కన్నున ముల్లును తాకగ
వెన్నున నొప్పి జనియించు విధమునకలుగన్
పన్నున బాధయు కలుగగ
కన్నని గుండెయు జలధిగ కదిలెను గదరా
కంటి ముల్లు తగిలి కలతను జెందిన
రీతి బిడ్డడేడ్వ భీతినొంది
పంటి నొప్పి తోడ బాలుడు విలవిల
కాళ్ళు నిలువలేడు కన్న తండ్రి!
ఎండ తాకిడి కలువలు వాడినట్లు
కన్న బిడ్డడు కన్నీరు గార్చుచుండ
కాయ మాతని దైనను కలుగు బాధ
కన్న తండ్రికి కలుగుట కాదె నిజము.
పిడుగు పడగ నెమలి భీతిల్లినట్లుగ
సుతుడు బాధ పడగ చొక్కిపోతి
కంట నీరు గార కటకట పడెడి నా
మనసు వేదనొందె మహిని జూడ.
ముల్లు గుచ్చుకొనగ మొగ్గ వాడిన రీతి
బాలు డడల గుండె బాధపడుచు
పంటి బాధ చూడ కంటినీరాయెరా
కొడుకు బదులు తండ్రి కంట రాలె
చాక్లెటులటుల పళ్ళను సలుపునంచు
నేర ములనెల్ల మోపుచు నింద చేయు
లోక మెప్పుడు చూడదు లోని బాధ
కన్న వారల గుండెలు కరుగుచుండ
భగ్న దర్పణ ప్రతిబింబ భంగి యగుచు
నిద్దరాత్మలు మునిగెను నీటి యందు
సుతుని వేదన వికృతమై శోకమొంద
బాధ తట్టుకోలేకను బహుళముగను
గిరిని దావాగ్ని జిక్కిన హరిణి భంగి
పంటి బాధతో సుతుడును పంటిచూప
కన్న బిడ్డని దైన్యపు గతిని జూడ
తల్లిదండ్రుల మనసుల తాపమొందె.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 9.3.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి