‘ఆత్మవిశ్వాసమే అన్నింటినీ జయిస్తుంది’
పోటీపరీక్షల శిక్షణాశిభిరాన్ని ప్రారంభిస్తున్న ఆచార్యదార్ల వెంకటేశ్వరరావు
మనకున్న ఆత్మవిశ్వాసమే మనల్ని అన్ని విజయాల్ని సాధించేలా చేస్తుందని, పోటీపరీక్షలకు అత్యంత ముఖ్యమైనది నిరంతర అధ్యయనం, సూక్షపరిశీలన, ఆత్మ విశ్వాసమేనని, అవి ఉంటే ప్రతి ఒక్కరూ విజేతలవుతారని హెచ్ సియు తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. డి.కె.ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి), నెల్లూరు వారు శనివారం నుండి జూమ్ ఆన్లైన్ వేదికగా ఎం.ఏ.తెలుగు ప్రవేశపరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం ఉచితంగా జూన్ ఒకటో తేదీ నుండి తొమ్మిదవ తేదీవరకు నిష్ణాతులతో శిక్షణనిప్పించే కార్యక్రమాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం అన్ని విద్యాసంస్థల్లోను ప్రవేశాలన్నీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే జరుగుతున్నాయనీ, ఉభయ రాష్ట్రాలు, సెంట్రల్ యూనివర్సటీలలో ఎం.ఏ తెలుగు చదవాలంటే క్రమబద్ధమైన అధ్యయనం అవసరమనీ, అది ఇలాంటి నిష్ణాతులు ఇచ్చే శిక్షణ, ఉపన్యాసాల వల్ల విజయాన్ని సాధించుకోవచ్చునని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసేవారికంటే, దాని ద్వారా తాను విజయం సాధిస్తాననే ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూలమని గుర్తించుకోవాలన్నారు. గతంలో కూడా పరిశోధకులకు ఉపయోగపడే పరిశోధన పద్ధతులపైనా ప్రత్యేక ప్రసంగాలను ఏర్పాటు చేసిన డి.కె.ప్రభుత్వ మహిళా కళాశాల వారే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పేద, మధ్యతరగతి ప్రతిభావంతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమంగా ఆయన వ్యాఖ్యానించారు. మంచి కార్యక్రమాలు చేస్తున్న తెలుగుశాఖను కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.గిరి అభినందించి, ఈ ప్రసంగాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమాన్ని కళాశాల తెలుగు శాఖ అధ్యాపకులు డా.కె.కరుణశ్రీ సమన్వయం చేస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల పోటీ పరీక్షల శిక్షణా శిభిరంలో డా.ఎస్.ఎల్.వి. ఉమామహేశ్వరరావు, డా.జి.పద్మప్రియ, డా.కె.ఈశ్వరమ్మ, డా. కె.కరుణశ్రీ, డా.ఎస్.దివిజాదేవి, డా.కెవిసత్యనారాయణ, డా.వై.దివ్య, శ్రీ ఆర్ ,వెంకట్రావు తదితులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. తెలుగు వ్యాకరణం, అలంకారశాస్త్రాలు, ఛందస్సు, భాషాశాస్త్రం, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై ఈ ప్రసంగాలు కొనసాగుతాయని కార్యక్రమ సమన్వయ కర్త డా.కె.కరుణశ్రీ తెలిపారు. ఈ ప్రసంగాలన్నీ యూట్యూబ్ లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని, దాని ద్వారా వివిధ పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయని నిర్వాహకులు వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి