ఆచార్య ముదిగొండ రచనల ఆవిష్కరణ
ఆచార్య ముదిగొండ వీరభధ్రయ్యగారు తన జీవితంలో ఆచరించినట్లే తన రచనల్లో కూడా రాస్తారని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలిచాల కొండలరావు వ్యాఖ్యానించారు. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య సుదీర్ఘ కాలం పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, శాఖాధ్యక్షులుగా పనిచేసి, తర్వాత శ్రీ సత్య సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (ఎస్.ఎస్.ఎస్.ఐ.హెచ్.ఎల్)లో గౌరవ ఆచార్యులుగా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకాలు 'కెమోమిల్లా' (కథానికల సంపుటి), మానససరోవరంలో స్వర్ణహంస (దీర్ఘ కవిత)లను ఆవిష్కరించి వెలిచాల కొండలరావు మాట్లాడారు. ఈ ఆవిష్కరణోత్సవంసోమవారం (30.10.2023) నాడు హైదరాబాద్, ఖైరతాబాద్ లో క్షేత్ర హోటల్ లో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన మాజీ ఐఎఎస్ అధికారి కె.సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఆచార్య ముదిగొండ వీరభద్ర గారికి నా అనుబంధాన్ని వివరిస్తూ ఆయన నిరంతర అధ్యయనశీలి అనీ, ఆయన రచనలు సాహిత్యానికి నూతన చైతన్యాన్ని తీసుకొస్తాయని, జాతిని జాగృతం చేస్తాయని పేర్కొన్నారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆచార్య ముదిగొండ వారు నిలువెత్తు ప్రేమకు ప్రతిరూపంగా వ్యాఖ్యానించారు. కవిత్వం రాయడానికి దాన్ని ఆస్వాదించడానికి అత్యంత ముఖ్యమైనది మనుషుల పట్ల ప్రేమ అని దాన్ని సిద్ధాంతికరిస్తూ 'మానస సరోవరంలో స్వర్ణ హంస' కావ్యాన్ని రాశారని ఆచార్య దార్ల పేర్కొన్నారు. కవిత్వం మానవునికి తన జీవన పరమార్ధాన్ని తెలియజేసేలా ఉండాలనీ, అప్పుడే నిజమైన కవిత్వమనీ వెలువడుతుందనీ వీరభద్రయ్యగారు తన కావ్యంలో వివరించారని ఆచార్య దార్ల సోదాహరణంగా పేర్కొన్నారు. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యగారు గారిని సనాతన సంప్రదాయవాదిగా చాలామంది భావిస్తారని కానీ ఆయనలో గల ఆధునిక భావాలు తెలియాలంటే ఆయన కథానికలు చదివి తీరాలని దార్ల చెప్పారు. ఇంతమంది పెద్దవాళ్ళమధ్య తనను ఈ సభకు ముఖ్యఅతిథిగా పెట్టడం గురువుగారికి శిష్యుడిపట్ల ఉండే అనురాగానికి పతాకస్థాయిగా భావిస్తున్నాని తన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎం.ఏ నుండి రచనలు ప్రారంభించానని, ఆ రచనలు వ్యావహారిక భాషలో ఉంటే ఆనాటికి ఆ భాష అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆచార్య ముదిగొండ వీరభధ్రయ్య తన సాహితీ నేపథ్యాన్ని వివరించారు. తాను 64 పుస్తకాలు రాశారని అందులో తనకు అత్యంత ఇష్టమైన కావ్యం 'మానస సరోవరంలో స్వర్ణ హంస'అని పేర్కొన్నారు. 1968 లో రాసిన ఆ కథలలో ఆనాటి భావాలే నేటికీ ఉన్నాయని, సంస్కరణకు ఒప్పుకొని మతం సామాజిక విధ్వంసాలకు, యుద్ధాలకు కారణమవుతాయని నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులే నిరూపిస్తున్నాయని వివరించారు. తనకెంతో ఇష్టమైన ఈ రచనలను తనకు అత్యంత ఇష్టమైన గొప్ప సాహితీవేత్తలైన ఆచార్య కె యాదగిరి, దోమలపల్లి అమరేందర్ రావులకు అంకితమిస్తున్నానని వెల్లడించారు. పుస్తకాల అంకితోత్సవం, ఆవిష్కరణ ఎంతో నిరాడంబరంగా జరిగాయి. తన శిష్యులు, తన మిత్రుల మధ్య ముదిగొండ వారి పుస్తకాలను ఆవిష్కరించుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగించిన ఆత్మీయ సమ్మేళనంగా సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారిని శిష్యులు, మిత్రులు, సాహితీవేత్తలు ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సమావేశంలో తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ఆచార్య వారిజారాణి, ప్రసిద్ధ సాహితీవేత్తలు, అధ్యాపకులు డా. వాణీకుమారి, డా.ధూర్జటి లక్ష్మి, డా. జె భారతి డా. చెన్నమనేని పద్మజ, డా.కృష్ణారావు, డా. పాండయ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి