"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

30 మార్చి, 2026

మట్టల పండుగ పుణ్య కీర్తనలు


మట్టల పండుగ పుణ్య కీర్తనలు



  పురమున యెరూషలేములొ

   కరుణామయుడేగు దెంచె గాడిద పైనన్

   విరిసెను భక్తియు నిచటను

   ధరలో గమనించ వయ్య ధన్యత దార్లా!

    (భావం: ఓ దార్లా! కరుణామయుడైన యేసుప్రభువు యెరూషలేము నగరంలోకి గాడిదపై విచ్చేశారు. ఆ సమయంలో అక్కడ భక్తి వెల్లివిరిసింది, ఈ లోకంలో ఆ ధన్యతను గమనించు.)

   మట్టల చేతను బట్టియు

   గట్టిగ జయమును పలుకగ గావించిరిగా

   చుట్టూ జేరిరి ప్రజలును

   దిట్టవు నీవెరుగు మిచట ధీమణి దార్లా!

  (భావం: ప్రజలంతా చేతుల్లో మట్టలు పట్టుకొని, ప్రభువుకు జయజయధ్వానాలు చేశారు. గుంపులుగా చేరిన ఆ ప్రజల ఉత్సాహాన్ని, ఆ గొప్పతనాన్ని ఓ బుద్ధిమంతుడా గ్రహించు.)

   పత్రము లెన్నో పరచిరి

   ధాత్రిని రక్షించు విభుడు దారిని పొడవున్

   స్తోత్రము లర్పించి రపుడు

   పాత్రత నొందెడియుభక్త ప్రవరుడ దార్లా!

    (భావం: లోకరక్షకుడు నడిచే దారి పొడవునా భక్తులు ఆకులను, బట్టలను పరిచారు. ఎంతో భక్తితో స్తోత్రాలు చేశారు. ఓ భక్తాగ్రేసరా! ఆ యోగ్యతను నువ్వు కూడా పొందు.)

   మట్టల చేతను బట్టిరి

   గట్టిగ హోసన్న యంచు గానము జేయన్

   పుట్టుక ధన్యము గదరా

   నెట్టన జూడగను రమ్ము నిశ్చల దార్లా!

    (భావం: భక్తులు మట్టలు పట్టుకొని "హోసన్న" అని గొంతెత్తి గానం చేశారు. ఆ దృశ్యాన్ని చూస్తే జన్మ ధన్యమవుతుంది. నిశ్చల మనస్కుడా! ఆ వేడుకను చూడడానికి రా.)

   నమ్మిన భక్తుల కోవెల

   సమ్మతి గాడిదను నెక్కి సాగెను ప్రభువున్

   కమ్మని పాటల తోడను

   రమ్మిక దీవెనలు గొనగ రమ్యము దార్లా!

    (భావం: భక్తుల హృదయాలనే ఆలయాలుగా చేసుకున్న ప్రభువు, గాడిదపై సాగిపోతుంటే అందరూ కమ్మని పాటలు పాడారు. ఓ దార్లా! ఆ దీవెనలు అందుకోవడానికి రా.)

   బలియగు ముందుర జయముగ

   కొలువున గాడిదను నెక్కి కోరిన పురికిన్

   నిలువున భక్తిని జూపిరి

   పిలువగ సాగిరి జనంబు ప్రీతిగ దార్లా!

    (భావం: తన ప్రాణత్యాగానికి ముందుగా ప్రభువు యెరూషలేము పురంలోకి ప్రవేశించారు. జనం ఎంతో ప్రీతితో ఆయనను ఆహ్వానిస్తూ తమ భక్తిని చాటుకున్నారు.)

   కన్నుల విందుగ ప్రభువులు

   మున్నెన్నడు లేని రీతి ముదమును బెంచెన్

   తిన్నగ గాడిద నెక్కిన

   వెన్నెల దేవునిని జూడు వేడుక దార్లా!

    (భావం: మునుపెన్నడూ లేని విధంగా కనువిందు చేస్తూ ప్రభువు సంతోషాన్ని పంచారు. గాడిదపై వస్తున్న ఆ వెన్నెల వంటి దేవుని సౌందర్యాన్ని తిలకించు.)

   

  పరమపు దైవము రాగను

   ధరనున హోసన్న యంచు ధ్వనులను జేయన్

   సిరిమురి పెమ్ములు కురిసెను

   వరుసగ దీవెన లొసగగ వందన దార్లా!

   (భావం: పరమదైవం వస్తుండగా భూమిపై హోసన్న నాదాలు మిన్నంటాయి. ఆ శుభ సమయంలో భక్తులపై దీవెనలు కురిశాయి.)

   

   కొమ్మల మట్టల బట్టిరి

   నమ్మిన భక్తులును గూడి నయముగ నపుడున్

   సమ్మతి గాడిద నెక్కిన

   రమ్మిక రక్షకుడు జూడ రంజిత దార్లా!

    (భావం: భక్తులందరూ కలిసి కొమ్మలను, మట్టలను పట్టుకొని వచ్చారు. గాడిదపై వస్తున్న రక్షకుడిని చూడడానికి రా.)

    వచ్చెను లోకపు రక్షకు

   డిచ్చిన హోసన్న యంచు డిండిమ మొనరన్

   మెచ్చెను ప్రజలంద రపుడు

   నొచ్చిన మనసులను కడగ నోరిమి దార్లా!

    (భావం: లోకరక్షకుడు వస్తుంటే హోసన్న జయజయధ్వానాలు మారుమోగాయి. బాధల్లో ఉన్న మనసులను ఓదార్చడానికి వచ్చిన ప్రభువును అందరూ కొనియాడారు.)

   

  కొమ్మల పండుగ యందున

   నమ్మకమంతయును జూపి నడవగ వలయున్

   ప్రేమను పంచెడి మార్గము

   క్షేమమునీకును నొసంగు శీలవ దార్లా!

  (భావం: ఈ మట్టల పండుగ రోజున పూర్తి నమ్మకంతో దైవమార్గంలో నడవాలి. ఆ ప్రేమ మార్గమే నీకు క్షేమాన్ని ఇస్తుంది.)

    గుర్రము నెక్కగ లేదుగ

   మర్రగు గాడిదను నెక్కి మహిమను జూపెన్

   తర్రిరి భక్తులు వేగమె

   కుర్రిన దీవెనలు గొనగ కోరిన దార్లా!

    (భావం: గర్వానికి చిహ్నమైన గుర్రాన్ని కాక, వినయానికి చిహ్నమైన గాడిదను ఎక్కి ఆయన తన మహిమను చూపారు. ఆ దీవెనల కోసం భక్తులు వేగంగా తరలివచ్చారు.)

    ఖర్జూరపు మట్టలతో

   మర్జనమును జేసి రపుడు మార్గము నందున్

   దుర్జన శిక్షకుడు గదర

   సజ్జన రక్షకుడు వీడె చక్కని దార్లా!

    (భావం: మార్గమంతా ఖర్జూరపు మట్టలతో అలంకరించారు. దుష్టులను శిక్షించేవాడు, సజ్జనులను రక్షించేవాడు అయిన ఆ దేవుడే ఇతడు.)

   - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 29.3.2026


కామెంట్‌లు లేవు: