అమ్మ యగుచు నిచ్చు అమృతపు దీవెన
ధరణి మోయు నట్టి ధైర్య గుణము
శాంతి మూర్తి యగుచు సాగును మహిళయే
దారి పూలతోట దార్ల మాట
ఆడ బిడ్డ పుట్ట ఆనందమొందాలి
లక్ష్మి ఇంట వెలసె నన్న రీతి
గౌరవించు వాడు గాంచును పుణ్యము
దారి పూలతోట దార్ల మాట
చదువు నేర్చి నేడు చలన చిత్రము వోలె
నింగి కెగసె మహిళ నిఖిల లోక
శక్తి రూపమగుచు సాధించు నెల్లను
దారి పూలతోట దార్ల మాట
మాతృ మూర్తి కంటె మహిమలె లేవురా
సృష్టి కర్త యగుచు నెసగు చుండు
పూజ సేయ వలెను పుడమిపై నెప్పుడు
దారి పూలతోట దార్ల మాట
ఇల్లు దిద్దు నామె ఇలవేల్పు గనుజూడు
ఓర్పు తోడ జూపు నొప్పు లన్ని
ప్రేమ పంచె నట్టి పెన్నిధి యగు నిల
దారి పూలతోట దార్ల మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి