మనసారా ఏడ్వలేను!
నాకొకోసారి
ఆకాశం బద్దలయ్యేలా అరవాలనుంటుంది
గొంతు బొంగురు పోయేదాకా
కళ్ళల్లో చివరి బొట్టు కారిపోయేలా
గుక్కపట్టి ఏడ్వాలనుంటుంది
గడ్డ కట్టిన బాధనంతా
ఎక్సరేతీసి చూపాలనుంటుంది
ముక్కలైపోతున్నసంతోషాన్నంతా
గుట్టలు గుట్టలుగా పోయాలనుంటుంది
ఆవిరైపోతున్న ఆశలన్నింటినీ
చిత్రాల్లా తీసి నీ ముందుంచాలనుంటుంది
వెంటనే నడ్డిమీద
ఒక చరుపేదో వేసినట్లు
నన్నూ- నాపెద్ద్దరికాన్నీ
నన్నూ- నా అధికారతనాన్నీ
ఎదురెదురుగా
ఓ బూతద్దం ముందు నిలబెడుతుంది
ఎంత గట్టిగా పరుగుపెడదామనుకున్నా
కలల్లో కాళ్ళెక్కడికీ కదలనట్లు
శరీరమంతా ఉక్కిరిబిక్కిరైనా
చౌరస్తాలో వస్త్రాలన్నీ విసిరేయలేనట్లు
కొన్నిసార్లు
ఏడ్వడానికి కూడా ఎలాంటి స్వేచ్ఛాలేని
జీవితపు ఇరుకు సంధుల్లో నలిగిపోవాల్సిందేనేమో!
నాకంటే వాళ్ళే నయం
దాచుకోవడానికి ఏ లాకర్లూలేవు
బాధల్ని కూడా అర్థవంతంగానే ఏడ్వాలనే
సంకెళ్ళేమీ లేవు
వాళ్ళంతా ప్రకృతికి వరమైన బిడ్డలు!
నేనేంటిలా
ఆకాశహార్మ్యాల్లో అందంగా బంధీనైన
మహానగరంలో మెరుపుల దుస్తుల్లో
మూతికొక రంగుల మాస్కధరించి
మనసారా కూడా ఏడ్వలేను!
దార్ల వెంకటేశ్వరరావు,
5.7.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి