కాకి శ్రీదేవి ( ఫైల్ ఫోటో)
.....
ఈమె పేరు కాకి శ్రీదేవి. అనారోగ్యకారణాలతో నిన్న సాయంత్రం (11.5.2025) ఐదు గంటలకు చనిపోయింది. నా దగ్గరే పిహెచ్డి పూర్తి చేసిన డా.మద్దిరాల సిద్ధార్థ ఉదయమే ఫోన్ చేసి చెప్పాడు.
కాకి శ్రీదేవి ఎం.ఏ., సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖలో చేసింది. తర్వాత ఎం.ఫిల్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పూర్తి చేసింది. నాజర్ మీద సిద్ధాంత గ్రంథం బాగా రాసింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి పిహెచ్డి లో చేరింది. ఆమె నా దగ్గర పరిశోధన చేయాలని అడిగింది. ఆ ఎం. ఫిల్ సిద్ధాంతం చూసిన తర్వాత ఒక మంచి పరిశోధన చేయగలుగుతుంది అనుకున్నాను. అంగీకరించాను.
ఆమెకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ వచ్చింది. ఆ డబ్బులతో కొన్నాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నానని చెప్పేది.
తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితులను కూడా చెప్పేది.
వాళ్ళ తమ్ముడు ని చదివిస్తున్నానని, అతను వైజాగ్ లో ఉంటాడని చెప్పేది.
తన తమ్ముడికి సంబంధించిన ఏదో వివాదం విషయంలో కూడా ఆమె తీవ్రంగా బాధపడేది. ఆ సమయంలో ఆమె అన్ని తానై తన తమ్ముడిని కాపాడుకుంది.
సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ లో పనిచేసేది. ఆమె దళిత సాహిత్యం, దళిత ఉద్యమాలు, బహుజన రాజకీయాలు ఎంతో లోతుగా మాట్లాడేది.
వైయస్సార్ పార్టీ ద్వారా పోటీ చేయాలని సీటు కోసం కూడా ప్రయత్నం చేసింది.
మీ చాలా యాక్టివ్ గా ఉండేది.
ఒకరోజు అప్పటి మా హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఎన్.ఎస్. రాజుగారు నాకు ఫోన్ చేశారు.
‘’బాబు.. మీ దగ్గర పరిశోధన చేస్తున్న విద్యార్థిని శ్రీదేవికి ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయట. ప్రస్తుతం ఆమె మన యూనివర్సిటీ ఆసుపత్రిలో ఉంది. ఒకసారి మీరు వెళ్లి చూడండి’’ అని చెప్పారు.
నేను వెళ్లి చూస్తే, ఆమె అప్పటికే కొంచెం కోలుకుంది. డాక్టర్లతో మాట్లాడాను. ఆమెతో కూడా మాట్లాడాను. ఆమెకు అప్పటికే 180 బి.పి.ఉంది. డాక్టర్స్ టాబ్లెట్స్ వాడమని చెప్పారు. అప్పటికి అలాగే వాడతానని చెప్పింది. కానీ, టాబ్లెట్లు వాడలేదు.
తర్వాత కౌన్సిలింగ్ చేశాను.
‘రోజు టాబ్లెట్స్ వేసుకోవడం కష్టం సర్’ అంది.
‘’మనం రోజూ మంచినీళ్లు తాగుతున్నాం. మనం రోజూ, ప్రతీ నిమిషం మనకు తెలియకుండానే గాలి పీలుస్తున్నాం… ఇంకా చాలా పనులు రోజువారిగా చేస్తున్నాం. అవి చేయకపోతే మనం బ్రతకలేం…’’ ఇలా ఎన్నో విధాలుగా ఆమెకు కౌన్సిలింగ్ చేశాను. మందులు వాడడానికి ఒప్పుకుంది. వాడిన తర్వాత ఆమెలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. రీసెర్చ్ వర్క్ చేస్తానని చెప్పేది. ఈలోగా వేముల రోహిత్ సంఘటన జరిగింది. అంబేద్కర్ అసోసియేషన్ లో భాగంగా ఉండేది. ఆందోళనలో పాల్గొనేది. ఢిల్లీ కూడా వెళ్ళింది. అందువల్ల ఆ తన పరిశోధన గురించి పట్టించుకోవడం మానేసింది.ఆ తర్వాత ఆమెకు రాజకీయాల్లో పాల్గొవాలనే ఆసక్తి పెరిగింది. రాజకీయాలలో డబ్బు సంపాదించే విధానం చాలా సులభంగా ఉంటుందని చెప్పేది. ‘’ఒక ప్రొఫెసర్ జీవితాంతం పనిచేసినా ఒక మంచి ఇల్లు… కారు కొనుక్కుంటే సరిపోతుందనుకుంటాడు. కానీ రాజకీయవేత్తకు ఒక ఐదు సంవత్సరాల అనుభవం ఉంటే, అతను సంపాదన మామూలుగా ఉండదు. తాను ఆర్థికంగానూ, సాంఘికంగానూ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అతనికి సలాం కొడుతుంది. చెప్పేది ప్రజాసేవ. చెప్పేదంతా ప్రజాసేవ…కానీ చేసేదంతా సంపాదించే మార్గాలను అన్వేషించడమే. అందరూ అలాగే ఉంటారని నేను అనను కానీ ఎక్కువ శాతం మంది వాళ్లే కనిపిస్తున్నారు’’. అంటూ తన సామాజిక అవగాహనను వివరించేది.
‘’ డబ్బు సంపాదించడానికే ప్రొఫెసర్ అవుతారనుకోవడం ఆ ప్రొఫెషన్ కే అవమానం. ప్రొఫెసర్ కి అనేక లక్ష్యాలుంటాయి. అనేక ఆశయాలుంటాయి. జాతి నిర్మాణంలో తానొక కీలకమైన పాత్రపోషిస్తాడు. అదే కాదు, నా దృష్టిలో టీచింగ్ అండ్ రీసెర్చ్ ఒక పవిత్రమైన వృత్తి. అదొక బాధ్యత…అది నీకింకా తెలియదు…’’ అంటూ మౌనంగా ఉండి పోయేవాడిని. అంతే ఇక, ఆ డబ్బు సంపాదించేమార్గాల గురించి నా దగ్గర మాట్లాడేది కాదు.
కొన్నాళ్లకు ఫెలోషిప్ అయిపోయింది.
ఈలోగా ఒక రోజు వచ్చి,కుటుంబ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పింది. తన తల్లి బెడ్ పైనే ఉంటుందనీ, ఆమెను చూసే వాళ్ళు లేరనీ బాధపడింది. ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవనీ, తన తల్లి ఆరోగ్యాన్ని బాగుచేయించుకోవడానికి కొంత డబ్బు కావాలని, తన దగ్గర తిన్న వాళ్ళు ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఒక పైసా కూడా తనకు ఇవ్వడం లేదని, మౌనంగా నిలబడిపోయింది. నా స్థాయిలో నాకు తోచిన సహాయం చేశాను. తాను ఇంటికి వెళతాననీ వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ నాకు ఫోన్ చేయలేదు. మా సిద్ధార్థ ఆమె గురించి చెప్పేవాడు. పెళ్లి చేసుకోమన్న చేసుకోవడం లేదనీ తన కుటుంబానికే ఆమె అంకితం అయిపోయిందని, లోగా ఆమెకు పక్షవాతం వచ్చిందని కూడా చెప్పాడు. అది తెలిసి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాలి. కన్నీళ్ల కెరటమయ్యింది. మీరు చెప్తుంటే అప్పుడు వినలేదు అక్కడ మీరు తిడతారేమోనని టాబ్లెట్స్ వేసుకునే దాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత మానేశాను. మీరు చెప్పినట్టే నా ఆరోగ్యం క్షీణించిపోయింది. పక్షవాతం వచ్చింది సర్’’ అని బోరుని ఏడ్చేసింది.
ఆ తర్వాత ఆమె ఎవరితోటి ఎక్కువగా మాట్లాడేది కాదట. ఆమె ఫోన్ చేస్తే అది ఎవరో తీసేవారు. నా గురించి సమాచారం ఇచ్చేవారు కాదు. ఆ. క్రమంలో ఫోన్ చేయటం మానేశాను.
ఉదయం సిద్ధార్థ ఫోన్…శ్రీదేవి లేదని!
***
ఒక అసంపుర్ణ ధిక్కార స్వరం
గ్రీన్ టీ తాగుతున్నప్పుడల్లా
కేరళ నుండి ప్రేమగా తెచ్చిన
తేయాకులపొడిలా నువ్వే పరిమళిస్తున్నావు
తల్లికోసమో, తమ్ముడు కోసమో
మొత్తం కుటుంబం కోసమో
తపనపడేవాళ్ళను చూసినప్పుడల్లా
ఆ త్యాగంలో కరిగిపోయిన నువ్వే కనిపిస్తున్నావు
ఏ శవరాజకీయాల్ని చూసినా
నువ్వు చెప్పిన ఢిల్లీ కబుర్లే వినిపిస్తున్నాయి
తొలిసారిగా ఫెలోషిప్ తీసుకున్నవాళ్ళ
సంతోషాన్ని చూసినప్పుడల్లా
కొత్త బట్టలు, కొత్త చెప్పులతో
మురిసిపోయే కుటుంబాలే కనిపిస్తాయి
చెయ్యని పరిశోధన కోసం సృష్టించే కథల్నివింటూ
ఫెలోషిప్ పై సంతకం పెట్టినప్పుడల్లా
నా ముందు పెట్టిన
నీ అసంపూర్తి రఫ్ డ్రాప్టులే గుర్తుకొస్తున్నాయి
పెళ్ళిచేసుకోకుండా
కుటుంబ బాధ్యతల్ని మోసే
‘ఆడపిల్లల్ని’ చూసినప్పుడల్లా
తమ గుండెలపై పెట్టుకొని
కుటుంబ బాధ్యతలన్నీ మోస్తుంటారనే
పురుషాధిపత్యాన్ని
చెంప చెల్లుమనిపించిన నీ ధిక్కారమే కనిపిస్తుంది
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
12.5.2025
(అనారోగ్యంతో 11.5.2025 వ తేదీన మరణించిన మా పరిశోధక విద్యార్థిని కాకిశ్రీదేవికి నివాళులు అర్పిస్తూ…)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి