"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

30 మార్చి, 2026

దార్ల మాట’ తేటగీతి శతకం - డా. బండారు విజయ్ కుమార్ ముందుమాట

 సమకాలీన సామాజిక దార్శనికతకు గీటురాయి:

 దార్ల మాట తేటగీతి శతకం

- డా. బండారు విజయ్ కుమార్,

సామాజిక, సాహిత్య విశ్లేషకులు

“కులము మతభేద ములనెల్ల కూల్చివేసి

మనిషి మనిషిగా బ్రతికిన మనుగ డౌను

సమత మమతలు పంచెడి సత్యమిదియె

దారి చూపించు నట్టిది దార్ల మాట”

(దార్ల మాట తేటగీతి శతకం - పద్యం: 123)

“దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్” అని నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు గారు ఏనాడో చెప్పారు. మట్టిని ప్రేమించడం కంటే, మనిషిని మనిషిగా ప్రేమించడమే అత్యున్నతమైన ధర్మమని, కులమతాల అడ్డుగోడలు కూల్చివేసినప్పుడే నిజమైన ‘వసుధైక కుటుంబం’ సాధ్యమవుతుందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు పై పద్యంలో అద్భుతంగా ఆవిష్కరించారు. మహాకవుల ఆలోచనలకు, వర్తమాన సామాజిక అవసరాలకు వారధి కడుతూ, మానవత్వ పరిమళాలను వెదజల్లుతున్న అక్షర కుసుమమే ఈ ‘దార్ల మాట’.

సాహిత్యం సమాజానికి దర్పణం అంటారు. కానీ, ఆ దర్పణంలో కనిపించే రుగ్మతలకు సరైన చికిత్సను అందించేది ‘శతక సాహిత్యం’. పామరుడికి సైతం అర్థమయ్యే రీతిలో పాలకుల మెప్పు కోసం కాకుండా, ప్రజాహితం కోసం ఉద్భవించిన ఈ ప్రక్రియలో నాటి వేమన, బద్దెనల సరసన నేటి డిజిటల్ యుగంలో సగర్వంగా నిలబడగలిగే అద్భుతమైన కృతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి “దార్ల మాట తేటగీతి శతకం”. కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా తనదైన ముద్రవేసిన ఆచార్య దార్ల వారు, ఈ పద్యాలకు వస్తువును ఆకాశం నుంచి దిగుమతి చేసుకోలేదు. గ్లోబలైజేషన్ మాయలో పడి కునారిల్లుతున్న పల్లెలు, స్వార్థంతో కలుషితమవుతున్న పర్యావరణం, కుప్పకూలుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అడుగంటుతున్న నైతిక విలువలు – ఇవే ఆయన పద్యాలకు ముడిసరుకులు. తాను సమాజంలో చూస్తున్న, అనుభవిస్తున్న, ఆవేదన చెందుతున్న సమకాలీన పరిస్థితులకు అక్షరరూపమే ఈ శతకం.

నేటి ఇంటర్నెట్ యుగంలో గూగుల్ (Google) లో తెలుగు సాహిత్యంలోని ఏ ప్రక్రియ గురించి వెతికినా, ముందుగా కనిపించే మొదటి ఐదు పేర్లలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి పేరు కచ్చితంగా ఉంటుంది. అంతర్జాలంలో తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ నలుమూలలా అందుబాటులో ఉంచడంలో ఆయన చేసిన సేవ మహోన్నతమైనది. సాహిత్యంలోని ఏ ప్రక్రియను తీసుకున్నా, ఆయన అందులో విశేషమైన కృషి చేసి, ఆయా ప్రక్రియలకు ఒక్కొక్క కోటను నిర్మించి, ఆ కోట పైన ‘దార్ల’ అనే జెండాను సగర్వంగా పాతారు. ఒక గొప్ప విమర్శకుడిగా, కథకుడిగా, నవలాకారుడిగా, వ్యాసకర్తగా, విశ్లేషకుడిగా, కవిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ఆయన... ఇప్పుడు ఒక ‘శతక కర్త’గా కూడా మన ముందు ఉద్భవించడం తెలుగు సాహిత్యానికి గర్వకారణం. ఆయన అడుగుపెట్టని సాహిత్య రంగం లేదు, పండించని పంట లేదు.

శతకానికి ప్రాణం ‘మకుటం’. పద్యం ఏ విషయాన్ని చెప్పినా, అంతిమంగా మకుటం ఆ పద్యం యొక్క తాత్వికతను నిర్దేశిస్తుంది. వేమన తన శతకంలో “విశ్వదాభిరామ వినుర వేమ” అంటూ ప్రపంచం మొత్తాన్ని సత్యాన్ని వినాల్సిందిగా మేల్కొల్పాడు. బద్దెన తన సుమతీ శతకంలో “సుమతీ!” అంటూ చదివేవాడికి సద్బుద్ధి (మంచి మనసు) కలగాలని ఆకాంక్షించాడు. ఈ రెండు శతకాల్లోని తాత్వికతను, మానవీయతను ఒంటబట్టించుకున్న ఆచార్య దార్ల గారు, తమ శతకానికి ఎంచుకున్న మకుటం- “దారి చూపించు నట్టిది దార్ల మాట”. ఇది కేవలం ఒక సంబోధన కాదు, గందరగోళంలో ఉన్న నేటి సమాజానికి ఒక ‘మార్గదర్శనం’. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలియక కొట్టుమిట్టాడుతున్న ఆధునిక మానవుడికి కారుచీకటిలో ఒక కాగడా లాగా దారి చూపే అక్షర సత్యం ఈ ‘దార్ల మాట’.

సాధారణంగా శతక పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి అనేదాన్ని బట్టి ఆ కవి యొక్క ఉద్దేశం, ఆ పద్యం యొక్క నడక ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ప్రజాకవి వేమన తన సామాజిక విమర్శనంతటినీ సరళమైన ‘ఆటవెలది’లో అలవోకగా పలికారు. బద్దెన తన నీతి సూత్రాలను ‘కంద పద్యం’లో కుదించి చెప్పారు. ధూర్జటి వంటి భక్త కవులు తమ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ‘శార్దూల, మత్తేభ’ వృత్తాలలో తమ భక్తిని, పాండిత్యాన్ని చాటుకున్నారు.

అయితే, ఆచార్య దార్ల వారు ఈ శతకానికి ‘తేటగీతి’ ఛందస్సును ఎంచుకోవడం వెనుక ఒక బలమైన సామాజిక కారణం ఉంది. ‘తేట’ అంటే స్వచ్ఛమైనది, స్పష్టమైనది అని అర్థం. ‘గీతి’ అంటే గానం చేయదగినది. సంక్లిష్టమైన సమాసాలు లేకుండా, పండితులకే కాకుండా పామరులకు, విద్యార్థులకు కూడా సూటిగా అర్థమయ్యే రీతిలో, ఒక పారుతున్న ఏరులాగా భావం సాగిపోవడానికి తేటగీతి అత్యంత అనుకూలమైన ఛందస్సు. గురు లఘువుల గణన కంటే, భావ ప్రకటనకే కవి పెద్దపీట వేశారు. అందుకే ఆయన దీనికి ‘దార్ల మాట తేటగీతి శతకం’ అని సార్థక నామధేయం చేశారు. క్లిష్టమైన వృత్త పద్యాల జోలికి వెళ్లకుండా, సామాన్యుడి గుండెకు హత్తుకునేలా చెప్పడానికి ఈ తేటగీతిని ఎంచుకోవడం ఆయనలోని సామాజిక స్పృహకు నిదర్శనం.

దార్లన్నతో నా అనుబంధం – ఒక మధుర జ్ఞాపకం:

గురువు అంటే కేవలం తరగతి గదిలో పాఠం చెప్పేవాళ్లు మాత్రమే కాదు, జీవిత గమనాన్ని నిర్దేశించే మార్గదర్శకులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో నేను, నా అన్నయ్యలు (శ్రీనివాస్ అన్న, రాజేంద్రం, జయరాజ్ అన్న) పీజీ (PG) చదువుతున్న రోజుల్లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు మాకు ‘దార్లన్న’గా సుపరిచితులు. ఆ రోజుల్లో ఆయన వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తూనే, తన పరిశోధన (Ph.D) నిమిత్తం యూనివర్సిటీకి వచ్చినప్పుడు వారు మాతో అమూల్యమైన సమయం గడిపేవారు. విశ్వవిద్యాలయంలోని ‘గోప్స్’లో మాతో కలిసి టీ తాగుతూ, జేఆర్ఎఫ్ (JRF) సాధించడానికి చదవాల్సిన పుస్తకాలను మాకు సూచిస్తూ ఎంతో స్ఫూర్తిని నింపేవారు. ఆనాడు ఒక అన్నగా భుజం తట్టిన ‘దార్లన్న’, నేడు ప్రొఫెసర్‌గా, శాఖాధిపతిగా ఎదిగి, నాలాంటి ఎందరో పరిశోధక విద్యార్థులకు, సాహిత్యాభిమానులకు మార్గదర్శకులయ్యారు. 

ఆచార్య దార్ల గారి శతకంలోని పద్యాలను వివిధ కోణాల్లో పరిశీలిస్తే, ఆయన దార్శనికత, తాత్త్వికత ఎంత లోతైనదో, స్పష్టమైనదో అర్థమవుతుంది.

1. పర్యావరణ స్పృహ - రేపటి తరానికి ప్రాణవాయువు

ఆధునిక అభివృద్ధి ముసుగులో మనం చేసుకుంటున్న స్వయంకృతాపరాధాలను కవి ఈ పద్యంలో ఎత్తిచూపుతున్నారు. కాంక్రీట్ భవనాల కోసం పచ్చని చెట్లను నరికేస్తూ, ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న నేటి మానవుడి దుస్థితిని చూసి కవి గుండె తరుక్కుపోతోంది. రేపటి తరానికి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ, కనీసం పీల్చే గాలిని కూడా మిగల్చకపోతే ఎలా అనే కవి ఆవేదన ఇందులో కనిపిస్తుంది.

చలువ నిచ్చును గాదెవృక్షమ్ములెపుడు

ప్రాణవాయువు నందించి బ్రతుక జేయు

చెట్లు నరికిన ప్రాణికీ చేటు కలుగు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 29)

గ్లోబల్ వార్మింగ్ (Global Warming) అనేది కేవలం అంతర్జాతీయ సదస్సుల్లో చర్చించే అంశం కాదు, అది మన పెరటి మొక్కతో ముడిపడి ఉన్న జీవన సమస్య అని కవి హెచ్చరిస్తున్నారు. చెట్లను నరకడం అంటే మన గొంతును మనమే నులుముకోవడం అని, ప్రకృతి రక్షణే మానవ మనుగడకు రక్షణ కవచమని కవి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించకపోతే మానవాళి అంతం తప్పదని ఈ పద్యం ఘోషిస్తోంది.

నీటి కోసం యుద్ధాలు జరుగుతాయేమోనన్న భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. జల వనరులను కలుషితం చేస్తూ, భూగర్భ జలాలను తోడేస్తూ, వర్షం పడినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టకుండా సముద్రం పాలు చేస్తున్న మన అజ్ఞానాన్ని కవి నిలదీస్తున్నారు. ఆకాశం నుంచి రాలిన ప్రతి చినుకూ ఒక సంపద అని, దానిని దాచుకోకపోతే భవిష్యత్తు ఎడారిగా మారుతుందని కవి ఆందోళన చెందుతున్నారు.

నీరు లేనిది నిఖిలము నిలువబోదు

వందనమ్ముగమేఘమ్ములందజేసె

చినుకు చినుకు ను దాచాలి చిత్తగించి

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 32)

నీరు లేనిదే సృష్టి లేదు, జీవం లేదు. మేఘాలు మనకు అందించే వర్షం ప్రకృతి ప్రసాదించిన వరం. వాన నీటిని భూమిలో ఇంకించుకోవడం (Rainwater Harvesting) ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని కవి గుర్తుచేస్తున్నారు. చినుకును చిన్నచూపు చూస్తే, రేపు గుక్కెడు నీళ్ల కోసం తల్లడిల్లక తప్పదని, జల సంరక్షణే మన భవిష్యత్తుకు భరోసా అని దార్ల వారు ఎంతో ముందుచూపుతో హెచ్చరిస్తున్నారు.

వాడి పారేసే (Use and throw) సంస్కృతిలో భాగంగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది. ఈ ప్లాస్టిక్ భూతం భూమిని సారహీనం చేయడమే కాకుండా, పశుపక్ష్యాదుల ప్రాణాలను సైతం బలిగొంటోంది. తాత్కాలిక సౌకర్యం కోసం మనం వాడుతున్న ప్లాస్టిక్, భవిష్యత్ తరాలకు శాపంగా మారుతున్న వైనాన్ని, నాగరికత పేరుతో మనం చేస్తున్న అనాగరిక చర్యలను కవి ఈ పద్యంలో తీవ్రంగా ఖండించారు.

వ్యర్థమైనట్టి ప్లాస్టిక్కు వాడుతున్న

ముప్పు వాటిల్లుచుండునుతప్పకుండ

ప్రగతి శూన్యమ్ముగా మారు ప్రాణుల కిక

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 34)

ప్లాస్టిక్ కాలుష్యం అనేది పర్యావరణానికి క్యాన్సర్ లాంటిది. ఇది కేవలం నేలను పాడుచేయడమే కాదు, సమస్త జీవకోటి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. మనం సాధించే అభివృద్ధి (ప్రగతి) అంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతే అది శూన్యమే అవుతుందని దార్ల వారు అత్యంత శాస్త్రీయ దృక్పథంతో విశదీకరించారు. ప్లాస్టిక్ రహిత సమాజమే నిజమైన ప్రగతికి సూచిక అని ఈ పద్యం చాటిచెబుతోంది.

2. బౌద్ధ తత్వం - అంతరంగ శోధన, శాంతి మార్గం:

అణుబాంబులతో ప్రపంచాన్ని భయపెడుతున్న దేశాలు, మారణాయుధాలతో శాంతిని వెతుకుతున్న పాలకులు ఉన్న ఈ కలికాలంలో బుద్ధుడు చూపిన మార్గం ఎంత అవసరమో కవి గుర్తుచేస్తున్నారు. ద్వేషాన్ని ద్వేషంతో జయించలేమని, రక్తం మరకలను రక్తం కడిగివేయలేదని, కేవలం అహింస, శాంతి మాత్రమే ప్రపంచాన్ని రక్షించగలవని కవి బలంగా విశ్వసిస్తున్నారు.

కత్తి పట్టక శాంతికై కలయజూచి

మౌన వ్రతమున సాధించిమానవాళి

కందజేసెనీబుద్దుడుయిదరించి

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 121)

యుద్ధాలతో సాధించేది శ్మశాన శాంతి మాత్రమేనని చరిత్ర రుజువు చేసింది. కత్తి పట్టకుండా, అహింసను ఆయుధంగా మలచుకుని బుద్ధుడు మానవాళికి అందించిన ‘మౌనం’ అనే ఆయుధం ఎంత శక్తివంతమైనదో కవి వివరిస్తున్నారు. బుద్ధుని బోధనలు నేటి హింసాత్మక ప్రపంచానికి ఏకైక పరిష్కారమని, శాంతి మార్గంలోనే మానవాళి మనుగడ సాధ్యమని కవి ఈ పద్యం ద్వారా ఉద్బోధిస్తున్నారు.

నేటి కార్పొరేట్ ప్రపంచంలో మనిషి కోరికలకు అంతం లేకుండా పోయింది. ఒకటి దక్కితే మరొకటి కావాలనే తపనతో, ఎండమావుల వెంట పరుగెడుతూ మనిషి తనశ్శాంతిని కోల్పోతున్నాడు. ఎంత సంపాదించినా తృప్తి లేని బ్రతుకు వ్యర్థమని, ఆశే దుఃఖానికి మూలమన్న బుద్ధుని సత్యాన్ని విస్మరిస్తున్న ఆధునిక మానవుడికి ఇది కనువిప్పు.

అంత మెరుగమీ కోర్కెల నవనియందు

తీర దీదాహ మేనాడు తృప్తిగాను

నాశ వీడిన నొనగూరు హాయి మనకు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 119)

కోరికల దాహం సముద్రం లాంటిది, అది ఎప్పటికీ తీరదు. “నాశ వీడిన నొనగూరు హాయి” అని కవి చెప్పిన మాటలో ఎంతో తాత్వికత దాగి ఉంది. తృష్ణను (మితిమీరిన కోరికను) జయించినవాడే నిజమైన సుఖశాంతులను పొందుతాడని, సంతృప్తికి మించిన సంపద లేదని బౌద్ధ తత్వాన్ని కవి తేటగీతిలో ఒంపి సామాన్యులకు అందించారు.

మనిషి ఎలా బ్రతకాలి? అనే ప్రశ్నకు బౌద్ధం చూపిన అద్భుతమైన మార్గం ‘అష్టాంగ మార్గం’. కానీ నేడు మాటలో నిజాయితీ, చూపులో పవిత్రత, నడతలో స్వచ్ఛత లోపించాయి. సరైన జీవన విధానాన్ని మరిచిపోయి గందరగోళంలో పడిపోతున్న యువతకు, బౌద్ధం చూపిన ఎనిమిది మార్గాలను కవి ఈ పద్యం ద్వారా పరిచయం చేస్తున్నారు.

చూపు తోపాటువాక్కునుశుద్ధినడత

బ్రతుకు శ్రమయును స్మృతియును భౌమ ధ్యాన

మొప్పు నష్టాంగ మార్గమం దొదిగి యుండు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 127)

సమ్యక్ దృష్ఠి, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ మొదలైన క్లిష్టమైన పారిభాషిక పదాలను వాడకుండా... చూపు, వాక్కు, నడత అంటూ సామాన్యుడి భాషలో అష్టాంగ మార్గాలను కవి వివరించిన తీరు అద్భుతం. మనిషిని సంపూర్ణ మానవుడిగా (Complete Human Being) తీర్చిదిద్దడానికి ఈ ఎనిమిది సూత్రాలు ఎలా ఉపయోగపడతాయో కవి నిర్దేశిస్తున్నారు.

3. అంబేడ్కర్ స్ఫూర్తి - సామాజిక సమతా భావం:

డా. బి.ఆర్. అంబేడ్కర్ గారు జీవితాంతం కుల నిర్మూలన కోసం పోరాడి, అంతిమంగా సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వం ఎక్కడైతే దొరుకుతాయో ఆ బుద్ధుని మార్గాన్ని (బౌద్ధ ధర్మాన్ని) స్వీకరించారు. మనిషిని మనిషిగా గౌరవించే బౌద్ధం ద్వారానే భారతీయ సమాజంలో పాతుకుపోయిన అసమానతలు తొలగిపోతాయని ఆయన బలంగా విశ్వసించారు. అంబేడ్కర్ గారి ఆ అంతిమ ఆశయాన్ని, ఆయన ఎంచుకున్న శాంతియుత సమతా మార్గాన్ని ఆచార్య దార్ల గారు ఈ పద్యంలో ప్రతిబింబించారు. మనుషుల మధ్య కులమతాల అంతరాలు నశించి, సమానత్వం వెల్లివిరియాలంటే ఏ మార్గంలో నడవాలో కవి ఇక్కడ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.  

మాణ్యుడైనట్టి బుద్ధుని మార్గమైన

ధర్మ పథమును వీడక తరలు చున్న

సమత మమతలు తప్పక సాధ్యమగును

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 125)  

ఈ పద్యంలో కవి వాడిన ‘సమత’ (సమానత్వం), ‘మమత’ (ప్రేమ/సౌభ్రాతృత్వం) అనే రెండు పదాలు రాజ్యాంగంలో అంబేడ్కర్ గారు పొందుపరిచిన మూల స్తంభాలు. పూజ్యుడైన బుద్ధుడు చూపిన ధర్మ పథంలో నడిచినప్పుడే, సమాజంలో కుల మతాల అడ్డుగోడలు కూలిపోయి ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం దక్కుతుందని కవి ఘంటాపథంగా చెబుతున్నారు. చట్టాల ద్వారా వచ్చే సమానత్వం కంటే, మనుషుల మనసుల్లో వచ్చే మార్పు ద్వారానే నిజమైన ‘సమత’ సాధ్యమవుతుందన్న చారిత్రక సత్యాన్ని దార్ల వారు తేటగీతిలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అందించారు. ఇది అంబేడ్కర్ సమతా భావజాలానికి అక్షర నీరాజనం లాంటి పద్యం.

ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు కులాన్ని, మతాన్ని వాడుకోవడం మనం నిత్యం చూస్తున్నాం. ప్రజల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే కుటిల రాజకీయాలను కవి అసహ్యించుకుంటున్నారు. అధికారం కోసం సమాజాన్ని విడదీయడం కాదు, లోక హితం కోసం అందరినీ కలపడమే నిజమైన నాయకత్వ లక్షణమని కవి హెచ్చరిస్తున్నారు.

కులము మతభేదములపేర కుటిలమెపుడు

నెంచవలదయ్య ప్రజలలోనెవ్వరైన

లోకహితమునుకోరాలిప్రాకటముగ

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 80)

కులమతాల పేరుతో చేసే రాజకీయం కుటిలమైనది. అది సమాజానికి ఎప్పటికీ చేటు చేస్తుంది. ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా స్వార్థం విడనాడి, లోక కల్యాణాన్ని కాంక్షించాలని కవి ప్రబోధిస్తున్నారు. అంబేడ్కర్ గారు చెప్పినట్లుగా సామాజిక ఐక్యత లేనిదే రాజకీయ స్వాతంత్ర్యానికి అర్థం లేదని కవి ఈ పద్యం ద్వారా గుర్తుచేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలందరినీ సమానంగా చూడాలి. కానీ పక్షపాత ధోరణి, వివక్ష రాజ్యమేలుతున్న రోజులివి. రాజ్యాంగం ప్రసాదించిన ‘సమానత్వపు హక్కు’ (Right to Equality) పాలకుల ఆచరణలో కనిపించాలని, అప్పుడే అది రామరాజ్యం అవుతుందని కవి పాలకులకు హితవు పలుకుతున్నారు.

తారతమ్యముచూపకపౌరజనుల

నేలు చున్నను యేలికల్ మేలు కలిగి

సరిగసమరతభావన సంతరించు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 78)

పాలకులు ప్రజల మధ్య తారతమ్యాలు (తేడాలు) చూపకుండా, అందరినీ తమ బిడ్డల్లాగా సమానంగా చూసుకోవాలి. అప్పుడే ఆ పాలన సార్థకమవుతుంది. “సమరత భావన” అంటే అందరినీ సమానంగా ఆదరించే గుణం. ఇదే నిజమైన సామాజిక న్యాయం (Social Justice) అని దార్ల వారు చాటి చెబుతున్నారు. పాలకుల బాధ్యతను గుర్తుచేసే రాజనీతి పద్యం ఇది.

4. కుటుంబ బంధాలు - మానవ సంబంధాల మాధుర్యం:

నేడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. పిల్లలు ఉద్యోగాల పేరుతో విదేశాలకు ఎగిరి పోతుంటే, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు అనాథల్లా మిగిలిపోతున్నారు. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయంటే మనలోని మానవత్వం చచ్చిపోతోందని అర్థం. నవమాసాలు మోసి, సాకిన తల్లిదండ్రులను భారంగా భావించే ప్రబుద్ధులకు కవి కన్నీటితో రాసిన లేఖ ఈ పద్యం.

సరిగ నవమాసములుమోసి మురిపమంది

పేగు బంధాన్ని తృప్తిగా పెంపుజేసె

తల్లి తండ్రిని వీడుట తగదు తగదు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 12)

“వీడుట తగదు తగదు” అని కవి రెండు సార్లు నొక్కి చెప్పడంలో ఆయన ఆవేదన అర్థమవుతుంది. పేగు బంధం తెంచుకుని పుట్టిన మనం, ఆ బంధాన్ని చివరిదాకా నిలుపుకోవాలి. తల్లిదండ్రుల సేవలోనే నిజమైన పుణ్యం ఉందని, వారిని వదిలేయడం క్షమించరాని నేరమని కవి ఘోషిస్తున్నారు. కుటుంబ విలువలను కాపాడటంలో ఈ పద్యం ఒక మైలురాయి.

కుటుంబంలో తండ్రి పాత్ర తరచుగా మరుగున పడిపోతుంది. కానీ తన రక్త మాంసాలను కరిగించి, పిల్లల భవిష్యత్తు కోసం నిచ్చెనగా మారే త్యాగశీలి తండ్రి. ఆ తండ్రి పట్ల కొడుకులకు ఉండాల్సిన గౌరవాన్ని, కృతజ్ఞతా భావాన్ని కవి ఈ పద్యంలో ఎంతో గొప్పగా చిత్రించారు. తండ్రి అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

తండ్రి వలె నన్ను సాకిన త్యాగ శీలి

అండ దండగా నిలిచెమా యన్న చూపె

యడుగుజాడలన్ విడువక నడచుకొనెద

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 14)

తండ్రి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. కుటుంబ భారాన్ని మోసే ఆ త్యాగశీలిని విస్మరించకూడదు. అలాగే అన్నదమ్ములు తండ్రిలాగే అండదండగా నిలవాలని, పెద్దల బాటలో నడవడమే సంస్కారమని కవి వివరిస్తున్నారు. తండ్రి గొప్పతనాన్ని, సోదర బాధ్యతను ఇంత అద్భుతంగా చెప్పడం దార్ల వారికే చెల్లింది.

ఆస్తి తగాదాలతో సొంత అన్నదమ్ములే కోర్టుల మెట్లు ఎక్కుతున్న దౌర్భాగ్యపు రోజులివి. చిన్న చిన్న కారణాలకు విడిపోతూ, శత్రువులకు చులకన అవుతున్నారు. “ఐకమత్యమే మహాబలం” అనే సూత్రాన్ని మరిచిపోతున్న సోదరులకు, కలిసి ఉంటే కలిగే బలాన్ని, విడిపోతే వచ్చే నష్టాన్ని కవి ఈ పద్యం ద్వారా గుర్తుచేస్తున్నారు.

కష్ట కాలాన తోడుగా కలిసి మెలిసి

మెలగు చున్నను తప్పక మేలుకలుగు

అన్నదమ్ముల బంధమ్ము హాయి కూర్చు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 15)

కష్టకాలంలో మనకు నిజమైన అండ తోబుట్టువులే తప్ప బయటివారు కాదు. అన్నదమ్ములు కలిసి ఉంటే ఆ కుటుంబం ఎంతో బలంగా ఉంటుంది. ఆ అనుబంధం ఇచ్చే మానసిక ధైర్యం (Moral Support) వెలకట్టలేనిది. విడిపోవడం బలహీనత అయితే, కలిసి ఉండటం గెలుపుకు సంకేతం అని కవి ఈ పద్యంలో ఉద్ఘాటిస్తున్నారు.

5. విద్యా వైశిష్ట్యం - గురు దేవుల ప్రాధాన్యత:

టెక్నాలజీ యుగంలో సమాచారం కోసం గూగుల్ ను ఆశ్రయిస్తున్నాం, కానీ సంస్కారం కోసం గురువును వెతకడం మానేశాం. కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే చదువు అనే అపోహలో ఉన్న నేటి తరానికి... అసలైన విద్య అంటే ఏమిటి? గురువు స్థానం ఎంత గొప్పది? అనే విషయాలను కవి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.

గురువు నేర్పిన విద్యను మరువకెపుడు

జ్ఞాన దీపము వెలిగించు నవనియందు

నిత్యవిద్యార్జన పరుడు నిశ్చయముగ

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 24)

గురువు వెలిగించేది అక్షరాలనే దీపాన్ని మాత్రమే కాదు, జీవితం అనే జ్ఞాన దీపాన్ని. గురువు నేర్పిన విద్యను మరువని వాడు, నిత్యం కొత్త విషయాలను నేర్చుకునే వాడు (నిత్య విద్యార్థి) మాత్రమే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. గురు భక్తి లేని విద్య నిష్ప్రయోజనం అని వేమన స్ఫూర్తితో దార్ల వారు చెబుతున్నారు.

బడికి వెళ్లడం అంటే బరువు బాధ్యతగా భావించే పిల్లలు కొందరైతే, పుస్తకం పట్టడమే నామోషీగా భావించే వారు మరికొందరు. కానీ పాఠశాలలే బ్రతుకు బాటను చూపే దేవాలయాలని, పుస్తకాలే మెదడుకు పదును పెట్టే ఆయుధాలని కవి వివరిస్తున్నారు. వినయం లేని విద్య సువాసన లేని పువ్వు లాంటిదని కవి హెచ్చరిస్తున్నారు.

పాఠశాలలు చూపించు బ్రతుకు బాట

మస్తకమును పెం పొందించు పుస్తకములు

వినయ విధేయతలునున్న విజ్ఞు డతడు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 25)

చదువు మనిషికి కేవలం ఉద్యోగాన్ని ఇవ్వడమే కాదు, బ్రతుకు తెరువును, జీవన మార్గాన్ని చూపిస్తుంది. పుస్తకాలు చదవడం వల్ల మస్తకం (మెదడు) వికసిస్తుంది. అయితే ఎంత జ్ఞానం సంపాదించినా, వినయ విధేయతలు లేకపోతే ఆ వ్యక్తి విజ్ఞుడు కాలేడు. “విద్యా దదాతి వినయం” అనే ఆర్యోక్తిని కవి ఈ పద్యంలో సమర్థించారు.

డబ్బుంటే ఏదైనా కొనవచ్చు అనుకుంటారు, కానీ విజ్ఞానాన్ని కొనలేరు. కోట్లు సంపాదించినా, చదువు అనే ఆస్తి లేకపోతే సమాజంలో గౌరవం ఉండదు. అక్షరాభ్యాసం అనేది మనిషికి రెండవ జన్మ లాంటిది. అక్షరం గొప్పతనాన్ని, చదువు విలువను ధనంతో పోల్చి చూపిస్తూ కవి రాసిన అద్భుతమైన పద్యం ఇది.

అక్షరాభ్యాసమందించునమృతమునిల

శాశ్వతమ్ముగ జీవిక సఫల మగును

అర్థమెంతేని కూర్చిన వ్యర్థ మగును

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 86)

అక్షరం అమృతం లాంటిది, అది మనిషిని చిరంజీవిని చేస్తుంది. భౌతిక సంపద (అర్థం) ఎప్పటికైనా ఖర్చయిపోతుంది లేదా దొంగల పాలవుతుంది. కానీ విద్యా సంపదను ఎవరూ దొంగిలించలేరు, అది పంచేకొద్దీ పెరుగుతుంది. డబ్బు సంపాదన కంటే జ్ఞాన సంపాదన మిన్న అని కవి ఎంతో స్పష్టంగా తెలియజేశారు.

6. మాతృభాషాభిమానం - అమ్మ భాష అమృతం:

గ్లోబలైజేషన్ మోజులో పడి మమ్మీ డాడీ సంస్కృతికి అలవాటు పడ్డాం. అమ్మ అని పిలవడంలో ఉన్న కమ్మదనాన్ని, మాతృభాషలో మాట్లాడటంలో ఉన్న ఆత్మీయతను మర్చిపోతున్నాం. పరభాషను నేర్చుకోవడం తప్పు కాదు, కానీ కన్నతల్లి లాంటి మాతృభాషను చంపేసుకోవడం నేరం అని కవి ఆవేదన చెందుతున్నారు.

మాతృభాష యే నిరతము మమత పంచు

అమృత తుల్యమై నిక్కమ్ము నాదరించు

అమ్మ యనుమాట చెవులకు కమ్మ నగును

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 88)

“అమ్మ” అనే పిలుపులో ఉన్న మాధుర్యం ప్రపంచంలో మరే భాషలోనూ దొరకదు. మాతృభాష మన భావాలకు ప్రాణం పోస్తుంది, మనసులోని మమతను పంచుతుంది. అది అమృతంతో సమానమైనది. మాతృభాషను ఆదరించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే అని కవి ఎంతో ఆర్ద్రతతో పలికారు.

నేపథ్యం: భాష అనేది కేవలం భావప్రకటన సాధనం మాత్రమే కాదు, అది ఒక జాతి అస్తిత్వం (Identity). భాష నశిస్తే ఆ జాతి సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతాయి. మన భాషను మనమే కాపాడుకోకపోతే, భవిష్యత్ తరాలకు మన చరిత్రే తెలియకుండా పోతుంది. మాతృభాష జాతి గౌరవానికి చిహ్నం అని కవి గళమెత్తి చాటుతున్నారు.

అమ్మ భాషయమృత మయ్యి యవనియందు

నమర పదమున నిలుపు తా నాదరమున

జాతి గౌరవ చిహ్నమై జయము కలుగు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 101)

మన భాషను మనం అమరపదంలో (ఉన్నత స్థానంలో) నిలుపుకోవాలి. మాతృభాష అభివృద్ధి చెందితేనే ఆ జాతికి జయం కలుగుతుంది. పరాయి భాషల మోజులో పడి సొంత భాషను నిర్లక్ష్యం చేస్తే, జాతి గౌరవం మసకబారుతుందని దార్ల వారు హెచ్చరిస్తున్నారు. భాషాభిమానం ప్రతి పౌరుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం.

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ (Trolling), బూతులు మాట్లాడటం ఈ రోజుల్లో ఫ్యాషన్ గా మారింది. కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం. మనిషి సంస్కారం అతని మాటతీరులోనే బయటపడుతుంది. మృదువుగా మాట్లాడేవాడికి శత్రువులు ఉండరని, మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందని కవి యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు.

నోరు మంచిది యైనచో నూరియందు

శాంతిసౌఖ్యమ్ములనుపొంది సాగుచుండు

సరిగ మమతాను రాగాలు సంతరించు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 107)

మన మాట తీరే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కఠినంగా మాట్లాడి శత్రువులను పెంచుకోవడం కంటే, ప్రేమగా మాట్లాడి అందరినీ ఆత్మీయులుగా చేసుకోవడం మిన్న. వాక్శుద్ధి, మృదుభాషణం వల్ల సమాజంలో శాంతి సౌఖ్యాలు వర్ధిల్లుతాయని, అదే నిజమైన నాగరికత అని కవి గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు.

7. నైతిక విలువలు - సత్యనిష్ఠ, వాక్శుద్ధి: 

ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారు నేడు కరువయ్యారు. వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కడం పరిపాటిగా మారింది. కానీ పూర్వీకులు మాటకు ప్రాణం ఇచ్చేవారు. ఒక మనిషికి, లేదా ఒక వంశానికి నిజమైన గౌరవం ఆస్తిపాస్తుల వల్ల రాదు, సత్యం మాట్లాడటం వల్లే వస్తుందని కవి నొక్కివక్కాణిస్తున్నారు.

వంశ గౌరవ మన్నది వాక్కు తోడ

సత్యమెప్పుడు వీడక సాగవలెను

మాట తప్పని వానికి మన్ననబ్బు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 11)

“మాట తప్పని వాడు” అనే బిరుదు సంపాదించడం అంత సులభం కాదు. హరిశ్చంద్రుడు వంటి సత్యవాదులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని విడవకూడదని, మాట మీద నిలబడేవారికే సమాజంలో శాశ్వతమైన మన్నన (గౌరవం) దక్కుతుందని కవి స్పష్టం చేస్తున్నారు.

అబద్ధాలతో, అక్రమ మార్గాల్లో గెలిచే వాడిని చూసి మనం నిరాశపడకూడదు. ధర్మం ఎప్పుడూ ఆలస్యంగానే గెలుస్తుంది, కానీ కచ్చితంగా గెలుస్తుంది. న్యాయమార్గంలో నడిచేవాడే నిజమైన సజ్జనుడు. తాత్కాలిక విజయాల కోసం అడ్డదారులు తొక్కకూడదని కవి నేటి యువతకు ప్రబోధిస్తున్నారు.

సత్య వాక్కును మరువడు సజ్జనుండు

న్యాయమార్గమేజీవిత ధ్యేయమగును

ధర్మమేగెల్చినిలబడుధరణియందు

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 23)

సత్యం మాట్లాడేవాడు సజ్జనుడు. న్యాయమే అతని జీవిత ధ్యేయం కావాలి. “ధర్మమే జయిస్తుంది” (సత్యమేవ జయతే) అనేది భారతీయ సంస్కృతి నేర్పిన పాఠం. ఎన్ని ప్రలోభాలు వచ్చినా ధర్మపక్షాన నిలబడటమే దార్ల మాట సారాంశం.

మోసంతో బ్రతకడం ఒక తెలివితేటలుగా భావిస్తున్న రోజులివి. అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మించవచ్చు అనుకుంటారు కానీ, అది ఎంతో కాలం దాగదు. పునాది లేని ఇల్లు ఎలా కూలిపోతుందో, అబద్ధం మీద కట్టిన బ్రతుకు కూడా అలాగే కుప్పకూలుతుందని కవి హెచ్చరిస్తున్నారు.

బ్రతికియున్నంతకాలమబద్దమాడి

యేమిసాధించలేవునీవెచటనైన

నిజమువెలుగొందుచుండును నిక్కమిదియె

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 91)

అబద్ధానికి ఆయుష్షు చాలా తక్కువ. జీవితాంతం అబద్ధాలు ఆడుతూ బ్రతికినా చివరకు సాధించేది శూన్యం. చీకటిని చీల్చుకుని సూర్యుడు ఎలా వస్తాడో, అబద్ధాలను ఛేదించుకుని నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. సత్యానికి ఉన్న శక్తిని నమ్మి బ్రతకడమే ఉత్తమ మార్గమని కవి ఘంటాపథంగా చెబుతున్నారు.

8. సామాజిక బాధ్యత - దానగుణం, పరోపకారం:

బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోవడమే జీవిత ధ్యేయంగా బ్రతుకుతున్న లోభులు మన మధ్య ఎందరో ఉన్నారు. పక్కవాడు ఆకలితో అలమటిస్తుంటే కనీసం జాలిపడని రాతి గుండెలు తయారయ్యాయి. ప్రకృతిలో నదులు, చెట్లు పరోపకారం చేస్తుంటే, మనిషి మాత్రం స్వార్థంతో బ్రతుకుతున్నాడని కవి ఈసడిస్తున్నారు.

దానగుణశీలురేనాడుదాచుకొనరు

పంచిపెట్టరే నిరుపేదప్రజలకెపుడు

ఇవ్వబూనున లోభివాడెప్పుడైన

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 66)

సంపదకు సార్థకత దానంలోనే ఉంది. దాచుకుంటే అది పెరగదు, పంచుకుంటే తరిగిపోదు. దానగుణశీలురు తమ దగ్గర ఉన్నది నలుగురికీ పంచడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. కానీ లోభికి ఇవ్వాలనే ఆలోచనే రాదు. సమాజం మనకు ఎంతో ఇచ్చింది, మనం తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి అనే సామాజిక బాధ్యతను కవి గుర్తుచేస్తున్నారు.

మన చుట్టూ వందల మంది స్నేహితులు ఉండవచ్చు, సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లు ఉండవచ్చు. కానీ ఆపద వచ్చినప్పుడు ఒక్కడు కూడా పక్కన ఉండడు. సుఖంలో ఉన్నప్పుడు వచ్చేవాడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన స్నేహితుడని కవి మిత్రధర్మాన్ని నిర్వచించారు.

ఆపదెదురైన వెంటనే యాదు కొనెడి

మిత్రవర్యలన్ హృదినిల్పిమెలగవలయు

అంతరంగాననెలకొల్పెడద్దముగను

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 22)

ఆపదలో ఆదుకునే మిత్రుడు దేవుడితో సమానం. అలాంటి వారిని గుండెల్లో (హృదిలో) పెట్టుకుని పూజించాలి. అద్దం మన రూపాన్ని ఎలా నిజాయితీగా చూపిస్తుందో, నిజమైన మిత్రుడు కూడా మన తప్పుఒప్పులను అలాగే చెప్పి సరిదిద్దుతాడు. అలాంటి సన్మిత్రులను సంపాదించుకోవడమే నిజమైన ఆస్తి.

“పరోపకారార్థం ఇదం శరీరం” అంటారు పెద్దలు. తన కోసం తాను బ్రతికేవాడు స్వార్థపరుడు, ఇతరుల కోసం బ్రతికేవాడే త్యాగధనుడు. సమాజంలో అట్టడుగు వర్గాలను, దీనులను ఆదరించడమే మానవ జన్మకు పరమార్థం అని, సేవాభావమే మనిషిని మహనీయుడిని చేస్తుందని కవి ఈ పద్యంతో ముగించారు.

దీన జనులను దరిచేర్చి తృప్తి కూర్చు

పర హితమ్మును కోరిన ప్రాకటముగ

త్యాగ శీలమ్మునీదని తలచుదురయ

దారి చూపించు నట్టిది దార్ల మాట (పద్యం: 100)

ఏ దిక్కూ లేని దీనులను చేరదీసి ఆదరించడంలోనే నిజమైన తృప్తి ఉంది. పరుల హితాన్ని కోరేవాడే ప్రాజ్ఞుడు. త్యాగంలో ఉన్న ఆనందం భోగంలో ఉండదు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి, తోటి మనిషికి సాయపడటమే దార్ల మాట సారాంశం. ఈ సేవా గుణమే రేపటి సమాజానికి దారి చూపిస్తుందని కవి ఆకాంక్ష.

ముగింపు:

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి “దార్ల మాట తేటగీతి శతకం” కేవలం ఒక అక్షరాల కూర్పు కాదు, ఇదొక సమకాలీన సామాజిక దార్శనికతకు గీటురాయి. ఈ అద్భుతమైన గ్రంథానికి నాలుగు మాటలు రాసే అదృష్టం నాకు దక్కినప్పటికీ, నాకున్న పరిమితమైన సాహిత్య పరిజ్ఞానం మేరకు ఇందులో ఉన్న కొన్ని పద్యాలను మాత్రమే నేను విశ్లేషించగలిగాను.

నిజం చెప్పాలంటే, ఈ శతకంలోని ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆణిముత్యం. ఏ ఒక్క పద్యాన్నీ వదిలి వేయాలని నాకు అనిపించలేదు. నా విశ్లేషణలో ఎన్నో అద్భుతమైన పద్యాలను వదిలివేయాల్సి రావడం నా మనసుకు ఎంతో బాధను కలిగించింది. సత్కవిత్వానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే- ఒక పద్యాన్ని వంద మంది చదివితే, వారి వారి అనుభవాలను బట్టి వంద రకాల తాత్విక కోణాలు ఆవిష్కృతమవుతాయి. ఈ శతకంలోని ఒక్క పద్యమే వంద మందికి వంద రకాల జీవిత సత్యాలను బోధిస్తుంది. అంతటి గొప్ప మానవీయ, సామాజిక తాత్వికత ఈ పద్యాల్లో నిక్షిప్తమై ఉంది.

ఒక మనిషికి ఎంత ఆకలి వేసినా, అతని ముందు పంచభక్ష్య పరమాన్నాలు ఎన్ని ఉన్నా, కడుపు నిండగానే అతడు ఆగిపోతాడు. అంతమాత్రాన అక్కడ వడ్డించి ఉన్న రుచికరమైన పదార్థాల విలువ, రుచి ఏమాత్రం తగ్గిపోదు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా, ఆ పదార్థాలు వారి ఆకలిని తీరుస్తూనే ఉంటాయి. ఈ “దార్ల మాట తేటగీతి శతకం” కూడా సరిగ్గా అలాంటి అమృత భాండమే! నాకున్న పరిధి మేరకు కొన్ని పద్యాలను మాత్రమే విశ్లేషించి నా సాహిత్యపు ఆకలిని నేను తీర్చుకున్నాను. కానీ, ఈ గ్రంథంలో నేను స్పృశించని పద్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ పదే పదే చదివే కొద్దీ పాఠకుల సాహిత్య దాహాన్ని, జ్ఞాన పిపాసను ఎప్పటికీ తీరుస్తూనే ఉంటాయి.

నేను చేసిన ఈ విశ్లేషణ కేవలం ఒక ఆరంభం, ఒక చిన్న పరిచయం మాత్రమే. ఇక ఈ పద్యాలను చదివి, ఆస్వాదించి, వాటిలోని లోతైన తాత్వికతను అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత, భాగ్యం ఇకపై పాఠకులైన మీ అందరిదే! ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న రుగ్మతలకు కవి తన పద్యాల ద్వారా అద్భుతమైన చికిత్సను అందించారు. ఈ శతకం వేమన లోకజ్ఞానాన్ని, అంబేడ్కర్ సామాజిక న్యాయాన్ని, బౌద్ధంలోని శాంతిని పుణికిపుచ్చుకుని యువతకు ఒక కరదీపికలా దారి చూపిస్తోంది.

నా దార్లన్న కలం నుండి జాలువారిన ఈ ‘దార్ల మాట తేటగీతి శతకం’ తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మున్ముందు ఆయన కలం నుండి ఇలాంటి ఆణిముత్యాలు మరెన్నో పుట్టుకురావాలని, సామాజిక చైతన్యానికి అక్షర జ్యోతులు వెలిగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.



కామెంట్‌లు లేవు: