నువ్వూ-నేనూ
నింగీ - నేలా
నువ్వు గుర్తొస్తావు
ప్రతీక్షణం నువ్వే గుర్తొస్తావు
అక్కడకెళ్ళినప్పుడల్లా ఎందుకో మరీ గుర్తొస్తావు
ఆ ఉబుసుపోని కబుర్లమధ్య
సమయమంతా వృధాగా పోతుందనుకుంటాను
అంతలోనే అందర్లో ఉండగానే
నీ అమాయకత్వం
నీ నిష్కల్మషత్వం
నీలో పొంగేప్రేమ
నీలోని ప్రతిభ...
ఇలా ఎన్నెన్ని రూపాల్లోనో
నువ్వే నాకళ్ళెదుటే కనిపిస్తావు
వెళ్ళేటప్పుడో
వచ్చేటప్పుడో
నిన్నోసారైనా పలకరించాలని
ఫోనుపై సున్నితంగా గొంతొకమునివేలవుతుంది
ఆ వెంటనే రహదారిపై వివేకమేదో
వద్దనీ నాతో యుద్ధం చేస్తుంది
నేనే గెలుస్తాననుకుంటాను
కాస్తంతదూరం వెళ్ళానో లేదో
కొనసాగే సంభాషణలన్నీ
వేగంగా ప్రవహించే నదికెవరో
ఆనకట్ట కట్టినట్లవుతుంది !
పొద్దున్నుంచి చూసి చూసి
అలసిపోయిన కళ్ళలో
ఓ చిరుదరహాసపు మెరుపు మెరిసేలోగానే
అసహనం మనసునంతా ముళ్ళకంపలతో కప్పేసినట్లు
ఆ బాధెనెవరిపై చూపించాలో
నన్నే చూస్తూ స్టాటస్ లో
అర్థాంతరంగా మాయమైపోయే ఫోటోలా
మూలుగుతూ మనసంతా తీయని బాధ
నువ్వూ -నేనూ
నింగీ - నేలగా
ఇవెప్పటికీ కలవలేవు
ఇవెప్పటికీ ఒకర్నొకర్ని విడిచీ ఉండలేవు
కళ్ళెదుట నిలిచిన అందమైన దృశ్యమేదో
గుండె గదిలోకే మళ్ళీ వెళ్ళిపోతుంది।
బహుశా నీకూ అంతేనేమో
మళ్ళీ తెల్లవారివస్తాననే ఆశనేదో సంతకం చేస్తూ
ప్రతి సాయంత్రం కళ్ళకి తడినిస్తూ వెళ్ళిపోతుంది!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 1.8.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి