దళితుడినని తెలిశాక..!
ఖద్దరు చొక్కా తొడిగిన ఆనందంలో నేనుంటే
జేబులో ఐదొందల నోటు
బయటకు కనిపించేలా వుండాలంటూ
ఆనందంపై నీళ్లు చల్లాడో అభ్యుదయవాది
పేదనని అవహేళనో
దళితుడు ఖద్దరు తొడుగుడేంటన్న అహంభావమో…
నేను దళితుడనని తెలిశాక…
నా కింది ఉద్యోగికి సీటిచ్చి
నన్ను నుంచోబెట్టిన రోజునే అర్థమైంది
టాలెంటు కంటే
కులానికే పెద్ద పీటని
గంటలకొద్దీ మాటలు
రోజులకొద్దీ ప్రేమలు
కలబోసుకున్నాక
మౌనందాల్చిందొక ప్రేమ
నేను దళితుడనని తెలిశాకనే…
నా అక్షరాలను ఆరాధించి
నా భావాలను ప్రేమించి
అందమైన ప్రపంచాన్ని సృష్టించి
దళితుడనని తెలిశాక…
ఒక్కడినే వదిలేసిందొక ప్రేమ
ఇంటిపేరు చూసి
అగ్రవర్ణమనుకొని
ఒంటిపేరు విని
క్రైస్తవుడ్ననుకొని
ఉండబట్టలేక నువ్వు దళితనా అని
నిట్టూర్చిందొక స్నేహం
అవసరానికి పనికొచ్చిన చెయ్యిని
అనంతరం వదిలేసిందొక చెయ్యి
కవితల నిండా ప్రేమను కురిపించి
మనసు నిండా ఆశలు ఒలికించి
ప్రేమ బరువును మోయలేనని
దూరం జరిగిందొక నేస్తం
నేను దళితనని తెలిశాకనే…
అనురాగాలు అవమానాలు
అభిమానాలు అవహేళనలు
పట్టుదల పెంచాయి… మనిషిని చేశాయి
అవును… నేను దళితుడ్నే
కానీ, మనసున్న వాడ్ని
మనిషిని మనిషిగా గౌరవించే
మనసున్న మనిషిని…
రాజాబాబు కంచర్ల,
9490099231
(ప్రజాశక్తి దినపత్రిక, ఆదివారం అనుబంధం 7.7.2024 సౌజన్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి