‘బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి’ అనే పాటతో బండి యాదగిరిగారు గుర్తింపు పొందారు. అది మాభూమి సినిమాలో రావడంతో మరింత ప్రఖ్యాతి పొందారు. తర్వాత కాలంలో ఆయన కంటే ప్రజలు ఆ పాటకే ప్రాధాన్యాన్ని ఇచ్చారు. నాటి నిజాం నవాబు, రజాకార్ల దుర్మార్గాలను ఎంతో శక్తివంతంగా నిరసించిన పాట అది. క్రమేపీ ఆ పాట సజీవమైపోయింది. రాసిన రచయిత ఏదో కొంతమందికి తప్ప చాలామందికి తెలియకుండా పోయింది. నిజానికి యాదగిరి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకమైన పాత్రని నిర్వహించారని చరిత్ర చెబుతుంది.
తెలంగాణలో తెలుగు భాష ద్వారా శక్తివంతమైన పోరాట సాహిత్యం వెలువడింది. నిజాం నవాబుకు వ్యతిరేకంగా చాలామంది తమ రచనలను కొనసాగించారు. దాశరధి జైలుకు కూడా వెళ్ళాడు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా ఏదో ఒక పోరాటంలో భాగస్వామ్య కనిపిస్తూనే ఉంటారు. ఆ విధంగా నక్సలిజం లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేకమంది తెలంగాణ ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులు తెలుగు భాష ద్వారా పాట, నాటిక, యక్షగానం, నవల వంటి ప్రక్రియల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. ఆ విధంగా విశాలాంధ్ర ఉద్యమంలో తెలుగు సాహిత్యం తనవంతు పాత్రను నిర్వహించింది.
బండి యాదగిరి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ప్రజా నిజామా నవాబును వ్యతిరేకించడం కీలకమైన పాత్ర నిర్వహించిన మాట నిజమే. కానీ, గద్దర్ ప్రజానాయకుడు, ప్రత్యక్షంగా నక్సలిజంలో అనేక సంవత్సరాల పాటు పనిచేసినవాడు. పాట రాయడం, ఆ పాటను ప్రజల్లో తీసుకెళ్లడానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. దీనికి తోడు ఆయన దళిత వర్గానికి చెందినవాడు కావడం వల్ల ఆ వర్గానికి చెందిన ప్రజలు కూడా ఆయనను ప్రజల్లోకి విశేషంగా తీసుకెళ్లి కృషి చేశారు. ఈ చైతన్యం బండి యాదగిరి వర్గానికి కలగలేదేమో అనిపిస్తుంది. కొమరం భీమ్ విషయంలో ఆయన ప్రత్యక్షంగా నిజాం నవాబును వ్యతిరేకించిన గొప్ప యోధుడు. గిరిజనులను కాపాడడానికి తన ప్రాణాలను కూడా బలిపెట్టిన త్యాగశీలి. అందువల్ల అభ్యుదయ సాహిత్యకారులు, విప్లవకారులు అందరూ కూడా ఆయనను కీర్తించారు. ఆయన ధైర్యసహసాలను మెచ్చకున్నారు.
నేటి తెలుగు యువత దేశభక్తికి సంబంధించిన విషయాలను విస్మరించారనేది వాస్తవం కాదు. ఆమధ్య కార్గిల్ యుద్ధంలో మన సైనికులు మరణించినప్పుడు ఎంతోమంది యువతీ యువకులు తమ దేశభక్తిని నిరూపించుకున్నారు. అలాగే, వివిధ సందర్భాలలో అవసరమైనప్పుడల్లా దేశభక్తిని ప్రదర్శించుకుంటూనే ఉన్నారు. ఇక, బెంగాలీ, మరాఠీ భాషా ప్రాంతాలలో ఉన్నంత చైతన్యం యువతలో లేదనడం కూడా పూర్తిగా వాస్తవం కాదు. బెంగాల్లో ఉన్నటువంటి సాహిత్యం ఇతర భాషల్లోకి వెంటనే అనువాదం అవుతుంది. అక్కడ ప్రధానంగా వామపక్ష భావజాలం ఉండడం వల్ల అది దేశవ్యాప్తంగా వ్యాపించేలా ఆ ఉద్యమకారులు ఆ సాహిత్యకారులు చేయగలుగుతున్నారు. మరాఠీలో వచ్చిన సాహిత్యాన్ని కూడా దళిత ఉద్యమకారులు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోకి అనువాదం చేసి ప్రాచుర్యులకు తీసుకొస్తున్నారు. మన తెలుగులో వచ్చిన సాహిత్యాన్ని ఇతర భాషలో పంపించడానికి లోతైన అనువాదాలు అవసరం.
బండి యాదగిరి గారు తెలంగాణలో గొప్ప వీరుడు, ఉద్యమకారుడు అనే విషయాన్ని ప్రభుత్వం ప్రజలు పట్టించుకోవాలంటే ఆయన సాహిత్యాన్ని ముందు బయటకు తీసుకురావాలి. మన సమాజంలో కులం అనివార్యమైన పరిస్థితుల్లో కులాన్ని బట్టి కూడా సాహిత్యాన్ని, నాయకుల్ని కానీ ఉన్నతంగా కీర్తించడానికి లేదా ఆశ్చర్యం లోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలను మనం కాదనలేం. ఈ పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు, అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సారస్వత పరిషత్తు, మరికొన్ని రచయితల సంఘాలు తమవంతు కృషి చేస్తే బండి యాదగిరి గారి జీవితాన్ని, సాహిత్యాన్ని బయటకు తీసుకు రావచ్చు. ఆయన చేసిన గొప్ప పనులన్నీ ప్రజలకు తెలిసేలా చేయొచ్చు. మీలాంటి వాళ్లు ఆయన జీవితాన్ని ప్రజల ద్వారా సేకరించి, మంచి సాహిత్యాన్ని మీడియాలో ప్రచురించడం ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ అధ్యక్షులు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి