తెలుగుజాతి గర్వించదగిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ , భారత,రామాయణాలతో పాటు ప్రపంచ సాహిత్యంతో లోతైన అవగాహన ఉన్న కవి అని తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు ఆచార్య కె.యాదగిరి పేర్కొన్నారు.
గుంటూరు శేషేంద్రశర్మ జయంతి సందర్భంగా శుక్రవారం (20.10.2023) నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 'గుంటూరు శేషేంద్రశర్మ రచనలు- సమాలోచన' పేరుతో మానవీయ శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో
స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్ డీన్ ఆచార్య వి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆచార్య కే యాదగిరి మాట్లాడుతూ భావ, అభ్యుదయ కవిత్వాల అపూర్వ సమ్మేళనం గుంటూరు శేషేంద్రశర్మ రచనల్లో కనిపిస్తుందని అన్నారు. సాహిత్యం ద్వారానే సమాజాన్ని మార్చవచ్చునని నమ్మిన సాహితీవేత్తగా ఆయనను అభివర్ణించారు. గుంటూరు శేషేంద్రశర్మ ఎంత సనాతనుడో అంత ఆధునికుడిగా కనిపిస్తాడని ఆచార్య యాదగిరి వివరించారు. తన పాటల ద్వారా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా శేషేంద్రశర్మ ప్రతిఫలింపజేశారని అన్నారు. రాయప్రోలు సుబ్బారావు గారి తర్వాత ఆధునిక కాలంలో కావ్యశాస్త్ర విషయాలను శాస్త్రీయంగా నిరూపించినవారు గుంటూరు శేషేంద్ర శర్మ అని ఆయన సోదాహరణగా వివరించారు. ఆధునిక కవిత్వంలో ధ్వనిని సమర్థవంతంగా ఆయన ఉపయోగించుకున్న తీరు తెన్నులను సోదాహరణంగా తన ప్రసంగంలో వివరించారు.
సభాధ్యక్షత వహించిన ఆచార్య వి. కృష్ణ తన అధ్యక్షోపన్యాసంలో సాహిత్యం ప్రజల కోసం అని నమ్మిన అతి కొద్దిమంది సాహితీవేత్తలలో గుంటూరు శేషేంద్రశర్మ ఒకరని సామ్రాజ్యవాద వ్యతిరేక సాహిత్యాన్ని జనవాణి పత్రికలో రాసి వారిని ఆ విధంగా రష్యా సంక్షోభాన్ని అక్షరీకరించిన గొప్ప సాహితీవేత్త అని వ్యాఖ్యానించారు. సదస్సు లక్ష్యాలను సదస్సు సమన్వయకర్త ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరిస్తూ
ప్రతి యేడాదీ హెచ్ సియులో వివిధ శాఖల వారు గుంటూరు శేషేంద్ర శర్మ ధర్మనిధి స్మారక ఉపన్యాసాలు నిర్వహిస్తారని, అయితే, కొన్ని అనివార్య కారణాల వలన గత ఏడాది నిర్వహించలేదని, ఆ రెండింటినీ కలిపి ఈ ఏడాది ఒక రోజు సదస్సుగా జాతీయ సదస్సుగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తెలుగులో నోబెల్ బహుమతికి నామినేట్ అయిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ అనీ, ఆయన సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలలో విశేషమైన పాండిత్యం కలిగిన వ్యక్తి అనీ ఆయన తెలుగు సాహిత్యాన్ని విశేషంగా ప్రభావితం చేశారని, ఆ ప్రభావాన్ని సమకాలీన సమాజంతో పాటు భవిష్యత్తుకు బాటలు వేసే విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవడానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆచార్య దార్ల సదస్సు లక్ష్యాలలో వివరించారు. మానవీయ శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తెలుగుశాఖ, అంతరిస్తున్న భాషలు మాతృభాష అధ్యయన కేంద్రం, ప్రాచీన విశిష్ట తెలుగు అధ్యయన కేంద్రం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆచార్య దార్ల వివరించారు. 2027 వ సంవత్సరం నుండి గుంటూరు శేషేంద్ర శర్మ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, బహుశా ఉభయ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాయని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. సదస్సులో సమర్పించిన పత్రాలతో పాటు మరికొన్ని పత్రాలను కలిపి పుస్తక రూపంలో కూడా తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గుంటూరు శేషేంద్ర శర్మ సతీమణి, ధర్మనిధి ఉపన్యాసాలను ఏర్పాటు చేసిన ప్రముఖ రచయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిరి గౌరవ అతిథిగా పాల్గొనవలసిఉండగా, ఒక అత్యవసర పరిస్థితుల్లో తాను రాలేకపోతున్నానని, సదస్సు విజయవంతం కావాలని సందేశాన్ని పంపించారు.ఈ సదస్సులో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ డైరెక్టర్ ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు, యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి, సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య తాడేపల్లి పతంజలి, శ్రీవివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ జే. భారతి, సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య గోనా నాయక్, డా.భూక్యతిరుపతి తదితరులు గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్యం పై వివిధ అంశాలపై తమ పరిశోధన పత్రాలను సమర్పించారు . ఈ సదస్సులో డాక్టర్ బాణాల భుజంగ రెడ్డి ఒక సమావేశానికి సమావేశకర్తగా వ్యవహరించారు.
సదస్సు మరొక సమన్వయకర్త, అంతరిస్తున్న భాషలు మాతృభాషల అధ్యయన కేంద్రం అధ్యక్షులు ఆచార్య పమ్మి పవన్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ సదస్సులో పరిశోధక విద్యార్థులు, ఎం.ఏ. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి