తారు. తమ పూర్వీకులే సెలయేటి రూపంలో తమను కాపాడుతున్నారని వారి ప్రగాఢ నమ్మకం. తొలకరి చినుకులు పడి పాత, కొత్త నీళ్లు కలవగానే, వారు ఉదయాన్నే స్నానం చేసి కొత్త కడవల్లో ఆ నీటిని తెచ్చుకుంటారు. ఆ పవిత్ర జలాలను ఇంటి మూలల్లో, పొలాల్లో చల్లుకుని, మిగిలిన నీటిని శుభకార్యాల కోసం భద్రపరుచుకునే ఆచారం వారి ప్రకృతి ఆరాధనకు గొప్ప నిదర్శనం. అటువంటి నీరెలా వ్యాపారమయమైపోయిందో గమనించమనే ధ్వని ఈ కథలో ఉంది.
‘మోగని గుడి గంట’లో గిరిజనులకు గుడులు, గోపురాల కంటే తమ ఆచారాలు, నమ్మకాలపైనే గురి ఎక్కువ. అపరిచితులు వచ్చి కరపత్రాలు పంచుతూ స్వర్గం గురించి మత ప్రచారం చేయబోతే, "పొయ్యి మీద కాలుతున్న జొన్న రొట్టె వాసన, తమ మట్టి వాసన, బంధువులతో కలిసిమెలిసి ఉండటమే తమకు నిజమైన స్వర్గం" అని గిరిజన యువకుడు చాటిచెప్పిన తీరు వారి సంస్కృతుల పట్ల ఉన్న అభిమానాన్ని, మట్టిపై ఉన్న మమకారాన్ని స్పష్టం చేస్తుంది. ‘మా ఊరి తిరునాలా’లో కొండ పైన తెల్లటి వస్త్రధారణతో ఉన్న దేవుడు రాత్రిపూట ఆవుల పాలు తాగుతాడనే నమ్మకంతో ఆ గుడిని నిర్మించారని కథలో ప్రస్తావించారు. కొండ పైన హిందూ దేవాలయం, కింద దర్గా, ఎప్పటికీ ఇంకిపోని మహిమగల కోనేరు ఉండటం వారి విశ్వాసాలకు ప్రతీకలు. అలాగే జాతర సమయంలో అడవి బిడ్డలు రంగురంగుల దుస్తులు, మోటారు బండ్లు, పుచ్చకాయలు చూసి పడే ఆనందం, ఆశ్చర్యం వారి కల్మషం లేని మనస్తత్వాన్ని కళ్ళకు కడతాయి. దేవుళ్ళు కూడా కులాలకు, జాతులకు వేర్వేరుగా ఉండడం, వాటిని అనుసరించే సంస్కృతుల్లో వ్యత్యాసాలు ఉంటాయనీ, అయినా ఎవరి సంస్కృతి వారికి గొప్పగానే కనిపిస్తుందనే గుర్తించాలంటాడు.
‘ఉనికి’లో గిరిజనులు ప్రకృతి ఒడిలో ఎంతలా ఒదిగిపోయారంటే, వారు అడవి గాలితో సైతం మాట్లాడగలరు. గాలి వీచే వేగాన్ని బట్టి అడవిలో తర్వాత ఏం జరగబోతోందో వారు కచ్చితంగా అంచనా వేసి చెప్పగలరనే గిరిజన విజ్ఞానాన్ని పొందుపరిచాడు. ‘నిశీధి నడక’లో గిరిజనుల వేట వెనుక కూడా కొన్ని ఆచారాలు ఉంటాయనీ, వేటకు వెళ్లే సమయంలో ఎవరైనా ఎదురుపడితే, వేట సాగదని నమ్ముతారని చెప్పాడు. అలా జరిగితే చిన్న కర్రపుల్లలను తీసుకుని గోయ్యితీసి, ఎదురుపడిన వారి పేరు చెప్పి ఆ పుల్లలను కప్పెట్టేస్తారు. దీనివల్ల కీడు తొలగి వేట బాగా సాగుతుందని వారి నమ్మకం. రాత్రిపూట గుడ్లగూబ (పక్షి) అరుపులు, నక్కల ఊళలు వింటే వారు అపశకునంగా భావిస్తారు. పుట్ట మన్ను గిరిజన బాలలు ఆధునిక ఆటబొమ్మలపై ఆధారపడకుండా, తమ చుట్టూ ఉన్న ప్రకృతి వనరులైన కానుగ ఆకులు, పత్తి, పుట్ట మన్ను, బంకమట్టితో అద్భుతమైన బొమ్మలు (ఆవులు, బడులు, కుక్కలు) తయారుచేసుకోవడం వారి సృజనాత్మకతకు, ప్రకృతితో ఉన్న బంధానికి అద్దం పడుతుంది. ఈ విధంగా గిరిజనుల జీవితం అడవితో, మట్టితో, వారి విశిష్టమైన ఆచారాలతో ఎలా పెనవేసుకుపోయి ఉందో రచయిత ధేను నాయక్ తన కథల ద్వారా అత్యంత సహజంగా చిత్రించారు.
5. కుటుంబ బంధాలు - మాతృమూర్తి త్యాగం:
పేదరికంలోనూ చెక్కుచెదరని కుటుంబ బంధాలు, ముఖ్యంగా గిరిజన మహిళల త్యాగం 'అమ్మకోసం', 'అమ్మ తత్వం', 'కొండ దూరమౌతుందా?', 'మర్రివూడలు' మొదలైన కథల్లో నిక్షిప్తమై ఉన్నాయి. 'అమ్మకోసం' కథలో చీకట్లో అడవికి వెళ్లిన తల్లి కోసం కొడుకు వెదకడం, వారి మధ్య ఉన్న అవ్యాజమైన ప్రేమ కనిపిస్తుంది. 'అమ్మ తత్వం' కథలో గిరిజన మహిళలు తమ పిల్లల కోసం పడే శ్రమ, కష్టం బయటపడకుండా వారు చూపే ధైర్యం అద్భుతంగా చిత్రించబడింది. ‘వలస’ కథలో తాను సంపాదించడానికి నాటుసారా కాస్తానంటే "కష్టమైనా సరే సరైన మార్గంలోనే నడవాలి" అని అమ్మ చెప్పే నీతి కథకు తాత్విక బలాన్ని ఇస్తుంది. జీవనం కోసం ఎల్లలు దాటినా, జీవించాలంటే మాత్రం జన్మభూమే శరణ్యమనే పరమార్థంతో ఈ కథా వస్తువు ముగుస్తుంది. ఈ కథ కేవలం కష్టాలను చెప్పి ఆగిపోకుండా రచయిత ఒక బలమైన తాత్విక ముగింపును ఇస్తారు. "వలస ఒక 'వల' లాంటిది అది కవ్విస్తుంది. ఒక రంగుల కలని కళ్ళముందు ఆవిష్కరిస్తుంది. ఆ రంగులని చూసి మోసపోవద్దు... జన్మభూమిని మించిన భూమి మరెక్కడా ఉండదు" అంటూ కథను ముగించిన తీరు ధేనుకానాయక్ గారి కథన పరిణతిని తెలియజేస్తుంది. సమాజంలో నైతిక విలువలన్నీ ప్రాథమికంగా కుటుంబం నుండే వస్తాయనే సాంఘికీకరణ సిద్ధాంతాన్ని చెప్పినట్లయ్యింది.
ధేనుకానాయక్ గారు ఈ కథను నడిపించిన విధానం పాఠకుడిని కథలో లీనమయ్యేటట్లు చేస్తుంది. ఈ కథ ఉత్తమ పురుష కథన శైలిలో, అంటే "నేను" (ఆ బాలుడి) కోణంలో సాగుతుంది. దీనివల్ల వలస వెళ్తున్నప్పుడు ఆ చిన్నారి మనసులో కలిగిన ఆందోళన, అరచేతులు మొద్దుబారేలా గొడ్డలి పట్టుకుని వెదురు నరుకుతున్నప్పుడు కలిగిన ఆవేదన పాఠకుడికి నేరుగా కనెక్ట్ అవుతాయి. ఇందులో పాత్ర చిత్రణలు కూడా ఎంతో సహజ సిద్ధంగా ఉన్నాయి. పేదరికంలోనూ ధర్మబద్ధంగా బ్రతకాలని నేర్పే ఆదర్శమూర్తిగా, కొడుకు దారి తప్పుతున్నాడనిపించినప్పుడు చెంప చెళ్ళుమనిపించి, మరుక్షణమే ఒడిలోకి తీసుకునే అంతులేని ఆప్యాయత గల అమ్మ పాత్ర ఇందుకు చక్కని ఉదాహరణ. అలాగే, వలస వెళ్లిన చోట మానవత్వం చూపించే పెద్ద రైతు పాత్ర ఒకవైపు, డబ్బు ఎలా తయారవుతుందో తెలియకపోయినా వెదురుతో డబ్బులు చేస్తారని బాలుడికి చెప్పి కసురుకునే మేస్త్రి పాత్ర మరోవైపు సమాజంలోని విభిన్న మనస్తత్వాలను మన కళ్లకు కడతాయి.
కథాకథన పద్ధతి విషయానికి వస్తే, ఈ సంపుటిలో అనుసరించిన శైలి పాఠకుడికి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రతీ కథా ఉత్తమ పురుష కథనంలో "నేను" అనే ఒక బాలుడి లేదా యువకుడి ఆత్మకథాత్మక కోణంలో సాగడం వల్ల పాఠకుడు ఆయా పాత్రల మానసిక స్థితికి, వేదనకు చాలా సులభంగా కనెక్ట్ అవుతాడు. కథనంలో వాడిన భాష సరళంగా ఉంటూనే, గిరిజన జీవన యాసను, "పల్లెటూరి రోజువారి సంగీతం", "గోధూళి", "నిశీధి నడక" వంటి ప్రకృతి రమణీయ పదబంధాలను నవ్యంగా మేళవించింది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రతీ కథ కేవలం ఒక సంఘటనతో ముగిసిపోకుండా, ముగింపులో జీవిత సత్యాన్ని ఆవిష్కరించే ఒక బలమైన తాత్విక స్పర్శను కలిగి ఉండటం ఈ రచయిత కథన పద్ధతిలోని ప్రత్యేక నవ్యతకు నిదర్శనం.
ఆత్మకథాత్మక కథన శైలి, తాత్విక ముగింపులు ఇప్పటికే పాఠకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే, ఈ కథలను శిల్పపరంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కథాకథనంలో మరికొన్ని మెళకువలు తోడైతే బాగుంటుంది. కథనంలో "నేను" అనే పాత్ర యొక్క అంతర్గత భావాలను ఎక్కువగా వివరించడంతో పాటు, ఎడ్లబండ్ల శబ్దాలు, అడవి పరిమళాలు, మంటల వేడి వంటి ఇంద్రియ చైతన్య అనుభూతులను దృశ్యాత్మకంగా మరింతగా పండించవచ్చు. అలాగే, గిరిజన లేదా ప్రాంతీయ సంభాషణలు సాగేటప్పుడు ఆయా సంస్కృతికి చెందిన విలక్షణమైన సామెతలు, జాతీయాలు, ప్రకృతికి సంబంధించిన లోకోక్తులను సంభాషణల్లో మరింత విరివిగా ఉపయోగిస్తే పాత్రల ప్రామాణికత ఇంకా పెరుగుతుంది. దీనితో పాటు, కొన్ని కథలలో సంఘర్షణను నేరుగా కాకుండా, నెమ్మదిగా ఉత్కంఠను (సస్పెన్స్) పెంచుతూ క్లైమాక్స్ వైపు నడిపించే నాటకీయ శిల్పాన్ని ప్రయోగిస్తే, తాను చెప్పిన సంఘట ‘కథ’గా మారి పాఠకుడిపై పడే సామాజిక ప్రభావం మరింత తీవ్రంగా, దీర్ఘకాలికంగా ఉంటుంది.
ఉదాహరణకు ఈ మెళకువలను కథాసంపుటిలోని 'వలస' కథకు అన్వయిస్తూ సరికొత్త నవ్యతను తీసుకురావచ్చు. కథలో కేవలం వెదురు నరికే శ్రమను వివరించడమే కాకుండా, ఎండ తీవ్రతకు అడవిలో తెగ అరిచే ఆ వింత పురుగు శబ్దాన్ని, తేలు కుట్టినప్పుడు ఒంటికి పట్టిన జిగట చెమటను, పసరు మందు ఘాటు వాసనను ఇంద్రియ చైతన్య అనుభూతుల ద్వారా మరింత దృశ్యాత్మకంగా వర్ణించవచ్చు. అలాగే, బాలుడు మేస్త్రిని డబ్బు తయారీ గురించి విసిగిస్తూ అడిగే ప్రశ్నల సందర్భంలోనూ, దారి తప్పే క్రమంలో అమ్మ మందలించే సన్నివేశంలోనూ గిరిజన సంస్కృతికి చెందిన విలక్షణమైన అడవి లోకోక్తులను, సామెతలను సంభాషణల్లో చేరిస్తే పాత్రల ప్రామాణికత రెట్టింపవుతుంది.
'నివురుకప్పిన నిప్పు', 'అగ్ని పిలుపు', 'బానిస స్వతంత్రియం' వంటి కథలు భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థపై, దళారీల మోసాలపై గిరిజన సమాజం సాధించిన చైతన్యానికి, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలు. తప్పి పోయిన మేక ‘కథ’లో కేవలం ఒక మేక తప్పిపోవడమే కాదు, బాలకార్మికుడిగా మారిన ఒక బాలుడి కథగా చెప్పాడనిపిస్తుంది. కష్టం అంటే ఏంటో తెలిసిన రోజే, జీవితంలో అక్షరాల విలువ, బడి ప్రాధాన్యత ఆ బాలుడికి అర్థమౌతాయి. దారి తప్పిన మేక బాలుడిని సరైన దారిలో (బడికి) నడిపించడం ఇందులో విశేషం. ‘మా ఊరి తిరునాలా’ కథ ద్వారా దేవుళ్ళెలా వెలుస్తారో చెప్తూనే, పల్లెటూరి జాతర చుట్టూ అల్లుకున్న ఈ కథలో బాల్యపు అమాయకత్వం, పుచ్చకాయ కొనుగోలులోని ఆనందం, చిన్న వయసులోనే సోడాలు అమ్మి సంపాదించిన గర్వం చక్కగా వ్యక్తమయ్యాయి. "ఒకరికి పని దొరికితే అదే జాతర, ఒకరి సంపాదన పెరిగితే అదే సంబరం" అనే రచయిత తాత్విక చింతన అద్భుతం. ‘నిశీధి నడక’లో రాత్రి పూట తలపై జొన్నపిండి మూటతో ఒంటరిగా నడిచే బాలుడి మానసిక స్థితిని, సమాజం నూరిపోసే మూఢనమ్మకాల భయాలను ఈ కథ కళ్లకు కడుతుంది. భయం అనేది ఒక మానసిక స్థితి అని, దాన్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే తరువాతి తరానికి ఆదర్శంగా నిలుస్తామని కథకుడు నిరూపిస్తాడు. ఈ కథలలోని పాత్రలు అత్యంత సహజంగా, మన చుట్టూ ఉండే మనుషులలాగే ఉంటాయి.ఈ కథల్లో ‘అమ్మ/నాన్న’ పాత్రలు రచయిత తల్లిదండ్రుల్లా కనిపిస్తూనే గిరిజనులందరికీ ప్రతీకాత్మకంగా అనిపిస్తాయి. శ్రమకు, క్రమశిక్షణకు, ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపాలని చెప్పవచ్చు.‘భీక్య (ఉనికి)’ గిరిజనులకు ఓటరు కార్డు అనే ఆయుధం ద్వారా తమ హక్కులను ఎలా సాధించుకోవాలో నేర్పిన ఆధునిక యువకుడు.
‘కొండకబుర్లు’ కథలు చదువుతుంటే అవి కేవలం కల్పిత కథల్లా కాకుండా, అడవి బిడ్డల ఆత్మకథల ప్రతిఫలనంగా అనిపిస్తాయి.ఈ సంపుటిలోని చాలా కథలు ‘నేను’, ‘మా ఊరు’, ‘మా నాన్న’, ‘మా అమ్మ’ అంటూ ఉత్తమ పురుషలో సాగుతాయి. "నా తొమ్మిదో ఏట నేను ఒకటో తరగతి" అని చెప్పడం, "నా ఆది గురువు అడవే" అని తన అనుభవాలను పంచుకోవడం వల్ల ఇవి రచయిత సొంత జీవిత కథలేమో అన్న భావన పాఠకులకు కలుగుతుంది. 'తప్పి పోయిన మేక' కథలో రచయిత తన తండ్రి తనను ఒకరి దగ్గర మేకల కాపరిగా (గాసానికి) పెట్టిన సంఘటనను, తోటి కాపరుల చేతిలో దెబ్బలు తిన్నప్పుడు పడిన మానసిక వేదనను అత్యంత సహజంగా ఆవిష్కరించారు. అలాగే 'మా ఊరి తిరునాలా' కథలో సోడాలు అమ్మడం, బొమ్మల దుకాణంలో దొంగలను పట్టే పని చేయడం వంటివి అచ్చమైన ఆత్మకథాత్మక అనుభవాలుగా కనిపిస్తాయి. వలస వెళ్లినప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసం పొలాల్లో మిగిలిపోయిన వరి కంకులను (పరిగ) ఏరుకున్నానని రచయిత వివరించిన తీరు కంటతడి పెట్టిస్తుంది. అన్నయ్యలు వాడేసిన బట్టలనే తానూ వేసుకోవడం, దీపావళికి కొత్త బట్టలు లేకపోవడం వంటివి అడవి బిడ్డల దారిద్ర్యానికి సజీవ సాక్ష్యాలు. 'మా (నా) గురుకులం' కథలో ఒక గిరిజన విద్యార్థి పట్నంలోని గురుకులానికి వెళ్లి, అక్కడ ఆంగ్ల భాష, లెక్కలు నేర్చుకోవడానికి పడిన ఇబ్బందులను, మాతృభాషకు ఆంగ్లానికి మధ్య ఉన్న అంతరాన్ని అనుభవపూర్వకంగా వివరించారు. అడవిని ఒక 'సూపర్ మార్కెట్' లాగా రచయిత అభివర్ణించారు. తమకు ఏ అవసరం వచ్చినా అడవి తల్లి కడుపు నింపుతుందని, వెదురు నరకడం, చింతపండు, కుంకుడుకాయలు సేకరించడం వంటి పనులను తమ సొంత అనుభవాలుగా కథల్లో మలిచారు. 'అమ్మకోసం', 'అమ్మ తత్వం' కథల్లో తల్లితో ఉన్న అనుబంధాన్ని రచయిత తన ఆత్మకథలోని మధుర స్మృతులుగా పంచుకున్నారు. చీకట్లో అడవికి వెళ్లిన తల్లి కోసం వెదకడం, తల్లి నేర్పిన జీవిత పాఠాలు, చివరి రోజుల్లో వెంటిలేటర్ మీద ఉన్న తల్లి చేయి పట్టుకుని కుమిలిపోయిన తీరు ఇవన్నీ ఒక కొడుకు ఆత్మకథలోని ఆర్ద్రతను ప్రతిబింబిస్తాయి. 'పుట్ట మన్ను' కథలో బంకమట్టితో బొమ్మలు చేయడానికి వెళ్లి, పుట్ట తవ్వుతుండగా తన కళ్లెదుటే పాము కాటుకు గురై ప్రాణ స్నేహితుడు ధుంగ్ర మరణించిన సంఘటనను రచయిత తీవ్ర ఆవేదనతో అక్షరీకరించారు. ఇది సమాజంలోని అసమానతలను ప్రశ్నించే ఒక ఆత్మకథాత్మక ఘట్టం.
నేను ‘నెమలి కన్నులు’ ఆత్మకథ (మొదటి భాగం) పదవతరగతి వరకు రాసుకున్నాను. అందులో కొన్ని సంఘటనలతో ధేనునాయక్ ఆత్మకథాత్మక సంఘటనలు పోలి ఉన్నాయనిపిస్తుంది. మా అమ్మ అరుంధతీదేవి కథ చెప్తూ ఆమెకు ఇసుకను అన్నంగా మార్చగలిగే విద్యతెలుసనిచెప్తే, అయితే దాన్ని నేర్చుకుంటే ఆకలి అనేదే లేకుండా పోతుంది కదా అని ఆలోచించేవాడినని రాసుకున్నాను. ధేనునాయక్ రాసిన కథల్లో అడవిలో వెదురు కొట్టే పనికివెళ్ళిన బాలుడు, దాన్నేమిచేస్తారోచెప్పమని ఆ యజమానిని పదేపదే అడిగితే, దానితో రూపాయలు ముద్రిస్తారనీ, దానికోసం మంచి వెదురు కావాలని చెప్తాడు. అప్పడు తాను కూడా వెదురుతో రూపాయలు ముద్రిస్తే బాగుంటుందికదా అని ఆలోచిస్తాడు. నేను నా ఆత్మకథలో చిన్నప్పుడు బెల్లంతో చేసే జీళ్లంటే ఎంతో ఇష్టమనీ, దానికోసం ఆ మిఠాయిలు చేసేవాళ్ళకి పనిలో సహాయం చేసి వాటిని తినేవాడినని రాసుకున్నాను. ధేను నాయక్ కూడా ఇటువంటి సంఘటనను రాశాడు. తనకి పుచ్చకాయంటే ఇష్టం. దానికోసం కూలిపనిచేసేవాడు. రోజంతా షోడాలు అమ్మి డబ్బులు సంపాదించేవాడు. నేను పొలంలో పనిచేసి, ధాన్యానికి కాపలా ఉండే నాన్నకు భోజనం పట్టికెళ్ళడానికి స్మశానాన్ని దాటుకొని వెళ్ళవలసి ఉన్నా, భయంలేకుండావెళ్ళవలసి వచ్చేదని రాసుకున్నాను. ధేనుకానాయక్ తాను తల్లి కష్టపడి తిరగలితో పిండి చేస్తుంటే చూసి, ఆ కష్టాన్ని తప్పించడానికి జొన్నలు మిల్లులో పట్టించడానికి వెళ్ళి రాత్రి వచ్చేటప్పుడు బాలుడు పొందిన భయాన్ని వర్ణించాడు. ఇలా అనేక సంఘటనలతో నేను కూడా స్వయంగా ఈ కథల్లోని అనేక సంఘటనలతో తాదాత్మ్యం పొందాను. నేనే కాదు, ఈ కథలు చదివితే గిరిజన బిడ్డలు, దళితులు, పేదపిల్లలెంతోమంది తమ అనుభూతులను నెమరువేసుకుంటారు.
మొత్తం మీద ‘కొండకబుర్లు’ పుస్తకంలోని ప్రతి కథా రచయిత స్వయంగా అనుభవించిన, కళ్లారా చూసిన గిరిజన జీవన పోరాటాలకు, వారి ఆకలి కేకలకు, ఎదురొడ్డి నిలిచిన ధైర్యానికి అక్షర రూపంగా (ఆత్మకథలా) నిలుస్తుంది. ప్రతి అడవి బిడ్డా తన కథనే తాను చెప్తున్నట్లు, తన కథనే తాను చదువుకుంటున్నట్లనిపిస్తుంది. ఈ 20 కథలవంటి కథలన్నీ కేవలం కాలక్షేపం కోసం రాసినది కాదు. ఇది ఒక సామాజిక దర్పణం. చదువు ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నొక్కి చెప్పాడు. సమాన విద్య ఉన్నప్పుడు సౌకర్యాలు కూడా సమానంగా ఉండాలనే వ్యవస్థీకృత లోపాలను ప్రశ్నించింది."సమిష్టిగా ఉంటి ఎటువంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చు" అనే ఐక్యమత్య సందేశాన్ని ఇస్తుంది. మొత్తంగా, ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవవలసిన ఒక అద్భుతమైన సామాజిక, తాత్విక కథా కావ్యం. గ్రామీణ జీవితాలలోని కన్నీళ్లను, కష్టాలను చూపిస్తూనే, వాటిని అధిగమించే ధైర్యాన్ని, ఆశావహ దృక్పథాన్ని ఈ కథలు అందిస్తాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి