"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

12 ఏప్రిల్, 2025

సాహిత్య ప్రక్రియలపై అవగాహనకు ఓ చిరు ద్వారం

 సాహిత్య ప్రక్రియలపై అవగాహనకు ఓ చిరు ద్వారం 

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

పూర్వ అధ్యక్షులు, తెలుగు శాఖ,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటి), 

 హైదరాబాద్ – 500 046.

సాహిత్యం, దానికి సంబంధించిన వార్తాంశాలు మాత్రమే ప్రచురిస్తూ, తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవలు అందిస్తున్న ‘తెలుగు దినపత్రిక’ సంపాదకులు శ్రీ బి.వి.వి.ఎస్.కామేశ్వరరావుగారు ఒక తెలుగు భాషాభిమాని. వ్యక్తిగా కనిపించే ఒక గొప్ప అక్షరశక్తి. తెలుగు భాషాసాహిత్యాల ఉద్యమదీప్తి. గత కొన్నాళ్ళుగా ఆ పత్రిక ప్రతిరోజూ చదువుతున్నాను. తెలుగు భాష వ్యవహారంలో స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయేస్థితిని కల్పించే కొన్ని పదాలు, వాక్యాలను చూసినప్పుడు దానికి ఒక సరైనమార్గాన్ని సూచించడానికి ఆ యా రంగాల్లో ఉన్న నిష్ణాతులను తమ అభిప్రాయాల్ని తెలుపుతూ భాషపట్ల చైతన్యాన్ని తీసుకొస్తుంటారు.తెలుగు భాష అర్థవిపరిణామాన్ని పొందుతున్న క్రమాన్ని కూడా కొన్నాళ్ళపాటు ప్రతిరోజు ఒక శీర్షికగా రాశారు. 

తెలుగు సాహిత్య ప్రక్రియల స్వరూప, స్వభావాలను

ఆ మధ్య తెలుగు భాషాసాహిత్యాల గొప్పతనాన్ని తెలియజేసే ప్రక్రియావైవిధ్యాన్ని తెలియజేస్తూ ధారావాహికంగా తెలుగులోకం పత్రికలో ప్రచురించారు. ఆ వ్యాసాలను ‘సాహితీ క్రియ–ప్రక్రియ’ పేరుతో ఒక సంకలనంగా తీసుకొస్తున్నారు. దీనిలో 18 వ్యాసాలు ఉన్నాయి. అవన్నీ ఇంచుమించు తెలుగు సాహిత్యంలోని కొన్ని ప్రక్రియలను పరిచయం చేసేవే. ఇవన్నీ కొండను అద్దంలో చూపించినట్లుగా రెండు మూడు పుటల్లోనే ఆ ప్రక్రియ లక్షణాలను, కొన్ని రచనలతో సమన్వయాన్ని చేయడం, ఆ ప్రక్రియ పరిణామ వికాసాలను వివరించడం సామాన్యమైన విషయం కాదు. ఈ వ్యాసాలు రచించిన వారు వివిధ కళాశాలల్లో పనిచేస్తున్నవారు; పనిచేసిన వారు. మరికొంతమంది తమ వృత్తి సాహిత్య బోధన కాకపోయినా ప్రవృత్తిగా సాహిత్య రచన కొనసాగించేవారున్నారు. అలాంటి వారిలో డా.రాధశ్రీగా సుప్రసిద్ధులైన డా.డి.ఏ.వి.ఆర్.కె.ప్రసాద్ గారు పద్యాన్ని వర్ణించడంలో చేయితిరిగిన కవి. ఆయన చేతిలో పద్యం మృదుమధురంగా ఒదిగిపోతుంది. అటువంటి ఆయన రాసిన వ్యాసాలు కూడా అంతే సులభమైన శైలిలో విషయగాఢతతో కొనసాగాయి. ప్రబంధసాహిత్యం, గేయకథాకావ్యాలు, యాత్రాసాహిత్యం మొదలైన వ్యాసాలు ఆయన సునిశిత పరిశీలనతో రచించిన వ్యాసాలు. ప్రక్రియలతో పాటు ఉద్యమాలు, ధోరణులు, వాదాల వంటి వాటిలో చేర్చదగిన ‘దిగంబరకవిత్వం’ వ్యాసం, కవిత్వప్రక్రియలో భాగమే. ఆ వ్యాసం రచించిన డా.నల్లా నరసింహమూర్తిగారు కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధకవి. అవదానం అమృతవల్లిగారి ‘స్మృతి సాహిత్యం’ కొత్త అంశాల్ని అందించే ప్రయత్నం చేసిన వ్యాసం. రచయిత్రి డా.భువనేశ్వరి మారేపల్లి రాసిన ‘వ్యాసం’ అనే పాశ్చాత్య సాహిత్య ప్రక్రియ. దీన్ని రచయిత్రే పేర్కొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘తెలుగు వ్యాస పరిణామము’లో మరిన్ని లోతైన విషయాలకు ఆ గ్రంథాన్ని సంప్రదించాలి. ప్రసిద్ధ రచయిత్రి, పరిశోధకురాలు డా.దేవులపల్లి పద్మజ గారు పరిచయం చేసిన ‘నవల’ ప్రక్రియ పై విస్తృతమైన సమాచారం లభిస్తుంది.అయినా సంక్షిప్తంగా ఆమె చెప్పిన తీరు ప్రశంసనీయం. డా.పసుపులేటి నాగమల్లికగారు ‘చంపూకావ్యం’ గురించి రాస్తూ ఆంధ్రమహాభారతాన్ని అనుసృజన చేసిన నన్నయ, ఆయన కాలానికి ముందూ, తర్వాత ఉన్న శాసనాల్లోని పద్యాలను, కావ్యాల్లోని చంపూ కావ్య వైశిష్ట్యాన్ని విశ్లేషించిన తీరు బాగుంది. భారతీయ ఆలంకారికులు, పాశ్చాత్య సాహిత్య విమర్శకులు చెప్పిన కావ్య విభజన రీతులతో దీన్ని అన్వయించడం ఆమె లోతైన పరిశీలనకు నిదర్శనం. ఉదాహరణ కావ్యం గురించి శిష్టవ్యావహారికంలో రాసిన డా.పి.శాంతమ్మగారు చిన్ని వ్యాసంలో కూడా ఎంతో సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశారు. ద్విపదకావ్యం గురించి డా.సిహెచ్.రమాదేవి లోతైన అధ్యయనం చేసి, సరళంగా దాన్ని పరిచయం చేస్తూనే, ఆ కవిత్వసౌందర్యాన్ని కూడా పరిచయం చేయడం అభినందించదగ్గ విషయం. తెలుగులో అనేక చారిత్రక కావ్యాలు వచ్చాయి. ప్రాచీన చారిత్రక కావ్యలక్షణాలను, స్వరూప స్వభావాలను డా.ద్వివేది కృష్ణగాయత్రి చక్కగా పరిచయం చేశారు. బాలల సాహిత్యంతో పాటు, ఆధునిక కవితాప్రక్రియలపై చక్కని అవగాహన ఉన్నవారు గుడిపూడి రాధికారాణి. ఆమె వ్యాసం చాలా బాగుంది. ఇలా అందరూ పత్రికలో లభించే స్థలాన్ని బట్టి ఆ యా ప్రక్రియలను పరిచయం చేశారు. కొల్లిరామయ్య గారు హైకూని పరిచయం చేసినా, ఆ కవితామాధుర్యాన్నికూడా రుచిచూపించారు. ఖండకావ్యం కవిత్వ కండ ఉండే కావ్యంగా సాహితీవేత్తలతో ప్రశంసలు పొందిన ఈ ప్రక్రియలో దళితుల గురించి వర్ణించిన కావ్యం మంగిపూడి వేంకటశర్మగారి ‘నిరుద్ధభారతం’ కూడా ఖండకావ్యంగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో జాషువా తనదైన ముద్రవేసిన కవి. ఈ వ్యాసాల సంకలన కర్త, పత్రికాసంపాదకులు శ్రీ బి.వి.వి.ఎస్.కామేశ్వరరావుగారు డిటెక్టివ్ సాహిత్యంపై ఒక సమగ్రవ్యాసాలన్ని అందించారు. డిటెక్టివ్ నవలారచనలోని విశేషాంశాల్నీ, ఆ రచనలు, రచయితలను కామేశ్వరరావుగారు ఎన్నో విశేషాలను తెలిపారు.

సాధారణంగా సాహిత్య ప్రక్రియలను లోతుగా అధ్యయనం చేయాలనుకునేవారికి అనేక పరిశోధన గ్రంథాలు ఉన్నాయి. మన తెలుగు సాహిత్యంపై జరుగుతున్న పరిశోధనల్లో ఆ ప్రక్రియ గురించి నేపథ్యంగా ఆ ప్రక్రియ పరిచయం, వికాసం వంటివన్నీ వివరిస్తారు. తెలుగు సాహిత్య ప్రక్రియలను మరింత లోతుగా తెలుసుకోవాలనుకునేవారికి ఆ పుస్తకాలు తమ జ్ఞానతృష్ణను తీరుస్తాయి. నేడు పోటీ పరీక్షల కోసం కూడా అనేక ప్రయివేటు సంస్థలు కూడా సాహిత్య ప్రక్రియలపై సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అవన్నీ ఈ పత్రికానిర్వాహకులకు తెలిసినా, సామాన్యపాఠకులకు కూడా వివిధ సాహిత్యప్రక్రియలను పరిచయం చేయాలనే ఆలోచన ఎంతో గొప్పదిగా భావించాలి. ఈ వ్యాసాలన్నీ పత్రిక చదివే సామాన్య పాఠకులకు ఎంతో విజ్ఙాన్ని అందించి ఉంటాయి. ఇప్పుడు పుస్తరూపంలోకి తీసుకొని రావడం ద్వారా ఆ ప్రక్రియలపై లోతుగా అధ్యయనం చేసేవారికి కొంత ప్రేరణనిస్తాయి. వాటిని కేవలం ఆ పత్రికకే పరిమితం చేయకుండా, వాటికి విశేషగౌరవాన్నిస్తూ ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నందుకు సంకలనకర్తను అభినందిస్తున్నాను. అంతే కాదు, ఈ పత్రికలో భవిష్యత్తులో ఇలాంటి వ్యాసాలుగానీ, కవితలు గానీ పుస్తకాలుగా వచ్చే అవకాశం ఉందేనే సూచనను చేస్తూ ఈ గ్రంథం వెలువడుతుందని కూడా భావించవచ్చు. నేడు పెద్ద పత్రికలకు ఎంత ప్రాధాన్యం ఉందో, చిన్నపత్రికలకు కూడా అంతే ప్రాధాన్యం లభిస్తుంది. దానికి కారణం సామాజిక మాధ్యమాలు. ఏ పత్రికలో వచ్చినా వాటిని మరలా పత్రికల్లో ప్రాచుర్యంలోకి తీసుకొని రావడమే ప్రధాన కారణం. అందువల్లనే కరోనో తర్వాత డిజిటల్ పత్రికలు విస్తృతంగా వస్తున్నాయి. అవి స్థానిక పత్రికలైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆ విధంగా తెలుగులోకం పత్రిక కూడా తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటుంది. సాహిత్యాన్నే ప్రచురించడం ద్వారా పత్రికారంగంతో పాటు, సాహిత్య చరిత్రలోను దీనికీ, దీనిలో రచనలు చేసేవారికీ ఒక విశిష్టమైన స్థానం లభిస్తుందని చెప్పడం అతిశయోక్తికాదు. ఈ వ్యాసాలు రాసిన వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

12.4.2025

కామెంట్‌లు లేవు: