గురజాడ వారి ప్రకాశిక త్రైమాస పత్రిక – నా అనుభవాలు
అందరికీ నమస్కారం.
ముందుగా అంతర్జాతీయ గురజాడ ఫౌండేషన్ వారికి, అలాగే భారతదేశంలోని భారతీయ గురజాడ ఫౌండేషన్ నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ రోజు (1.12.2025 ) మనం ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికుడు గురజాడ అప్పారావు గారి 110వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడానికి, స్మృత్యాంజలి ఘటించడానికి ఈ అంతర్జాల వేదికపై సమావేశమయ్యాం. అయితే, నా దృష్టిలో ఈ సమావేశం గురజాడను కేవలం గుర్తు చేసుకోవడానికే పరిమితం కాకూడదు; ఆయన ఆలోచనలను, ఆయన సమాజానికి చూపిన మార్గాన్ని వర్తమాన సందర్భంలో నిలబెట్టి పునర్మూల్యాంకనం చేసుకోవలసిన సందర్భమనుకుంటున్నాను. ముఖ్యంగా గురజాడ సాహిత్యాన్ని, ఆలోచనలను ప్రపంచవ్యాప్తం చేయడంలో విశేషమైన కృషి చేసిన గురజాడ అప్పారావు గారి మనుమరాలు గురజాడ అరుణమ్మ గారిని మనం మొదటగా గుర్తుచేసుకోవాలి. ఆమె కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిల్లో చేసిన కృషి అసాధారణమైనది. గురజాడ వారి మనవరాలుగా సాహిత్య రంగంలోకి వచ్చి కార్యక్రమాలు చేపట్టేసరికి సాహిత్య లోకంలో ఎక్కడలేని ఏకాగ్రత, సరికొత్త ఉత్సాహం ఏర్పడ్డాయి. ఆమెతో మాట్లాడాలన్నా, సదస్సులు నిర్వహించాలన్నా పండితులు, పరిశోధకులు ఎంతో ఆసక్తితో ముందుకొచ్చారు. ఆ కృషి చేసినందుకు అరుణమ్మగారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈనాటి సభాధ్యక్షులు డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ గారు అమెరికాలో క్యాన్సర్ ఔషధ రూపకల్పనలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తూనే, అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా, అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ నడిపిన విస్తృతమైన అనుభవం ఉన్నవారు. ఆ శాస్త్రీయ దృక్పథంతోనే గురజాడ అప్పారావు గారు స్థాపించిన ‘ప్రకాశిక’ పత్రికను తెలుగువారికి అందిస్తున్నారు. నాకు ఇప్పటికీ గుర్తుంది — నన్ను ఈ పత్రిక సంపాదక మండలిలో భాగస్వామ్యం చేస్తున్నామని ఆయన ఒక లేఖ రాసినప్పుడు, నేను ఎంతో సంతోషంగా ఆయనకు బదులిస్తూ ఒక మాట అన్నాను.“నాకు ఒక జ్ఞానపీఠ పురస్కారం రావడం కంటే, సాహిత్య అకాడమీ పురస్కారం రావడం కంటే... ఆధునిక తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన గురజాడ వారి పేరిట వెలువడే ‘ప్రకాశిక’ సంపాదక మండలిలో ఉండడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.” అని! నేను ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నాను. ఆయన నమ్మకంతో నన్ను కార్యనిర్వాహక సంపాదకులుగా పెట్టినందుకు కృతజ్ఞతలతో కూడిన నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ అంతర్జాల వేదికపై ఉన్న ఈ కార్యక్రమానికి స్వాగతం పలికిన గురజాడ ఫౌండేషన్ (అమెరికా) అధ్యక్షులు శ్రీమతి గురజాడ అరుణమ్మగారికీ,, ఈ సమావేశంలో ప్రత్యేక అతిథి గా పాల్గొన్న సహృదయ సాహితి, అధ్యక్షులు, శ్రీ శేఖరమంత్రి ప్రభాకరరావు గారికీ గురజాడ ఫౌండేషన్ (ఇండియా) అధ్యక్షులు గురజాడ రవీంద్రుడు గారికీ, గురుతుల్యులు ఆచార్య వెలమల సిమ్మన్న, గురువులు ఆచార్య అయినవోలు ఉషాదేవి గారికి, మిత్రులు డాక్టర్ షమీవుల్లా గారికి, గురజాడ పై పరిశోధన చేసిన డా చెంగల్వ రామలక్ష్మి గారికి, గురజాడ వారి బంధువులు గురజాడ రవీంద్రుడు గారికి, ప్రజాసాహితి మాసపత్రిక సంపాదకులు డా.కొత్తపల్లి రవిబాబు గారికి, ‘ప్రకాశిక’ పత్రికసంపాదక వర్గ మిత్రులందరికీ, ఈ సభలో పాల్గొన్న సహృదయ సాహితీవేత్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈ సందర్భంగా ఆచార్య గోపాలకృష్ణ కొవ్వలి, ఆచార్య అయినవోలు ఉషాదేవి సంపాదకత్వంలో వచ్చిన ‘గురజాడ సాహిత్యంలో భాషా విశేషాలు’ గ్రంథాన్ని ప్రముఖ కవి, విమర్శకులు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎస్.షమీఉల్లా, ‘మనస్వినీయం’ (ఆచార్య గోపాలకృష్ణ కొవ్వలి వారి వచన కవితాసంపుటి)ని ప్రముఖ కవయిత్రి, విమర్శకులు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.చెంగల్వ రామలక్ష్మి సమీక్షించారు. ఇలాంటి గొప్ప సభలో ఈ రోజు నా చేతుల మీదుగా ‘ప్రకాశిక’ ఐదవ సంచిక ఆవిష్కరణ జరుగడం నాకెంతో సంతోషంగాను, గర్వంగానూ ఉంది. సాంకేతికంగా మొబైల్ తెరపైనా, బ్యాక్‌గ్రౌండ్‌లోనూ పత్రికను చూపిస్తూ ఆవిష్కరించాను. కానీ పత్రికను స్క్రీన్‌పై చూపించడం కేవలం బాహ్యమైన లాంఛనం మాత్రమేనని నా అభిప్రాయం. పత్రిక అంతరంగాన్ని, దాని వెనుక ఉన్న తాత్వికతను ఆవిష్కరించడమే నిజమైన హృదయావిష్కరణగా భావిస్తున్నాను.
ఈ ఐదవ సంచిక ఎందుకు ప్రత్యేకమైనదో, గురజాడ ఫౌండేషన్ సహృదయత ఎంత గొప్పదో ఒక్క ఉదాహరణ చెబితే స్పష్టమవుతుంది. ఈ సంచికలో అందెశ్రీకి నీరాజనాలు అర్పిస్తూ గురజాడ అప్పారావు, అందెశ్రీలు ఇద్దరూ మానవత్వం, మనిషి తత్త్వం గురించి చర్చించుకుంటున్నట్లు కృత్రిమ మేధ సహాయంతో చిత్రీకరించిన ఓ చిత్రాన్ని ముఖచిత్రంగా ప్రచురించారు. ఇందులో తెలంగాణాలో పుట్టి పెరిగిన ప్రజాకవి అందెశ్రీ గారి జీవితం, సాహిత్యంపై ఏకంగా 23 పేజీల సుదీర్ఘమైన, సమగ్రమైన విశ్లేషణాత్మక ఒక వ్యాసాన్ని ప్రచురించాం. ఆ వ్యాసం జాగ్రత్తగా చదివితే ప్రతి అక్షరంలో తెలంగాణ సాంస్కృతిక చైతన్యం తొణికిసలాడుతుంది. అక్షరజ్ఞానం లేని, తల్లిదండ్రులెవరో కూడా నిర్దిష్టంగా తెలియని అట్టడుగు సామాజిక నేపథ్యం నుంచి వచ్చి, తన వాగ్ధాటితో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన ఒక ప్రజాకవికి ఇంతటి ప్రాధాన్యతనిచ్చి వ్యాసం ప్రచురించడమంటే... అది గురజాడ వారు మట్టి మనుషులకు ఇచ్చిన గౌరవంగా, పేద ప్రజల పక్షాన నిలబడిన మానవత్వపు విజయపతాకగా నేను భావిస్తున్నాను. అందెశ్రీ గారు మరణించిన వెంటనే ఇయనపై ఒక వ్యాసం వేయాలని, ఎవరైనా బాగా, ఆత్మీయంగా, సవివరమైన విషయ పరిజ్ఞానంతో రాస్తే బాగుంటుందని ప్రకాశిక పత్రిక ప్రధాన సంపాదకులు ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు నేనూ మాట్లాడుకున్నాం. చాలా మంది పేర్లు చర్చించుకున్నాం. కానీ, త్వరగా రాసివ్వాలి. ఎవరైనా రాస్తారేమోనని, నేను వాళ్ళతో మాట్లాడతానని అన్నాను. కానీ వాళ్ళంతా అందెశ్రీ కి సంబంధించిన తగిన సమాచారం తమ దగ్గర లేదన్నారు. అంత వేగంగా కూడా ఇవ్వలేమన్నారు. ఎలాగైనా మా పత్రిక ‘ప్రకాశిక’లో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఒక వ్యాసం వేయాలనుకున్నాం. ఇక, నన్నే రాయమనన్నారు. అలా ఆయనపై ఒక సుదీర్ఘమైన వ్యాసం రాశాను.
నేను నిరంతరం పరిశోధనా వ్యాసాలు రాస్తుంటాను, సంపాదకత్వంలో భాగస్వామినే అయినా... డాక్టర్ గోపాలకృష్ణ గారితో కలిసి పనిచేస్తూ నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన పేరుకు సైంటిస్ట్ అయినప్పటికీ, సంపాదకత్వానికి వచ్చేసరికి అత్యంత నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఎవరి వ్యాసమైనా సరే ఎడిటింగ్ ఎడిటింగ్లాగే చూస్తారు. “దార్ల గారూ, ఇక్కడ వాక్యం ఇలా ఉంది, ఈ భావం ఇలా ఉంటే బాగుంటుంది కదా” అని నాతో నిర్మొహమాటంగా చర్చిస్తారు. ఒక సంపాదకుడు ఎలా పనిచేయాలో ఆయన ఆచరణలో చేసి చూపించారు.
అన్నిటికంటే ముఖ్యంగా సాహిత్య పరిశోధనలో ఆయన ప్లేజియరిజాన్ని (నకలు రాతలను) పట్టుకునే తీరు నన్ను విస్మయానికి గురిచేస్తుంది. గురజాడ వారి 150వ జయంతి సందర్భంగానో, విజయనగరం సదస్సుల్లోనో, వెయ్యేళ్ల కన్యాశుల్కం సంపుటాల్లోనో వచ్చిన పాత వ్యాసాల నుంచి భాగాలను కాపీ చేసి, తమ పేర్లు తగిలించి పంపే పరిశోధకుల వ్యాసాలను ఆయన ఒక్క చూపుతో పసిగట్టేవారు. “దార్ల గారూ, ఈ వాక్యానికి ఆ వాక్యానికి తేడా చూడండి, ఇది ఇతని సొంత వాక్యంలా లేదు, ఎక్కడి నుంచో తెచ్చి అతికించినట్టుంది” అని ఇట్టే పట్టేసేవారు. అందుకే ‘ప్రకాశిక’లో ఒక వ్యాసం ప్రచురితమైందంటే అది సంపూర్ణ ప్రామాణికమైనది, నికార్సయిన పరిశోధన అయితేనే సాధ్యమవుతుంది.
అంతేకాదు, ‘ప్రకాశిక’ సాహిత్య రంగానికి చేసిన నిర్మాణాత్మక సేవలు అపారమైనవి. గతంలో కొన్ని ప్రత్యేక సంచికలు తీసుకొచ్చారు. తెలుగు కవిత్వోద్యమాలు, లఘు కవితాప్రక్రియలు, వాగ్గేయకార సాహిత్యం, ప్రాచీన సాహిత్యం- సామాజిక స్పృహ, గురజాడ భాషా విశేషాలు మొదలైన పేర్లతో ప్రత్యేక సంచికలు తీసుకొని రావడం, ఆ తర్వాత వాటిని పుస్తకాలుగా తీసుకురావడం ప్రకాశిక పత్రిక చేస్తున్న గొప్ప కృషిగా భావిస్తున్నాను.ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు, ఆచార్య అయినవోలు ఉషాదేవి గారు, ఆచార్య జి.యస్.మోహన్ గారు, ఆచార్య దామోదరనాయుడు గారి వంటి పండితుల సహకారంతో ప్రాచీన సాహిత్యంలో సామాజిక స్పృహ, జానపద వాగ్గేయకార సాహిత్యంపై ప్రామాణికమైన ప్రత్యేక సంపుటాలు తెచ్చారు. నానీలు, గజళ్ల వంటి లఘు కవితా ప్రక్రియల మీదా ప్రత్యేక సంచికలు తీసుకొచ్చారు. డాక్టర్ గడ్డం శ్యామల, డాక్టర్ ఎస్.రఘు, డాక్టర్ వింధ్యవాసిని గార్లు ఆ ప్రత్యేక సంచికకు రచనల సేకరణలో సహకరించినందుకు, వారికి సంపాదకులుగా సముచిత రీతిలో గౌరవించారు.
ఇక్కడ గోపాలకృష్ణ గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంస్కారం మరొకటుంది. ఎవరి దగ్గరైనా కొద్దిపాటి సహకారం తీసుకున్నా, వారి శ్రమను గుర్తించి విభాగ సంపాదకులుగా వారి పేర్లను గౌరవంగా ప్రకటిస్తారు. అదే పద్ధతి ఆ యా ప్రత్యేక సంచికలకు కూడా వర్తించేలా చేశారు.ఇక, పత్రిక సాంకేతిక రూపకల్పన విషయానికి వస్తే, ఇది అంతర్జాల పత్రిక అయినప్పటికీ మనం ముద్రితమైన గ్రంథాన్ని చేతిలో పట్టుకుని చదువుతున్న అనుభూతిని కలిగిస్తుంది. చిత్రకారుడు శివాజీ గారి అద్భుతమైన బొమ్మలు, వెంకట్ గారి పేజీ లేఅవుట్, కిరణ్ గారి వెబ్సైట్ నిర్వహణ పత్రికకు విశేషమైన హుందాతనాన్ని తెచ్చిపెడుతున్నాయి. అంతర్జాలంలో ఉచితంగా పని చేయించుకోవాలనే భావన ఆచార్య గోపాలకృష్ణ గారికి ఎక్కడా ఉండదు; ప్రతి పేజీ రూపకల్పనకూ నిర్దిష్టమైన గౌరవ వేతనం ఇస్తూ వృత్తిపరమైన విలువలను కాపాడుతుంటారు. అలాగే వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తాజా వ్యాసాలు యూనికోడ్లో చదువుకునే సౌలభ్యంతో పాటు, గూగుల్ సెర్చ్‌లో వెతికితే నేరుగా ప్రకాశిక వ్యాసాలకు చేరుకునేలా సాంకేతిక నిర్మాణాన్ని కూడా తీర్చిదిద్దారు.
ఒక పెద్ద విశ్వవిద్యాలయం లేదా పరిశోధనా సంస్థ చేయాల్సినంత బృహత్తర కార్యాన్ని ఒక పత్రికగా ‘ప్రకాశిక’ నిర్వహిస్తుండడం తెలుగు సాహిత్యానికే గర్వకారణంగా భావిస్తున్నాను. గోపాలకృష్ణ గారు రెండు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దగ్గర పెట్టుకుని అటు అంతర్జాతీయ క్యాన్సర్ శాస్త్రవేత్తలకు సలహాలు ఇస్తూనే, మరోవైపు తెలుగు సాహిత్యానికి ఇంతటి సమయాన్ని వెచ్చిస్తూ నిర్విరామంగా పనిచేస్తుండడం నిజంగా పత్రిక చేసుకున్న అదృష్టం. ఈ మహత్తరమైన సాహితీ యజ్ఞంలో ఒక కార్యనిర్వాహక సంపాదకుడిగా నన్ను భాగస్వామిని చేసి, గౌరవించినందుకు గురజాడ ఫౌండేషన్‌కు, గురజాడ కుటుంబానికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
సెలవు. ధన్యవాదాలు.
(1.12.2025 వ తేదీన నిర్వహించిన అంతర్జాల వేదికపై మాట్లాడిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 2.12.2025.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి