సంస్కృతలు వేరు- సారమొక్కటే!
తనదు సంస్కృతి తానెట్లు తలచుకొనుయె
నటులె పరుల సంస్కృతిని తా నరయవలయు
గంగ యమునలు వేరైన కడలి నొకటె
రీతి సంస్కృతులన్నియు ప్రీతి గొల్పు!
పరగన్ సంస్కృతులన్నియు
సరియగు సరిదృష్టినిగన సమతను గూర్చన్!
ధరలో భేదము లేకను
అరయగ నందరునుమెచ్చు నానందముగన్
వేష భాషలందు వేర్వేరుగనిపించు
భావమొకటె యదియు భాషవేరు
సంస్కృతులవి యెన్నొ జగతిపై నున్నను
మానవత్వమొకటె మమత గూర్చు!
వేల కళలు కలిసి విశ్వమౌ తోటలో
రంగు రంగు పూల రకములుండు
సంస్కృతులవి యెన్నొ సౌభాగ్యమొనరించు
మనిషి మనుగడకును మహిమ గూర్చు!
పుడమి తల్లికి నందము పూల దండ
వింత సంస్కృతులన్నియు వింత గొల్పు
తరము తరమున వెలుగును వరములవియె
కాచుకోవలె మనమంత కలిసి మెలిసి
భాషలు ఏవైనను మఱి
వేషము లూహల కతీత వెలయును భువిలో
పోషిత సంస్కృతి యెపుడున్
దోషము లేకుండజూడు తోయజనేతా!
రంగు రంగు పూలు రాణించు తోటలో
అందమొకటె యగును అవని పైన
సంస్కృతులవి వేరొ? సారంబు నొకటేగ
విశ్వశాంతి గూర్చు విలసితముగ!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 10.3.2026
( ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి