( సాహితీమిత్రుడు, కవి గద్దపాటి శ్రీనివాసు తన కవితాసంపుటి ‘యుద్ధం ముగిసిపోలేదు’ పేరుతో మే, 2023 వ తేదీన పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీనికి నన్ను ఒక ముందుమాట రాశాను. కవిత్వం ఎంతో పదునుగా ఉంది. సమకాలీన సమాజానికి అవసరమైన కవిత్వం. నాతో పాటు ప్రసిద్ధ కవులు యూకూబ్, ప్రసిద్ధ విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్యగార్లు కూడా ఈ పుస్తకానికి ముందుమాటలు రాశారు. నా ముందుమాటను ఇక్కడ ప్రచురిస్తున్నాను... ఆచార్య దార్ల)
‘నిజాయితీ గల నిత్య చైతన్య పూరితమైన కవిత్వం’
నిజంగా కవిత్వం రాసేవాళ్ళకి వస్తువు ఒకదాని తర్వాత మరొకటిగా తనవైపు చూడమంటూ వెంటబడుతుంది. గద్దపాటి శ్రీనివాసు ఖమ్మం కవుల్లోనే కాదు, తెలుగుకవుల్లోనే ప్రసిద్ధి చెందిన ఒక కవి. ఇప్పటికే వివిధ సంకలనాల్లో, వివిధ పత్రికల్లో తన కవితల ద్వారా పాఠక ప్రపంచానికి తెలిసిన కవి. తన అస్తిత్వాన్ని మరిచిపోని కవి. తన అస్తిత్వం కోసం నిరంతరం యుద్ధం చేస్తున్న అక్షర సైనికుడు. పల్లె నుండి ప్రపంచం వరకు తన అస్తిత్వమెలా రూపుమాసిపోతుందో గమనించమంటూ, దాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ‘మనిషి’ చేయాల్సిన యుద్ధాన్ని గుర్తు చేస్తున్న చైతన్యశీలి. తాను రాసిన కొన్ని కవితల్ని ‘యుద్ధం ముగిసిపోలేదు’ పేరుతో కవితాసంపుటిగా ప్రచురిస్తూ, వాటిని నాకు పంపించి అభిప్రాయాన్ని కోరాడు. శ్రీనివాసు కవిత్వం ఇంతకు ముందే చదివిన అనుభవం ఉన్నా, ఈ పుస్తకంలో ఏముందని తెరిచి చూశాను. ఈ కవిత్వంలో అదృశ్యమవుతున్న పల్లెల గోడు వినిపిస్తుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా విచ్చలవిడిగా మదమెక్కి, బలహీనమైన జీవుల్ని తమ బలమైన పదఘట్టనలతో అదృశ్యం చేసే కుల, మతాధిపత్యాలు కనిపిస్తున్నాయి. ఎర్రజెండాలు, నీలి జెండాలు వెలిసిపోయాయనే వెకిలి నవ్వులకు చెప్పు తీసికొట్టినట్లు చెప్పిన సమాధానాలు వినిపిస్తున్నాయి. సొంత దేశంలో, సొంత రాష్ట్రంలో, సొంతకులాల్లో కనిపించీ, కనిపించనట్లు కలిసి పయనించే కుట్రల స్వరూపమెలా ఉంటుందో ఈ కవిత్వం తెలుపుతుంది. భావజాల సంఘర్షణ, దానిలో తానెటువైపు నిలబడాలో తేల్చుకోమని చెప్పే చైతన్య స్వరం ఈకవిత్వంలో వినిపిస్తుంది. ఆదిమానవుడింకా అడవుల్లోనే ఉన్నా, వాణ్ణీ వదలని మోసాలెలా ఉంటాయో ఈ కవిత్వం చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డం కోసం పడిన త్యాగాలు, ఆ త్యాగాల ఫలితాలు, రాష్ట్రావతరణ తర్వాత పునర్నిర్మాణంలో చేయాల్సినవేంటో కూడా ఈ కవిత్వం స్పష్టంగా చెప్తుంది. తల్లి, తండ్రి, కుటుంబం, స్నేహితుల మధ్య ఉండే సున్నితమైన బంధాలు, ఆ జ్ఞాపకాల గుర్తులు చెరిపేస్తున్న ప్రపంచీకరణ విశ్వరూపాన్నీ ఈ కవిత్వంలో చూడొచ్చు.
శ్రీనివాసు కవిత్వం చదువుతుంటే ఈ కవి గుండెల్లో ఖణ ఖణ మండే విప్లవజ్వాలలున్నాయనిపించింది. ఒకటి మతం పేరుతో గిరిజనుల్ని, దళితుల్ని, మహిళల్ని అమానవీయంగా ప్రవర్తిస్తే, మరొకటి అదీ మతం పేరుతోనే మానవత్వాన్ని పరిమళింపజేసింది. భారతదేశంలో కులం పేరుతో, జెండర్ పేరుతో సాగిస్తున్న అమానవీయతను క్ర్తైస్తవం తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది. ఇవన్నీ నిబద్ధతతో, నిజాయితీతో శ్రీనివాసు కవిత్వీకరించాడు.
భావజాలం పట్ల కవికి స్పష్టమైన దృక్పథం ఉంది. దళితులపై దళితేతరులు చేస్తున్న దాడికి తీవ్రంగానే స్పందిస్తాడు కవి. గిరిజనుల పట్ల కేవలం సానుభూతిగా మాత్రమే స్పందించలేదు కవి, దాన్నొక చారిత్రక స్థలంగానూ, దాన్నొక పవిత్ర స్థలంగాను, జ్ఞానాన్ని ప్రసాదించే ప్రదేశంగాను కావాలనే ఆత్మీయాకాంక్ష ప్రతిధ్వనిస్తుంది. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో ఒక చైతన్యమే కేంద్రంగా భాసిల్లాలనే ఆకాంక్ష ఉంది. ఈ కవిత చూడండి:
''ఓ ...నా జోడేఘాట్/జయంతుల, వర్ధంతుల వేదికేనా/ నా జోడేఘాట్ /మంత్రుల సంతాపాలు/ప్రతినిధుల పశ్చాత్తాపాలు /ఇంతేనా జోడేఘాట్ /ఇదేనా నా జోడేఘాట్ /కాదు కానేకాదు /ఇంకేంటి మరి/ఇంకా /ఇంకా /ఇంకా /నా జోడేఘాట్/ఒక మక్కా/ఒక జెరూసలేం /ఇంకో బుద్ధగయ'' (జోడేఘాట్)
ముస్లిములకు మక్కా ఒక పవిత్రస్థలంగా మారింది. క్రైస్తవులకు జెరూసలేం ఒక పవిత్రస్థలంగా కొనసాగుతోంది. దీనికి బుద్ధగయను జోడించడం కవి చైతన్యాన్ని తెలుపుతుంది. జోడేఘాట్ స్థలం కేవలం కల్పనకాదు. ఒక చారిత్రక వాస్తవం. ‘‘బుద్ధగయ’’ బౌద్ధులకు పవిత్ర స్థలం. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రాంతం కాబట్టి దానికి ‘బోధ్ గయ’ అయ్యింది. అది క్రమేపీ వ్యావహారికంలో బుద్ధగయగా ప్రాచుర్యం చెందింది. అలాంటి చారిత్రక ప్రాంతంగా జోడేఘాట్ కూడా మారాలనే ఆకాంక్ష కవిలో కనిపిస్తుంది. గిరిజనుల స్వేచ్ఛకు, చైతన్యానికి, పోరాటశక్తికీ నిదర్శనంగా నిలిచే ఆదర్శపురుషుడు కొమురం భీమ్ (1901 - 1940) నిజాం నవాబు గిరిజనులపై విధించే అక్రమమైన పన్నులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు. గిరిజనులకు హక్కుల్ని కాపాడ్డంలో, వారిని చైతన్యపరచడంలో, సమైక్యపరచడంలో గొప్ప నాయకత్వలక్షణాలతో వ్యవహరించేవాడు. అతణ్ణి జోడేఘాట్ అడవుల్లో కుట్రపూరితంగా నిజాం సైనికులు చంపేశారు. ఆ ప్రాంతాన్ని గిరిజనులు అంత పవిత్రంగా భావించుకోవాలంటాడు కవి.
సామాన్య పరిభాషలో మార్క్సిజం అని పిలుచుకునే తాత్విక చారిత్రక భౌతికవాదం పట్ల కవికి నిలువెత్తు అభిమానం ఉంది. దాంతో పాటు దానికున్న పరిధుల పట్ల కూడా అవగాహన ఉంది. అయినప్పటికీ దాన్ని అజేయంగా భావించాలనడంలో కవికున్న ప్రాపంచిక దృక్పథం స్పష్టంగా తెలుస్తోంది.
'ఇప్పటికీ విజయం నీదే అయినా/భ్రమలు తొలిగే కాలం ఎంతో దూరం లేదు/గూడు విడిచిన పక్షి మళ్లీ గూటికే చేరుతుంది/ గ్రహణం ఉన్నంతసేపే మీ చీకటి నాటకాలు/తెరలు తొలగించి రోజు రాక మానదు/కాక పికాలను కాలమే తేల్చుతుంది/ఋతు ధర్మాన్ని పాటిస్తున్నాం/రాబోయేది వసంతమే'' (మార్క్సిజం అజేయం).
దీనిలో కొన్ని కవితలు చదివేటప్పుడు కవి ఒక మార్క్సిస్టు గా కనిపిస్తాడు. కానీ, కవితలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక బహుజన దార్శనికతనే ప్రదర్శిస్తున్నాడని స్పష్టమవుతుంది. సమకాలీన పరిస్థితుల్లో కుల బలం, ధనబలం లేనటువంటి వాళ్ళు ఏదొక మతాన్ని ఆశ్రయించక తప్పడం లేదు. అలా అంగీకరించకపోతే వాళ్ళ మీద పీడన మరింతగా పెరిగిపోతుంది. ఈ కవికి మార్క్సిజం పట్ల సానుభూతి ఉన్నా, భారతదేశంలో మతాన్ని, దాని ప్రభావాన్ని బాగా గమనించాడు. అందుకే దళితులు క్రైస్తవం లోకి ఎందుకు వెల్లవలసి వచ్చిందో చాలా స్పష్టంగానే చెప్పాడు.''మానవత్వం మంటగలిసి /మనిషితనాన్ని మట్టుబెట్టి /నీశ్లోకం నన్నంటరాని వాణ్ణి జేసినా.../వాక్యం నన్ను అక్కున జేర్చుకుంది'' (స్టాప్ ది గేమ్స్).
విషయాన్ని కళాత్మకంగా అభివ్యక్తం చేయడం శిల్పపరమైన అంశం. వస్తువు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ దాన్ని పాఠకుడికి అందించే నైపుణ్యం ఈ శిల్పం లోనే ఉంటుంది. శిల్పాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాసే కవికి కొన్ని అంశాలను కవిత్వం చేసే పద్ధతిలో జాగ్రత్త కనిపిస్తుంది. ఆ కవిత్వం నిత్యనూతనంగా కనిపిస్తుంది.
భారతీయ సంప్రదాయ కావ్యేతిహాసాలు ధర్మం గురించి అనేక కథల్ని వివరించాయి. రామాయణంలో రాముడు ఆదర్శపురుషుడుగా చేసిందంతా నాటి ధర్మపరిరక్షణమే. వాలిని చెట్టు చాటు నుండి బాణంవేసి చంపడం ధర్మమే! మహాభారతంలో శ్రీకృష్ణుడు కర్ణుని రథం భూమిలో దిగబడినప్పుడు అతనిపై యుద్ధం చేయడం కూడా ధర్మమే! అది ధర్మమని చెప్పే అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. గీతాసారం కర్మసిద్ధాంతం కూడా ధర్మవివరణమే! ఇలాంటి హిందూ పౌరాణిక ప్రతీకలు తీసుకొని ఆధునిక కాలంలో కొన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు శాంతిభద్రతల పేరుతో చేసే చర్యల్లో ధర్మలేదంటున్నాడు కవి.
‘‘తెగ బలిసిన సింహాలు /అమాయకపు లేళ్లపై /అమాంతంగా దూకటం కాదు /పచ్చని నేలపై రక్తపు మరకలు అద్దడం కాదు/ యుద్ధమంటే చాటుగా మట్టుపెట్టడం కాదు/ పచ్చని ఆకుల్ని చిదిమేయడం కాదు/ శాంతిభద్రతలపేర అశాంతినిసృష్టించడం కాదు /యుద్ధం అంటే కలల్ని చిద్రం చేయడం కాదు/ కల్లోలాన్ని సృష్టించడమంతకంటే కాదు...''
లేళ్ళు సామాన్య ప్రజలకు ప్రతీకలైతే సింహాలు అధికారంలో ఉన్న పోలీసులకు లేదా పీడించే వాళ్ళకి ప్రతీకలుగా భావించవచ్చు. మనం అనేకసార్లు పత్రికల్లో, టీవీల్లో బూటకపు ఎన్కౌంటర్లలో అమాయకుల్ని చంపేశారని చదువుతూ ఉంటాం., వింటూ ఉంటాం. అందుకే కవి ఇలా నిలదీసి అడుగుతున్నాడు.
''యుద్ధం ఎప్పుడు జరిగినా/గెలిచేదంతా ధర్మమే/గీతాసారాన్ని/నూరిపోసిన కర్మభూమిలో/వేల యేండ్ల చరిత్ర పుటల /రక్తపు మరకల సాక్షిగా/నిజం చెప్పూ.../ధర్మమే గెలిచిందా??'' ఈ కవితలో పురాణ ప్రతీకలను తన శిల్పచాతుర్యంతో కవి చక్కగా వాడుకున్నాడు.ఈ ధర్మాధర్మాల జీవన సమరంలో కొన్ని ధర్మ సూక్ష్మాలను కూడా తెలుసుకోవాలంటాడు కవి.''సముద్రం ఒడ్డున నిర్మించుకున్న దారులన్నీ/ అలల తాకిడికి అదృశ్యమవుతాయి/ జీవితమంటే కోల్పోయిన ఇసుక గూళ్లను మళ్లీమళ్లీ నిర్ణయించుకోవడమే.../కరిగిపోయిన క్షణాలన్నీ/ఏటి ఒడ్డున గవ్వల్లోనో.../పగిలిన ముత్యపు చిప్పల్లోనో/వెతుక్కోవడమేమో...''
జీవితాన్ని ఇలా నిర్వచించగలగడమంటే గొప్ప లోకానుభవం కావాలి. ఒక తాత్విక ప్రపంచంలోకి వెళ్ళగలగాలి. గొప్ప ఆశావాదాన్ని నింపుకోవాలి. అందుకే ఈ కవిత్వాన్ని నిజాయితీతో రాసిన నిత్యం చైతన్యాన్ని పూరించే కవిత్వం అంటున్నాను. ఈ కవితా సంపుటిలో ‘‘పగిలిన గీతం’’ పేరుతో రాసిన కవిత గొప్ప కవిత. కొన్ని వందల సంవత్సరాలుగా దళితులు అనుభవిస్తున్న అస్పృశ్య విషాద జీవితమంతగానో ఈ కవితలో అభివ్యక్తమైంది. దీన్ని చక్కని శిల్పమర్యాదతో వర్ణించాడు. గతంలో జరిగిన కొన్ని అంశాలు సమకాలీన సమాజంలో కూడా కనిపిస్తూ అవి తనని ఆనందపరచడమో, వేదనకు గురి చేయడమో చేస్తూ ఉంటే ఆ అంశాలకు కవి స్పందించిన రకరకాల భావ విస్పోటనాలు చెప్పడాన్ని 'ఉల్లేఖన' Allusion)గా భావిస్తారు.
''ఇక్కడ జీవితమంటే/దుఃఖానికి పర్యాయపదమే/నదిలా ప్రవహిస్తున్న జ్ఞాపకమేదో/తళుక్కున మెరుస్తుంది /ఇప్పుడంతా అర్థమైనట్లే /ఏమీ అర్థం కాని ఒక సందిగ్ధావస్థ/శతాబ్దాలనాడు చెవుల్లో పోయించుకున్న సీసం తాలూకూ తుప్పేదో.../వదులుతున్న భావన/ఏవో కొన్ని శబ్దాలు/అస్పష్టంగా వినిపిస్తుంటాయ్/నా వెనకే నడుస్తున్న తాటాకులు శతాబ్డాలు/మూతికి కట్టిన ముంజలు జారి / పెటేళ్మని పగిలిన శబ్దాలు /దాహమేసి/అలసిన దేహాన్ని శాంతపరచడానికి /ఏ టీ కొట్టునో ఆశ్రయిస్తానా.../నవ్వుతూనే వెక్కిరింతగా /పలకరిస్తుంది రొండో గ్లాసు'' దీనిలో కేవలం ఎల్యూషన్ మాత్రమే కాదుఒక డ్రమెటిక్ మోనోలాగ్ కూడా ఉంది. విషయాన్ని కవిత్వంగా చెప్పే విధానం దళితుని బాధను మరింత గాఢంగా అందించగలిగింది.
ఇలా రాసుకుంటూ పోతే ఈ కవిత్వలో ఇంకా అనేకాంశాల్ని చెప్పాలనిపిస్తుంది. దీనిలో కవి- కవులకు కూడా చురకలేసిన కవిత్వం ఉంది. కవిత్వం పేరుతో ఉగాదులు, దీపావళి మొదలైన పండుగలకు కవిత్వం పేరుతో రాసే కవిత్వం పట్ల కూడా అధిక్షేపం ఉంది. ఒక దళితుడిగా సమన్యాయం కోసం ఎస్సీవర్గీకరణను సమర్థించాడు. ఒక తెలంగాణ పోరాటవీరుడిగా తన ప్రాంత అస్తిత్వం కోసం గళమెత్తాడు. ఒక భారతీయుడిగా కుల, మత, వర్గ విభేదాల్ని పోవాలని ఆకాంక్షించాడు. ఒక ప్రపంచపౌరుడిగా గ్లోబలైజేషన్ ని వ్యతిరేకించాడు. ఒక కుటుంబ సభ్యుడిగా అమ్మ, నాన్నలను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఒక స్నేహితుడిగా తన స్నేహితులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఒక ప్రకృతి ప్రేమికుడిగా, ఒక ఆర్ద్రమైన మనిషిగా అనుభూతుల్ని, జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. ఒక సాహిత్య ప్రేమికుడిగా కవిత్వమైనిలిచాడు. శిల్పపరమైన ఆర్భాటాలకు పోకుండా తనకు తెలిసిన భాషలో, తనకు తెలిసిన పద్ధతిలో కవిగా నిజాయితీతో కవిత్వమయ్యాడు.
మిత్రుడు గద్దపాటి శ్రీనివాసు రాబోయే కాలంలో మరింత మంచికవిత్వాన్ని రాస్తాడనే భరోసానిస్తున్నాడు. అందుకే సమాజంలో అనేక సంఘర్షణలతో నిత్యం సంఘర్షణ పడుతున్నాడు. అక్షరమై పలవరిస్తున్నాడు. మనల్ని అక్షరమై పలకరిస్తున్నాడు. కవికి నాహృదయపూర్వక అభినందనలతో, ఈ కవిత్వాన్ని స్వాగతిస్తున్నాను.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు. ఫోన్ : 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి