"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

22 జూన్, 2026

రాజ్యాంగ నైతికతను చాటిచెప్పిన 'కోయి' నాగస్వరం

 రాజ్యాంగ నైతికతను  చాటిచెప్పిన 'కోయి'  నాగస్వరం!



ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్య అనుబంధం'వివిధ' , 22.6.2026 సౌజన్యంతో 

''ప్రణవనాదాలెన్ని ప్రతిధ్వనించినా/ ఆదిమస్వరం నాదే/ ధరిత్రికి ఊపిరి నేను /చరిత్రకు తొలి అక్షరం నేను /నాగరికతకు నారుపోసి/ నీరు పోసింది నేను/ సంస్కృతికి బొడ్డుకోసిపేరుపెట్టింది నేనే/ సంగీత సాహిత్యాలు /నాచెమట బొట్టు కన్నబిడ్డలు /...ఉన్మాదంపై/ నాది నిత్యదండయాత్ర/ నేనేనిజమైన దేశభక్తుడిని'' (నాగస్వరం) సంపదకు సృష్టికర్తలైన దళిత, బహుజనులే ఈదేశసాంస్కృతిక నిర్మాతలని, నాగరికతకు మూలమనే ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కోయి కోటేశ్వరరావు ఇటీవల ‘నాగస్వరం’ అనే కవిత సంపుటిని తీసుకొచ్చాడు. ఇది దళితతాత్త్వికతను, దళిత ఈస్తటటిక్స్ ని వాగ్దానం చేసే అత్యంత శక్తివంతమైనకవిత్వం. సంప్రదాయ సాహిత్యలోని 'సత్యం, శివం, సుందరం' అనే భావనలకు భిన్నంగా సమానత్వం, స్వేచ్ఛ, సామాజికన్యాయం అనే రాజ్యాంగ నైతిక సూత్రాలను కళాత్మకంగా కవిత్వీకరించడం కోటేశ్వరరావు ప్రధానలక్ష్యంగా కనిపిస్తుంది. జి.లక్ష్మీనరసయ్య చెప్పినట్లుగా ''బాధ, ఆగ్రహం, ప్రతిఘటనలతో కూడిన ఆవేశంతోపాటు హేతుబద్ధమైన ఆలోచనలతో పాఠకులను ఉత్కంఠకు గురిచేసే కవిత్వమిది. కొత్తగా, తాజాగా, తేటగా పలకరించే పదచిత్రాలతో  దళిత జీవిత సాగరం నుండి వెలికితీసిన ఈస్థటిక్స్ తోకవిత్వ నదిని సజీవంగా ఉంచాడు కోటేశ్వరరావు''(నాగస్వరం బ్లర్బ్). 'నాగస్వరం' అనే శీర్షికే దళిత ఈస్తటిక్స్‌కు తాత్త్వికతకు కేంద్ర బిందువు. కోటేశ్వరరావు తాను గతమూడు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా గమనిస్తున్న మనువాద సమాజ తీరుతెన్నులను, రాజకీయ, ఆర్ధిక స్థితిగతులను, దళిత, బహుజన జీవితాల వేదనలను, విమర్శనాత్మకంగా కవిత్వంలో పలికించాడు. దళిత కుటుంబంలో జన్మించిన కోయి బాల్యంలో ఆకలీ, అవమానాలను అనుభవించి, ఆ స్వీయానుభవంతో తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక  గొంతుతో మంచి గుర్తింపు పొందాడు. సంప్రదాయ సాహిత్యంతో పాటు ఆధునిక సాహిత్యతత్త్వాన్ని అవగాహన చేసుకున్న సహృదయకవి పండితుడు, విమర్శకుడు కోయి. ప్రత్యేక తెలంగాణ, దండోరలాంటి ప్రజాస్వామ్య ఉద్యమాలకు నిజాయితీగా సంఘీభావం తెలియజేస్తూ కవిత్వం రాశాడు.

దళిత జీవితంలోని పేదరికం, కులవివక్ష, రోజువారీ అణచివేతల వంటి దళిత వాస్తవికత, సంఘర్షణలను, వారి శ్రమతత్త్వాన్ని కవి సజీవంగా కవిత్వీకరించాడు "వేదంలో ఏముందో తెలియదు గానీ/మా అయ్య స్వేదంలోనే సృష్టి జీవం ఉంది" (ప్రాణవాయువు) ''పత్తిచేలో ఇంకిపోయిన నెత్తురంతా/ మట్టిపెదాలమీద తెల్లగా నవ్వితేనే కదా  నువ్వు బతికి బట్టకట్టింది'' (లద్దెపురుగు) తండ్రి, తల్లి శ్రమను కేవలం కష్టానికి ప్రతీకగా మాత్రమే కాకుండా, సృష్టికి మూలంగా చిత్రించడంలో ఎంతోఔచిత్యాన్ని ప్రదర్శించాడు."మట్టిమబ్బుల్లో చెమటచుక్కల్ని నాటి/ ఎండి ఎన్నెల్ని బస్తాలకెత్తే” శ్రామికుడైన తండ్రిని "నల్ల చంద్రుడిగా" అభివర్ణించడం దళితకళాతత్త్వానికి  నిదర్శనం .శ్రమను వెన్నెలతో పోల్చడం ద్వారా, దళిత శ్రమను విశ్వవ్యాప్త సృజనాత్మక శక్తిగా కవి ఆవిష్కరించాడు.  'కొత్త చెప్పులు' కవితలో, "వొడ్లగింజల్లో ఇంకిపోయిన/మా అయ్య వొంటిసత్తువ/ కూటికుండలో/ తుకతుక ఉడక్కపోతే/ ఊరికి కూడెట్టా దొరికేది?" అనే ప్రశ్నలు శతాబ్దాలుగా అణచివేయబడిన శ్రమదోపిడీని నిలదీస్తాయి. తాపీమేస్త్రిగా పనిచేస్తున్నతన తమ్ముడు శివ శ్రమ ఔన్నత్యాన్ని 'నమశ్శివాయ' కవితలో బొమ్మకట్టించాడు.  ''మిట్ట మధ్యాహ్నం వాడు మోస్తున్న/ ఇటుకల కాంతిలో ఎరుపెక్కిన చెమట చుక్కలు /తనువు నుండి రాలి పడుతుంటే/నేల తల్లిపై పగడాలవాన కురిసినట్లుండేది /ఒంటి నిండా సిమెంటు ధూళితో /తమ్ముడు సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు/ భస్మాంగరాగయ నమశ్శివాయ  అంటూ/అంటూ పంచభూతాలు జేజేలు పలుకుతాయి'' తాపీ మేస్త్రి శ్రమ సౌందర్య వర్ణన అపురూపం   

                దళిత స్త్రీజీవితం, కులవ్యవస్థతో పాటు పితృ స్వామ్యవ్యవస్థలో కూడా బానిసత్వానికి గురవుతుంది. దీన్ని"బానిసకుబానిస"అనే బలమైన భావనతో ఆవిష్కరించాడు. 'పత్తి పువ్వు' కవితలోని "ఊరందరికీ మా అయ్య బానిసైతే/ పాపం అమ్మ, మా అయ్యక్కూడ బానిస" అనే పంక్తులు దళితస్త్రీ ఎదుర్కొనే అంతర్గత అణచివేతను సూచిస్తాయి.'మాసిపోయిన వరదగుడిలాంటి/అమ్మను చూసినప్పుడల్లా గొంతుచిట్లిపోయి /పెన్నునెత్తురుకక్కుతుంది /అక్షరాలుమోయలేని/ ఒకఏడుపుకొండ /కనులకొమ్మలకు వేలాడుతుంది/ ఆడ తనం అంటరాని తనాల నడుమ /అమ్మ రోకలి బండ కింద చితికిన దోసబద్దయి రోదిస్తుంది''(పత్తిపూవు)వంటి పదచిత్రాలు దళితస్త్రీలు ఎదుర్కొంటున్నబహుముఖీన వివక్షను నిత్యపోరాటంలోని సంఘర్షణని ప్రతిబింబిస్తాయి. కవిత్వంలో కేవలం బాధను వ్యక్తం చేసి ఊరుకోకూడదు. ఆ బాధను ఆయుధంగా మలచి తిరుగుబాటు చేసేలా ప్రేరేపించాలి. 'గుండెడప్పు' కవితలో రిజర్వేషన్లపై వచ్చిన విమర్శలకు ధీటుగా ''ధాత్రి వేణువుఊది /ధాన్యరాగాలు పలికించే  హరిత ప్రతిభ నాది", "అగ్ని ప్రతిభ నాది" అంటూ దళిత మేధస్సును, శారీరకశక్తిని గర్వంగా, నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో ప్రకటించడం ఈస్తటిక్స్‌లోభాగమే. దీన్నే దళిత తిరుగుబాటు, అస్తిత్వ ప్రకటన Dalit Aesthetics of Resistance and Assertion అంటారు.'ఉలిపి కట్టె' కవితలో, మధ్యాహ్న భోజనంలో కుల వివక్షనుప్రశ్నిస్తూ"నాచేయి తగలగానే పరబ్రహ్మ స్వరూపం కూడా/ పనికి రానిదైపోయింది...?" అని అడగడం ద్వారా, కవి ఆ మత, సాంస్కృతిక ఆధిపత్యం యొక్క పవిత్రత(Purity)అనే భావనను ప్రశ్నించడం ద్వారా ప్రత్యామ్నాయ సంస్కృతిని అన్వేషించాలనే ఆలోచన కలిగిస్తాడు. ''మన సాంకేతిక పరిజ్ఞానం చంద్రుడి మీద రహస్యాలు శోధిస్తుంటే /మన సంస్కారం మాత్రం ఇంకా కులం మలాన్ని వాసన చూస్తుంది" వంటి విమర్శలతో, ఆధునిక సాంకేతిక యుగంలో కూడా కుల అస్తిత్వాన్ని వదలని అమానుషాన్ని ప్రశ్నించాడు.

        ఈ కవి రాసిన ఎలిజీ కవిత్వంలోకూడా బలమైన దళిత్ ఈస్తటిక్స్ దృష్టినే ప్రదర్శించాడు. ప్రసిద్ధ జానపద పరిశోధకులు బిరుదురాజు రామరాజుగారి వ్యక్తిత్వాన్ని, సాహిత్య కృషిని వర్ణించిన ‘పలుకుబువ్వ’ కవితను ఇటీవల ఆయన శతజయంతి సందర్భంగా ఒక జాతీయ సదస్సులో నిర్వాహకులు ఒక పెద్దబ్యానర్ గా ప్రదర్శించడం విశేషంగా భావించవచ్చు. ‘చిన్నప్పుడు అమ్మ పరిగ గింజలేరుకొని వచ్చి/ మాకు అన్నం వండిపెట్టినట్లు/ గొంతు గొంతునూ పలకరించి/ బాసమాలిన జాతికి/పల్లెపాటల పలుకు బువ్వ తినిపించావు నీవు’’ (పలుకు బువ్వ) అన్నప్పుడు కూడా దళిత కళాతత్త్వంతో పాటుఆయనచేసినక్షేత్రస్థాయిమౌలికపరిశోధనకృషికనిపిస్తుంది.చిన్నవయసులోనేఅకాలమృత్యువుకిబలైన మద్దెల శాంతయ్యను స్మరించుకుంటూ ‘మనసులో అతని రూపాన్ని తలచుకుంటే చాలు ... గద్దర్ పాటలా ఘాటుగా ఉంటాడు/ తెలంగాణా మాండలికమంత తీయగా ఉంటాడు’’ (ప్రేమ నిఘంటువు ) స్థానిక భాష, యాస, సంస్కృతిని, స్వాభావిక మాధుర్యాన్ని రూపగతపరికరాలుగా స్వీకరించడంనూతన భావన.  దళితులకు పిడికెడు ఆత్మగౌరవం కోసం తపించిన మద్దూరి నగేష్ బాబు స్మృతిలో ‘‘అన్నా పుంభావ అరుంధతీ../ కోడిపుంజులకు మేలుకొలుపులు నేర్పినవాడా /గుర్రంజాషువా మీసకట్టులోని పౌరుషంలా /మాలకన్నమనీడు కరవాలంలా /మనుస్మృతిని తగలబెడుతున్నప్పుడు /అలుముకున్న పెను మంటల సెగలా /ప్రతిక్షణం ప్రజ్వలిస్తుంటావు'' (షాక్ ట్రీట్ మెంట్ ) ప్రత్యామ్నాయ రూపనైపుణ్యాన్ని కవితలో ప్రదర్శించాడు.  కులోన్మాదం, మతసామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ వ్యతిరేకతపై నాగస్వరం ద్వారా కవిత యుద్ధం చేశాడు కవి.''వాడంతే పరమయుద్ధోన్మాది/ ఒక్కచమురుబొట్టుకోసం/ లెక్కలేని రక్తసముద్రాలను పొంగిస్తాడు'' అంటూ అమెరికా దురహంకారాన్ని ఎదిరించాడు.''నాగజాతి రక్తసంతకాన్నినేను /ధమ్మపథ బాటసారిని నేను/ సత్యజ్యోతి కిరణాన్ని/ నేను భీమపతాకాన్ని''అంటూ కవి తన కవితాదృక్పథాన్ని స్పష్టంగా తెలియజేశాడు. బుద్ధుడు, జ్యోతిరావుపూలే, ముఖ్యంగా డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ సైద్ధాంతిక ఎరుకతో తన కవిత్వానికి అపారమైన శక్తిని సమకూర్చుకొని పాఠకుల్ని ఆలోచింపజేస్తాడు కవి. దళితులు, బహుజనులంతా రాజ్యాధికారం కోసం కలిసి ప్రయాణం చేయాలనే సందేశాన్నితన కవిత్వం ద్వారా అందిస్తున్నాడు.'కాలసర్పం', 'భీమరాజ్యం' వంటి కవితలు ఇందుకు ఉదాహరణలు. ఈకవితా సంపుటికి రాసిన ముందుమాటలో శిఖామణి అన్నట్లుగా 'తీగలవంతెన' కవిత కోటేశ్వరరావు ఊహాశాలిత్యానికి పరాకాష్ఠగా కనిపిస్తుంది.''కాలం ఋతు రాగం శృతి చేయగానే  /నింగికీ నేలకు నడుమ /వెండి తీగల వంతెన రచిస్తుంది మేఘం/ఆ వెండి తీగల్లో నిజ ప్రతి బింబాలను దర్శించిన వెలుగు కిరణాలు /దిక్కుల మెడలో /ఏడు రంగుల పూల హారాన్ని అలంకరిస్తాయి''  రాజకీయ కవిత్వం తో పాటు ఇలాంటి అభివ్యక్తి సుందరమైన కవితలు కూడా  నాగస్వరంలో ఉన్నాయి. ప్రధానంగా ఈకవితల్లో రాజ్యాంగ నైతికతను కవి ప్రబోధించాడు. ''పుట్టిన దేశం ఋణం తీర్చుకోవడమంటే / నిజాయితీగా నిన్ను అనుసరించడమే / నీవు పంచిన విలువలను అనునిత్యం ఆచరించడమే ఇప్పుడు దేశభక్తి అంటే (ఐ లవ్ యు) అంటూ దేశభక్తిని పునర్నిర్వచించాడు కవి. మత గ్రంథాలకంటే, సనాత, అధునాతన ధర్మాల కంటే రాజ్యాంగమే పవిత్రమైనదని ఈ కవి ఉన్నతంగా భావిస్తున్నాడు. నిజమే కదా? ఈరబాహుడు, ఎల్లమ్మజాతర, గుండెడప్పు... పున్నీళ్ళకుండ, గొడ్డుకారం వంటి దేశీయమైన పదజాలంతో దళిత జీవిత వాతావరణాన్ని ప్రతిభావంతంగా కవిత్వంలోకి తీసుకువచ్చాడు కవి. దళిత నుడికారం, పలుకుబడులు, నిత్యజీవితంలో భాగమైన వాటినే ప్రతీకలుగా తీసుకోవడం, దళితుల ఆచారాలు, భాషను గౌరవించి ఆ పదసంపదతో కవిత్వం రాశాడు. 

పండితుల సంస్కృత సాహిత్యానికి భిన్నంగా నిత్య జీవితంలోఎలా మాట్లాడుకుంటారో ఆభాషనే ప్రయోగించడం దళిత్ ఈస్తటిక్స్ లో భాషాపరమైన దృక్పథాన్ని తెలియజేస్తుంది. వ్యంగ్యం (Satire), అధిక్షేపం (Sarcasm),  ఆర్ద్రత (Compassion)తో కూడిన కోటేశ్వరరావు కవిత్వ శైలి పాఠకులను ఆకట్టుకుంటుంది.  దళితులు అనుభవించే బాధను విశ్వజనీనం చేస్తూనే, వారి అస్తిత్వ చైతన్యాన్ని ఆత్మగౌరవ  పోరాటాన్ని కవి నాగస్వరంలో సముచితంగా చిత్రించాడు.దళిత అనుభవాలను శక్తిమంతమైన కవిత్వ భాషలోకి తీసుకువచ్చి, తెలుగు సాహిత్యంలో దళిత వాస్తవికతనెలా బలంగా చూపించవచ్చో తెలియాలనుకునే వాళ్ళకి ఈ మధ్యకాలంలో వచ్చిన దళిత రచనలన్నింటిలో 'నాగస్వరం’ ప్రథమస్థానంలో  నిలుస్తుంది.



                        -డా. దార్ల వెంకటేశ్వరరావు (ప్రొఫెసర్, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్. ఫోన్: 9989628049)




కామెంట్‌లు లేవు: