"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

30 సెప్టెంబర్, 2025

ఆధునిక ఋషితుల్యులు శ్రీ ఎన్. సిహెచ్. చక్రవర్తి (చక్రవర్తి కవితా సుదర్శనం ప్రత్యేక సంచిక-2025లో..)

  

(శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తిగారు కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు లేకుండా ఆసక్తిగల వారిని చేరదీసి సాహిత్య సంస్కారాన్ని అలవర్చే శిక్షణను ఇస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అటువంటివారిని గమనించాను. ఆ సంతోషంతో ఆయనపైనా, ఆయన శిష్యులపైనా రచించిన వ్యాసం. 2025 సెప్టెంబరు 25 నుండి 28 వరకు భద్రాచలంలోని శ్రీ జీయర్ పీఠంలో జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమతి పాలపర్తి హవీలా గారి సంపాదకత్వంలో ‘చక్రవర్తి కవితా సుదర్శనం’( కవిత్వ విమర్శనా వ్యాస సంగ్రహం) ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. దీనిలో ప్రముఖ పండితుల వ్యాసాలు ఉన్నాయి. దీనిలో నా వ్యాసం కూడా ఉంది. దీన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను... దార్ల)

ఆధునిక ఋషితుల్యులు శ్రీ ఎన్.సిహెచ్.చక్రవర్తి

 ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

పూర్వ అధ్యక్షులు, తెలుగు శాఖ,

మానవీయ శాస్త్రాల విభాగం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

(సెంట్రల్ యూనివర్సిటీ), హైదరాబాద్


ప్రముఖకవి, ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీ ఎన్.సిహెచ్.చక్రవర్తిగారి గురించి మా యూనివర్సిటీలో చదువుకుంటున్న బట్టు విజయ్ కుమార్ చెప్పేవాడు. మాకు ఆయన పాఠాలతో పాటు సాహిత్యాన్ని చదివించేవారనీ, కవిత్వం కూడా రాయించేవారనీ చెప్పేవాడు.  విజయ్ కుమార్ కూడా ఛందోబద్దంగా పద్యాలు రచించేవాడు. వచనంలో కూడా మంచి కవిత్వం రాసేవాడు. అతని నానీలు ఎంతో భావుకతతో ఉండేవి. తన గురువుగారు శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తిగారిపై ఒక ప్రత్యేక సంచిక వేస్తున్నారని, ఆయన రచించిన నానీ పంచశతి కవిత్వం, ఆయన సంపాదకత్వంలో వచ్చిన ‘నా–నీ ప్రపంచం’ (పదిమంది కవుల వెయ్యినానీల సమాహారం) కవితాసంపుటి, వీటితో పాటు చక్రవర్తిగారు రచించిన హైకూలు, వ్యంజకాలు, బతుకు చిత్రాలు (మినీ వచన కవితలు), నానోలు, తెలుగు పదాలు అనే పుస్తకాలను పంపించాడు. వాటన్నింటినీ చూసిన తర్వాత శ్రీఎన్.సిహెచ్.చక్రవర్తిగారిపై నాకు గౌరవం పెరిగింది. ఆయన రాయడమే కాకుండా తమ విద్యార్థులను సాహిత్యంవైపు పయనింపజేసి, మంచి కవిత్వం రాయించి, పుస్తకరూపంలో కూడా తీసుకొనిరావడం నాకు ఆ గౌరవానికి ప్రధాన కారణం.


 నాకు శ్రీఎన్.సిహెచ్.చక్రవర్తిగారు ఒక రచయితగా విజయ్ కుమార్ చెప్పకముందే తెలుసు. పత్రికల్లో ఆయన రచనలను చూసేవాడ్ని. ముఖ్యంగా ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు ప్రధాన సంపాదకులుగా ఉండి గురజాడ అప్పారావు గారు స్థాపించిన ప్రకాశిక త్ర్తైమాసిక పత్రికలో ఆయన  సంప్రదాయ సాహిత్యంలోని ఆణిముత్యాలను వ్యాఖ్యానిస్తూ వ్యాసాలు రాసేవారు. ఆ పత్రికకు నేను సంపాదకుడిగా ఉండడంవల్ల ఆ రచనలన్నీ  చదివేవాడిని. చక్రవర్తి గారు పద్యసాహిత్యంపై వ్యాసాలు రాసేవారు. ఆయనపై ఒక ప్రత్యేక సంచిక వేస్తున్నామనీ, కొంతమంది చేత వ్యాసాలు రాయిస్తున్నామని చెప్పి, నన్ను కూడా ఒక వ్యాసం రాయమని చెప్పి బట్టు విజయకుమార్ నాకు కొన్ని పుస్తకాలు పంపించాడు. చక్రవర్తిగారు రచించిన ‘నానీ పంచశతి’ కవితా సంపుటి (2016) చదివిన తర్వాత ఆయనలోని  సామాజిక స్పృహ, భావుకత,  వ్యంగ్యధోరణి వంటివెన్నే తెలుస్తాయి. సమకాలీన రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, కుటుంబ సంబంధాలు… ఇలా ఎన్నో విషయాలను ఈ కవిత సంపదలో ఆయన కవిత్వీకరించారు. ఈ కవితా సంపుటికి ముందుమాట రాస్తూ ‘చక్రవర్తి నానీలు వాసిలో గానీ, రాశిలో గానీ గణనకెక్కినవి. కవితా శక్తిలో గాని, భావుకతలో గాని, లోకవృత పరిశీలనలో గాని, అభివ్యక్తి శిల్పంలో గాని తలమానికి స్థాయిలో ఉన్నాయి’ అని నానీల సృష్టికర్త డాక్టర్ ఎన్. గోపి గారు వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఈ కవిత్వం చదివిన వారికి ఎంతో అనుభూతిని కలిగిస్తాయి.

సామాజిక స్పృహ:

సామాజిక స్పృహ అనేది వ్యక్తులు లేదా సమూహాలు తమ చుట్టూ ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల పట్ల కలిగిన అవగాహన, బాధ్యతాయుతమైన ఒక దృక్పథం. ఇది సమాజంలోని సమస్యలు, అసమానతలు,  అవసరాలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి  తనదైన మార్గంలో కొన్ని సాధనాలను ఎన్నుకుంటారు. సాహితీవేత్తలు కవిత్వం, కథ, నవల, ప్రసంగం వంటి వాటిని తమ సామాజిక స్పృహకు వ్యక్తీకరణ సాధనాలుగా ఉపయోగించుకుంటారు.‌

‘’వార్తలన్నీ

తెలుపూ నలుపే !

ఛానల్సులో

రంగులద్దుకుంటాయి.’’

నేటి మీడియా వ్యవస్థను, దాంట్లో జరిగే అవినీతి కార్యక్రమాలను వర్ణిస్తున్నాడు కవి. తప్పులు ఒప్పులు గానూ, ఒప్పులు తప్పులు గానూ మారిపోయాయే మీడియా రాజకీయాలను తూర్పారబడుతున్నాడు కవి.

నిత్యం మనం టీవీల్లో కేవలం సెన్సేషన్  చేయడానికే పనిచేసే కొన్ని చర్చలను కూడా మనముందుంచుతున్నాడు కవి. ఇది నా కాలిపోతుంటే నీళ్లతో ఫైరింజన్ రావాలి. అలా కాకుండా, నీళ్లు లేని ఫైరింజన్ వల్ల ప్రయోజనం ఏమిటి? ‌ దీన్నే అద్భుతంగా కళ్ళకు కట్టిస్తున్నాడు కవి.

‘’రేప్ జరిగింది

టి.వి చర్చలు చూడు

నీళ్లులేని ఫైరింజన్

గంటల మోత’’

శ్రీ శ్రీ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని అన్నాడు. ఈ కింది నానీలో ‘చెమట ముత్యాలు’ అని ప్రయోగించటం ఎంతో బాగుంది. చెమటను ముత్యాలతో పోల్చడం శ్రామికుల శ్రమ యొక్క విలువను ఉదాత్తీకరిస్తుంది, కానీ, దాని వెనుక దాగిన దోపిడీని కూడా ఎత్తి చూపుతుంది.

‘’కళ్ళంలో

రాలి పడుతున్నవి

ధాన్యపు గింజలా ?

చెమట ముత్యాలా ?’’

ముత్యాలు విలువైనవి, అయితే శ్రామికుడి చెమటకు ఆ విలువ ఆర్థికంగా మారి తగిన గుర్తింపు లభించడం లేదు. ఇది మార్క్సిస్టు సిద్ధాంతంలోని "సర్‌ప్లస్ వాల్యూ" (Surplus Value) భావనతో సమన్వయిస్తుంది.  ఇక్కడ కూలీవాని శ్రమ ఫలితం యజమానికి లాభంగా మారుతుంది. కేవలం దాన్ని మాత్రమే కాకుండా ఆ పని చేసేటప్పుడు పడే నీటి బిందువులు చూడడానికి నిజంగా ముత్యాల మెరుస్తూ ఉంటాయి అదొక సౌందర్య భావన. అది కవి భావుకతకు నిదర్శనం.

మేధావులలో కనిపిస్తున్న అవకాశవాదాన్ని చూసి కవిరా వర్ణించాడు.

‘భయంతో

తల ఊపేస్తున్న

మేధావిని చూసి

గంగిరెద్దూ తలొంచుకుంది’

అవకాశవాదం (opportunism) అనేది సమాజంలోని మేధావులు లేదా బుద్ధిజీవులు తమ జ్ఞానాన్ని, స్థానాన్ని స్వలాభం కోసం లేదా భయంతో అధికార వ్యవస్థలకు లొంగిపోవడానికి ఉపయోగిస్తున్న తీరుకి ఆవేదన చెందుతున్నాడు కవి."మేధావి" అనే పదం సమాజంలో జ్ఞానం, చైతన్యం,  సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. అయితే, ఈ మేధావి "భయంతో తల ఊపడం" అనేది అధికార వ్యవస్థలకు (రాజకీయ, ఆర్థిక, లేదా సామాజిక) లొంగిపోవడాన్ని సూచిస్తుంది. ఇది అవకాశవాదం యొక్క స్పష్టమైన లక్షణం—స్వీయ ప్రయోజనాల కోసం లేదా భయం వల్ల సత్యం, నీతి, లేదా సామాజిక న్యాయం కోసం నిలబడకపోవడం బాగా గమనించి చెప్పిన నానీ ఇది. రాజకీయాలు భ్రష్టు పట్టినప్పుడు మేధావులు స్వీయ రక్షణ చేసుకోలేనప్పుడు ఇలాంటి పరిస్థితులు సంభవిస్తుంటాయి.  పేరుకి ప్రజాస్వామ్యం అయినప్పటికీ, గ్రామాల నుండి పార్లమెంట్ వరకు ఆధిపత్య వర్గాలదే పెత్తనం. దీన్ని ఎంతో వ్యంగ్యంగా కవి వర్ణిస్తున్నాడు. ఒకప్పుడు దేవాలయాలకు పాలకులు కొంత మాన్యాలను ఇచ్చేవారు. అంటే భూమిని ఇచ్చేవారు. దానితో దేవాలయ నిర్వహణ జరిగేది. దీపారాధన నుండి ప్రసాదం వరకు ఎవరిని అడగవలసిన పరిస్థితి ఉండేది కాదు. దేవుని నమ్ముకున్న పూజారికి కూడా ఇబ్బంది ఉండేది కాదు. కానీ, దేవాలయాలకు ఇచ్చిన మాన్యాలను ప్రభుత్వం, ఆ గ్రామాల పెత్తందారులు వేలం పాట వేసి, నామమాత్రపు రుసుము చెల్లించి, ఆ భూములను లీజుకు తీసుకొని శాశ్వతంగా తమ ఆదాయమే అన్నట్లుగా అనుభవిస్తున్నారు. ఇది ప్రస్తుతం దేవాలయాల  భూములు ఏమయ్యాయని పరిశోధన చేస్తే తెలిసే ఒక పచ్చి నిజం.

‘’గుడిమాన్యం

బాగా పండింది

ఇంక గ్రామ దేవతలకు

నిండు నైవేద్యం’’

ఇక్కడ కవి గ్రామదేవతలకు, నిండు నైవేద్యం అనే పదాలు గొప్ప వ్యంగ్యమైనటువంటి ప్రయోగాలు. గ్రామాన్ని రక్షించవలసిన గ్రామ పెత్తందారులు దేవుడి సొమ్ముతో సహా ఆరగిస్తున్నటువంటి వైనాన్ని ఇక్కడ మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఇలా, చక్రవర్తి గారు ఎంతో సామాజిక అవగాహనతో సమకాలీన అంశాలను  నాలుగు పంక్తుల నానీలలో శక్తివంతంగా కవిత్వం చేయగలిగారు.

భావుకత:

ప్రతిభావంతుడైన కవికి అపూర్వ మైన భావనాశక్తి ఉంటుంది. భావనా శక్తి అనేది  ఊహాశక్తి లేదా సృజనాత్మక భావనలను సూచిస్తుంది, ఇది మనస్సు ద్వారా కొత్త ఆలోచనలు, దృశ్యాలు, లేదా భావోద్వేగాలను రూపొందించే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఇది సాహిత్యం, కళ, సంగీతం, లేదా శాస్త్రీయ ఆవిష్కరణలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. భావనా శక్తి ద్వారా ఒక వ్యక్తి వాస్తవానికి మించిన ఆలోచనలను సృష్టించి, వాటిని భావోద్వేగంతో లేదా సృజనాత్మకంగా వ్యక్తీకరించగలుగుతాడు.  మన భారతీయ ఆలంకారికులు ఈ భావుకత ప్రతిభావంతులకు మాత్రమే ఉంటుందని చెప్తూ ‘అపూర్వ వస్తు నిర్మాణ క్షమా ప్రజ్ఞా’ అని ప్రతిభను నిర్వచించారు. అంటే, అపూర్వవస్తు నిర్మాణ దక్షమైన ప్రజ్ఞయే ప్రతిభ అని అభినవగుప్తుని అభిప్రాయం. 'ప్రజ్ఞా నవనవోన్మేషశాలినీ ప్రతిభా మతా, తదనుప్రాణనాజ్జీవేద్వర్ణనానిపుణః కవిః'- అని భామహుడు  ప్రతిభను నిర్వచించాడు. ఇలా ప్రతిభ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ప్రతిభావంతుడు చక్రవర్తి గారు.

మన భూమిని ఎంతో ఉదాత్తంగా చెప్తూ ‘క్షమయా ధరిత్రీ’ అన్నారు మన పెద్దలు. దీన్ని ఆధారంగా చేసుకుని నిత్యం మనకు కనిపించే చెట్టుని దాని విత్తనాన్ని సాదృశ్యంగా చెబుతూ మనకి ఉండవలసిన సహనం గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు కవి.

‘’చెట్టుకు ఎక్కడిది

అంత సహనం ?

మరి విత్తును

 పొదిగింది - భూమే !’’

మనిషి గుణగణాలు, మన తల్లిదండ్రులు గురువులు మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల అలవాడతాయని అంటారు. చెట్టుకి సహన గుణం ఉన్నా లేకపోయినా అది వచ్చిన వాతావరణం భూమిది. ఆ వాతావరణ ప్రభావము వల్ల దానికి సహనం అబ్బిందట! ఆహా ఎంత భావుకత!

ఆకాశం విశాలంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతం అయినప్పుడు అంటే దట్టమైన మేఘాలు అలుముకున్నప్పుడు గాలి విస్తృతంగా వేస్తున్నప్పుడు ఆ మేఘాలు వేగంగా కదులుతూ ఉంటాయి. అప్పుడు ఆకాశంలో మెరుపులు కనిపిస్తాయి. కాసేపటికి వర్షం కురుస్తుంది. దీని వెనుక ఒక సైంటిఫిక్ ప్రక్రియ ఉంది. దాన్ని కాసేపు పక్కన పెడితే, కవి ఆకాశం మెరుపు మబ్బు మూడింటిని మానవీకరిస్తున్నాడు. అంటే పెర్సానిఫికేషన్ చేస్తున్నాడు. దీన్ని ప్రాణం లేని వాటిలో ప్రాణం ఉన్నట్లుగా వ్యక్తిత్వ ఆరోపణ చేయడం అంటారు. కారణంగా ఆకాశం అంటే శూన్యం. కానీ పైన ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని చూసి మెరుపు కన్ను కొట్టిందట. ఒక్కసారిగా ఒక మెరుపు మెరిసింది. మెరుపుని మబ్బు ఇష్టపడుతుంది. కాబట్టి ఆకాశానికి మెరుపు దగ్గర అయిపోతుంది అనే బాధతో కన్నీళ్లు పెట్టుకుందట!

‘’నింగిని చూసి

మెరుపు కన్నుగీటింది

సహించలేక

 మబ్బు బావురుమంది’’

వాతావరణం లో వచ్చిన మార్పులు, ఆ మార్పులకు వచ్చిన విస్తృతమైన గాలి, గాలికి కదిలిన మబ్బులు, ఆ తర్వాత కురిసిన వర్షం. నిన్న ఎంత అద్భుతమైనటువంటి భావుకతతో పాఠకుని  మనసులో శాశ్వతంగా గుర్తుండిపోయేలా వర్ణించాడో చూసారా కవి.ఇలా వీరి కవిత్వంలో అద్భుతమైన భావుకత కనిపిస్తుంది. నిజమైన రస హృదయానికి ఇలాంటి వందనాలు చదివేటప్పుడు ఆ కవిని ఆనందంతో ఆలింగనం చేసుకోవాలని అనిపిస్తుంది. పెద్దవాళ్లయితే నమస్కరించాలనిపిస్తుంది. చక్రవర్తి గారు అద్భుతమైన భావుకత కలిగిన కవి.

వ్యంగ్యం - చమత్కారం:

వ్యంగ్యం (Irony) అనేది సాధారణంగా ఒకరి ఉద్దేశం లేదా మాటలకు విరుద్ధమైన లేదా ఊహించని అర్థాన్ని తెలియజేయడానికి ఉపయోగించే ఒక ఆలంకారిక ప్రక్రియ. ఇది ఒక రకమైన భాషా ప్రయోగం, ధ్వని అనే మరో అర్థం కూడా ఉంది. దీనిలో చెప్పబడిన దానికి, ఆశించిన దానికి, లేదా కనిపించే దానికి భిన్నంగా వాస్తవ అర్థం ఉంటుంది. దీన్నే మనం అభిద, లక్షణ,  వ్యంజన అని అంటూ ఉంటాం. కేవలం శబ్దం యొక్క అర్ధాన్ని మాత్రమే చెప్తే అది అభిధ. దాన్ని మించిన మరొక అర్ధాన్ని స్పురింపజేస్తే అది లక్షణ. ఈ రెండూ కాకుండా మరింత గాఢమైన అర్ధాన్ని అవగాహన చేయగలిగినట్లయితే దాన్ని వ్యంజన  అంటాం. ఈ చివరి రెండింటినే ధ్వని అనీ, వ్యంగ్యం అనీ పిలుస్తుంటాం. కార్యక్రమంలో వ్యంగ్యం అనేది తిట్టుకీ, వెటకారానికీ పర్యాయపదంగా మారిపోయింది. నేను ఇక్కడ ధ్వని అనే అర్ధంలో ప్రయోగిస్తున్నాను. ప్రతిభావంతులైన వారు వ్యంగ్యాన్ని సాహిత్యంలో, సంభాషణలలో,  రోజువారీ జీవితంలో విస్తృతంగా ఉపయోగిస్తారు.

చమత్కారం (Wit) అంటే తెలివైన, హాస్యభరితమైన, వేగవంతమైన మాటలతో లేదా ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకునే లేదా నవ్వించే సామర్థ్యం. ఇది కేవలం నవ్వించడం మాత్రమే కాదు, సందర్భానికి తగినట్లుగా, తెలివిగా, సూక్ష్మంగా భాషను ఉపయోగించి చేసే ఒక కళ. అది కవిత్వంలో రసభరితంగా ఉంటుంది.

ఇలా సందర్భాన్ని బట్టి చక్రవర్తి గారు వ్యంగ్యాన్ని చమత్కారాన్నీ రెండింటిని ప్రయోగిస్తాడు.

‘’అందరి అలసటా

తీర్చే పనిలోపడి

ఆదివారం

సొమ్మసిల్లిపోయింది’’

ఆదివారం వచ్చిందంటే సెలవు అని మనందరికీ తెలుసు. కానీ నిజంగా చూస్తే ఉద్యోగస్తులు ఆదివారం నాడు మిగతా రోజులు కంటే బిజీ బిజీగా గడుపుతాం. దీన్ని చక్కటి వ్యంగ్యంతో వర్ణించి సెలవు రోజైనప్పటికీ ఆరోజు అధికమైన పని చేయవలసి వచ్చింది అనే అర్థం వల్ల కవిత్వం అయింది. దీనిలో చమత్కారం కూడా ఉంది.

ప్రకృతితో మమేకమైన కవి ఆకాశం, గాలి, నీరు, భూమి, చెట్లు, పక్షులు, జంతువులు, సమస్త ప్రకృతినీ తన కవిత వస్తువులుగా స్వీకరిస్తాడు. చక్రవర్తి గారు కొన్ని పదాలతో అనేకమైన వర్ణనలు చేయడం ఆయనకు సరదా. వానని అనేక రకాలుగా ఉల్లేఖించినట్లు  కొన్ని నానీలు రాశారు. అలాంటి దాంట్లో ఇదొకటి. ఇంతకు ముందు ఒక నానీలో మబ్బు ఏడ్చింది. అప్పుడు దానికి కారణం- తాను బాగా ఇష్టపడి ఎప్పుడు ఆకాశంలోనే అంటే దాని సాన్నిహిత్యంలోనే ఉండే మబ్బు మరొకరికి ఆకాశం దగ్గరవుతుందంటే తట్టుకోగలుగుతుందా? అందుకని ఏడ్చింది.

‘’ఆకాశం

ఉరిమింది

భయపడినట్లుంది

మేఘం బావురుమంది’

కానీ ఇప్పుడు, ఆకాశం భయపెట్టేటట్లుగా పెద్ద కేక వేసింది. ఇక్కడ మెరుపు లేదు. మెరుపు వర్ణన ప్రత్యక్షంగా కనిపించట్లేదు. ఆకాశమే అరిచింది. అందుకని  మేఘం ఏడుస్తుందట. ఇక్కడ వర్షం వచ్చింది అక్కడ వర్షం వచ్చింది కానీ రెండు వర్షాలకి కారణాలను రెండు రకాలుగా ఊహించగలిగాడు కవి. ఇది ప్రతిభావంతుడైన కవికి మాత్రమే సాధ్యం. ఇంకా వర్షాన్ని రకరకాలుగా వర్ణించిన నానీలు కూడా ఉన్నాయి.

ఎండాకాలంలో అప్పుడప్పుడు కొన్ని చినుకులు పడుతుంటాయి. ఒకసారి ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి జల్లులు మొదలవుతాయి. అలాంటప్పుడు భూమి ఎలా ఉంటుందో  అద్భుతమైన వర్ణన. వర్షం అనే చినుకులతో భూమి చల్లగా స్నానం చేస్తుందట.

‘’గ్రీష్మ తాపంతో

చెమట కక్కిన భూమి

వర్ష ధారలతో

చల్లటి స్నానం’!’’

కవి కొన్నాళ్లపాటు ఇతర దేశాలు వెళ్ళాడు. అక్కడ మాతృభాష మాట్లాడని వాళ్ళని చూసినప్పుడల్లా అతనికి కలిగిన భావన ఒక చక్కని నానీని అందించేలా చేసింది.

‘విదేశాల్లో

అందరూ పరాయివాళ్లే

అక్షరం ఒక్కటే

ఆత్మీయ నేస్తం’

ఒకటి: ఇతర దేశాల్లొ ఉన్నప్పుడు తన మాతృభాషలో మాట్లాడేవాళ్లు తక్కువగా ఉంటారు. ఒక్కోసారి కనిపించకపోవచ్చు కూడా. అలాంటప్పుడు ఎవరైనా మాతృభాషలో మాట్లాడేవాళ్లు ఎదురైతే తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. రెండు: ఎవరూ తన మాతృభాషలో మాట్లాడలేనప్పుడు తనకు తానే తన మాతృభాషలో చదువుకోవడం, రాసుకోవడం ఒక నిత్య కృత్యంగా మారిన స్థితిని కూడా ఈ కవిత తెలియజేస్తుంది. దీన్ని డయాస్పరిక్ కాన్సెప్ట్ అంటారు.  అంటే మన మాతృభాష మాతృదేశం మన వాళ్ళ విలువ పరాయి దేశం వెళ్లినప్పుడు పరాయి భాషలో మాట్లాడవలసి వచ్చినప్పుడు పరాయి మనుషులతో జీవించవలసినప్పుడు మనకు మన వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటో తెలియడం అనేది డయాస్పోరిక్ కాన్సెప్ట్ అవుతుంది.

ఈరోజుల్లో ఇంకా కుంకుడుకాయ, సీకాయలతో  తలంటు స్నానం చేసే వాళ్ళు ఉంటే ఈ కవిత వాళ్లకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

‘కుంకుడుకాయను

రోకలి కొట్టింది

నీళ్లు తాగిస్తే

నురగలు కక్కింది’

సాధారణంగా కుంకుడుకాయల్ని చితకకొట్టి వాటిని వేడినీళ్లలో వేసి కాసేపు ఉన్న తర్వాత దాన్ని పిసికితే రసం వస్తుంది. దాన్ని తల మీద వేసుకొని రుద్దుకుంటే తలలో ఉన్న జుట్టు అంతా పోతుంది. తలవత్తుకునేటప్పుడు నురగ వస్తుంది. ఈ ప్రక్రియను కవి పెర్సానిఫికేషన్ టెక్నిక్ తో చమత్కారంగా వర్ణించారు.

మనుషులు ఎంతో తెలివైన వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. అంత తెలివైన వాళ్ళు కూడా ఒక్కోసారి ఏదో ఒక భ్రమకు లోనవుతారు. అప్పుడు వాళ్లకు తెలియకుండానే వాటిలో చిక్కుకుంటారు. అది నేటి సైబర్ క్రైమ్ ల గురించి తెలిసిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. జీవితంలో రకరకాలైన ఎరలు ఎదురవుతుంటాయి. డబ్బు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుని వ్యామోహం, అధికార కాంక్ష, కీర్తి కాంక్ష…ఇలా రకరకాలైన వాటిలో ఏదో ఒక దానికి ఒకసారి మనిషి ఆకర్షితులడతాడు. ఇక్కడ చేపలు పట్టడం ఎర వేయడం, చిక్కుకోవడం వంటివన్నీ భిన్నమైన అర్ధాలలో ప్రయోగించాడు కవి. ఈ కవితలు సంక్షిప్తత అనేది గొప్పగా పాటించడాన్ని గమనించాలి.  దీనిలో వ్యంగ్యం ఉంది; చమత్కారం కూడా ఉంది.

‘’మనిషి చేపలు

పడుతూనే ఉంటాడు.

అయినా ఎరలకు

చిక్కుతుంటాడు’’

ఒక అద్భుతమైన పరిణామాన్ని సామాజిక పయనాన్ని చెప్పిన ఒక నానీ. హిందూ పురాణాలు, కాలగణన, తాత్విక ధార్మిక దృష్టికోణాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన పదాలు కృత, త్రేతా, ద్వాపర, కలియుగం అనేవి.

1. కృతయుగం (సత్యయుగం) – ధర్మం నిండిన యుగం, ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల్లో నడిచిందని చెప్తారు. శ్రీరాముడు, హనుమంతుల వారి కాలం. మానవుడు కోతి జన్మ నుండి పరిణామం చెంది మానవుడిగా రూపొందాడని  జీవ పరిణామ సిద్ధాంతాలు చెబుతున్నాయి. 2. త్రేతాయుగం – ధర్మం ¾ ఉండే యుగం, 3. ద్వాపరయుగం – ధర్మం సగం ఉన్న యుగం, 4. కలియుగం – ధర్మం ¼ మాత్రమే మిగిలిన యుగం. అంటే ఒంటి పాదంపై నడిచే కాలం. మానవుడికి రెండు పాదాలు ఉన్నా, రెండింటి మీదా సమానంగా  నిలబడకుండా, ఒకే పాదంపై తన భారాన్ని మోపుతుంటాడు. ధర్మం, అధర్మం అనే రెండింటిలో దేన్నో ఒక్కదానిపైనే నడుస్తున్నాడు. దీన్ని ఒక చిన్న నానీలో ప్రపంచం అంత భావాన్ని తాత్వికతను వర్ణించారు.

‘కోతి కాలంలో

ధర్మం నాల్గు పాదాలు

ఇప్పుడు

మనిషికి రెండే కాళ్లు’

భాగవతం, విష్ణుపురాణం, లింగపురాణం, కాళికాపురాణం వంటి గ్రంథాలలో కలికాలాన్ని గురించి పదే పదే ప్రస్తావించారు. కలికాలం (కలియుగం) ముఖ్య లక్షణాలుగా వీటిని మన పురాణాలు చెబుతున్నాయి. అధర్మం – ధర్మాన్ని మించిన స్థాయికి చేరుతుంది. సత్యం కంటే అసత్యానికే ఎక్కువ స్థానం.ధనం, స్వార్థం ఆధారంగా సంబంధాలు ఏర్పడతాయి. బ్రాహ్మణులు వేదాలను మర్చిపోతారు, ధర్మం నిర్వీర్యమవుతుంది. ద్వేషం, అసూయ పెరుగుతాయి. ఆలోచనలు, సంబంధాలు, రాజకీయాలు – అన్నీ అస్థిరంగా మారతాయి. ఇవన్నీ స్పురించే తాత్విక భావనలు అందించిన నానీ ఇది.

శ్రీ చక్రవర్తిగారు భద్రాచలం పరిసర ప్రాంతాలలో తెలుగు ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేశారు. ఆ శ్రీరాముని ఆలయం కూడా అక్కడే ఉంది. తన కవిత్వంలో ఆ పరిసరాలు అనేక సందర్భాలలో తన వర్ణనలో చేరాయి. పాపికొండలు, ఆ నదితీరాలు, అడవులు, ఆ ప్రకృతి అంతా తన కవిత్వంలో భాగమైంది. అనేక కవితలలో ఆయన ప్రకృతి ప్రేమికుడుగా కనిపిస్తాడు. ప్రకృతిని ప్రేమించిన వారు మనిషిని ప్రేమిస్తారు. సకల జీవులను ప్రేమిస్తారు. ఇలా సుమారు ఐదువందల పై చిలుకు నానీలు రచించారు. శతక సంప్రదాయంలా నానీలలో కూడా వందలాది నానీలను వర్ణించారు. తాను సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ ఆ  గిరిజన ప్రాంతాలలోనే ఉద్యోగం చేశారు. అనేకమంది గిరిజన, దళిత విద్యార్థులకు విద్యాబోధన చేశారు. అటువంటి ప్రాంతాలలో ఉద్యోగం చేసేవారు ఎన్నో నియమనిష్టలకు కట్టుబడి ఉండకపోతే సాహిత్యాన్ని సృష్టించలేరు. జీవితంలో ఒక క్రమశిక్షణ ఉన్నప్పుడు తాను ఎక్కడ ఉన్నా తన తల్లిదండ్రులు, గురువులు నేర్పిన ఆ సంప్రదాయాలు పాటించాలనిపిస్తుంది. ఆ సంప్రదాయాలలో నిరంతర అధ్యాపనం ఒకటి. అధ్యాపనం వలన వచ్చే సృజనాత్మక శక్తిని ప్రదర్శించడం మరొకటి. వీటిని కాపాడుకున్నారు కవి.  తాను రాయడం మాత్రమే కాకుండా ఒక తొమ్మిది మంది చేత ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించడం ఎలాగో నేర్పారు. ఆ తొమ్మిది మందిలో  గొప్ప కవులుగా పేరు పొందిన వాళ్లు కూడా ఉన్నారు.  మనిషికి సహజంగానే  ప్రేమించే గుణం ఉంటే కుల మత ప్రాంతాలు అతీతంగా కూడా ఆ ప్రేమను పంచుకోవచ్చు. అది శ్రీ చక్రవర్తి గారిలో కనిపించింది. అందుకే ఆయనను నేటికీ ఆ కవులంతా ఎంతో గౌరవిస్తున్నారు. తడబడే అడుగులకు ఊతం ఇచ్చి, ఒక్కొక్క అడుగు ఎలా వేయాలో నేర్పిన వాళ్లని ఆ కవులు అంతా నిత్యం స్మరించుకుంటున్నారు. 

చక్రవర్తిగారి కవిత్వం చదివిన తర్వాత, ఆయన ఇంతమందిని అపరబ్రహ్మలుగా తీర్చిదిద్దారని తెలిసిన తర్వాత ఆయన పట్ల నాకు గౌరవ భావం ఏర్పడింది. ఆ కవులు కూడా సమాజానికి సాహిత్యానికి తరతరాలుగా దూరంగా ఉన్న కుటుంబాలకు చెందిన వాళ్ళని దగ్గరగా చేసిన గొప్ప వ్యక్తి అని తెలిసిన తర్వాత ఆయన పట్ల నాకు మరింత గౌరవం పెరిగింది. అందుకే ఆయనకు నమస్కరిస్తున్నాను. ఆయన రాస్తూ, తన శిష్యులతో కలిసి నాటిన ‘నా-నీ ప్రపంచం’ అనే కవితల పూలతోటలో అడుగుపెట్టి ఒకటి రెండింటిని ఆఘ్రాణిద్దాం.

***

‘నా-నీ ప్రపంచం’ అనే కవితా సంపుటి పదిమంది కవులు రాసిన వెయ్యి నానీలా సమాహారం. 9 మంది తన శిష్యులతో పాటు చక్రవర్తి గారు రాసిన నానీలు కూడా దీనిలో ఉన్నాయి. గురు శిష్యులు ఒక పుస్తకంలో ఒకే ప్రక్రియలో రాయడం అంటే గురువుగారికి శిష్యులు పట్ల ఎంతో ప్రేమ ఉంటేనే తప్ప అలా కలిసి రాయడం జరగదు. పదిమంది రాసిన నానీలకు పది రకాలైన రత్నాల పేర్లు పెట్టడం ఎంతో కొత్తగా ఉంది. మాణిక్యనానీలు (ఎన్. సీహెచ్. చక్రవర్తి), నానీ పగడాలు (అవేరా), రవ్వల నానీలు (గంగవరపు సునీత), నానీల నీలమణులు (పాలపర్తి హవీలా), మరకత నానీలు (బట్టు విజయ్కుమార్), నానీ పుష్యరాగాలు (యలగందుల సుచరిత),  నానీ గోమేధికాలు (రజిత కొండసాని), నానీ మౌక్తికాలు  (రాళ్ళబండి బాలాజీరాజు), నానీ వైడూర్యాలు (విద్యాసాగర్), నానీ రత్నాలు (విట్టుబాబు).

‘’వజ్రాలే

కిరీటాన్ని శోభిల్లచేస్తాయి

మేటికైతలో

అలంకారాల్లాగా!’’ (ఎన్. సిహెచ్.చక్రవర్తి, 2021:26)

దీన్ని అనేక రకాలుగా విశ్లేషణ చేసుకోవచ్చు.

కిరీటం = గురువు. గురువు అంటే జ్ఞానానికి ప్రతీక. ఆయన "కిరీటం" లాంటి శోభాయమానమైన వ్యక్తి – పదవికంటే విలువ గొప్పది.

 వజ్రాలు = శిష్యులు / విద్యార్థులు. వజ్రాలు ప్రకాశించే, కఠినమైన, విలువైన వస్తువులు. ఇక్కడ ఇవి శ్రద్ధా, శ్రమతో కూడిన శిష్యుల ప్రతీకలు. వారు గురువు చుట్టూ ఉండి, ఆయనకు గౌరవాన్ని అందిస్తారు.

అలంకారాలు = జ్ఞానమార్గంలో శిష్యుల విజ్ఞానాభివృద్ధి / ప్రశంసలు. వారు ఆర్జించిన విజ్ఞానం, విజయం, లోకప్రశంసలే గురువు కిరీటానికి వచ్చిన నిజమైన అలంకారాలు.నిజమైన గురువు తనకంటే శిష్యుడి విజయంలో సంతృప్తి పొందతాడు.

దీన్ని మరొకరకంగా అన్వయించి వ్యాఖ్యానించుకోవచ్చు.

కిరీటం = రాజు / నాయకుడు. కిరీటం అనేది శక్తి, అధికారానికి ప్రతీక. ఇది వ్యక్తిగతంగా నాయకుడిని సూచిస్తుంది – అతడి స్థానం, ప్రతిష్ట.

వజ్రాలు = మంత్రులు / సహచరులు / ముఖ్యుడి చుట్టూ ఉండే సమర్థవంతులైన వ్యక్తులు.వజ్రాలు అంటే ప్రకాశించే, విలువైనవి – అంటే నాయకుడికి మేధస్సు, సుదీర్ఘ దృష్టి, రాజనీతిలో నైపుణ్యం కలిగిన సలహాదారులు, మంత్రులు, అనుచరులు.

వారు ఉన్నప్పుడు నాయకుడి "కిరీటం" (స్థానం) శోభ పుచ్చుకుంటుంది. వారి లేకపోతే ఆ కిరీటం అలంకారమే అయినా వెలగదు.

అలంకారాలు = సలహాలు / ఆలోచనలు / ప్రణాళికలు.చక్కగా మేలుకొల్పిన, విశ్లేషించిన, సరైన సమయంలో ఇచ్చే సలహాలు – ఇవే ఆ "వజ్రాల" నుంచి వచ్చే అలంకారాలుగా అన్వయించవచ్చు.

ఒక నాయకుడు (కిరీటం ధరించినవాడు) తన చుట్టూ ఉన్న సమర్థవంతుల (వజ్రాలు) సహకారం వల్ల మాత్రమే గొప్పవాడిగా, మేటిగా ఎదుగుతాడు.

వారి నుంచి వచ్చే మంచి సలహాలు, దృక్కోణాలు (అలంకారాలు) అతడిని నిజంగా శోభిల్లజేస్తాయి.

నాయకత్వం వ్యక్తిగత గొప్పతనం వల్ల కాదు – సహకార బలంతో మాత్రమే అది నిజమైన బలంగా నిలుస్తుంది.

ఈ నానీ ఆధునిక నాయకత్వంపై సూక్ష్మ వ్యాఖ్యానంగా కూడా పరిగణించవచ్చు –

చుట్టూ ఉన్న బుద్ధిమంతులు లేకపోతే నాయకుడు ఒంటరివాడు.చుట్టూ మాయా వజ్రాలు ఉన్నా, నిజమైన శోభ రాదు. సలహాలు వినడమే కాక, స్వీకరించగల నైతికత కూడా అవసరం. అది రాజరికమైన ప్రజాస్వామ్యమైన ఈ లక్షణాలు చాలా అవసరం.

 ‘అవేరా’అనుసూరి వేంకటేశ్వర రావు:

‘’చినుకులు పడుతుంటే

 ముత్యాల కోసం వెతికాను

 పగడాలు

దొరికాయి’’ (నా-నీ ప్రపంచం, పుట : 49)

ఇది మన ఆశలు వాస్తవం మధ్య ఉన్న వ్యత్యాసానికి బలమైన ప్రతీక.

 

‘’పుత్తడి బొమ్మకు

ముత్యాల సరాలు

ఇసుక దేశంలో

రాలుతున్న ముత్యాలు.’’ (నా-నీ ప్రపంచం, పుట : 50).

గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాల్లో ముత్తటి బొమ్మ పూర్ణమ్మ కోసం వేదన చెందుతూ ఒక విలువైన కవితా ఖండికను రచించాడు. వీటిని ప్రత్యేకంగా తీసుకొని అరబ్ దేశాలకు అమాయకులైన అమ్మాయిలను తరలించి ముసలి వాళ్ళకి వివాహం చేస్తున్న దీనస్థితిని అద్భుతమైన ప్రతీకలతో వర్ణించాడు కవి. ‘అవేరా’ తన నానీలలో సామాజిక స్పృహతో ఎన్నికల గురించి అనేక సమస్యలను తన కవిత్వంలో వర్ణించాడు. తన కవిత్వాన్ని సామాజిక మార్పుకి ఉపయోగపడే సాధనంగా వాడుకున్నాడు. పైకి చెప్పేది అభ్యుదయంగా కనిపిస్తున్నా, ఆచరణలో లేని మాటలను సహించలేని తనం ఈ కవి కవిత్వంలో కనిపిస్తుంది.

 

 

గంగవరపు సునీత:

కవిత్వమనే ‘గంగ’ను వరంగా పొంది మనసులను సున్నితంగా మీటుతూ మనల్ని కూడా ఆమెతో కలిసి గుక్కపట్టి ఏడ్పించగల  సౌకుమార్యం గంగవరపు సునీత గారి కవిత్వం. అప్పుడే అందిన ఒక అందమైన జీవితాన్ని కోల్పోయిన కాలాన్నేదో మళ్ళీ తోడుకోవాలని మనసు పడే బాధ ఆమె కవిత్వం నిండా కనిపిస్తుంది. అది ఆమె ఆత్మాశ్రయమేమో అనిపిస్తూనే ఆ కవిత్వం మనదేననే అనుభవంలోకి తీసుకెళ్తుంది. ఒక నానిని కూడా పదే పదే పలవరించేటట్లు కలవరపెడుతుంది. ఆమె కవిత్వం జీవితాన్ని మధించిన నిత్య సాధనల తపః ఫలం.

‘’ఆమె కవిత్వం

ఆమె జీవితమే

ఎంత కాలమైనా

తడి ఆరదు’’

జీవతానుభవాలు, వ్యక్తిగత బాధలు, వాటి సాక్ష్యంగా నిలిచిన మధురమైన కవిత్వం ఇలాగే ఉంటుంది. బాధను అనుభవించినవారే నిజమైన భావవ్యక్తీకరణ చేస్తారనే మాట ఒకటి ఉంది. ఇది అన్నివేళలా నిజంకాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి కవితా వస్తువు తన వ్యక్తిగత జీవితంలోనుండే  లేదా తన జీవిత అనుభవం నుండే వచ్చిందని చెప్పలేం. ఇతరుల అనుభవాలు కూడా మన అనుభవాలుగా అనుభవించగలుగుతాం- మనం సహృదయులమైతే! ఈ నాని లో ఒక శ్లేష కూడా ఉంది. ‘ఆమె’ ఒక కవయిత్రి. అని సునీత గారు కావచ్చు. మరొక కవయిత్రి కావచ్చు. ఒక స్త్రీ కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో చెప్పే కోణం ఒకటి. మరొకటి స్త్రీ గురించి ఎవరు రాసినా ఎంత కాలమైనా ఆ దుఃఖాన్ని మాన్ప లేనంత వేదన కనిపిస్తుందని మరో పార్శ్వం కనిపిస్తుంది.

‘’నిద్ర రాని

ఆ రాత్రి వేళ

కంటి సంద్రంలో

ఎగసిన కన్నీటి అల’’

ఇందులో వ్యక్తమైన బాధ, ఒంటరితనపు తీవ్రత, ఆంతరంగిక కల్లోలం, ఆ అనుభవం కమ్ముకున్న గాఢత శక్తివంతంగా ప్రతిఫలిస్తోంది. ఇది ఒక అనుభూతికావ్యంలా ఉంది. ఒక గొప్ప కథలా ఉంది. ఒక నవలలా ఉంది.  హృదయాన్ని తాకేలా ఉంది. “కంటి సంద్రంలో” అనే ఉపమానం కన్నీళ్ళను సముద్రంతో పోల్చడం ద్వారా బాధ యొక్క లోతును, విస్తృతిని వ్యక్తపరుస్తుంది. ఇది ఒక సాధారణ కన్నీటి చుక్క కాదు, ఒక అనంతమైన దుఃఖ సాగరాన్ని సూచిస్తుంది, ఇది హృదయంలోని తీవ్రమైన ఆవేదనను ప్రతిబింబిస్తుంది.“ఎగసిన కన్నీటి అల” అనే పదచిత్రం కన్నీళ్ళు అలలాగా ఉప్పొంగడాన్ని సూచిస్తుంది. ఇది భావోద్వేగం నియంత్రించలేని స్థితిని, ఒక తాకిడితో పొంగిపొరలే బాధను తెలియజేస్తుంది. ఇది కవిలోని అంతర్గత సంఘర్షణను, బహుశా కోల్పోయిన ప్రేమ, ఆశ, లేదా ఏదైనా లోతైన గాయాన్ని సూచిస్తుంది. ఇంత చెప్పినా ఒంటరిగా ఆ బాధను అనుభవించిన వాళ్ళ ఆ ఎడబాటు కలిగించే దుంఖాన్ని అక్షరాల్లో చెప్పలేం. అందుకే మళ్ళీ మళ్ళీ ఆ కవితను చదువుకుంటాం. కవిత రాసిన వారి హృదయ  చిత్రాన్ని మనం ఊహించుకుంటాం. మనం కూడా ఆ దుఃఖంతో మమేకమవుతాం. ఇది నిజమైన కవిత్వం.

‘’గుండె వెనుక

దాగిన అలజడులు

కలం నుండి ఒలికిన

సెలయేళ్లు’’

కవిత్వం అంటే జీవితం. ఊహల హార్మ్యాలు కట్టడం కాదు. కవిత్వం అంటే గుండెలు కదిలించాలి. అది చదివాక దానితో మమేకమై రస హృదయంతో ప్రవహించాలి. కవయిత్రి చెప్పిన కవిత్వ గుణం. నిజంగానే ఆమె కవిత్వం మనిషిని కుదుటుగా నిలబడనీయదు.మనసు నిండా ఒక అలజడి. ఈమె కవిత్వం నిజంగా ఒక మెస్మరిజం.

‘’ఎలా రాయను

నేను నేర్వని భాషను

ఏమని చెప్పను

 నాకే చెందిన బాధను’’

పట్టుకున్న ప్రతి అక్షరం కవిత్వమే. అక్షరాన్ని కలంతో కాదు హృదయంతో రాసినట్టుంది. ఈ పద్ధతిలో కవిత్వం వాస్తూ పోతే  తెలుగు సాహిత్యంలో కృష్ణశాస్త్రిని మించిన గొప్ప కవయిత్రి గంగవరపు సునీత. ఒంటరితనంలోని బాధ, బరువు, దుఃఖం తెలియాలంటే ఈమె కవిత్వం చదవాలి.

అంతర్ముఖీన కవిత్వం (Introspective Poetry) అన్న పదబంధం మనసు లోపలికి చూసే, వ్యక్తిగత అనుభూతులను, మనోభావాలను, ఆత్మసాక్షాత్కారాన్ని కవిత్వ రూపంలో వ్యక్తపరిచే ప్రక్రియకు సూచికగా నిలుస్తుంది. ఇది ముఖ్యంగా బాహ్య ప్రపంచంపై కంటే, అంతరంగిక లోకంపై దృష్టి సారించే కవిత్వం. లిరికల్ పోయిట్రీలో అంతర్భాగం. దీనిలో  ఆత్మపరిశీలన (Self-reflection) అంటే  కవి తన వ్యక్తిగత బాధలు, సందేహాలు, ఆశలు, ఆత్మాన్వేషణను వ్యక్తీకరిస్తాడు. ఈ కవిత్వం ద్వారా కవి తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వ్యక్తిగత భావజాలం (Subjective sentiment)  అంటే సామాజిక సందర్భాల కన్నా వ్యక్తిగత అనుభూతులు, మానసిక స్థితులు ప్రధానంగా ఉంటాయి. ఒంటరితనాన్ని, మౌనాన్ని, నిశ్శబ్దాన్ని కవితా వస్తువులుగా చేస్తారు. ప్రతిబింబ స్వభావం (Introspective tone) అంటే,  ప్రశ్నించే స్వభావం కలిగి ఉంటుంది — “నేను ఎవరు?”, “ఇది నిజం కాదా?”, “ఎందుకిలా అనిపిస్తుంది?” లాంటి ప్రశ్నలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలన్నీ గంగవరపు సునీతగారి కవిత్వంలో కనిపిస్తాయి.

పాలపర్తి హవీలా:‌

ఒక నిండు కుండలా ఎంతో బ్యాలెన్స్ గా కవిత్వాన్ని చెప్పగలదిట్ట. పద్యమైనా వచనకవిత్వమైనా ‘కవిత్వం’ పండేటట్లు వర్ణించే ప్రతిభావంతురాలు. తన కవిత్వంలో సామాజిక అంశాలు ఉన్నా వాటిని ఎంతో పెద్దరికంలో ఇరువైపులా బ్యాలెన్స్ చేస్తూ చెప్పే మేథో మధన కవిత్వం ఉంటుంది. దీన్ని థాట్ ప్రొవోకింగ్ (Thought-provoking) కవిత్వం అనొచ్చు. పాఠకుడిని ఆలోచనలో ముంచి, ఆహ్లాదపరిచే కవిత్వం.సాధారణంగా ఊహించని కోణంలో విషయాన్ని చూపుతుంది, లోతైన భావాలను, తాత్విక ప్రశ్నలను, లేదా చైతన్యాన్ని కలిగించే విషయాలను పట్టుకుంటారు. కవిత్వం రాస్తూ కవిత్వమెలా పుడుతుందో చెప్తుంటారు. మంచి కవిత్వం రావాలంటే బలమైన వ్యక్తీకరణతో కూడిన స్పందన ఉండాలి.

‘’అమృతఝరులు

ధారకట్టాయి

కొండలో.. గుండెలో..

పగిలినట్లున్నాయి!!’’

“అమృతఝరులు” అనే పదం అనేది స్వచ్ఛమైన భావాలను సూచించే రూపకం (Metaphor). అంటే మంచి కవిత్వం. నిజమైన స్పందనతో వచ్చిన వచ్చిన కవిత్వం. గుండె నిండుగా స్పందించే కవిత్వం “కొండలో.. గుండెలో” అనే ద్వంద్వ దృష్టి, మనిషి–ప్రకృతి అంతరంగాన్ని కలుపుతుంది. దీన్ని అన్యోన్యత (Interiority + Exteriority) అంటారు. కొండ’ కఠినత్వానికీ, గుండె స్పందనకు ప్రతీకలుగా తీసుకుంటే, నిజమైన కవిత్వం శిలలను కూడా కరిగించగలగానే భావన వస్తుంది.  కవిత్వం రాయాలన్నా, ఆస్వాదించాలన్నా మృదుత్వం, సౌకుమార్యం ఎంతో అవసరం. దీన్నే మన భారతీయాలంకారికులు ‘సహృదయత’ అన్నారు. కవయిత్రి ఈ అంశాల్ని కవితాత్మకం చేస్తూ ఇలా నానీలో వర్ణించారు.

‘ఆమె లత,

చేతివేళ్ళు చివుళ్ళు

అందుకే నిత్యం

 కైతల పూలు.’’

ఆమె సున్నితమైన వ్యక్తి. ‘లత’ కున్న లక్షణం అల్లుకుపోవడం. ఇక్కడ ప్రతివాళ్ళతో కలిసిపోయే మానవసంబంధాలున్న వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దానికి కారణం ఆమె చిన్న విషయానికి కూడా స్పందించగలిగే మృదువైన హృదయం గలది. అందుకే ఆమె ఏ విషయాన్ని చూసినా, విన్నా దాన్ని కవిత్వంగా చేయగలుగుతుంది. అంటే కవిత్వాన్ని రాయాలంటే స్పందన ముఖ్యం. ఒక కవితలో పాఠకుని హృదయాన్ని, మరొక కవితలో కవిహృదయాన్ని వర్ణించి, కావ్యశాస్త్ర సూత్రానికి ఒక చక్కని సమన్వయాన్ని అందించారు.

మానవత్వం పరిమళించే మంచి మనిషికి కవిత్వం పుడుతుంది. అదే స్పందన. తన చుట్టూ ఉన్న అనేక సంఘటనలకు, రోజూ చూస్తూ మనసుని కదిలించే సంఘటనలకు కవి గుండె కదిలిపోతుంది. ఆ సంఘటన, ఆ దృశ్యం పదే పదే గుర్తొచ్చి, కళ్ళెదుట కనిపించి మనిషిని నిలబడనీయదు. ఆ ఉద్వేగమంతా ఒక కవితగా బయట పడాల్సిందే.

‘’ఉదయాల్లో

 గొంతుస్పీకర్లో

బతుకుపాట

పాడుతోంది కూరలమ్మ.’’

ప్రతిరోజూ కూరగాయలు అమ్ముకోవడానికి ఒకామె వస్తుంది. ఆమె ప్రతి ఉదయం వస్తుంది. ఆమె గొంతు పెద్దగా అందరికీ వినిపించేలా కూరగాయల గురించి చెప్తుంది.  అలా ప్రతిదినం కూరగాయలు అమ్మకపోతే తన కుటుంబం గడవదు. దీన్ని అద్భుతంగా ఒక దృశ్యచిత్రంలా ఆవిష్కరించారు కవయిత్రి. కొన్ని పదాలు వేసేటప్పుడు కవులు తర్జన భర్జనలకు గురవుతారు. ‘ఉదయాన్నే’ అంటే సరిపోతుంది కదా, మరి ‘ఉదయాల్లో‘ అని ప్రయోగించడమెందుకు? ఈ రెండు పదాలలో దేన్ని ప్రయోగిస్తే బాగుంటుందనే సంఘర్షణ పడి ఉండారు. తర్వాత  అన్యభాషా పదం వేసినా, నిత్యం వాడుకొనే, అందరికీ అర్థమయ్యే పదాన్ని వేయడం తప్పుకాదనుకున్నారు. అందువల్ల ‘గొంతు స్పీకర్లో’ అని అన్యభాషా పదంలో కూడా సంధి చేసేశారు. ఈ రెండు పదాలు కవితలో ఒక లయను, ఆ కూరగాయలు అమ్మే ఆమె గొంతునీ వినగలిగేలా చేయవచ్చు. కాబట్టి, ఉదయాన్నే కంటే ‘ఉదయాల్లో’ అని, ప్రతీరోజూ అనే అర్థం వచ్చేటట్లుగా ఉదయాన్ని బహువచనం చేశారు. చివరిలో ‘ కూరలమ్మ’ అనడంలో కూరగాయలు అమ్మే మనిషి అనడం కంటే ‘అమ్మ’ అనడం వల్ల ఆమె పట్ల కవయిత్రికి ఉన్న మానవీయ స్పర్శకూడా పాఠకుణ్ణి ఆనందంలో ముంచేస్తుంది. ఈ ఒక్కనానీలోనే కవయిత్రి ప్రతిభ, కవ: నిరంకుశ: అనే ఆర్యోక్తి వంటివెన్నో కనిపిస్తున్నాయి.

“ఆశల మబ్బుని /తలగడ చేసుకున్నా/మొయిలు బాష్పమై/వర్షించింది.”  అద్భుతమైన భావుకత. తన ఆశలు నెరవేరనప్పుడు పడుకొని ఒంటరిగా ఏడుస్తుంటే తలగడ తడిసిపోయిందట. చక్కని దృశ్యం కనిపిస్తుంది. ‘చీకటిపిట్ట /రేయంతాపాడింది/ వేకువపిట్టనులేపి/ నిద్రపోయింది’ రాత్రీ, పగళ్ళను కవిత్వం చేశారు.‘నిన్న ఎక్కడో!! /రేపు ఎక్కడో!! /నేటికి మాత్రం/ ఈ దేహంలోనే మజిలీ’ మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదు. కానీ, గతంలో ఎక్కడున్నామో, భవిష్యత్తులో ఎక్కడుంటామో తెలియదు. తెలిసేది మాత్రం వర్తమానం. దేహంలోనే మజిలో అనడం ద్వారా ఆత్మ నిత్యం అనే తాత్విక భావన. ‘’సౌందర్యం/ ప్రకృతి కాంతదా?/ కవి సృజించిన/ కవితాకాంతదా?’’ అనే ప్రశ్నలో వ్యక్తీకరణకు ప్రాధాన్యాన్నిచ్చినా, కేవలం వ్యక్తీకరణ నైపుణ్యం ఉంటే సరిపోదు వస్తువైవిధ్యం, జీవిత సారం, దాన్ని అనుభవించే సహృదయతా ముఖ్యం.

సౌందర్యశాస్త్రం (ఈస్తటిక్స్)లో సౌందర్యం ఎక్కడ ఉంటుంది? వస్తువులోనా? శిల్పంలోనా? అనే చర్చ ఉంది. అలాగే ఆనందం ఎక్కడ ఉంటుంది. మనిషిలోనా? ప్రకృతిలోనా? దేన్నీ ఒక్కమాటలో చెప్పేయలేం. ఎంతో చర్చ చేయాలి. ‘‘శనై: శనై: యన్నవతా ముపైతి తదేవ రూపం రమణీయతాం’’ అనే శ్లోకంలోని భావమే. మొదట రూపంగా కనిపించినా లేదా రూపాన్ని ఆధారం చేసుకున్నా, తర్వాత ఆ రూపం కంటే మానవుని మనసు నుండి ఏదైతే మెలమెల్లగా ఆనందంగా బహర్గతమౌతుందో అదే సౌందర్యం అని ఒక ఆలోచన ఉంది. ‘శ్రామికుడూ.. కర్షకుడూ/కిరణుడూ /ఆమెతో/పోటీపడి ఓడారు./ రాత్రీ, పగలూ తేడా లేకుండా పనిచేసే స్త్రీమూర్తి శ్రమైకజీవన సౌందర్యాన్ని ఇంతకంటే ఎవరూ చెప్పలేరేమో అన్నంతగా వర్ణించారు.ఇలా పాలపర్తి హవీలా గారి కవిత్వం చదువుతున్నంతసేపూ ఆమె పాండిత్యం, సహృదయత, స్పందన, నిండుకుండలా నిలబడే ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఆమె రాసిన ప్రతి నానీ ఎంతో హృద్యంగా పదేపదే చదివించే మనోరంజకత్వ గుణాన్ని కలిగి ఉంటాయి.‘’ఆమె ఎంత నేర్పరో? /తనగుండె /తరిగినప్పుడల్లా..../ ఉల్లి తరుగుతుంది’’‘’అతనికళ్ళలో /గ్రీష్మాలు కాశాయి/ ఆమె నయనాల్లో/మోదుగలు పూశాయి’’‘’పూల కార్మికులతో /పుప్పొడి అద్దకాలు/ వేయించుకుంది/ సీతాకోక.’’‘’హాల్ నిండలేదంటే/ చిత్రం ఫ్లాప్ /గుండె నిండలేదా? /కవిత్వం ఫ్లాప్’’ ఇలా ఎన్ని కోట్ చేసినా, ఇంకా చేయాలనిపించే చక్కని, చిక్కని నానీలు. నిత్య అధ్యయనం, లోక పరిశీలన, కవిత్వసాధన ముప్పేటగా కనిపించే హవీలా గారు సమకాలీన అగ్రశ్రేణి కవుల సరసన నిలబడతారు. ఈమె తెలుగు కవిత్వానికి నిజమైన ఒక వాగ్దానం.

బట్టు విజయ్ కుమార్ :

       స్వీయ అస్తిత్వం, ఉప్పొంగుతున్న యువహృదయ కెరటాలతో, భావుకతా ప్రపంచంలో పయనించే యువకవి. పద్యం, వచనం … ఏది రాసినా కవిత్వ పరిమళంతో వ్యాపించే కవి. గురువుల పట్ల వినయం, విద్యార్థుల పట్ల వాత్సల్యం, సాహిత్యమే జీవితంగా కనిపించే విజయ్ కుమార్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు విద్యార్థి. ఒక సాధారణ విద్యార్థిగా యూనివర్సిటీలో ప్రవేశించి, ఎం.ఏ. చదువుతున్నప్పుడే కవిత్వం రాస్తూ గురువుల ప్రశంసలు అందుకుని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొంది, అదింకా పూర్తికాకుండానే డిగ్రీ లెక్చరర్ గా ఉద్యోగం సాధించి, దానితో పాటు డాక్టరేట్ పట్టాను కూడా  రెండుచేతులతో నిండుగా బయటకు వెళ్ళిన విజయుడు. ఒక పూట తినకుండా ఉండగలడేమో గానీ, కవిత్వమో, ఒక వాక్యమో రాయకుండా ఉండలేనంతగా కనిపిస్తాడు విజయ్ కుమార్.

‘కలానికీ, కాగితానికీ

 జరిగిన యుద్ధంలో

కవిత్వమై

బయట పడ్డాను’

కవిత్వం ఒక సాధన. తొలిదశలో రాసిందంతా కవిత్వమనుకుంటాం. కానీ, ఎదిగే కొద్దీ కవిత్వమేదో గుర్తించే కొద్దీ హృదయంతో దాన్ని పలకరిస్తుంటారు. అది సంతోషపడేవరకూ యుద్ధం తప్పదు. దీన్నే ఈ నానీలో కవిత్వం రాయడం ఒక యుద్ధంలాంటిదని నిర్వచిస్తున్నాడు. కవిత్వం కావచ్చు, కన్నెపిల్ల కావచ్చు. మనసుని తాకితే ఎలా ఉంటుందో చెప్తూ…

‘చినుకులా నువ్వొచ్చి

చేరాక కన్ను

కునుకును

మరచింది’ అంటాడు. నిద్రపోయినట్లున్నా, నిద్రలేదని కళ్ళు చెప్తుంటాయి. కవిత్వం లేదా సాహిత్య రచన చేసేవాళ్ళకి ఏదైనా ఒక కొత్త భావన వస్తే దాన్ని అక్షరంగా మార్చే క్రమంలో కవిపొందే జీవుని వేదన ఎలా ఉంటుందో హృద్యంగా చెప్పాడు. ఆ కవిత్వం గనుక తాను వలచిన, తనను వలచిన ప్రియురాలిగురించైతే ఇక చెప్పాల్సిన పనేలేదు. ఎలా ఉంటుందో ఈ నానీలలో చూడొచ్చు. ‘ఈ రోజెందుకో/ నిద్రా కలలూ /రావడం లేదు/ నీ కైతలు తప్ప!’, ‘సఖి మధువు/ పోస్తూ కన్ను /గీటింది/ కవిత ఎదను మీటింది’

కవికి ప్రకృతిలోని ప్రతీదీ ఆనందానికీ, స్పందనకీ కారణమవుతుంది. కవి పసిపిల్లాడు లాంటి వాడు. పిల్లాడు దేనితోనైనా ఆడుకుంటాడు, ఆనందిస్తాడు. కవి కూడా అంతే, ప్రకృతితో తన్మయమవుతుంటాడు. ‘అర్థం కాని భాషలోనూ/ పాట పాడి /మనసును తేలిక చేస్తాయి/ పిట్టలు’ ఒక్కోసారి తన బాధనో, తన సంతోషాన్నో పిట్టలో చూడొచ్చు, పక్షిలో చూడొచ్చు. జంతువులో కూడా చూడొచ్చు. చెట్టు ఊగడంలో, ఆకు కదలడంలో కూడా తనకు తానే వాటిలో కనిపించవచ్చు. ఆ దృశ్యాలతో తన్మయం చెందొచ్చు. కవికి కావలసిన వాటిలో వర్ణనా సామర్ధ్యం, భావుకత అత్యంతముఖ్యమైనవి. ‘చీకటిని/కన్నుకొట్టి వెక్కిరిస్తాయి/కొంటె చూపుల/మిణుగురులు’ మిణుగురు పురుగులు ఒకసారి వెలిగి, మళ్ళీ ఆగి, మళ్ళీమెరుస్తుంటాయి. దీన్ని ఎంత చమత్కారంగా, ఔచిత్యమంతంగా తన భావుకతతో ముడివేశాడు కవి. అలాంటివే ఎన్నో నానీలు రాశాడు. తన గురువుగారు కూడా ప్రకృతినీ, సూర్య చంద్రుల్నీ వర్ణించారు. విజయ్ కుమార్ కూడా వర్ణించాడు. కానీ, ఇద్దరూ వేర్వేరు కోణాల్లో వర్ణించారు చూడండి. ఒక యువకుడు కవిత్వం రాస్తే, ప్రకృతి కన్యలా కనిపిస్తుంది. ఒక యువతి లేదా యువకుడు తన స్థితికి దగ్గరగానే ఆ ఊహలు ఉండే అవకాశం ఉంది. అందుకే ‘చంద్రుణ్ణి /చుక్కల అక్షింతలు చల్లి /ఆశీర్వదించింది /ఆకాశం!’ అనగలిగాడు. యువకవులలో భావుకతా సామర్థ్యం ఉన్న బట్టు విజయ్ కుమార్ కి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. నిరంతర అధ్యయనం, నిరంతర సాధన, నిరంతర అభ్యసన వల్ల ఆ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక మంచి కవిని తెలుగుసాహిత్యం అందుకోగలుగుతుంది. ఆ మార్గంలో పయనిస్తున్నకవి విజయ్ కుమార్. గురువుల గౌరవాన్ని నిలబెట్టే ఒక ఉత్తమశిష్యుడు.



         యలగందుల సుచరిత ‘కలల గవాక్షాలను/ తెరుస్తాయి/ మూసిన /కనురెప్పలు’ (పుట:141) అని చెప్పిన నానీలతో పాటు,  రజిత కొండసాని వారి ‘ మెరిసిన మెరుపు, కురిసిన చినుకులు, కాగితప్పడవలో, పసితనం’ పుట:143) అని చిన్నపిల్లల్లో తానొక పిసిపిల్ల అయిపోయిన నానీలు దీనిలో ఉన్నాయి. మంచి స్పార్క్ ఉన్న కవి రాళ్ళబండి బాలాజీరాజుగారు ‘కర్రదెబ్బకి, క్రిందపడి లేచాడు, మాటదెబ్బకి.., ఇప్పట్లో లేవడు’ (పుట: 146) అని మాటలోని శక్తిని తెలియజేస్తే నానీలు ఉన్నాయి. మంచి కథకుడు, కవి విద్యాసాగర్ నానీలలో లోతులు తూచగలరు.‘‘ పైకి నవ్వుతూ/, లోపల ఎన్నో/ ఎత్తుపల్లాలు దాచే/ సముద్రుడు నాన్న’’ (పుట: 160) అని నాన్నను ఎవరూ నిర్వచించలేనంత బలంగా వ్యక్తీకరించిన నానీలు కొత్తప్రపంచాన్ని చూపిస్తాయి. రాయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రపంచానికి అందించే ప్రచురణ కర్తలు మరొక ఎత్తు, వీరు నిజంగా గొప్ప సాహిత్యాభిమానులు. అందులో విట్టుబాబుగారొకరు. ‘‘వ్యక్తులంతా/ అపరిచితులేనేమో/ సమూహంలో ఒకటి /స్వగతంలో ఒకటి’’ (పుట: 179) అని మనుషుల ప్రవర్తనలను, మనస్తత్వాలను కవిత్వీకరించే నానీలు దీనిలో ఉన్నాయి.

ఈ పుస్తకంలో ప్రతివారి గురించీ రాయాలనిపిస్తున్నా, వ్యాసం పెరిగిపోతుంది. అందువల్ల కొంతమంది నానీలను మాత్రమే స్పర్శించాను. ప్రతి ఒక్కరిలో మంచి ఉత్సాహం ఉంది. భావుకత ఉంది. దాన్ని కవిత్వం చేయడంలోనే ఇంకా చాలామంది తమ నానీలను అందరిచేతా చదివించి, దాచుకొనేలా చేయగలుగుతారు. నిజమైన కవిత్వం ఏమిటో విమర్శకులు చెప్పినా చెప్పకపోయినా, పాఠకులు చెప్తారు. ఆ కవిత్వాన్ని ఆదరించడమే అది నిజమైన కవిత్వమని చెప్పడానికి ఒక మంచి ప్రమాణం. మన ఎదుట మన కవిత్వాన్ని ప్రశంసించినా, ప్రశంసించకపోయినా ఆ కవిత్వాన్ని చదివేటప్పుడు ఆ కవి లేదా కవయిత్రి ఆ పాఠకునిపై శాశ్వతమైన ఒక ముద్రవేస్తారు. అది కవిత్వంతో వేసే ముద్ర కావాలి. అలాంటి కవిత్వం ఈ పుస్తకంలో ఈ ‘రత్నాలు’ రాసులు పోశారు.

శ్రీ ఎన్. సిహెచ్. చక్రవర్తిగారు ఒక ఋషి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కవిత్వాన్ని సాధన చేయించి, దాన్ని ప్రచురించి, ఆ శిష్యులతో కలిసి పయనించడం ఎంతో గొప్ప విషయం. మన భారతీయ సంప్రదాయంలో కృష్ణ యజుర్వేదంగా పిలిచే తైత్తరీయోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. ఉపనిషత్తుల అధ్యయన సమయంలో గురువు – శిష్యుల మధ్య ఉపయోగించే శాంతిపాఠాలలో ఒకటి. ఇది మానవ సంబంధాల్లో సహకారం, ఓర్పు, విద్యాప్రాప్తి,  మానసిక సమతుల్యతను సూచించే అద్భుతమైన మంత్రం.

సహ నావవతు (మన ఇద్దరినీ పరమాత్మ రక్షించుగాక.)

సహ నౌ భునక్తు (మనిద్దరినీ పోషించుగాక.)

సహ వీర్యం కరవావహై (మేమిద్దరం కలిసి విద్యాధ్యయనంలో మనశక్తినంతా ఉపయోగిద్దాం.)

తేజస్వినావధీతమస్తు (మన విద్య ఫలదాయకంగా ఉండుగాక.)

మా విధ్విషావహై ( మన మధ్య  ఎటువంటి ద్వేషభావం కలగకుండుగాక.)

ఓం శాంతిః శాంతిః శాంతిః (లౌకిక, దైవిక, భౌతిక అశాంతులన్నీ తొలగి, శాంతి చెలామణి జరుగుగాక.)

నిజమైన గురువు తన దగ్గర ఉన్న విద్యనంతా ఉత్తములైన శిష్యులకు ధారపోస్తాడు. తనకంటే గొప్పవారైనప్పటికీ వారిని చూచి ఈర్ష్య చెందకుండా, తన శిష్యులు అంతటి వారైనందుకు గర్విస్తాడు. అంతే కాదు, తాను పాఠం చెప్పేటప్పుడు శిష్యుడు ప్రశ్నలు వేయడం, తర్కించడంలో ఇద్దరి మధ్యా జ్ఞానాన్ని శోధించడమే లక్ష్యం తప్ప, ఒకరిపై మరొకరి ఆధిపత్యం, అసూయా ద్వేషాలు ఉండకూడదని కూడా ఈ శాంతిమంత్రం తెలియజేస్తుంది.

దీనికి సజీవమైన ఉదాహరణగా శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తిగారు తమ శిష్యుల పట్ల వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నారని వారంతా కలిసి వేసిన పుస్తకాలు, శిష్యులు చెప్పిన మాటలు తెలియజేస్తున్నాయి.

శ్రీ ఎన్.సిహెచ్. చక్రవర్తిగారు భారతీయ ఋషి సంప్రదాయాన్ని పాటించి తన శిష్యులను తయారు చేస్తున్నారు. ఇది ఆధునిక జీవనవిధానంలో ఎంతోకష్టం. ఇలాంటివారిని గురువులు, శిష్యులు ఆదర్శప్రాయంగా చేసుకోవాలని భావిస్తూ, వారికి భగవంతుడు  పరిపూర్ణమైన జీవితాన్నిప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను.


హైదరాబాద్, 

తేది: 3.7.2025



కామెంట్‌లు లేవు: