ఓ నాన్న...
నిన్ను తెలుసుకోవాలంటే
నా జన్మంతా సరిపోదేమో!
నువ్వు చేసేదేమిటో
ఎవ్వరికీ చెప్పవు.
అమ్మలా ప్రేమను
బయటికి చూపించవు.
నాన్నా...
నువ్వు ఇంటికొచ్చేటప్పు
నువ్వెలా ఉంటావోచూడాలని
ఎదురు చూసి చూసి నిద్రపోతాను
ఎప్పుడొస్తావో
లేచాక చూస్తే
నా నుదుటిపై ఒక సుకుమారమైన
అనురాగపు సంతకం మాత్రం కనిపిస్తుంది
నువ్వు వెళ్ళేటప్పుడు
నేను మారాం చేస్తుంటే
నువ్వెలా వెళ్ళగలవో
నా చూపుల బంధాలతో
నిన్ను బంధించాలనుకుంటాను
మళ్ళీ కనిపించకుండా వెళ్లిపోతావు.
నీ అడుగుల శబ్దం కంటే
నీ బాధ్యతల శబ్దమే
ఇంట్లో ఎక్కువగా వినిపిస్తుందేమిటో!
చిన్నప్పుడు నువ్వు నాకోసం
ఏం చేశావో ఎలా చేసేవాడవో నాకు తెలియదు.
ఏనుగు మీద ఊరేగాలంటే
అదైతే నన్నేమి చేస్తుందోనని
నువ్వే ఏనుగైన దృశ్యం మాత్రం తెలుసు!
నీ జేబులో డబ్బు ఎంత ఉందో
నాకు తెలియదు,
నో కోరికలన్నీ
కొరత రానివ్వకుండా తీర్చేవాడివి!
నీ అలసటను
నువ్వే దాచుకున్నావు,
నీ కన్నీళ్లను నువ్వే తుడుచుకున్నావు
నాకు మాత్రం అందమైన జీవితాన్నిచ్చావు
నా కోసం
నా కలలు నిజం చేయడం కోసం
నీ కలలెన్ని వదులుకున్నావో
నా కోసం
నాకు కలత నిద్ర లేకుండా చేయాలని
ఎన్ని రాత్రులను నిద్ర లేకుండా గడిపావో!
ఓ నాన్న…
నువ్వు నీ ప్రేమను చెప్పలేదు,
నీ ప్రేమనంతా చూపించావు
నిన్ను అర్థం చేసుకోవడం వయసుతో వస్తోంది,
నిన్ను ప్రేమించడం శ్వాసతో పాటు వస్తోంది, కానీ
నీ ఋణం తీర్చడం మాత్రం
ఈ జన్మకు సాధ్యమవుతుందో లేదో తెలియదు.
ఓ నాన్న...
నిన్ను తెలుసుకోవాలంటే
నా జన్మంతా సరిపోదేమో!
(పితృ దినోత్సవ శుభాకాంక్షలతో ...)
— ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
21.6.2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి