"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

15 జూన్, 2024

సృజన కాంతి లో ఆచార్య దార్ల ఇంటర్వ్యూ (14.6.2024)

 ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల గ్రామీణ నేపథ్యం నుండి ఉన్నత విద్య ద్వారా మీరు ఎదిగిన తీరు చెప్పండి..?

ఆచార్య దార్ల: నేను పుట్టి, పెరిగిన తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో క్రిస్టియానిటి, అంబేద్కర్ ప్రభావం అధికంగా ఉంటుంది. దీనివల్ల చదువుకోవడానికి ప్రభుత్వ విద్యాసంస్థలు అధికంగానే ఉంటాయి. చదువుకున్న వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు గమనించిన మా తల్లిదండ్రులు ఎంతటి కష్టమైనా భరించి మమ్మల్ని చదివించాలనుకున్నారు. మాలో కూడా అంబేద్కర్ ప్రభావం వల్ల ఉన్నత చదువులు చదవాలనే కోర్కె బలంగా ఉండేది. అయినప్పటికీ చాలామంది ఉన్నత చదువులు చదువుకోలేక పోయినా, పాఠశాల, కళాశాలల్లోని ఉపాధ్యాయుల ప్రోత్సాహం, ప్రేరణలతో, వాళ్ళలా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష నన్ను ఉన్నత చదువులు చదివేలా చేసింది. 

తెలుగు సాహిత్యం చదవడానికి , పరిశోధనకు ప్రేరణ..?

ఆచార్య దార్ల: ఉభయగోదావరి జిల్లాల్లో సాహిత్య వాతావరణం విస్తృతంగానే ఉన్నా, నాకు ఊహ తెలిసే నాటికి, సాహిత్యం కొన్ని వర్గాలకే పరిమితమన్నట్లు ఉండేది. దీన్ని గమనిస్తుండడం వల్ల  నేను కూడా అలాంటి సాహిత్య వాతావరణంలో ప్రవేశించాలనుకొనేవాణ్ణి. ఇవన్నీ నా ఉన్నత విద్యకు, సాహిత్య సృష్టికి గల ప్రధాన ప్రేరణలే. అయితే,నేను డిగ్రీ వరకు చదువుకున్న శ్రీ కోనసీమ బానోజీరామర్స్ కళాశాల, అమలాపురంలో డా.ద్వానాశాస్త్రి, డా.వాడవల్లి చక్రపాణిరావు, డా.బి.వి.రమణమూర్తి, డా.పైడిపాల మొదలైన వారు మాకు పాఠాలు చెప్పేవారు. అప్పటికే వారంతా సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధులు. కళాశాలలో మంచి సృజనాత్మక రచనలకు సంబంధించిన పోటీలు జరిగేవి. వాటిలో పాల్గొంటుండేవాణ్ణి. వీరంతా నన్నెంతగానో ప్రోత్సహించేవారు. అప్పటికే వారంతా డాక్టరేట్లు చేసి, మేము చదువుకొనే పాఠ్యాంశాల రచయితలుగా కూడా వారివి కూడా ఉండేవి. వాళ్ళ బోధన నన్ను పరిశోధన వైపు పురిగొల్పింది. 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం మీకు ఏమి నేర్పింది..?

ఆచార్య దార్ల: ఎం.ఏ.తెలుగు ప్రవేశ పరీక్ష రాసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రెండింటిలోనూ సీటు వచ్చింది. కానీ, రాష్ట్ర రాజధానిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ( సెంట్రల్ యూనివర్సిటీ) ఉండటం వల్ల ఇక్కడే చదవాలనుకున్నాను. దేశంలోని వివిధ రాష్ట్రాల వాళ్ళే కాకుండా, విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకుంటారు. భిన్న భాషలతో, సంస్కృతులతో  సెంట్రల్’వర్సిటీ ఒక మినీ భారతదేశంలా అనిపించేది. డైరెక్ట్ గా లైబ్రరీలోకి వెళ్ళి నాకు కావాల్సిన పుస్తకాలు తీసుకొని చదువుకొనే అవకాశం ఈ యూనివర్సిటీలో ఉండటంతో నాకిష్టమైన రచనలను చదువుకొనే అవకాశం కలిగింది. విద్యార్థి సంఘాలు కూడా సాహిత్య గోష్ఠులు నిర్వహించేవి. ప్రసిద్ధులైన గొప్ప వ్యక్తులు ప్రసంగాలు ఇచ్చేవారు. అప్పటివరకు కంఠస్థం పట్టి చదివే చదువుల నుండి విశ్లేషణాత్మక దృష్టి అలవడింది. సెంట్రల్’వర్సిటీ నా జీవితాన్ని మార్చేసింది. నా ఆలోచనలకు సరైన వేదికగా మారింది. ఇదొక విజ్ఞాన ప్రపంచం. దీన్ని ఉపయోగించుకోవడాన్ని బట్టి మనం రూపొందుతామని అనుభవపూర్వకంగా చెబుతున్నాను. పరిశోధన చేసిన కవులు, రచయితలు డిగ్రీలో పాఠాలు చెబితే, సృజనాత్మక రచనల్లోని మెళకువలు చెప్తూనే, పరిశోధనలు చేయించే గొప్ప అధ్యాపకులు సెంట్రల్’వర్సిటీలో ఉండేవారని తెలుసుకున్నాను. ఆచార్యులు కె.కె.రంగనాథాచార్యులు, జి.వి.సుబ్రహ్మణ్యం, రవ్వాశ్రీహరి, ఆనందారామం, ముదిగొండ వీరభద్రయ్య, పరిమి రామనరసింహం మొదలైన మహామహోపాధ్యాయల పాఠాలు నన్నెంతగానో సంబ్రమాశ్చర్యాలతో నింపేసేవి. వీళ్ళందరివీ భిన్నభావజాలాలైనా పాఠాలు చెప్పేటప్పుడు వారి దృక్పథానికి లొంగే వారు కాదు! సివిల్ సర్వీసు రాయాలనుకొని వచ్చిన నేను వీరి పాఠాలు విన్న తర్వాత ఇక్కడే పరిశోధన చేసి, ఇక్కడే ప్రొఫెసర్ కావాలని కలలు కంటుండేవాణ్ణి. నా కలలు నిజమయ్యాయి. నా సెంట్రల్ యూనివర్సిటీ కోరుకున్నది ఇచ్చే కల్పతరువు! 

సృజనాత్మక సాహిత్యంలో చేసిన రచనలు, ప్రచురణల వివరాలు పంచుకోండి..?

ఆచార్య దార్ల: కళాశాల స్థాయి నుండే రచనా వ్యాసంగం ప్రారంభించాను. పత్రికల్లో జోక్స్, కవితలు, కథలు రాసే వాణ్ణి. ఎం.ఏ.లో ఉండగా నా కవిత ఆంధ్రప్రభ దీపావళి సంచికలో ప్రచురితం అయ్యింది. అప్పుడు ఆ కవితకు రెండువందల ఏభై రూపాయలు ఇచ్చారు. నా రచనలకు వచ్చిన తొలిపారితోషికంతో మా చెల్లికి చీర కొన్నాను. ఆంధ్ర జ్యోతి, ఆంధ్రభూమి, వార్త, సూర్య, మనం, ప్రజా సాహితి, సాహితీ ప్రస్థానం, ప్రజాశక్తి, నవతెలంగాణ మొదలైన ప్రముఖ దిన మాసపత్రికల్లో నా కవిత్వం, వ్యాసాలు వచ్చాయి. జనకవనం, రంజని వారి అమ్మ, సృజన లోకం వారి నాయిన వంటి కవితా సంకలనాల్లో నా కవితలు వేశారు. చిత్రమేమిటంటే నా రచనలు ముందు పెద్దపత్రికలకు పంపేవాణ్ణి. తర్వాత ఎడిటర్స్ అడగడంవల్లా, కరోనా తర్వాత వచ్చిన పరిణామాలు, మరికొన్ని కారణాల వల్లా స్థానిక పత్రికలకు కూడా పంపుతున్నాను. అలాంటి వాటిలో నేటి నిజం, భూమిపుత్ర, జనప్రతిధ్వని మొదలైన వాటిలో నా రచనలు ప్రచురితమయ్యాయి. దళిత తాత్వికుడు (2004), నెమలి కన్నులు (2016) కవితా సంపుటాలు ప్రచురించాను. దార్లమాటశతకం(2021)పేరుతో ఛందోబద్ధమైన పద్యాలు ప్రచురించాను.  రెండు వచన కవితా సంపుటాలు ముద్రణలో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని కథలు కూడా రాశాను.

చిన్న వయసులోనే ఆత్మకథ రాయాలని ఎందుకు అనుకున్నారు..?

ఆచార్య దార్ల:  పాఠాలు చెప్పేటప్పుడు సహజంగానే మా వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవాలని విద్యార్థులు భావిస్తుంటారు. పైగా నేను సెంట్రల్ యూనివర్సిటీలోనే ఎం.ఏ. ఎం.ఫిల్, పిహెచ్.డి. చేసి, ‘ఇక్కడే ప్రొఫెసర్ స్థాయికి చేరాను’ అనగానే వారిలో ఏదో ఒకరకమైన ఉత్సాహాన్ని గమనించే వాణ్ణి.సాధారణంగా తెలుగు చదువుకోవడానికి వచ్చేవిద్యార్థుల సామాజిక, ఆర్థికస్థితిగతులు ఎంతో భిన్నమైనవి. ఈ పోటీ ప్రపంచంలో  తాము జీవితంలో స్థిరపడగలమా? తమకి ఉద్యోగాలు వస్తాయా? అనే సందేహాలు లేకుండా ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి నా జీవితమే ఉదాహరణగా తీసుకోవచ్చని చెప్పే వాణ్ణి. అది విన్న తర్వాత ఎంతోమంది నా గురించి మరింతగా తెలుసుకొని, తాము కూడా కష్టపడతామని ఆత్మవిశ్వాసంతో చెప్పేవారు. నిజంగా జె ఆర్ ఎఫ్ , పిహెచ్ .డి సీటు సాధించి చూపేవారు. మనచుట్టూ రకరకాలైన మనస్తత్వాలు గల మనుష్యులు ఉంటారు. మనకు చెడుచేయాలనుకొనేవారిని కూడా మంచి చేయకపోయినా ఆటంకాలు కలిగించకుండా చేసుకోగలగాలి. నా గమ్యానికి చేరడంలో సహకరించిన వాళ్ళనీ, అవరోధాలు సృష్టించిన వాళ్ళనీ పేర్కొంటూనే, వాటికి అతీతంగా పయనించడమెలాగో గుర్తించమని ప్రబోధించడమే నా ఆత్మకథ ఆశయం.ఇది ఇప్పుడు రాస్తేనే మా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందనుకున్నాను. ఇవన్నీ నేను సాధించిన విధానాన్ని మా విద్యార్థులకు చెప్పడానికే నా ఆత్మకథ (దీని పేరు కూడా ‘నెమలికన్నులు’ అనే పెట్టాను.) మొదటి భాగం రాశాను. నా జీవితాన్ని క్రియేటివ్ గా చూపించిన వాస్తవజీవితం. 

తెలుగు శాఖ అధ్యక్షులుగా మీరు చేస్తున్న భాషా సాహిత్య సేవలు తెలపండి..?

ఆచార్య దార్ల: మా శాఖలో అత్యంత చిన్న వయసులో శాఖాధ్యక్షులుగా పనిచేయడం ఒక సంతృప్తినిచ్చిన కాలం. కొలీగ్స్ గా నా కంటే పెద్దవాళ్ళున్నప్పటికీ, అందరూ సహకరించారు.ఈ యేడాది మే 31 తో నా పదవీకాలం పూర్తయ్యింది. నా విధిలో భాగంగానే చేసినప్పటికీ మా అధ్యాపకుల సహకారంతో తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన సదస్సులు నిర్వహించాను. గురజాడ, గుర్రం జాషువా, రావిశాస్త్రి, డా.సినారె, దాశరథి, కాళోజి తదితరుల సాహిత్యంపై సదస్సులు, సమావేశాలు జరిగేలా చూశాను. ‘కొత్త పుస్తకంతో కాసేపు’ శీర్షికతో తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను పరిచయం చేశాను. కొత్త కోర్సుల రూపకల్పన, కొత్త రచనలను పాఠ్యాంశాల్లో చేర్చడం, విస్మరణకు గురైన అంశాలు, కవులు, రచయితలపై పరిశోధనలకు ప్రోత్సాహాన్నివ్వడం, పి.జి.స్థాయిలోనే పరిశోధనాత్మకంగా ఆలోచించడం, శాస్త్రీయమైన పద్థతుల్లో వ్యాసాలు రాయడానికి ఒక కొత్త కోర్సు రూపకల్పన, విద్యార్థులకు భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగేలా, సృజనాత్మక శక్తి పెరిగేలా పుస్తక సమీక్షలు, విద్యార్థి సదస్సులు నిర్వహించడం వంటివెన్నో చేశాను. మన కంటే ముందున్న తరాన్ని అనుసరిస్తూనే నూతన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తూ కొత్త తరాన్ని తయారు చేయడం అనే లక్ష్యంతో పని చేశాను. 

ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల సంపాదకులుగా మీ అనుభవం గురించి చెప్పండి..?

ఆచార్య దార్ల:  తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకానికి సంపాదక వర్గ సభ్యుడిగా పనిచేశాను. రాబోయే కొన్ని పుస్తకాలకు సంపాదకుడిగా ఉన్నా వాటిని ఇంకా బయటకు చెప్పకూడదు. కుల, మత, ప్రాంత, లింగ భేదాలకు అతీతంగా పాఠ్యాంశాల రూపకల్పనలు జరగాలి. జాతీయ సమగ్రతను, సమైక్యతను పెంపొందించేలా ఉండాలి. వాటిని పెంపొందిస్తూనే, స్థానిక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక వాస్తవికతను తెలియజేయాలి. కానీ, సామాజిక వాస్తవికత, వివక్షలను తెలుపుతూనే అందరినీ కలుపుకొనిపోయే పాఠ్యాంశాల ఎంపిక కష్టమవుతుంది. ఒకవేళ అలాంటి పాఠాలు పెడితే భావజాల ఆధిపత్యం ఎలా ఉంటుందో చూశాను. 

కవిత్వానికి మీరిచ్చే స్వీయ నిర్వచనం..?

ఆచార్య దార్ల:  జీవిత రహస్యాల అన్వేషణ. వాస్తవానుభవం కళాత్మకంగా మారి జీవితాన్ని నిత్యం ఆశల్ని చిగురింపజేసేది కవిత్వం. 

రచయితగా భవిష్యత్ ప్రణాళికలు..?

ఆచార్య దార్ల: ప్రొఫెసర్ గా పనిచేసినంతకాలం నా ప్రథమ ప్రాధాన్యం విద్యార్థులే. కాబట్టి వాళ్ళు కొత్త అంశాలపై పరిశోధనలు చేసేలా ప్రేరేపించే పరిశోధనాత్మక రచనలు, విశ్లేషణను పెంచే విమర్శనా సాహిత్యానికి నా మొదటి ప్రాధాన్యతనిస్తాను. జీవితంలో తట్టకోలేనంత బాధనో, సంతోషాన్నో పొందినప్పుడు దాన్ని సృజనాత్మకంగా అందించే ప్రయత్నం చేస్తాను. 

యువరచయితలకు మీరిచ్చే సందేశం..?

ఆచార్య దార్ల:’సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ అఫ్ సక్సెస్’ అనేది మన నిత్యం కనిపించేటట్లు పెట్టుకోవాలి. దానిలోనే కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలనే అంతః సూత్రం ఇమిడివుంది. నిత్యం గమ్యం కోసం శ్రమించాల్సిన కృషి వుంది. ఇదే నేటి యువతరం అలవర్చుకోవాల్సిన జీవన విధానం. మన పుట్టుక మనచేతుల్లో ఉండదు. ఏదొక కులంలో, ఏదొక మతంలో, ఏదొక ప్రాంంతంలో పుడతాం. కానీ, పుట్టిన తర్వాత మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మన చుట్టూ పోజిటివ్ వైబ్రేషన్స్ ఉండేటట్లు చూసుకోవాలి. నెగెటివ్ థాట్స్ వదిలేసే స్ఫూర్తిని నింపే రచనలు చెయ్యాలి.అలా చెయ్యాలంటే సాహిత్యాన్ని బాగా చదవాలి. సమాజాన్ని లోతుగా అవగాహన చేసుకోవాలి. జీవితానుభవాన్ని కళాత్మకంగా అందించాలి. రాయడానికి కంటే చదవడానికి అధిక ప్రాధాన్యాన్నివ్వాలి. 


1 కామెంట్‌:

గోపాల్ సుంకర చెప్పారు...

చాలా బాగుంది సార్