"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

25 జూన్, 2024

జీవితాన్ని ఒక నిరంతర కవితా ప్రవాహం చేసిన మహోదాత్తకవి ఎన్.గోపి. (ఆచార్య దార్ల వ్యాసం, 25.6.2024)

 https://srujana.net/kavi-n-gopi-who-made-life-a-continuous-flow-of-poetry/



జీవితాన్ని ఒక నిరంతర కవితా ప్రవాహం చేసిన మహోదాత్తకవి ఎన్.గోపి.



వస్తువు, అభివ్యక్తుల్లో ఒక కొత్త శక్తినేదో తీసుకొస్తూ నిత్యం ప్రవహించే కవి డా.ఎన్.గోపి. ఆయన కవిత్వాన్ని ఎంత బాగా రాస్తారో, అంత అందంగా పుస్తకాల్ని కూడా ప్రచురిస్తారు. ‘గోపి కవిత్వం’ పేరుతో వచ్చిన మూడు సంపుటాల్ని పరిశీలించినప్పుడు, ఒక్కొక్క కవితకు చెప్పిన నేపథ్యాల్ని  చదివితే ఆయన ఆత్మ కథాత్మక గేయాల్ని చదువుతున్నామేమో అనిపిస్తుంది. కానీ, ప్రతి కవితనూ ఆ నేపథ్యాన్ని వదిలేసి చదివితే అది మన జీవితమే అనిపిస్తుంది. కవిత్వంలో ఉండవలసిన లక్షణాల్లో పాఠకుడు ఆ కవితలను చదివేటప్పుడు అది తన జీవితమే అనుకోవాలి. తన స్పందననే అద్భుతంగా ఆవిష్కరించారనుకోవాలి. కొన్ని కవితలకేవో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తప్ప మిగతావన్నీ స్థల, కాలాలకు అతీతమైన భావాన్ని అభివ్యక్తీకరించగలగాలి. అదే వీరి కవిత్వం నిండా కనిపిస్తుంది. 

ఎన్.గోపి గారు రాసిన మొట్ట మొదటి వచన కవితగా ‘తంగెడిపూలు’ (1967) తో ప్రారంభించి నేటివరకూ రాస్తున్న ప్రతికవితలోనూ ఈ కవితా లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ఆయన బి.ఏ.లో ఉండగా రాశారు. ‘’మనసున్న పూలు/ మమతలున్న పూలు/ వాసన లేకున్నా వలపు/ బాసలు నేర్పిన పూలు’’ అని చెప్పి వాటిని ‘తంగేడు పూలు అంటే ఒప్పుకోను బంగారు పూలు’ అనాలి అంటాడు ఆయన. తొలి కవితతోనే మనుష్యుల మధ్య ఉండాల్సిన మమతలను, మనసులను తాకే కవిత్వంతోనే ఆయన కవితా ప్రయాణం ప్రారంభమైంది. 

గోపి గారు కవిత్వాన్ని మూడు సంపుటాలుగా ప్రచురించిన కవిత్వం నా దగ్గర ఉంది. వీటిలో తంగెడుపూలు, మైలురాయి చిత్ర దీపాలు, వంతెన, కాలాన్ని నిద్రపోనివ్వను తొలి సంపుటి లో ఉన్నాయి. నానీలు, చుట్టకుదురు, ఎండపొడ, గోపి నానీలు, జలగీతం రెండవ సంపుటిలోను, మరో ఆకాశం, అక్షరాల్లో దగ్ధమై, దీపం ఒక ఏకాంతం, గోవాలో సముద్రం, వాన కడిగిన చీకటి అనే పేరుతో గతంలో ప్రచురించిన వాటిని ఈ మూడు కవితా సంపుటలుగాను   ఒకే చోటకు తీసుకొచ్చారు. ఈ కవిత్వం ఇంచుమించు 1967-2009 మధ్య కాలంలో రాశారు. ఆ తరువాత  రాసిన కవితలు కూడా వివిధ పేర్లతో ప్రచురణ పొందాయి. రాతి కెరటాలు (2011), హృదయ రశ్మి (2013), మళ్ళీ విత్తనంలోకి (2014), వృద్ధోపనిషత్ మొదలైన రచనలను చేశారు. ‘వృద్ధుడంటే/ ముసలివాడు కాడు / వృద్ధి పొందినవాడని” వృద్ధోపనిషత్ కావ్యం ఎంతో హృద్యంగా రాశారు. కొంచెం వయసుకు వచ్చాక ముఖ్యంగా వయోభారం మీద పడుతున్నప్పుడు,  వాళ్ళ అవసరం తమకు లేదనుకున్నప్పుడు వాళ్ళ మాటలు వినేవారు ఉండరు. దీన్ని కవి అభివ్యక్తీకరిస్తూ…

‘’వృద్ధులకు ఎంతసేపూ జ్ఞాపకాలే, వినడానికి శ్రోతలుండరు. వారి మాటలకు రావాల్సిన జవాబులు రావు, వారి మాటల్లో కొన్ని చెల్లని నాణాలవుతాయి” అనడంలో ఎంత దుఃఖముందో  అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. వేదన గడ్డకట్టిన దుఃఖంగా మారడం ఈ కవితలో కనిపిస్తే, డిగ్రీ  పరీక్షలో కొన్ని సబ్జెక్టులు తప్పినప్పుడు దుఃఖం ఆవేదనగా మారుతుందో ‘ఆశోపహతుని స్వగతం’ అనే కవితలో ఇలా రాశారు. ‘ఏ మహోన్నత శిఖరాలనధిరోహించాలని/ ఎక్కడికి విసిరి వేయబడ్డాను/ అనుకోలేదు జీవితమిలా ఉంటుందని…ఎడద ఎడారిగా మారుతుందని/ ఎటు చూసినా ఎండమావులు ఎదురవుతాయని /అనుకోలేదు జీవితమిలా వుంటుందని’’ 

విరసం ఆవిర్భావం తర్వాత తెలుగు సాహిత్యంలో వర్గస్పృహ విస్తృతంగా పెరిగింది. ఈ నేపథ్యాన్ని గోపి గారు రాసిన ‘పిట్టలు’ (1974) అనే కవితలో చూడొచ్చు. చెట్టు, దాని ఆకులు, దాని కొమ్మలు, దాని వేళ్ళు… వీటన్నింటినీ ప్రతీకాత్మకంగా తీసుకొని  దాని కింద బ్రతుకుతున్న లేదా దానిపై బతుకుతున్న చిన్న చిన్న రెక్కల ఉన్న పిట్టల గురించే కవిత్వంలో ఒక కథ చెప్తున్నట్లుగా సాగిపోతుందీ కవిత. కానీ, తరతరాలుగా పాతుకుపోయిన ఆధిపత్య భావజాలాన్ని, పీడన స్వభావాన్ని పెకళించి, పీడితుల జీవితాల్లో కొత్త వెలుగుల కోసం పడే ఒక సమైక్య శక్తిని కలగంటూ వచ్చిన విప్లవ రచయితల సంఘం ఆశయాన్ని ప్రతిఫలిస్తున్నట్లుగా భావచిత్రంగా అందించిన ఈ కవిత కనిపిస్తుంది. 

‘’ఇక ఈ ఆగడాలు సహించం/ పిట్టల బతుకులు బాగుపడే/ మార్గాలను వెతకందే నిదురించం/ అంటుండగానే అరిచిందింకో పిట్ట/ “అదిగో తూరుపున ఎరుపు/ ఇదిగో చీకట్లు చీలుతున్న తెలుపు”

వర్గ చైతన్యం పెరిగినప్పటికీ భారతదేశంలో కులం ఒక విస్మరించలేని గుర్తింపు. కులం తెలుసుకోవడానికి రకరకాల ప్రశ్నలు. ఈ నేపథ్యం నుండి రాసిన ఒక కవిత ‘బయోడేటా’ (1975) ఒక సంభాషణాత్మక శిల్పంతో వెలువడింది. 

‘’అయ్యా మీదేం కులం /‘యువకులం/ పేరేమిటి?/ 

“నవగళం" /ఏ వూరు?/“చీకటి కానల కావల”/ చిగురించే వెలుగుసీమ’’ 

కొన్ని కులాలకు సమాజంలో గౌరవం.మరికొన్ని కులాలకు అవమానం. ఈ స్థితి పోవాలని కలలు కంటున్నాడు కవి. తర్వాత వచ్చిన అస్తిత్వ ఉద్యమాల్లో ముఖ్యంగా దళిత సాహిత్యం తెలుగు సమాజంలో బయలుదేరినప్పుడు అనేక వాదోపవాదాలు జరిగాయి. ‘పెనుగులాట’ పేరుతో 1979లో గోపీ గారు రాసిన కవితలో ‘’నా మాటల్లో/నీ భాషను నింపి/ నా గొంతులో/ తరాల నిశ్శబ్దాన్ని నింపావు/ నా గొంతు కోశావు…ఇన్నాళ్లకు/ గొంతెత్తి అరుద్దామంటే / అడుగున/ అట్టడుగున/ నత్తి వెలుగైనా లేని వృత్తిగా…’ అనడం ద్వారా  అప్పుడే అక్షరం పట్టి కవిత్వం అవుదామనుకున్న వాళ్ళను బలమైన అభివ్యక్తిగా పరిగణించని స్థితిని చూసి  దళిత కవుల పడే ఆవేదన ఉంది. పోనీ, దళితుల లేదా రాయలేని వాళ్ళ జీవితాల్ని వాళ్ళు రాస్తున్నారని సంతోషపడదామంటే ‘’నీ భాషలో/ నా బతుకు పలకదు/ నీ భాషలో/ నా కన్నీళ్లు ఇంకిపోతాయి’’నిపించేలా రాస్తున్న స్థితిలో అస్తిత్వ కవులు పడే ఆవేదనకు నిలువుటద్దం ఈ కవిత. 

భావపరంగానే కాదు, భాషాపరంగా కూడా అస్తిత్వ ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ భాషలో రచనలు రావాలనే వాదన విస్తృతంగా వినిపించింది. ఆ నేపథ్యం నుండి కూడా ఈయన కొన్ని కవితలు రాశారు. తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారి వ్యవస్థలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న రోజుల్లో సబ్బండ జాతుల జీవితాలు ఎలా ఉంటాయో ‘పల్లెల్లో మన పల్లెల్లో’ అని వీరి కవిత చదివితే తెలుస్తుంది. 

‘చెట్టు గొట్టురా ఎంకా కట్టే గొట్టు/ పటేలింట్ల పొలావొండు తుండ్రు/ గడ్డిగొయ్యే గౌరీ మోపు గట్టు/ పటేలోల్ల కొత్త బర్రె యీనింది/ కల్లు గియ్యరా రాములూ బుడ్డినింపు/ పటేలింట్ల పట్నం సుట్టాల్ దిగిండ్రు’’ సబ్బండ జాతుల వాళ్ళంతా తమ జీవితమంతా పటేళ్ళ పనులు చేయడానికే అన్నట్లు జీవించే బతుకు చిత్రాల వెనుక చూడవలసిన ఆధిపత్యమెలా చెలాయించేదో మనసులను మెలి పెట్టే వెట్టిచాకిరి. దీన్ని పల్లెమనుషుల మనస్తత్వాన్ని ఎంతో సహజంగా ఇలా వర్ణించారు కవి.

‘మనిండ్ల కాడ/ తల్లి బాగలేదు/ పిల్లలు బాగలేరు/ కుండల్ల ఇత్తుల్లేవు/ పొయ్యిల్ల నిప్పులేదు/ కండ్లు దిరుగుతున్నయి. కండ్లల్ల నీళ్లు దిరుగుతున్నయి/ అంత మంచిగనే వున్నది గని/ నడువుండ్రి నడువుండ్రి జెల్ది/ పటేలుక్కోపమొస్తే/ పటేలు పటేలు కాడు’’ 

ఇటువంటి కవితలు సందేశాన్నివ్వవు. జీవిత సత్యాల్ని ఆవిష్కరించి కర్తవ్యాన్ని బోధిస్తాయి. కవి ఎప్పుడూ బాధపడే వారి వైపే ఉంటాడు. 1973 ప్రాంతంలో యునిసెఫ్ ప్రాజెక్టు ఆఫీసరు గా మహబూబ్ నగర్ లోని దాదాపు 100 గ్రామాలు చూసిన తర్వాత రాసిన కవిత ఇది. 

వర్తమానానికి ప్రతీకగా మైలురాయిని తీసుకొని గతాన్ని భవిష్యత్తుని స్మరించుకుంటూ రాసిన గొప్ప కవిత ‘మైలురాయి’ (1976).

ఒకప్పుడు ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లేటప్పుడు రోడ్డుపక్కన ఉండే మైలురాయిని చూసుకుంటూ ప్రయాణించే వాళ్ళం. గూగుల్ మ్యాప్ లు వచ్చినా నేటికీ మైలురాయికి, దానిపై రాసే ఊరు, కిలో మీటర్ల సంఖ్యలకు ప్రాధాన్యం పెద్దగా తగ్గలేదు. అవి తమ పాత్రను తాము నిర్వర్తిస్తూనే ఉన్నాయి. అయితే కవి మైలురాయి దూరం చెప్తుందనో, జ్ఞాపకాలను నెరవేస్తుందనో  దాన్ని ఇష్టపడలేదట. మరెందుకిష్టపడ్డారో చూద్దాం.

‘’దీని మొగాన /గత దూరపు నల్లటి మరకల గాట్లున్నాయి/ రోడ్డుకడ్డంగా నెమరు వేసే /దున్నపోతులు చిత్రించిన పేడగుర్తులున్నాయి/ ఐనా /దీని నొసట/ ఎర్రెర్రని/ భవిష్యద్దూరాల నవ్వులున్నాయి /అందుకే/ ఈ రాయి నా కిష్టం’’ అనడంలో రాబోయే కాలాన్ని ఆశావాహ దృక్పథంతో ఆహ్వానించమనడం కనిపిస్తుంది. అమూర్త వస్తువుని మూర్త వస్తువుగా చెప్పడంతో పాటు, రాయి గతానికి వర్తమానానికి భవిష్యత్తుకు ఒక దిక్సూచికగా నిలబడే అపురూప దృశ్యంగా చిత్రించటం కవిలోని దార్శనితకు నిదర్శనం. రాబోయే కాలం ఎంతో గొప్పగా ఉంటుందని గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగించే కవిత. గురజాడని గుర్తు చేసే కవిత. 

‘వంతెన’ కవితా సంపుటిలో హైదరాబాదులో జరిగిన మతకల్లోలాలు,  జర్నలిస్టు రసూల్ ని చంపేసిన పరిస్థితులు, అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న ఆర్థిక సరళీకృత విధానాలతో అనుసంధానం అవుతున్న జీవిత సంఘర్షణలు, మానవుల మధ్య పెరిగిపోతున్న దూరాలు, నాస్తాల్జియా  వంటివెన్నో  దీనిలో ఉన్నాయి. 

1990లో హైదరాబాద్ లో మతకల్లోలాల వల్ల మూడురోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అప్పటి పరిస్థితిని వర్ణిస్తూ ‘బుద్ధిని దేశంలో అన్ని అహింస  పేరున జరుగుతాయి/ మనుషుల్లోని చీకటి గల్లీల పాలవుతుంది/ విప్పి చెప్పలేని వ్వథ  ఒప్పుకోక తప్పనంత నిరాశ’తో కూరుకుపోయిన మనుషుల మనస్తత్వాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. 

ఇలా గోపీగారు తన జీవితంలో చూసిన వాటికి స్పందించిన స్పందనలన్నీ కవిత్వమయ్యాయి. ఈ కవిత్వం చదివితే తెలుగు రాష్ట్రాలు మాత్రమేకాదు, భారతదేశంలోను,  ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక సంఘటనల సమాహారం మన కళ్ళ ముందు మెదులుతుంది. ఒక చిన్న సంఘటనకు కూడా కదిలిపోయే మనస్తత్వం కవిత్వానికి ప్రాణం. అది గోపి గారి కవిత్వంలో బాగా కనిపిస్తుంది. గోపి గారిలోని కరుణ రసార్ద్రహృదయమేమిటో తెలియాలంటే ఆయన కవిత్వం చదవాలి. వస్తువు, అభివ్యక్తి, రూప వైవిధ్యం ఇవన్నీ గోపి గారి కవిత్వంలో అనేక పార్శ్వాలలో మనకు కనిపిస్తాయి. ఈ వ్యాసాన్ని ముగించే ముందు ఆయన కవిత్వంలోని అభివ్యక్తి వైవిధ్యాన్ని తెలిపే కొన్ని అంశాలని చూడాలనిపిస్తుంది.  నిజానికి కొత్తగా కవిత్వం రాసే వాళ్ళతో పాటు కవిత్వరచనలో ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు కూడా పరిశీలించదగిన అనేకమైన అంశాలు గోపి గారి కవిత్వంలో ఉన్నాయి. ‘ఎన్ని ఆశలు రాలిపోతున్నవి’ 

‘ఆవేశం పగులుతుంది కదా’ 

‘రాలిపోతున్న దినాలను చూస్తూ/ నిట్టూర్చడం తప్ప ఏం చేస్తున్నాను?’

అభివ్యక్తి, భావుకత రెండూ ఒకటి కాదు. చాలామందికి గొప్ప భావుకత ఉండొచ్చు; కానీ, దాన్ని అభివ్యక్తీకరించే శక్తి లేకపోవచ్చు. రెండింటినీ కలిపేది పాండిత్యం.  ఒక మంచి మాట. ఒక మంచి మనిషి.  ఒక మంచి పాట వినడం… వల్ల సహృదయుని మనసు ఎలా కరిగిపోతుందో తెలియాలంటే ఒక పాట గురించి గోపిగారు రాసిన కవిత చదివి తీరాలి. 

‘నీ మౌనం తీగెలుగా సాగి/ ఏ పాటమీదకో పాకిపోయింది/ పాట కరిగి కరిగి/నిశ్శబ్దంలోకి జారిపోయింది’ 

కవి అనగానే భావుకతే ప్రధానం. వస్తువు పాతదైనప్పటికీ,  దాన్ని చెప్పే ఉపమానం లేదా ఉపమేయం కొత్తగా ఉండడం భావుకతలో అత్యంత ముఖ్యం. 

‘మొనదేరిన గిరి శిఖరానికి తగిలి/ ఇనబింబం గాయపడినప్పుడు’ ప్రభాత వేళ సూర్యుణ్ణి చూస్తే పర్వతాల నుండి పైకి వస్తున్నట్లు అనిపిస్తాడు. ఆ పర్వతాలకు తగిలి సూర్యుడు గాయపడ్డాడట. అందుకనే అప్పుడు  కిరణాలన్నీ అరుణ వర్ణం శోభను సంతరించుకున్నాయనేది కవి అద్భుతమైన భావుకత. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని మన కవులు వర్ణించిన తీరు ఎప్పటికీ ఒక అద్భుతమే. ఈ వర్ణనకు ప్రాచీన, ఆధునిక అనే భేదం లేదు. 

అభివ్యక్తిలో నవ్యత్వానికి నిదర్శనంగా నిలిచే ఇలాంటి ప్రయోగాలు గోపిగారి కవిత్వంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. మూర్తపదార్థాల్ని అమూర్త పదార్థాలతో ఉపమించడంలో ఈ అభివ్యక్తి నవ్యతను సాధిస్తుంది.

డా.గోపి గారికి 75 సంవత్సరాలు నిండాయి. అమృతోత్సవాన్ని చేసుకుంటున్నారు. ఆయన కవిత్వం రాయడం మొదలు నేటి వరకు ఆయన రాసిన కవితలన్నీ మానవ జీవితంలోని వివిధ స్థాయిల్లో గల అనుభూతులను మనకు వినిపిస్తాయి. ఆయన ఒక ఉత్తమ అధ్యాపకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజా కవి వేమన పై పరిశోధన చేసి గొప్ప పరిశోధకుడిగా నిరూపించుకున్నారు. ఒక పరిశోధన ఎలా చేయాలో తెలియడానికి ఆ గ్రంథం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. వేమన కవి జీవితాన్ని తెలిపి, ఆయన రాసిన పద్యాలను, ఆయన తాత్విక దృక్పథాన్ని ఎంతో శాస్త్రీయంగా‌ ప్రజాకవిగా వేమనను నిరూపించారు. వేమన గారి పద్యాల పారిస్ ప్రతులను తేవడంలో పరిశోధకుడిగా గోపి గారి కృషి ఎంతో ఉంది. నిజానికి ఈ పరిశోధన చేసేనాటికే కవిగా గోపి గారు ఎంతో ప్రసిద్ధి పొందారు. అయినప్పటికీ పరిశోధన గ్రంథ రచనలో భాష ఎలా ఉండాలో అలాగే రాశారు తప్ప, తన కవిత్వ భావుకతను, ఆలంకారిక శైలినీ ప్రదర్శించలేదు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసి పరిపాలనాదక్షుడిగా నిరూపించుకున్నారు. సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందడన కాదు; అనేకసార్లు సాహిత్య అకాడమీ పురస్కారాల ఎంపికలో ఉన్నారు. ఆయన రాసిన వ్యాసాలు కూడా పుస్తకాలుగా వచ్చాయి. ఆయన రాసిన ముందు మాటలు ఎంతో ఆత్మీయంగా ప్రోత్సాహాన్నిచ్చేలా ఉంటాయి.  కవిత్వంలో అయినా వచ్చిన కవిత్వం, దానితోనే దీర్ఘ కవిత్వాన్ని కూడా రాశారు. తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు స్థిరంగా నిలబడే నానీలు అనే ఒక కవితారూపాన్ని సృష్టించారు. వేమన పద్యాలు ప్రజల నాలుకలపై ఎలా నిలిచిపోయాయో, గోపీగారు సృష్టించిన నానీలు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్లిపోయాయి. గోపీ గారు అన్ని పదవులు అలంకరించినా, అన్ని బాధ్యతలు నెరవేర్చినా తన కవిత్వ సాధనను మాత్రం ఆపలేదు. అందుకనే పరిశోధన చేసే వారికి ఆయన ఒక గొప్ప పరిశోధకుడు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఒక మంచి ఉపాధ్యాయుడు. ఆయన కవిత్వాన్ని అభిమానించే అందరికీ ఆయన గొప్ప కవి. సమకాలీన సమాజంలో వచ్చిన వివిధ ఉద్యమాలు, ధోరణలు, వాని ప్రతిస్పందనలు ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. ఇవన్నీ ఒక వ్యాసంలోనే కాదు; ఒక ఒక పరిశోధన గ్రంథంలో కూడా సమగ్రంగా చెప్పలేం. ఆయనే ఒక కవితలో చెప్పుకున్నట్లు…‘’ఎన్నెన్నీ సందర్భాలు ! /పల్లెలోని పైరగాల్లోంచి/ నగర ఝంఝామారుతంలోకి/ రాలిన దినాలు/ కన్నీటి తీగలపై బ్యాలెన్సు చేస్తూ/ సాగిన రోజులు’’ గోపీ గారి కవిత్వం నిండా ఇలాంటి వెన్నతో పరిమళిస్తుంటాయి. అవన్నీ మన స్పందనలే కనిపిస్తుంటాయి. 


(డా.ఎన్.గోపిగారి అమృతోత్సవంలో భాగంగా జూన్  25 వ తేదీన తన 75 కవితల సంపుటి ‘రేపటి మైదానం’ ఆవిష్కరణ, దాన్ని డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గార్కి అంకితం ఇస్తున్న సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం) 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పూర్వ శాఖాధ్యక్షులు, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్. 





కామెంట్‌లు లేవు: