(ప్రముఖ గాయకుడు చాలాకాలం పాటు నక్సలిజం ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, తన పాటల తోటలతో ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసిన వారు గద్దర్. ఆయన మరణించిన తర్వాత ఆయనను ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు కీర్తించటం కనిపిస్తుంది. సాహిత్య పరంగా ఆయన పాట ఎన్నో చర్చలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కృపాకర్ మాదిగ రాసిన ఒక వ్యాసం ఆయనలోని భిన్న కోణాలను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించిన తీరు చరిత్రలో, భవిష్యత్తులో పరిశోధన చేసే వారికి ఉపయోగపడే వ్యాసంగా అనిపించింది. అందుకని కృపాకర్ గారి అనుమతితో ఈ వ్యాసాన్ని నా బ్లాగులో పునర్ ముద్రిస్తున్నాను..దార్ల)
// గద్దర్ -- భిన్న కోణాలు //
ఉన్నది ఉన్నట్టుగా చూడు.
ఉన్నదాన్ని ఎక్కువ చెయ్యొద్దు.
తగ్గించవద్దు.
మాయం చెయ్యొద్దు --- బుద్దుడు.
యాలరో యీ మాదిగ బతుకూ,నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకూ - అనే పాట నలభై ఏళ్ళ క్రితం మొదటి సారి విన్నాను.1980 - 85 సంవత్సరాల మధ్య కాలంలో విప్లవ విద్యార్థుల " విద్యార్థులారా! గ్రామాలకు తరలండి. " అనే వేసవి కార్యక్రమంలో,అనేక పాటల మధ్య ఈ పాటని ఎక్కువగా ప్రజల మధ్య పాడే వాళ్ళం. మంచినీటి కోసం,అధికారుల వద్ద సర్టిఫికెట్లు పొందడం కోసం,ఇంటి నిర్మాణ పనుల్లో,తెల్ల బట్టలు కట్టిన సందర్భంలో మాదిగలు ఎంత దారుణమైన కుల హింసలకు,వివక్షలకు గురౌతున్నారో,గద్దర్ ఈ పాటలో ఎంతో ఆర్తిగా రాశారు.1985 కారంచేడులో కమ్మ ఆధిపత్య కుల దురహంకార దాడిని ప్రతిఘటించి మృతవీరులైన మాదిగలపై గద్దర్ రాసి,పాడిన " దళిత పులులమ్మా!కారంచేడు భూస్వాముల మీద,కలబడి నిలబడి పోరు చేసిన... " అనే పాటని సమాజం రోజూ నెమరు వేసుకుంటూనే వుంది.ఆగదు ఆగదు ఆగదు,ఈ ఆకలి పోరూ ఆగదు - అనే పాట,నాసా కింద,మీసా కింద నిన్నూ జైల్లో పెట్టీనారు,నీకూ నాకూ తేడా లేదయ్యో ఓ పోలీసన్న, పోరుదప్ప దారి లేదయ్యో ఓ పోలీసన్న - అనే పాట, వడ్డెరోళ్ళ మండి మేమూ - అనే పాట, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా - అనే పాట,యీ దేశం ఎవదిరిరా ఈ దేశం మనదేరా - అనే పాట,నడవరో రెంకన్న నడవరో! - అనే పాట,ఇంకా ఆనాడు గద్దర్ నోట గానమైన ప్రతీ పాట,ఎన్నో పాటలు సమాజంలోని వర్గ,కుల,జెండర్ అసమానతలను ఎత్తి చూపినాయి.పీడితుల దృక్పథంతో కొన్ని సార్లు దుఃఖాన్ని,సహానుభూతినీ పంచాయి.కొన్ని సార్లు దోపీడీ,పీడనలపై నిప్పులు కురిపించాయి. సమాజాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ పాటలు ప్రజల్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి.సమాజంలో అసమానతలు ఉన్నంత వరకూ కొన్ని గద్దర్ పాటలు ప్రాసంగికత కలిగి, పీడితులను కదిలిస్తూనే ఉంటాయి.ఇది సాంసృతిక రంగంలో గద్దర్ ముద్ర,కృషీ,ప్రభావం.ఇక,ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కోసం,మానవ గౌరవం,కోల్పోయిన మానవ హక్కులు తిరిగి పొందటం కోసం జరిగిన మాదిగ దండోరా చారిత్రిక ఉద్యమాన్ని పైకి బలపరిచినప్పటికీ,మాల కులస్తుడైన గద్దర్ కి లోపల వ్యతిరేకత ఉందనే దానికి రుజువులున్నాయి.మాదిగల విషయంలో గద్దర్ సమధర్మాన్ని పాటించలేదు.లోపల మాల మహానాడుగానే ఉన్నాడు.ధర్మాన్ని పాటించడం అంటే బౌద్ధాన్ని స్వీకరించడం కాదు.తనకంటే వెనుకబడిన సమూహాలకు న్యాయం జరగాలని ఆచరణలో ఉండటం.నిరంతరం బాధితులతో ఉండటం.సామాజిక న్యాయమంటే,యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు రిజర్వేషన్లలో సామాజిక గౌరవంతో కూడిన పంపిణీ న్యాయం జరిపించుకోడం. ఇందుకోసం కృషి చేయడం.అంతేకానీ,వేదికల మీద, పెదవులపై అంబేడ్కర్ పదాలను నర్తింపజేయడమంత ఈజీ కాదు.
అణగారిన కులాల సమస్యల మీద,ఇతర సామాజిక సమస్యల మీదా తాను పాటలు రాసి,పాడినపుడు సాంసృతిక రాజకీయాల్లో గద్దర్ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు.తాను పాడిన హిట్టు పాటల్లో చాలా పాటలు ఇతరులు రాసిన హిట్టు పాటలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు : ఊరు మనదిరా,ఈ వాడ మనదిరా పాటని గూడ అంజయ్య రాసారు.కొండలు పగలేసినం,బండలను పిండినం పాటని చెరబండరాజు రాశారు.ఏం పిలడో ఎల్దమొస్తవా అనే పాట వంగపండు ప్రసాద్ రాశాడు. ఎర్రజెండెర్రజెండెన్నియ్యలో అనే పాట అల్లం వీరయ్య రాశారు.ఇలా ఎందరో రాసిన,ఎన్నో హిట్టు పాటలను తాను పాడడం వలన,యీ పాటల క్రెడిట్స్ కూడా గద్దర్ కీర్తి ప్రతిష్టల అకౌంట్లోనే పడిపోయాయి.ఎర్ర జెండా అతనికి ఊతకర్ర అయింది.అంతే కాదు,అతనికి వచ్చిన అపరిమిత కీర్తి ప్రతిష్టల వెనుక,పీపుల్స్ వార్,ఇంకా మరెన్నో ప్రజా సంస్థల రాజకీయ,నైతిక,భౌతిక సంఘీభావం ఉంది. సంస్థాగత బలం తెచ్చి పెట్టిన యీ అపరిమిత కీర్తి ప్రతిష్టలను వొదులుకోవడం ఇష్టంలేక,దానిని కొనసాగించుకోవడానికిగాను,తానింకా విప్లవ పార్టీలోనే కొనసాగుతున్నట్లు గద్దర్ సమాజాన్ని భ్రమింప జేశాడు.ఇది ప్రజల్ని మోసం చెయ్యడమే.అలాగే,గద్దర్ మా పార్టీలో లేడు,బైటకు వెళ్ళాడు,అతనికీ మాకూ సంబంధం లేదని మావోయిస్టు పార్టీ కూడా ప్రముఖంగా ప్రకటించి,ప్రజల దృష్టికి తీసుకురాకపోవడం వలన,గద్దర్ ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడని సామాన్య,మధ్యతరగతి ప్రజలు భ్రమించడానికి ఆస్కారమయ్యింది.గద్దర్ ప్రజల పట్ల జవాబుదారీతనంతో, పారదర్శకతతో లేకపోవడం వలన,ఆయన అనుసరించిన అనేక అస్పష్ట రాజకీయ మార్గాలు ప్రజల్ని గందరగోళంలో పెట్టాయనేది స్పష్టం.
భారత దేశంలో అధికార,ప్రతిపక్ష పార్టీలు,కమ్యూనిష్టు, విప్లవ పార్టీలు అనబడేవి అన్నీ పాలక కులాల నాయకత్వ నియంత్రణలలో వున్న పార్టీలే.అణగారిన సామాజిక వర్గాల అభ్యున్నతి అజెండాతో ఉన్నామని చెప్పే ఆధిపత్య కుల నాయకత్వాల పార్టీలన్నీ హిందూ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలే.త్రివర్ణ,సూద్రాధిపత్య కులాల రాజకీయ ప్రయోజనాలను పెంపొందించడం కోసం విశేషంగా కష్టపడే బహుజన సామాజిక వర్గాల వ్యక్తులకు,ఆధిపత్య కుల రాజకీయ వ్యవస్థలు రాముని సేవలో తరించే హనుమంతుడు వంటి సామాజిక స్థాయి నాయకత్వాన్ని కట్టబెట్టి,ప్రాచుర్యం కల్పిస్తాయి.వర్గ రహిత ఉద్యమ వ్యూహంలో గద్దర్ కి కల్పించిన ప్రముఖత్వం కూడా ఇటువంటిదే.అపరిమితమైన కీర్తి ప్రతిష్టలను పొందిన గద్దర్ పారదర్శకతతో,జవాబుదారీతనంతో బహుజన రాజకీయ సాంస్కృతిక ఉద్యమానికి పునరంకితమై ఉండేవాడు.కానీ,అట్లా లేడు.
రూలింగ్ మైనారిటీలైన హిందూ పాలక కులాల దగ్గర సంపద,అధికారం,శక్తివంతమైన ప్రసార సాధనాలైన మీడియా అపరిమితంగా,అసహజంగా కేంద్రీకృతమై ఉంది.వీటిని ఆధిపత్య సమూహాలు తమ సామాజిక, ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక ప్రయోజనాల కోసం లేదా వాటి ఆధిపత్యాలను నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రయోగిస్తాయి.అవసరమైన పనుల్లో చురుకుదనం,చొరవ, తెలివి,బలము,రక్షణ,శిక్షణ,అభివృద్ధి,ప్రభావపూరిత కళాత్మకత,నిపుణతలు,నియంత్రణా శక్తిగల వారిని సమాజం వివిధ రంగాల్లో తమ నాయకులుగా, మార్గదర్శకులుగా,ఆదర్శనీయులుగా ప్రతి సమాజమూ నిలబెట్టుకుంది.సాపేక్షికంగా వెనకబడిన సమాజాల్లో ఇది ఇంకా ఎక్కువగా చూడగలం.
విముక్తి సిద్ధాంతాలను పుక్కిట బట్టి,వాటిని వ్యక్తిగత, ప్రైవేట్ ఉన్నతి కోసం,కేవలం ఒక టెక్నాలజీ (సాధనాలు)గా మాత్రమే వాడుకునే వారిని తోసిపుచ్చే స్థాయికి మన ప్రజల్లో పర్యవేక్షక చైతన్యం పెరగలేదు.ఇది వివిధ రంగాల్లో నాయకులుగా తిష్ట వేసిన మోసగాళ్ళకు పెద్ద సామాజిక వనరుల పెట్టుబడి అయి కూర్చుంది.గద్దర్ బతికుంటే,జాతీయంగా కాంగ్రెస్ వాళ్ళకి మేలు జరిగేదేమో?అతను చనిపోయి,ప్రాంతీయ పార్టీలకు అనుకూల బలముగా మారాడు! ప్రభుత్వ అధికార లాంఛనాలతో గద్దర్ అంత్య క్రియలు జరపడం ద్వారా,గద్దర్ మీద ప్రజల్లో వున్న సానుకూలత, ప్రముఖత్వాన్ని బిఆర్ఎస్ నాయకత్వం ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది.ఇక అంబేడ్కరైట్ పార్టీలన్నింటికీ గద్దర్ సమ దూరంలో ఉన్నాడు.అలాగే,మనువాద పార్టీలన్నింటికీ సమ దగ్గరలో ఉన్నాడు.
గద్దర్ ఎర్ర జెండా ఎత్తుకున్నాడు.కానీ,కొన్ని దశాబ్దాలుగా ఏ ఎర్ర పార్టీలోనూ లేడు.ఉన్నట్లు ప్రజల్ని కన్ఫ్యూషన్ కి గురి చేశారు.అతను బుళుగు జెండా ఎత్తుకున్నాడు గానీ,కొన్ని దశాబ్దాలుగా ఏ బుళుగు పార్టీలోనూ లేడు! వున్నట్లు ప్రజల్ని గందరగోళానికి గురిచేశాడు! రాజకీయ,సాంసృతిక సంతలో మోసంగా తన ప్రముఖత్వం తగ్గకుండా కాపాడుకున్నాడు.ప్రజల అభిమానాన్ని ఆరాధన స్ధాయికి తీసుకెళ్ళడంలో తిలా పాపమ్ తలా పిడికెడులా జరిగిపోయింది.గాంధీ,రణడే,జిన్నా అనే వ్యాసంలో డాక్టర్ అంబేడ్కర్ -- వ్యక్తి ఆరాధన సరైంది కాదనీ,మూఢులు మాత్రమే వ్యక్తి ఆరాధన చేస్తారని,నాయకులు మంచి పనులు చేసినప్పుడు,అభిమానులు అభినందించాలని, నాయకుల పట్ల అనుమానం కలిగితే,ప్రశ్నించాలని రాశారు.మూఢులు తాము ఆరాధించే వారి కోసం చావడానికీ,చంపడానికి వెనకాడబోరని రాశారు. అంతేకాదు,ఇది రాజ్యాన్ని నడిపించే వారికి లాభిస్తుంది.ఈ పరిస్థితిని హేతువుతో నిలవరించకపోతే, ఇక మూఢత్వమే మిగులుతుంది.
గతంలో యుద్ద నౌకగా,అమరులైన వారి కమిటీ నాయకునిగా పని చేశాననీ,కొన్ని దశాబ్దాలుగా,సాయుధ రాజకీయ కార్యక్రమాన్ని,పంథాని వదిలేశాననీ,గతంలో నా ఆట పాట మాట విని,విప్లవోద్యమం పట్ల ఆకర్షితులై,పని చేసి,చదువులూ,ఉద్యోగాలు,ఆస్తులు,ప్రాణాలు,
భవిష్యత్తులు త్యాగాలు చేసిన వారికి,వారి కుటుంబాలకు గద్దర్ నిజాయితీగా క్షమాపణ చెప్పివుంటే బాగుండేది.గతి తార్కిక,చారిత్రిక భౌతిక వాదాలను వదిలేశాననీ,అందుకే, భద్రాద్రి,యాదాద్రి,మొదలగు గుళ్ళని సందర్శించడం, చినజియ్యర్ ఆశీర్వాదాన్ని పొందటం, ఇత్యాదులన్నింటికీ ప్రజలకు క్షమాపణ చెప్పగల అవకాశం వుండి కూడా,చాలా కాలం ఇలా చెప్పక పోవడం గద్దర్ బాధ్యతా రాహిత్యానికి గుర్తు.
ఇక ఇప్పుడు మీరు చూడండీ.గద్దర్ సంస్మరణ వేదికలపై అతని కులం వారినే డిస్ప్రపోర్షనేట్ సంఖ్యలో చూడగలం!అంతేగాదు, షెడ్యూల్డు కులాల మధ్య పాలక కులముగా అవకాశాలు కల్పించబడినది మాల కులం.చాలా మంది గద్దర్ స్వీయ కులస్తులు,తమ కుల సాంస్కృతిక,రాజకీయ ఏకీకరణకు గద్దర్ ఇమేజ్ ను వాడుకుంటున్నారని స్పష్టంగా అర్ధం చేసుకోగలం.ఇది తప్పేమీకాదు కూడా.అయితే,వీరిలో అత్యధికులు మాదిగలకు,మిగిలిన మార్జినలైజ్డ్ ఎస్సీ కుల సమూహాలకు,రిజర్వేషన్లలో పంపిణీ న్యాయాన్ని వ్యతిరేకించిన వారే వుండటం చాలా బాధాకరమైన సంగతి.ఇలాంటి వేదికలపై కొద్ది మంది మాదిగ స్పృహ లేని,లేదా డబుల్ స్టేట్మెంట్ మాదిగలను కూడా చూడగలం.మరి గద్దర్ ని అభిమానించే వారు అన్ని సమూహాల్లో వున్నారు కదా అంటే,అది కాలం అవసరం!అతన్ని ఎలా కావాలంటే,అలా కొరముట్టుగా వాడేసుకోడం నేడు వ్యక్తుల,రాజకీయ సమూహాల " అవసరం " అయింది.ఇలా రాజకీయ పార్టీల స్వార్ధాలకి బాగా పనికి వచ్చే సరుకుగా గద్దర్ ని తయారు చేసుకున్నారు.గద్దర్ ఇలా 'అందరి వాడ'య్యాడు.
సమాజం ఏ వ్యక్తికైనా అపరిమితమైన గుర్తింపు,గౌరవ మర్యాదలు,కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టినా,లేక ఆ వ్యక్తి వాటిని నిర్మించుకుని,నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినా,అవి డబ్బుపెట్టి కొనలేని డిస్ప్రపోర్షనేట్ సోషల్ అసెట్ (ఆదాయానికి మించిన ఆస్తిని అక్రమంగా కూడబెట్టడం) అవుతుంది.ఇలా ఉండటం రాజ్యాంగం లోని పంపిణీ న్యాయ అధికరణాలు 38,39 లను అతిక్రమించడమే అవుతుంది.ఏ మనిషైనా సామాజిక,సాంసృతిక,రాజకీయ పరివర్తన కోసం కృషి చేస్తే,అది ఆ వ్యక్తి గుర్తించిన సామాజిక బాధ్యత మాత్రమే,అవుతుంది.ప్రతి మనిషీ,ఆ మాటకొస్తే ప్రతీ రంగంలో విజయం సాధించిన నాయకుడు లేదా నాయకురాలు " పంపిణీ న్యాయం,తగిన గౌరవం " పొందడానికి మాత్రమే అర్హులౌతారు.ఇందుకు మాత్రమే వారు పరిమితం కావాలి.ప్రజల అభిమానాన్ని అపరిమిత కీర్తి ప్రతిష్టలు అనే సోషల్ క్యాపిటల్ కింద గద్దర్ కూడబెట్టుకోకుండా ఉండవలసింది.
--- కృపాకర్ మాదిగ
సామాజిక ఉద్యమాల కార్యకర్త
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి