"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

10 మే, 2026

నేను… ఈ దేశపు మూలవాసిని! ( నిషిద్ధాక్షరం -2)

 


నేను… ఈ దేశపు మూలవాసిని!


ఏ కాలి చప్పుడూ వినిపించని
ఓ కీకారణ్యంలో 
వెదురు వనమంతా పల్లవించేలా  
 నేనే తొలి ప్రకృతి సంగీతమయ్యాను 
రాళ్లపై పుష్పించిన చేతి గీతల్లో
నేనొక సంకేతమయ్యాను
బాధల గాథల్నీ, విజయగాథల్నీ 
తరతరాలకు చరిత్ర గీతమయ్యాను
నా నాలిక నుంచి రాలిన శబ్దాల్లో
దేవుళ్లకు పేర్లు పలికాయి
నా గుండె చప్పుడే మొదటి భాష.
నా నీడలో పొలాలు పండాయి, 
నా ఊపిరిలో ఋతువులు మారాయి.

గుర్రాల మీద దేవతలమంటూ
ఎక్కనుండో 
తమ వెంట తెచ్చుకున్న గడియారాలు
నా సూర్యచంద్రులను ఖైదు చేశాయి.
నేను పెంచుకున్న 
నా అడవిలో విత్తనం చల్లితే దోషమన్నాయి
చెట్టు నాకు తల్లై
ఫలాల్నిస్తుంటే నా నోటినుండి లాక్కున్నాయి
నా జ్ఞాపకాన్ని పురాణమన్నాయి.
నా నిజాన్ని నాగరికతకు అడ్డుగోడన్నాయి.
గుర్రాల మీద దూసుకొచ్చిన ఆర్యలు విజేతలయ్యారు
ఈ నేలను పుష్పించిన
ఆదిమ ద్రావిడ పరిమళాల్ని మలినం చేశారు 
గెలిచిన వాడి మేధస్సు 'అగ్రం' అయ్యింది
ఓడిన వాడి శ్రమ 'దళితం' అయ్యింది!
విజయగర్వం శాశ్వతం కావడానికి
శ్రమను దోపిడీ చేసే ఒక వ్యూహం సిద్ధమైంది.
శ్రమ విభజనే కాదు
శ్రామికుల విభజన వర్ణమయ్యింది
శ్రామికుల విభజన కులమయ్యింది!


నేను… ఈ దేశపు మూలవాసిని!
ఒకప్పుడు మా వృత్తుల మధ్య కులాలు లేవు, వర్ణాలు లేవు
మాది చెమట చుక్కలు రాసుకున్న 
అవినాభావ సంబంధం
మాది నిష్కల్మషమైన పరస్పర సహకార సంస్కృతి!
మేమంతా ఒకే రక్తపు ప్రవాహంలో వేర్వేరు అలలం!
నీ విద్వేషపు విభజన మంత్రంతో
నా చుట్టూ చట్టాలు సంకెళ్ళు 
నా సరిహద్దుల్లోనే నేను బందీనయ్యాను
నా వృత్తులు వర్ణాలయ్యాయి
వర్ణాలు కులాలయ్యాయి
కులాలు ధర్మావతారాలెత్తాయి
భౌతికకు, భావ వాదానికి సంఘర్షణ 
శాస్త్రానికీ, ఆత్మలకీ ఎడతెగని పోరాటం
కలిసిమెలిసిన కుటుంబంలో చీలికలు! 
అంతా మాయ
ఎటుచూసినా మాయ
అందర్నీ కమ్మేసింది!
దట్టమైన మేఘం కుండపోతగా వర్షం!
నేను నమ్ముకున్న నేల
నన్ను కాపాడిన ఆకాశం
నన్ను వెలిగించిన సూర్యకిరణం
నాకర్థం కాకుండా పోయింది!
నా నుండి దూరంగా పారిపోయిందో
దానికి నేనే దూరంగా పారిపోయానో
పంచభూతాలన్నీ నా వశం తప్పాయి!

ఒకనాడు…
బుద్ధి శ్రమను సింహాసనంపై కూర్చోబెట్టి
శారీరక శ్రమను పాదాల చెంతకు నెట్టేసిన వేళ
అంతరాల విత్తనాలు చల్లారు
మెదడు చేసే పని 'ఉన్నతం' అట!
మట్టిని నమ్ముకున్న పని 'హీనం' అట!
అలా గీసిన గీత...
తరతరాల బతుకుల్ని చీల్చే అగాధమైంది!
కాలక్రమేణా...
వృత్తుల పవిత్ర బాట 
అపవిత్ర భావనలతో బందీఖానా!
కుమ్మరి చక్రం, వడ్రంగి వాసి, చర్మకారుడి సూది...
అవి కేవలం వృత్తులు కాలేదు, 
వంశపారంపర్య సంకెళ్లయ్యాయి.
సమాజపు అవసరాలు పెరిగిన కొద్దీ
మనిషి మనిషికి మధ్య గోడలు పెరిగాయి
ఒకటి మూడై, వందలై, వేలలై...
కులమనే మహావృక్షం విషపు వేళ్లను పాతుకుంది!
***
నేను
మీరంతా దళితుడిగా పిలుస్తున్న 
ఈ దేశ మూలవాసిని.
ఈ మట్టి సాక్షిగా, 
ఈ ఆకాశం సాక్షిగా ఈ దేశపు మూలవాసిని.
ఎవరు అస్పృశ్యుడు?
మృదంగమై దైవ సంగీతాన్ని పలికించేది నా చేతులే!
యుద్ధ వీరుడి కత్తికి రక్షణనిచ్చే ఒరను నేనే!
రైతు దప్పిక తీర్చే తోలుతిత్తిని నేనే!
నా చేతి నిండా అంటుకున్న ఈ నలుపు
మురికి కానే కాదు
ప్రాణం లేని తోలుకు అమ్మ 'స్పర్శ'నిచ్చి
అవనిని చుట్టేసే అడుగుల వేగాన్ని పెంచిన వాణ్ణి.
ఈ దేశపు అభివృద్ధికి నేను అద్దిన అందమైన రంగున్నేను!

నేను...
ఈ మట్టితో ముడిపడి ఉన్న పురాతన స్వరాన్ని.
మీరిప్పుడు తవ్వుతున్న
ఈ సింధు నాగరికత ఇటుకల వెనుక,
నా తాత ముత్తాతల చేతి ముద్రలున్నాయి.
ఈ భూమి నాది, 
ఈ చరిత్ర నాది.
ఆదిమ స్మృతులు...
వేల ఏళ్ళ క్రితం
అడవుల గుండెల్లో బతికాను.
వారసత్వపు వేటగాడి పౌరుషంతో
ప్రకృతితో మమేకమయ్యాను.
గుహల గోడలపై నేను గీసిన చిత్రాలు,
నా చరిత్రకు సాక్ష్యాలు.
చరిత్ర పుస్తకాల్లో 
మీరు వెతికే అస్థిపంజరాన్ని కాదు
ఈ మట్టి పొరల్లో 
సజీవంగా ప్రవహిస్తున్న రక్తాన్ని!
నేను ఈ మట్టి కళాకారుణ్ణి.
మీరు చూస్తున్న
ఈ మట్టి బొమ్మలు, ఈ ఎద్దులు…
ఈ చిన్న చిన్న దేవతా విగ్రహాలు...
వీటిని చేసిన చేతులు నావే.
ఈ మట్టిలోనే నా నమ్మకాలున్నాయి
ఈ నాగరికతకు ప్రాణం పోసిన శిల్పిని నేనే.
సింధునదీ తీరాన తొలి ఇటుక పేర్చింది నేనే
హరప్పా నాగరికత స్నాన వాటికలో
తొలిసారిగా ఈతనేర్పింది నేనే
నా చెమట చుక్కే 
ఈ నాగరికతకు పునాది రాయి.
సమస్త వృత్తులూ నా ఇంటి పేర్లే
నేటికీ వృత్తులే నా ఇంటి పేర్లు 
నేటికీ శ్రమైకజీవన సౌందర్యమే 
నా ఇంటి పేర్లలోని సజీవ శాస్త్రం! 

నేను ఏ ఒక్క కులానికో, 
నేను ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు
చేలోనాగలి పట్టినప్పుడు నేనో రైతును
చక్రం మీద 
మట్టికి ప్రాణం పోసినప్పుడు నేనో కుమ్మరిని
లోహాన్ని కరిగించి 
ముద్రలు చెక్కినప్పుడు నేనో కళాకారుడిని
నాడు నేను చేసిన ప్రతీ పనీ
నా అస్తిత్వానికో గుర్తు
నా వృత్తే నా గౌరవం.. 
నా శ్రమయే నా వైభవం!
కాలం మారింది.
చరిత్ర మారింది
కర్మ సిద్ధాంత రాధ్థాంతాలు
మాయలూ మర్మాలూ 
వృత్తి నైపుణ్య సిద్థాంతాలు 
ఒకటా రెండా 
అవి నన్నూ
నా జాతినీ చీకట్లోకి నెట్టేశాయి!
***
నా పూర్వీకులు
ప్రవహించే సజీవ నదుల్ని కనుగొన్నారు 
మట్టిని కుండగా మలిచారు 
మొదటి గ్రామం విలసిల్లింది 
వేటకాడి చేతిలో రాతి బాణం
అవిశ్రాంతంగా అలిసిపోయిన సంచారానికి 
ఎంత ఉపశమనం!
స్థిరజీవితాన్ని గుడిసెల్లో కలలు పోతపోశారు
నా తాత ముత్తాతల చేతి మచ్చలే 
నేటికీ సింధూనదీ తీరపు తవ్వకాల్లో దొరుకుతున్నాయి!

ప్రకృతితో నేను
నాతో ప్రకృతి 
పరస్పర సంభాషణలు 
పరస్పర సంఘర్షణలు
అతివృష్టి…అనావృష్టి 
పరస్పర దోబూచిలాటలు!

తోలుతో తిత్తులు చేశాను
నిప్పును రగిలించాను
కందకుండా పాదాల్ని ముద్దాడాను
మాన మర్యాదలకు వస్త్రాన్నయ్యాను
న్యాయాన్యాయాలకు శస్త్రాన్నయ్యాను

నేను ఈ దేశపు మూలవాసిని…
ఈ మట్టిలో నా అడుగుల ముద్రలు
కాలం తుడిచేయలేని చరిత్రకు ఆనవాళ్ళు
ఈ నేలపై పడిన ప్రతి చెమటబిందువు
నా వంశపారంపర్యపు అక్షరమై
రాయిల్లోనూ, వేళ్ళలోనూ, గాలిలోనూ
నిశ్శబ్దంగా పలుకుతోంది.

నేను పుట్టింది
పాలకుల చరిత్రల్లో కాదు,
పంటల మధ్య పొద్దు పొడిచే కష్టాల్లో
నా చరిత్ర వినిపిస్తుంది 
నా చేతులే ఈ నేలకి రూపం ఇచ్చాయి,
నా శ్రమే ఈ దేశానికి జీవాన్నిచ్చింది.
విచిత్రపు మాయలో నా పేరే నిషిద్ధం అయింది,
నా మాటే మౌనమైపోయింది,
నా జీవితమే ఒక ప్రశ్నార్థకంగా నిలిచిపోయింది.

నన్ను నువ్వు గుర్తుపట్టకపోయినా
గుర్తించకుండా నటిస్తున్నా
ఈ నేలే నన్ను గుర్తుపడుతుంది.
నన్ను నువ్వు తృణీకరించినా
ఈ గాలే నా పేరును పరిమళాలతో వ్యాపిస్తుంది.
నన్ను నువ్వు మౌనంగా మార్చాలనుకున్నా
ఈ పంచభూతాలే నా స్వరమై పల్లవిస్తాయి!

నా ఊపిరిలో
ఈ నేల గంధం ఉంది,
నా రక్తంలో
ఈ నదుల ప్రవాహం ఉంది.
నా చర్మం మీద
సూర్యుడి ముద్రలున్నాయి
అవి కేవలం కష్టాల గుర్తులు కావు,
అవి కాలానికి నేను పెట్టిన సంతకాలు!

నేను
కర్రతో మొదటి గీత గీసిన వాడిని,
రాయిపై మొదటి అక్షరం చెక్కిన వాడిని,
అడవిలో మొదటి గుడిసె కట్టిన వాడిని.
అయినా
నా కథకు పుటలు ఇవ్వలేదు
నా పేరుకు స్థానం ఇవ్వలేదు.
అది ఓ చరిత్ర కాదు
అది మరచిపోవాలని నేర్పిన 
అందమైన ఓ అబద్ధపు పురాణం.

నా నిశ్శబ్దం పరాజయం కాదు
అది ఒక సుదీర్ఘ శ్వాస,
ఒక తిరుగుబాటు ముందరి నిశ్చలత!

నా గళం
ఒక వ్యక్తి స్వరం కాదు,
అది వేల సంవత్సరాల అణచివేత
ఒక్కసారిగా పగిలే శబ్దం.
నేనే చరిత్రలో దాచిన పుట,
నేనే భవిష్యత్తులో వెలిగే నిషిద్ధాక్షరం
భవిష్యత్తుకి నీలి రంగుల దృశ్యాల నిషిద్ధాక్షరం!


నా కవిత్వం
కన్నీటి అక్షరాలు కాదు 
అవి మెరుపుల్లా పిడుగుల్లా
అణచివేతను చీల్చే పదాలు.
శ్రమైక జీవన సౌందర్య నాదాలు
సత్యాన్ని ఆవిష్కరించిన తొలివేదాలు
ఇప్పుడు నా పేరు నిషిద్ధం కాదు
ఇదొక ఆత్మ గౌరవ ప్రకటన.
ఇప్పుడు నా అక్షరం నిషిద్ధం కాదు
పాతిపెట్టిన భూమిని పెకలించుకొంటూ
సకల సంకెళ్ళనూ చీల్చుకొంటూ 
నిప్పులు చిమ్ముకుంటూ 
నలుదిశలా ఆత్మగౌరవాన్ని వెదజల్లే కాంతిపుంజాలు!

లోకం పితృస్వామ్యపు నీడల్లోకి వెళ్లకముందే
నేను ప్రకృతిని 'అమ్మ'గా పిలుచుకున్నాను.
నా ఇంట్లో, నా రాజ్యంలో స్త్రీయే ఆదిశక్తి
ఆమె గర్భం నుండే 
ఈ సృష్టీ, ఈ వృత్తులన్నీ ఉద్భవించాయి.
మట్టితో నేను చేసిన ఆ 'అమ్మతల్లి' విగ్రహమే
నా విశ్వాసానికి, నా సంస్కృతికి తొలి సాక్ష్యం.
నేను ఈ దేశపు మూలవాసిని
తరతరాల అన్వేషణలో నేను అలసిపోలేదు
నన్ను అస్పృశ్యుడిగా అంచులకు నెట్టినా
ఈ మట్టి అణువణువులో నా గతం దాగి ఉంది.
హరప్పా వీధుల్లో 
నా నడకల సవ్వడి ఇంకా వినిపిస్తోంది
మొహంజొదారో స్నానవాటికల నీటిలో 
నా ప్రతిబింబం ఇంకా స్పష్టంగానే కనిపిస్తోంది.
నేను...
నీ అణచివేతకు గురైన దళితుడిని కావచ్చు
ఈ దేశపు అసలైన వారసుడని నాకు తెలుసు!
ఈ దేశానికున్నంత పొగరంతా నాదేననీ తెలుసు!
వేల ఏళ్ల కిందటే నాగరికతను నేర్పిన
అమ్మతల్లి బిడ్డను నేనేననీ తెలుసు!
ఔను… ఈ మట్టి మూలవాసిని!
నేనే… ఈ దేశపు మూల వాసిని!!

-డా.దార్ల వెంకటేశ్వరరావు 

(10.5.2026,నినాదం దినపత్రిక, సాహిత్య అనుబంధం 'లహరి' సౌజన్యంతో)

5.5.2026















కామెంట్‌లు లేవు: