"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

12 మే, 2026

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 



తల్లి వోలెను రోగిని తనివి దీర

ఆదరించును నర్సమ్మ యమిత ప్రేమ

కష్ట కాలాన దీపమై కాంతి నిచ్చు

వందనములివే సేవకుల్ ధన్య చరిత!


రోత నొందక నెప్పుడు రోగి సేవ

నవ్వు తోడనె చేయుచు నయము పంచు

ధాత్రి పైనను దేవతల్ ధన్య జీవు

లిలను నర్సుల త్యాగము లెన్న తరమె?


శ్వేత వస్త్రము ధరియించి శాంతి మూర్తి

వలెను కన్పించి కరుణను కురియు చుండు

అమ్మ వోలెను దీవించు నాదరమున

నర్సు లందరి కర్పించు నతులు భక్తి.


మందు లిచ్చుచు రోగికి మమత తోడ

ధైర్య మును నూరి పోయుచు తన్మయమున

ప్రాణ రక్షణ జేసెడు భవ్య చరిత

లైన నర్సుల కెప్పుడు నంజలు లివి.


రేయి బవలును నిద్దుర రేచ కుండ

వ్యాధి పీడిత జనులకు వగపు దీర్చి

ఓర్పు తోడను సేవలు నేర్పు గాను

చేయు నర్సుల కీర్తియు చెరిగి పోదు.


తనువు అలసట చెందిన తడబడకను

అనుదినంబును రోగికి నండ నిలుచు

కరుణ నిండిన హృదయాన కాంతి పంచె

నట్టి నర్సుల సేవలు నవని మిన్న.


సేవ యనియెడి మార్గాన సిద్ధ పడెడు

సుగుణ మూర్తులు నర్సులే సుఖము నిత్తు

రొడలు కదలని వేళను ఓర్పు తోడ

కంటి రెప్పగ కాపాడి కరుణ చూపు.


మొగము పైనను చిరునవ్వు మోము నిండ

మమత తోడను రోగికి మాట నిచ్చు

గుండె లోపల ధైర్యంబు గూడ జేయు

నర్సు దీవెన అమృతంబు నమ్మ వలయు.


సొంత సుఖముల నన్నిటి వంత వీడి

చెంత నిలబడి రోగికి సేవ జేయు

చింత లేకను దీవించు చిత్ర మూర్తి

వంద నములివె నర్సమ్మ వనజ నేత్రి!


కరుణ జూపుచు రోగికి కాంతి నిచ్చు

తరుణి యయ్యెను నర్సమ్మ ధాత్రి పైన

మమత తోడను నిత్యము మంచి పనుల

జేయు నర్సుల కీర్తియు చెరిగి పోదు.



కంటి రెప్పగ నిలిచియు కాచు నెపుడు

వంట బట్టిన మందుల వరుస దెలిసి

మంచి మనసున సేవలు మెండు గాను

నెలవు నర్సులే యీ ధర నిత్య వెలుగు.


వేచి యుండును రోగికి మేలు జేయ

ఓర్చి కష్టము నెప్పుడు నోర్పు తోడ

అమ్మ వోలెను దీవించు నాదరమున

నవని నర్సుల త్యాగము లమిత మయ్యె.


దరికి జేరును భయమును దరిమి వేయ

కరుణ జూపుచు రోగికి కాంతి నిచ్చు

శాంతి మూర్తులు నర్సులే జగతి లోన

ధన్య చరితలు వారలే ధరణి పైన.


అమ్మ వోలెను కరుణను నమిత మగను

చూపు నర్సుల పట్లన క్షుద్ర బుద్ధి

చూపు వారలు జెందురు ఘోర నరక

మవని వారలు పశువులే యనగ నగును.


డా.దార్ల వెంకటేశ్వరరావు 

12.5.2026


కామెంట్‌లు లేవు: