"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

09 అక్టోబర్, 2025

డా.రాజేందర్ అనారోగ్యంతో మృతి

 


డా. ఎస్.రాజేందర్
డా.రాజేందర్, డా.బాలిరెడ్డి... ఇద్దరూ విజువల్లీ చాలెంజ్డ్ విద్యార్థులైనప్పటికీ సకాలంలో తమ పరిశోధనలు పూర్తి చేసి డాక్టరేట్ డిగ్రీలను పొందిన సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళిద్దరినీ ఘనంగా సన్మానించాం. 

డా.రాజేందర్ ని సత్కరిస్తున్న దృశ్యం
2017-10-14

వేదికపై డా.బాలిరెడ్డి, డా. రాజేందర్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తదితరులు

మాట్లాడుతున్న డా.ఎస్.రాజేందర్


మాట్లాడుతున్న డా.ఎస్.రాజేందర్


 సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదులో పరిశోధన చేసి, ప్రస్తుతం ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్న డా.ఎస్.రాజేందర్ మృతి చెందాడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. అతను నాదగ్గరే ఎం.ఫిల్., పిహెచ్.డి చేశాడు. అతడు నిన్న (8.10.2025) అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిసింది. రాజేందర్ చిత్తూరు జిల్లా సోమల గ్రామానికి చెందిన విద్యార్థి. సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏ. తెలుగు చదివాడు. అతడు చూపు లేకపోయినా తెలివైన విద్యార్థి. యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ వారి జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్ సాధించాడు. ఎం.ఏ.లో చేరక ముందే బి.యిడి, చేశాడు. అప్పుడే సుజన అనే అమ్మాయిని ప్రేమించాడు. కులాంతర వివాహం అయినప్పటికీ, ఆమెకు ఎలాంటి దృష్టిలోపంగానీ,  వైకల్యం గానీ లేకపోయినా ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు. సుజన కూడా తర్వాత నాదగ్గరే పిహెచ్.డి. చేసింది. 

ఇద్దరూ తెలివైనవాళ్ళు. సకాలంలో డాక్టరేట్ పూర్తి చేశారు. డా.రాజేందర్ జ్ఞాపకశక్తి కి ఆశ్చర్యపోయేవాణ్ణి. ఒక్కసారి వింటే వెంటనే దాన్ని మరలా చెప్పేసేవాడు. డాక్టరేట్ పూర్తి అవుతుందనగానే ఒక ప్రభుత్వరంగ బ్యాంకులో మేనేజర్ గా ఉద్యోగం సాధించాడు. 

అతను గత కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. ఈ మధ్య గత యేడాది నుండి అతను నాకు అందుబాటులో లేడు.  ప్రతి యేడాదీ నా పుట్టిన రోజుకి డా.బాలిరెడ్డి, డా.రాజేందర్ రావడమో, ఇద్దరూ కలిసి ఏదైనా గిప్ట్ పంపించేవారు. ఈ యేడాది వాళ్ళ వ్యక్తిగత సమస్యలేవో ఉండడం వల్ల రాలేదు. కానీ, నిన్న రాత్రి డా.బాలిరెడ్డి ఫోన్ మెసేజ్ పెట్టాడు. అది చూసి షాక్ అయ్యాను. నమ్మలేకపోయాను. మరలా  ఉదయమే కాల్ చేసి తెలుసుకున్నాను. 

అతను గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నాడనీ, ఈ మధ్య అతనికి పెరాలసిస్ కూడా వస్తే వెంటనే ఖరీదైన ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారని, తర్వాత వాళ్ళ చెల్లి గారి ఇంటికి తీసుకొచ్చారట. తర్వాత ఆస్తమా ఏటాక్  వల్ల చనిపోయాడని చెప్పాడు.

రాజేందర్ చాలా తెలివైన వాడు. 

రాజేందర్ లాగే బాలిరెడ్డి కూడా చాలా తెలివైనవాడు. అతడు కూడా బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 

ఇద్దరూ నాదగ్గరే పిహెచ్.డి. చేశారు. 

రాజేందర్ ‘‘రేడియో నాటకాలుగా మారిన గణపతివేయిపడగలు నవలలు విమర్శనాత్మక పరిశీలన’’ అనే అంశంపై పిహెచ్.డి.,చేశాడు.  కేశవరెడ్డి రచించిన ‘మునెమ్మ నవల – మహిళా చైతన్యం పరిశీలన‘  అనే అంశంపై ఎం.ఫిల్ చేశాడు. 1-10-2017 వతేదీన జరిగిన యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు 19వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ డిగ్రీలను రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ డా.సి.రంగరాజన్‌ నుండి  అందుకున్నారు.

వాళ్ళిద్దర్నీ దగ్గరుండి చూసిన తర్వాత అంధ విద్యార్థుల గురించి గతంలో రాసిన ఒక కవిత. 

 అసలై వైకల్యం

దాన్ని జయింది జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే

రకరకాలైన అనారోగ్య సమస్యలు

రాజేందర్... నీ జీవితంలో అనేక సమస్యలతో పోరాడావు.

నువ్వు ఓడిపోలేదు

నీ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోను నిలిచే ఉంటుంది.

నీకివే నా నివాళులు

  - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

                                       9.10.2025

.....

నిన్ను చూసినప్పుడల్లా... !

నిన్ను చూసినప్పుడల్లా
‘అంధ’కారాన్ని జయించడానికి 
ఓ ఆయుధమేదో
 నాచేతికొచ్చినట్లనిపిస్తుంది
నిన్ను చూసినప్పుడల్లా
దారితెలియక వేలాడే
 ఆ వెలుగు రేఖలకు దారి చూపే
నీ వైట్ కేన్ ( లాంగ్ స్టిక్ ) లో
 
నీనిలువెత్తు ఆత్మవిశ్వాసం నాకో కొత్త విశ్వాసాన్నిస్తుంది

నీకు నేనెవరో తెలియకూడదనుకొంటూ
ముద్దిస్తానా...!
అయినా నువ్వేమో వెంటనే
నాకో ఆత్మీయ 'గుర్తింపుకానుకనిచ్చేస్తావు
అది నన్నెంత సంభ్రమాశ్చర్యాలతో ముంచేస్తుందో!
అప్పుడు నీతో
 
దాగుడుమూతలాడే చిన్నపిల్లాడ్నైపోతుంటాను!
నీ కళ్ళు వర్షించే ఆ ఆనందంలో నేనూ మురిసిపోతుంటాను.
కరెంట్ పోయినప్పుడల్లా
నీదగ్గరకొచ్చి
 బ్రెయిలీ నేర్చుకోవాలనిపిస్తుంది.
హీరో ఫొటో చూసినప్పుడల్లా
నీ నల్లకళ్ళజోడు
 నేనూ పెట్టుకోవాలనిపిస్తుంది
ఒకరంగేమో భయపెడుతుంది
మరొకరంగేమో బుజ్జగిస్తుంది
ఇంకోరంగేమో మనసంతా ఏదేదో
చిందరవందర చేసేస్తోంటుంది
పగలు కనిపించిన దృశ్యాలు
రాత్రి కలల్లోనూ కలవరపెడుతుంటాయి
వీటిని జయించడమెలాగో
ఆ రహస్యోపనిషత్తుని
 
నీ నుండే తెలుసుకోవాలనిపిస్తుంది!

నువ్వు నాకెదురుపడినప్పుడల్లా
నన్ను నేను తడుముకున్నట్లుంటుంది
నువ్వు నాకెదురుపడినప్పుడల్లా
దేవుడూ సైన్సు
 
ఒకర్నొకరు ఓడిపోయిన ముఖాల్ని
 
 ఎదురెదురుగా బెదురు బెదురుగా
చూసుకుంటున్నట్లే ఉంటుంది
నిన్ను చూసినప్పుడల్లా
తనలో తానై ఘోషించే
 
ఆ భాషలో వినిపించీ వినిపించని
 
ఆ ధ్వనులయ్యే
సాగరమంతా ఈదుతున్నట్లే ఉంటుంది
అది సంతోషకెరటమో
అది విషాద వికటాట్టహాసమో
 
ఒకదానివెనుక ఒకటిగా
ఒకదానిపై మరొకటిగా
 
ఒకదానితో మరొకదాన్ని విడదీయలేని జీవితమేదో
సవాలు చేస్తున్నట్లే ఉంటుంది!
ఆ దేవుడెప్పుడైనా నాకెదురైతే
నీ నిలువెత్తు ప్రశ్నల శిఖరాన్నై
అతడ్ని నేనే ఢీకొనాలనుంది!
ఇంతకాలం నువ్వు కోల్పోయిన
 
వసంతాన్నంతా వడ్డీతో రాబట్టాలనుంది.
-దార్ల వెంకటేశ్వరరావు
15 అక్టోబర్ 2017
(మా పరిశోధక విద్యార్థులు డా.రాజేందర్డా.బాలిరెడ్డి ...ఇద్దరూ డాక్టరేట్ పట్టాలను స్వీకరించిన సందర్భంలో  జరుగుతున్న అభినందన సభమరియు 15th October White Cane Day సందర్భంగాను ఈ కవిత...)


కామెంట్‌లు లేవు: