గాయం పాడిన పాట
నిన్నిలా చూడలేకపోతున్నానురా నాచిట్టి కన్నా
పువ్వుల్ని కూడా సుకుమారంగా పట్టుకొనే నీ చేతులకు
సిరంజీలలా కర్కశంగా గుచ్చుతుంటే
కన్నీళ్ళు కాదురా
రక్తం చుక్కలేరాలిపడుతున్నాయి
నిన్నిలా చూడలేకపోతున్నానురా నాచిట్టి కన్నా
నీకో ముద్దా నాకో ముద్దా అంటూ
దాగుడు మూతులు పంచుకొనే నీ బోసినోటిలో
అలా బలవంతంగా మాత్రలేవో కూరుతుంటే
గొంతు మూగబోవడం కాదురా
దుఃఖపు కెరటాలేవో కీచురాళ్ళ మోతలవుతున్నాయి
నిన్నిలా చూడలేకపోతున్నానురా నాచిట్టి కన్నా
ఇల్లంతా వెలుగుల సంగీతం వెదజల్లే
నీ అడుగుల చప్పుళ్ళన్నీ
గర్నీ (gurnery) కే కట్టిపడేసినట్లుండే ఆ ఐసియులో
నిశ్శబ్దమంతా ఒంటరితనమైన చీకట్లేవో
మనసంతా చిత్తడి చిత్తడిగా మారిపోయి
ఈ కాళ్ళిక్కడే కూలబడిపోతున్నాయి
నా చిట్టికన్నా,
నువ్వు పొద్దున్నే నాతో పోటీ పడుతూ
బాత్ రూమ్ లో
నాపై నురుగునీళ్ళెప్పుడు చల్లుతావు?
నీ రంగులు పూసుకొని
పుస్తకాల్లో జీవం పోసుకునే ఆ సీతాకోకచిలుకలు
ఆనందంతో రెక్కల చప్పుళ్ళెప్పుడు చేస్తాయి?
గలగల ప్రవహించే
నీ మాటల సెలయేట్లో
తన్మయత్వంతో మనం గంతులేసేదెప్పుడు?
కాన్వెంట్ గువ్వల గుంపులోకి వెళ్ళగానే
మెరుపులొకవైపు
కన్నీటి ముత్యాలు మరొకవైపు
కదలనని మొరాయించే
మనిద్దరి మనసుల స్పందన వినీవినట్లలా
నువ్వొక వైపు నేనొక వైపు
యాంత్రికంగా కదిలిపోయినా
సాయంత్రం కాగానే మళ్ళీ వేయివసంతాల్ని
మోసుకుంటూ కలుసుకొనే
దివారాత్రుల దోబూచులాటల దినచర్యను
ప్రారంభించేందుకే
ఆ కోటానుకోట్ల దేవుళ్ళనందర్నీ నిలదీస్తున్నా!
ఈ తెల్ల కోట్ల వైద్యనారాయణలందర్నీ ప్రార్థిస్తున్నా!!
దార్ల వెంకటేశ్వరరావు,
సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్
ఫోన్: 9182685231
తేది: 23.2.2023
జనప్రతిధ్వని దినపత్రిక, 26.2.2023 సౌజన్యంతో
( మా అబ్బాయి అనారోగ్యంతో ( డీహైడ్రేషన్ ) కాంటినెంటల్ హాస్పిటల్, పిఐసియులో మూడు రోజుల పాటు ఉన్నప్పుడు, వాడిని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేని బాధతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి