Report/Telugu-Hcu/తెలుగు భాషా దినోత్సవం/29.8.2025
*హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం*
గిడుగు రామమూర్తి తన జీవితమంతా తెలుగు వ్యావహారిక భాషావికాసం కోసం, సవరల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడ్డం కోసమే కృషి చేశారని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యాఖ్యానించారు.
గిడుగు రామ్మూర్తి పంతులు గారి 163 వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని తెలుగు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమం కొనసాగుతున్న కాలంలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ప్రజానికానికి ఎటువంటిదో భాషా స్వేచ్ఛ కూడా అటువంటిదేనని భావించి గిడుగు రామమూర్తి పంతులు గారు ఉద్యమించారని ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యాఖ్యానించారు. సవరల కోసం ప్రత్యేకమైన వ్యాకరణాన్ని రూపొందించి, స్థానిక తెగల భాషా అధ్యయనానికి గిడుగు రామమూర్తి పంతులు శ్రీకారం చుట్టారని ఆచార్య పమ్మి పవన్ కుమార్ వ్యాఖ్యానించారు. నిఘంటువులు, వ్యాకరణ రూపకల్పనకు, ఆంథ్రోపాలజీ అధ్యయనానికి ఆనాడే గొప్ప పునాదులు వేశారని ఆయన కొనియాడారు. గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషా వాదాన్ని సరైన పద్ధతుల్లో ఉపయోగించినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని ఆచార్య డి.విజయలక్ష్మి అన్నారు. సవర జాతియొక్క జీవన విధానాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించి, వారి జీవితాలపై ఉత్తమకథలను రచించారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపక వర్గం ఆచార్య గోనానాయక్, ఆచార్య వారిజారాణి, ఆచార్య త్రివేణి, ఆచార్య భూక్యా తిరుపతి, డా.భుజంగరెడ్డి, డా.పి.విజయ్ కుమార్, డా.బాశెట్టి లత, డా.డి.విజయకుమారి, పరిశోధక విద్యార్థులు, ఎం.ఏ.విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని గిడుగు రామమూర్తి పంతులు గారికి నివాళులు అర్పించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి