"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 January, 2023

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు)25వ భాగం. బాల్యం చివరి భాగం.

 


ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు)25వ భాగం. బాల్యం చివరి భాగం.

యుద్ధం మొదలైంది...!

బాల్యం నాటి కష్టాలైనా, సుఖాలైనా మనం పెద్దవాళ్ళయిన తర్వాత అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగానే అనిపిస్తాయి. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసిన కోతి చేష్టలు అన్నీ తలచుకుంటే ఆనందాన్నే ఇస్తాయి. నాచేతి మణికట్టు చూసుకున్నప్పుడల్లా మేము చేపల కోసం వేసిన గేలం గుచ్చుకున్న ఆ మచ్చ నాటి చేష్టలన్నీ తీపి గుర్తులేనని గుర్తు చేస్తుంది. ఒకవైపు గేలం వెయ్యొద్దని చెప్పినా వినలేదని తిట్టడం, కొట్టడం వంటివన్నీ భయాన్నే కలిగించడం నిజమే.  మరొకవైపు అమ్మానాన్న ఇంట్లో వాళ్లంతా ప్రదర్శించిన కేర్ నా కుటుంబాన్ని మరింత ప్రేమించేలా చేస్తుంది.ఇప్పటికీ ఐస్ క్రీమ్ చూస్తే చిన్ననాటి నా ఓ ఆలోచన కళ్ళముందుకొచ్చి నవ్వొస్తుంది.

ఐస్ క్రీమ్ కోసం ఆపరేషన్

నాకు గొంతులో టాన్సిల్స్ పెరిగినప్పుడు అన్నాన్ని మెత్తగా పిసుక్కొని  తినేవాణ్ణి. పదిమందిలో అలా అన్నం తింటే మనల్ని అసహ్యించుకుంటారని, అలా తినొద్దని మా పెద్దన్నయ్య చెప్పేవాడు. అలా చేయకుండా అన్నాన్ని మింగాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది. ఆ విషయాన్ని ఎంత చెప్పినా వినేవాడు కాదు, తిట్టేవాడు. మా నాన్న ఈ టాన్సిల్స్ తగ్గించడానికి తనకు తెలిసిన వైద్య పద్ధతుల్ని అనుసరించేవాడు. అవి చాలా భయంకరంగా ఉండేవి. పొయ్యి దగ్గర చూరుకి ఏర్పడే బూడిద తీసుకొని, కన్ను ఉప్పు (క్రిస్టల్ సాల్ట్) కి పెట్టి పొద్దున్నే గొంతులో పెట్టి టాన్సిల్స్ పగిలేలా నొక్కేవాడు. అప్పుడు అవి పగిలి రక్తం వచ్చేది. ఆ సమయంలో నా గొంతులో ఉప్పు, బూడిద కలిపి పెడుతుంటే నాకు ఊపిరి ఆడేది కాదు. ఆ బాధ భరించలేకపోయేవాణ్ణి. ఇవన్నీ గమనించిన మా అమ్మ నన్ను హాస్పిటల్ తీసుకు వెళ్ళమని చెప్పింది. ఆ ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపిస్తే ఆయన ఆపరేషన్ చేయాలన్నారు. అంతకుముందే మా తమ్ముడు కృష్ణకు టాన్సిల్స్ ఆపరేషన్ చేయించారు. తర్వాత ఎవరు చెప్పారట. దానికి అంత ఆపరేషన్ చేయాల్సిన పనిలేదనీ, ఉప్పుతో నొక్కితే సరిపోతుందనీ అన్నారట. అందుకని దాన్ని నా మీద ప్రయోగం చేశారు.బాధ తట్టుకోలేకపోవడం, అది తగ్గకపోవడంతో నన్ను కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపరేషన్ అంటే భయమేసింది.అప్పుడు మా తమ్ముడు కృష్ణ తనకు టాన్సిల్స్ వచ్చినప్పుడు ''ఎన్నో ఐస్ క్రీములు ఇచ్చారు.  నీకు కూడా ఐస్ క్రీమ్ ఇస్తారు'' అని ఊరించాడు. ఐస్ క్రీమ్ ఇస్తారని నేను ఆపరేషన్ చేయించడానికి ఒప్పుకున్నాను.  నాకు ఐస్ క్రీమ్ చూసినప్పుడల్లా ఆ సంఘటన గుర్తుకు వస్తూ ఉంటుంది. టాన్సిల్స్ బాధ తగ్గిపోయింది. ఈ బాధ కంటే పెద్దన్నయ్య తిట్టే బాగా తగ్గిందని నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ, ఒకటి అయిపోతే మళ్ళీ మరొక టాస్క్ ఇచ్చేవాడు.

పెద్దన్నయ్య  మాకో ప్రియమైన హిట్లర్

మా పెద్దన్నయ్య మిమ్మల్ని కాళ్లు, చేతులు శరీరాన్ని బాగా తోముకోవాలని చెప్పడం వరకు ఓకే. కానీ, గడ్డితో గానీ, కొబ్బరి పీచుతో గాని తోముకోవాలని చెప్పేవాడు. కాళ్లు, చేతులకు గోర్లు పెరగటం మంచిది కాదని, వాటిని ఎప్పటికప్పుడు కట్ చేయించేవాడు.  మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడితే ఒక మొట్టికాయ వేసేవాడు. నెమ్మదిగా మాట్లాడ్డం అలవాటు చేసుకోవాలనేవాడు. పెద్దన్నయ్యకు తాను చదివే హైస్కూలు లో యవలతో చేసిన ఉప్మా పెట్టేవారు. దాన్ని మాకోసం పట్టుకొచ్చే వాడు. అది ఎంతో రుచి కరంగా ఉండేది. దాన్నిగానీ, అన్నాన్ని గానీ తినేటప్పుడు ఏమాత్రం సౌండ్ వచ్చినా అలా పందిలా తినకూడదనేవాడు.నాకు ఇంకొంచెం పెట్టమని గట్టిగా ఏడిస్తే, కోపంతో కారం బుడ్డితో నెత్తిమీద కొట్టాడు. కారం బుడ్డీ పగిలిపోయింది, తలనిండా కారం. ఆ దెబ్బకి కాసేపు నాకు కళ్ళు బైర్లు కమ్మేశాయి. తల పగిలిపోయిందేమో అనుకున్నాను. రక్తం రాలేదు కానీ, దెబ్బ గట్టిగానే తగిలింది.ఎప్పుడన్నా గుండు చేయించుకుంటే ఆ దెబ్బవల్లే కొంచెం తల లోనికి పోయినట్లు అనిపిస్తుంది. కాఫీ, టీలు తాగేటప్పుడు కూడా ఏమాత్రం సౌండ్ వచ్చినా కుడితిలా తాగకూడదని తిట్టేవాడు.తల మీద కొంచెం వెంట్రుకలు పెరిగినా పిచ్చోడి లా పెంచుకోవద్దనేవాడు. వెంటనే కత్తిరింపు చేయించుకోమని చెప్పే వాడు. మిలటరీ వాళ్ళ లాగా ఉండేది మా తల. స్కూల్లో 'రెండు మూడు నెలల కటింగ్ అవసరం లేకుండా చేయించుకున్నావే' అని ఫ్రెండ్స్ వేళాకోళంగా మాట్లాడేవారు. హాస్టల్లో చేరే వరకు నా తల కటింగ్ మా హిట్లర్ గారి ప్రకారమే జరిగింది. ఆ తర్వాత హాస్టల్లో నేను జుట్టు పెంచుకున్నాను. నాకు కావాల్సినట్టు తల పెంచుకున్నాను. ఆ రోజుల్లో తల పెంచుకొని నుదుటి మీద కుడి వైపు నుండి ఎడమవైపుకి ఒక ఉంగరంలా  చుట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా ఉండేది. అలా నేను కూడా చుట్టుకునేవాడిని. హాస్టల్ నుండి ఇంటికి వచ్చే ముందు మాత్రం కురుసగా కత్తిరింపు వేయించుకొని వచ్చేవాడిని. ఇంటిదగ్గర ''హిట్లర్''  ఉన్నాడు కదా అనిపించేది.ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యే వరకు కొన్నాళ్ళపాటు 'హిట్లర్' ని ఎదిరించి  కొంచెం జుట్టు పెంచుకున్నాను.ఎన్.సి.సి.లో చేరిన తర్వాత అక్కడ మరో హిట్లర్స్ ఎదురయ్యారు. ఆయనే ఎన్.సి.సి. ఆఫీసర్,  శిక్షణ ఇవ్వడానికి వచ్చే మిలటరీ ఆఫీసర్స్వీళ్ళంతా ఒక తాడు కట్టి మరీ కురచగా వేయించేసేవారు. వీళ్ళని చూసిన తర్వాత మా ఇంట్లోని హిట్లర్ గారే బెటర్ అనిపించేది. ఏది ఏమైనా మేమింతక్రమశిక్షణలో ఉండడానికి మా ప్రియమైన హిట్లర్ గారు కూడి ఒక ప్రధానకారణమే.

 

స్థానిక సమస్యలపై పత్రికలకు ఉత్తరాలు

నేను స్కూలుకి వెళ్ళడం, ఆతుకూరి లక్ష్మణరావు మాస్టారు మాటలు ఇచ్చిన స్ఫూర్తితో గ్రంథాలయానికి వెళ్ళడం, పత్రికలు చదవడం, ఆ పత్రికల్లో స్థానిక సమస్యలు గురించి వచ్చే లేఖలు చదివి నేను కూడా కొన్ని సమస్యలు రాసేవాణ్ణి. రోడ్లు బాగోలేదని, వాటిని మరమ్మతులు చేయించాలని రాసేవాణ్ణి. పోస్ట్ ఆఫీస్ ద్వారా సమయానికి అందాల్సిన ఉత్తరాలు, టెలీగ్రామ్స్ అందడం లేదని కొంత మసాలా కలిపి కూడా రాసేవాణ్ణి. ఒకసారి అలా రాసిన ఉత్తరానికి మా పోస్ట్ మ్యాన్స్పందించి నన్ను అడిగాడు. ''మీ టెలిగ్రామ్ గానీ, ఉత్తరాలు గానీ ఎప్పుడన్నా ఆలస్యమయ్యాయా? ఎప్పుడో చెప్ప'' మని నిలదీశాడు.నేను తడబడ్డాడు. కానీ మాకు ఈరోజు ఇవ్వాల్సిన ఉత్తరాలు రెండు మూడు రోజులు తర్వాత ఇచ్చిన సందర్భాల్ని గుర్తుచేశాను. టెలిగ్రామ్ విషయంలో మాకే కాదు, కొంతమందికి అలా అందడం లేదని నాకు కొంతమందిచెప్పడం వల్లనే ఆ విషయం తెలిసే రాశానని సమాధానం చెప్పాను. ''మీరు రాసే రాతల వల్ల నన్ను ఈ ఊరు నుండి ఇంకో ఊరుకి బదిలీ చేశారు. వచ్చే పోస్ట్ మ్యాన్ పట్ల అయినా కాస్త జాగ్రత్తగా ఉండండి'' అంటూ బాధపడ్డాడు.

                   ‘‘నిజమే… 

బాల్యం ఓ చలమలాంటిదే.

బాల్యం ఓ సముద్రం లాంటిదే.

బాల్యం ఓ ఆకాశంలాంటిదే.

ఇలా బాల్యాన్ని ఎన్ని విధాలుగానైనా పోల్చవచ్చునంటారు మన నెమలికన్నుల ఆత్మకథ రచయిత ఆచార్య దార్లవెంకటేశ్వరావుగారు ,... అదటుంచుదాం!

   కుటుంబంలో అమ్మ ,నాన్న ,తర్వాత మనకంటే పెద్దవారు అన్నయ్యలు ఉంటారు. వాళ్ళ అజమాయిషీ అనొచ్చు లేదా పెద్దిరకంతో కూడిన క్రమశిక్షణ నేర్పడం అనొచ్చు. తినేకాడా,తాగేకాడా ఎలాతినాలో , ఎలా తాగాలో అన్నయ్య మందలించి నేర్పించిన తీరు చక్కగా వివరించారు. తలక్షవరం దగ్గరే సమస్యమొదలవుతుంది.సహజంగా పెద్దవారు మనకు డిప్పకటింగు చేయిస్తుంటారు. మనకేమో  ప్రస్తుత ట్రెండ్ ఫాలో అవ్వాలనే కోరిక ఉంటుంది. అది బాల్యమైనా సరే.

       చిప్పటినుండే మన రచయిత సమస్యలమీద స్పందించడం ఆ సమస్యలను లేఖలద్వారా పత్రికలకు రాయడం అలవరుచుకున్నారు. మరీ ముఖ్యంగా వార్తాపత్రిక చదవడానికి రైసుమిల్లులో మూటలు మోశానని సగర్వంగా చాటుకున్నారు రచయిత.

       సబ్జెక్ట్ లన్నీ పాసై లెక్కల్లో తప్పన సంగతి నిజాయితీగా పాఠకులతో షేర్ చేసుకోవడమంటే, నిజంగా ఆయన ఔన్నత్యానికి హర్షించక తప్పదు.అందుకే దీనిని అరమరికలు లేని ఆత్మకథ అనొచ్చు. ఇది భవిష్యత్ తరాలకు,నేడు ఆత్మకథలు రాయాలనుకుంటున్న సమకాలీన మిత్రులకు ఓ గొప్ప మెసేజ్ నిచ్చే ఆత్మకథ.

        ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారి ఆత్మకథ ప్రస్తుతానికి 'అయిపోయింది' అనే చివరివాక్యాలు నా మనస్సును ఎంతగానో మెలిపెట్టింది. ఈ ఆత్మ కథనుండి నేను చాలా నేర్చుకున్నాను. భవిష్యత్ లో వీరిస్పూర్తితో నేను కూడా ఆత్మకథ రాయాలని నిశ్చయించుకున్నాను

      చక్కని ఆత్మకథ ను ధారావాహికంగా గా ప్రచురించిన భూమిపుత్ర పత్రికకు , డా: శ్రీహరిమూర్తి గారికి నాహృదయపూర్వక ధన్యవాదాలు…అభినందనలు.

  • దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, కవి, రచయిత ’’

ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో స్థానిక సమస్యలు ప్రచురించడమే కాకుండా, ఆ సమస్యను సంబంధిత అధికారి దృష్టికి తీసుకొని వెళ్ళి, తగిన పరిష్కారాన్ని కూడా ఆ ఉత్తరం తో పాటే ప్రచురించే వారు. ఆ ఉత్తరం రాసిన వారికి ఆ ఉత్తరం ప్రచురితమైన నాటి దినపత్రికను కూడా పోస్ట్ ద్వారా పంపేవారు. అలా సమస్యలు పరిష్కారం అవ్వడంతో వయోవృద్ధులకు పెన్షన్ ఆపేస్తే ఆ వివరాలతో ఉత్తరాలు రాసేవాణ్ణి. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి, లైఫ్ సర్టిఫికెట్ తీసుకొని, మళ్ళీ పెన్షన్ పునరుద్ధరించే వారు. నేను అలా ఎంతోమందికి మళ్ళీ ఓల్డ్ ఏజ్ ఫెన్షన్ వచ్చేలా చేశాననే తృప్తి కలుగుతుంటుంది. దీనితో పాటు ఎడిటోరియల్ పేజీల్లో ఉత్తరాలు ప్రచురించేవారు. అక్కడ స్థానిక సమస్యలు కాకుండా, దేశదేశాల వార్తలపై వ్యాఖ్యానాలు, అభిప్రాయాల రూపంలో ఉత్తరాలు ప్రచురించేవారు. నేను కూడా కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం ఇలా కొన్ని దేశ సమస్యలతో పాటు, అంతర్జాతీయ సమస్యల మీద కూడా నాకు తెలిసిన దాన్ని రాస్తుండే వాణ్ణి. ఇలా రాయాలంటే ఆ పత్రికలను బాగా చదవాలి. దానికోసమైనా పత్రికను అంతటినీ చదివేవాణ్ణి.

పత్రిక చదవడం కోసం మూటలు మోయడం:

హాస్టల్ నుండి మా ఊరు వస్తే న్యూస్ పేపర్ చదవడం కుదిరేది కాదు. వెళితే చెయ్యేరు పంచాయితీకి వెళ్ళాలి. అక్కడకి వెళ్ళకపోతే మా ఊరులో రెండు చోట్ల పేపర్ చదువుకొనే అవకాశం ఉండేది. కోలా రామారావు కాపుగారు ప్రతిరోజూ పేపర్ వేయించుకొనేవారు. ఆయన ఒక పెద్ద రైస్ మిల్లు కట్టించారు. అది మా ఇంటి నుండి చూస్తే కనిపిస్తుంది. పేపర్ ఎప్పుడు వేస్తాడో ఆ పేపర్ వేసే వ్యక్తి రావడాన్ని పైబట్టి మాకు తెలిసిపోయేది. ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు ఎక్కువ పేపర్స్ అనుబంధంగా ఇచ్చేవారు. వాటి కోసం ప్రతి యేడాదీ మే 31 వ తేదీ కోసం ఎదురు చూసేవాళ్ళం. ఆ పత్రికను ఆ రోజు కావాలని వారంరోజుల ముందే మా ఫ్రెండ్స్ అంతా బుక్ చేసుకొనే వాళ్ళం. వాటితో మా పుస్తకాలకు సరిపడా అట్టలు వేసుకొనేవాళ్ళం. అలా నాకు పేపర్ వేసే అతను బాగా పరిచయం అయ్యాడు. అతను వచ్చే సమయం కూడా తెలిసిపోయేది. మా ఊరులో ఉన్నప్పుడల్లా ఆ పేపర్ వేసే ఆయన వచ్చే సమయానికి నేను కోలా రామారావు కాపు గారి మిల్లు దగ్గరకు వెళ్ళిపోయేవాణ్ణి. నన్ను అక్కడ ఆ పేపర్ వేసే వ్యక్తి బాగా గుర్తు పట్టేవాడు. ఒక్కోరోజు ఆ రామారావు కాపుగారు గారు రావడం ఆలస్యమయ్యేది. నేనే దాన్ని తీసుకొని చదివేసేవాణ్ణి. ఒక్కోసారి నేను చదువుతుంటే ఆయన వచ్చేవారు. ఆయన రావడాన్ని గమనించి లేచి గబగబా ఆ పేపర్ ఆయనకు ఇచ్చేసేవాణ్ణి. అలా ఒకరోజు పేపర్ ఇచ్చేస్తుంటే నాతో ఇలా అన్నారు. '' నువ్వు ఇక్కడ పేపర్ చదువుకోవాలంటే మిల్లులో ధాన్యం బస్తాలు పైకి వెయ్యడం లో మా జీతగాడికి సాయం చెయ్యాలి. అలా చేస్తే నువ్వు కూడా నేను చదివేసిన తర్వాత పేపర్ చదువుకోవచ్చు'' అన్నారు.

అంతవరకు భయం, భయంగా పేపర్ చదువుకోవాల్సి వచ్చేది. ఇంకా భయం లేకుండా చదువుకొనే మార్గం దొరోకిందనుకున్నాను. ఆయన చెప్పినట్లే మిల్లులో ధాన్యం బస్తాలు మోసే వాణ్ణి. ధాన్యం బస్తాలు పైకి పెట్టుకొని వెళ్ళి గళ్ళాలో వెయ్యాలి. అది పెద్దగళ్ళా. నాలుగైదు బస్తాలు వేస్తే గాని నిండేదికాదు. పెద్ద బస్తాని మొయ్యలేక, దాన్ని రెండు, మూడు సార్లు చిన్న సంచిలో వేసుకొని పైకి పట్టుకొని వెళ్ళి ఆ గళ్ళాలో వేసేవాణ్ణి. ఆ గళ్ళా దగ్గరికి వెళ్ళాలంటే పైకి చెక్కతో ఏర్పాటు చేసిన మెట్లు ఉండేవి. వాటిమీద ఏమాత్రం పొరపాటున కాలు జారినా క్రిద పడిపోతాం. అప్పుకు క్రింద అంటే నేలమీద కాదు. మిల్లులో ధాన్యం మెషిన్ లోకి పంపే రేకులు మీద పడిపోతాం. అది జరుగుకుంటూ మిషన్లో పడేలా చేస్తుంది. అందువల్ల అక్కడ పడితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి.  అవన్నీ గమనిస్తూ జాగ్రత్తగా ధాన్యం వేసేవాణ్ణి. ఒక్కోసారి ధాన్యం బియ్యంగా ఆడేసిన తర్వాత ఎవరి బియ్యం వాళ్ళకి పట్టుకొని వెళ్ళడానికి వీలుగా ఆ మూటలను బండి మీద వేయమనేవారు.

అలాగే వేసేవాడిని. నాకు ఆ మిల్లులో ధాన్యం నుండి బియ్యం ఎలా విడిపోయేలా చేస్తున్నారని తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. దాన్ని నేను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాను అనిపించేది. ధాన్యం నుండి నూక ఒక పెద్ద గొట్టం ద్వారా బయటకు వచ్చేది. అది అక్కడ నిండి పోతే, గొట్టం నుండి ఊక బయటికి పోదు. అప్పుడు మిల్లు నడవడం లో కొంత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, ఆ గొట్టం దగ్గర ఊకను అక్కడ అడ్డం లేకుండా ప్రక్కకు తోసెయ్యాలి. దాన్ని కూడా చెయ్యమని చెప్పేవారు. నాకు అంత పెద్ద ఎత్తున్న గుట్టపైకి ఎక్కి క్రిందికి జారుతూ ఆడుకోవాలనే కోరిక ఆ విధంగా తీరుతుందని పించింది. నేనెప్పుడు కావాలంటే అప్పుడు నాతోపాటు మా ఫ్రెండ్స్ తో వచ్చి ఎలాంటి భయం లేకుండా ఆ ఊక పైకి ఎక్కి క్రిందికి దూకుతూ ఆడేవాళ్ళం.

మిల్లులో బియ్యం ఒకవైపు, మరొకవైపు చౌడు, ఇంకొకవైపు ఊక ఎలా వెళ్తుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చిందనుకున్నాను. ఎవ్వరినీ మిల్లు చూడ్డానికి లోనికి వెళ్ళనిచ్చేవారుకాదు. కానీ, యజమాని రామారావు కాపుగారే నన్ను కొన్ని పనులు చెయ్యమనడం వల్ల నేను ఎప్పుడైనా లోనికి వెళ్ళి వచ్చేవాడిని. అక్కడ వచ్చే తౌడు మెత్తగా ఉండేది. దాన్ని నోట్లో వేసుకుంటే కొంచెం తియ్యగా ఉండేది. నేను కొంత సరదాగా తినేవాడిని. ఇలా పనులన్నీ చేస్తూ ఆ మిల్లులో పేపర్ చదివేవాడిని. ఆ మిల్లు యజమానే చదువుకోమని చెప్పడంతో ఆయన రావడం కంటే కూడా ముందు నేనే పత్రిక చదివేసేస్తున్నాననిపించేది.

ఒకసారి మా తమ్ముడిని తీసుకొచ్చి మిల్లు చూపించాను. అక్కడ ఉన్న తౌడు రుచి గురించి చెప్పాను. వాడు తినకపోగా, ఆ విషయాన్ని వాడు ఇంట్లో చెప్పాడు. అలా తినొద్దనీ, ఆరోగ్యానికి మంచిదికాదనీ మా హిట్లర్ పెద్దన్నయ్య గారు ఆదేశించేవారు. నేనేమో మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ వస్తే పేపర్ ఉంటుందో లేదో. అందకని  అక్కడ ధాన్యం మూటలు మోసిన తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడున్న ఆ మెత్తని తౌడుని తినేవాణ్ణి.

దినపత్రిక ఇలా రామారావు కాపు గారితో పాటు, కిరాణాకొట్టు నడిపే వరదా నాగేశ్వరరావు గారికి కూడా వచ్చేది. నేను ఇంట్లో కావాల్సిన సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు గమనించాను. అక్కడ కూడా అప్పుడప్పుడు వెళ్ళి పేపర్ చదివేవాణ్ణి. ఆ కొట్టు యజమాని కూడా కిరాణా సామానులు సాయం చేసి, చదువుకోమన్నారు. నేను అలాగే డైలీ పేపర్ చదువుకొనేవాడిని.

కొత్త వెలుగుల్ని చూపిన పరీక్షలు

పొద్దునడినెత్తుకొచ్చినా శీతాకాలంలో చాలా సేపటి దాకా మబ్బులు దట్టంగానే ఉంటాయి. పదోతరగతి పబ్లిక్పరీక్షల తర్వాత ఆ మబ్బుల్లాగే అనిపించింది నాజీవితం కూడా! జీవితంలోని చీకటి వెలుగుల్లోని దృశ్యాదృశ్యాల్లోని గమ్మత్తుల్ని దర్శించగలిగాను. మబ్బులకు ఒకే రూపం ఉండదు. గాలికి మారిపోతుంటుంది. మనుషులుకూడా అలాగే అవకాశాల్ని బట్టి మారిపోతుంటారు. అవకాశాన్ని బట్టి మాట్లాడుతుంటారు. ‘‘అబ్బాయి గారి పిల్లలు చదువుకుంటారు. చదువుకుంటున్నామనే గర్వం లేకుండా పొలం పనీ చేసుకుంటారు. వాళ్ళను చూసి నేర్చుకోండిరా’’ అన్న నోళ్ళే ‘‘రెండు పడవల మీద కాళ్ళు పెడితే ఒడ్డుకు చేరడమెలా ఉన్నా, మధ్యలోనే మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరిగింది’’ అనడం కూడా విన్నాను. రెండు మార్కులే నాజీవితాన్నిలా నట్టేట్లో ముంచేస్తాయనుకోలేదని బాధపడని రోజుల్లేవు. లెక్కల్ని విస్మరిస్తే జీవితంలోను లెక్కతప్పిపోతుందనీ ఆలోచించని రోజులేదు. నా ఈడు పిల్లలంతా కాలేజీకి వెళ్తున్నారు. నేనేమో పొలంలో పనులు చేస్తున్నాను. అంతకుముందు కూడా పొలం పని చేసేవాణ్ణి. ఆ పనిలో అలసటగానీ, అసహనం గానీ ఉండేదికాదు. కానీ, ఇప్పుడేంటో పొలంలో పనిచేస్తూ వాళ్ళు అలా కాలేజీకి వెళ్ళడం చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపించేది. నా కన్ళీళ్ళను నేనే దిగమింగుకొంటూ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలెన్నో. అయినా చేసేదేముంది. నాలో నేను కుంగిపోకూడదనుకున్నాను. అందరితో పనిచేస్తున్నా ఒంటరిగా ఉన్నట్లనిపించేది.రకరకాల ఆలోచనలు ముసురుకొచ్చేవి. బుర్రవేడెక్కిపోయేది.నాతో చదువుకున్నవాళ్ళని ఎవరైనా  పొగుడుతుంటే నన్నేదో అవమానిస్తున్నట్లనిపించేది. నేను చెప్తే నేర్చుకునేవాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. కొన్నిసార్లు విజయం సాధించడమే ప్రధానంగా మారిపోతుంది. దాన్నెలా సాధించామనేది పట్టించుకోరు. మా స్కూల్లో పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టంగా జరుగేవి..మా స్కూల్ మాస్టర్లంగా ఎంతో స్ట్రిక్ట్ గా ఇన్విజిలేషన్ చేసేవారు. పబ్లిక్ పరీక్షల సమయంలో హాస్టల్ లేదు. దేనివల్లనో మూసేశారు.

దానితో ఇంటినుండే పరీక్షలకు వెళ్ళేవాణ్ణి.ఆ యేడాదే మా ఇల్లు కట్టుకున్నాం. ఇటుకతో ఆ ఇల్లు కట్టుకున్నాం. మేము ఇల్లు కట్టుకున్న ఆ యేడాదో తర్వాత యేడాదో మా వూరికి కరెంటు కూడా వచ్చింది.మేము కూడా ఇంటికి కరెంటు పెట్టించుకున్నాం.అలా ఒక మంచి ఇంటిలో చదువుకోవడానికి అవకాశం కలిగిందని సంతోషపడ్డాం.ఆ ఇంటిలోనే నేను, మా ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యశాస్త్రి, నేను, ఇంకా కొంతమంది రాత్రి పూట కూడా చదువుకునేవాళ్ళం. అప్పటికి వాళ్లకి అంత పెద్ద ఇల్లు లేదు. కరెంటు లేదు. కాబట్టి మా ఇంటికొచ్చే చదువుకొనేవారు. ఫలానా ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అనుకొనేవాళ్ళం. ఇంచుమించు 90 శాతం అవే ప్రశ్నలు పబ్లిక్ పరీక్షల్లో వచ్చేవి. నేను కూడా బాగానే రాశాననే నాకు నమ్మకం. లెక్కలు పరీక్షలు మాత్రం సరిగ్గారాయలేదనిపించింది.  అన్ని సబ్బెక్టులు మంచి మార్కులు వచ్చాయి. లెక్కలు మాత్రం రెండు మార్కులు తక్కువగా వచ్చాయి. అంటే 33 మార్కులు వచ్చాయి. నాలాగే చాలామందికి ఒకటి, రెండు మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యారని, వాళ్ళు రీకౌంటింగ్, రీ వాల్యూషన్ కి ఫీజు కట్టారని, తర్వాత మార్కులు పెరిగి పాసయ్యారు. వాళ్ళే తర్వాత చెప్పారు. నాకు అలా రీ కౌంటింగ్, రీ వాల్యూషన్ చేయించుకోవచ్చని తెలియదు. ఫెయిల్ అయ్యిందంటే మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ లలో సప్లిమెంటరీ రాయాల్సిందే. అదే నాకు తెలుసు.

మా క్యాస్ట్ సర్టిఫికెట్ మాకు రావడానికి నెలలు పట్టేది.  మాకు ఎమ్మార్వో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఆర్డీవో ఇవ్వాలి.  దానికోసం తిరుగడం వల్ల క్లాసులకు వెళ్ళడానికి అవకాశం ఉండేదికాదు. ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కంటే ఫీజు కట్టేస్తామంటే, జీవితాంతం మీకే రిజర్వేషన్లు ఉండవనేవారు. అందువల్ల క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఈ అన్నిచోట్లా రకరకాలుగా వాళ్ళకి మా స్థాయిలో మేము సమర్పణలు చేసుకోవాలి. చివరికి ఆర్డీవో కార్యాలయంలో స్టాంప్ వేసిన క్లర్కుకి కూడా తృణమో, ఫణమో ఇవ్వాల్సిందే. ఈ సర్టిఫికెట్ ప్రతి యేడాదీ చేయించుకోవాలి. ఇదొకనరకంలా అనిపించేది. ఇన్ని బాధలు పడిపడినా పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మానసికంగా చాలా కృంగిపోయాను. పైకి గంభీరంగా కనిపించినా, లోన మనసంతా గాయమైపోయి చాన్నాళ్ళ వరకు అన్నం సహించేది కాదు.

నేను ఫెయిల్ అయ్యానని తెలిసి తర్వాత ఒకప్పుడు పొగిడిన నోళ్లతోనే మమ్మల్ని తిడుతుండేవారు.  ఆ మాటలు విన్న మా అమ్మా, నాన్నా కూడా నన్ను మళ్ళీ తిట్టేవారు. వాళ్ళు కూడా బాధపడేవారు. మాకర్మకొద్దీ ఇలా అయ్యిందని వాళ్ళకేవేవో చెప్పేవారు.ఇలాంటప్పుడు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలనిపించేది. అక్కడ నుండే కాదు ఎవ్వరికీ కనిపించనంత దూరం వెళ్ళిపోవాలనిపించేది. ఇంట్లోనుండి పారిపోయి ఎక్కడికి వెళ్లాలి?ఎక్కడికి వెళ్ళినా రెండు ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకు పారిపోయి వచ్చావు? నీదేకులం?మొదటిది చెప్పడం కంటే రెండవది చెప్పిన వెంటనే వాళ్ళ చీదరింపులు, వాళ్ళ అసహ్యాలు నాలో తీవ్రమైన వేదనను కలిగిస్తాయి.కనీసం సానుభూతికి కూడా నోచుకోని వాళ్ళలా శూన్యం వైపు చూస్తూ మిగిలిపోతారు.  అలాంటి మాటలు అనేకసార్లు ఎదురైయ్యేవి. అలాంటప్పుడు నేను పడే బాధ వర్ణనాతీతం.

పడమటి వైపుకి వెళ్తున్న సూర్యుడు కమిలిపోయిన ముఖంతో ఎర్రగా కనిపిస్తున్నాడు. నేడు యుద్ధంలో ఓడిపోయి రేపటి యుద్ధంలో ఏలాగైనా విజయం సాధించాలనే కుతకుతతో ఉడికిపోతున్నాడు.  అమ్మా, నాన్న నిరంతరం పడే కష్టం నాకు అనేక పనుల్ని నేర్పింది. అన్నయ్యలు, తమ్ముడు,చెల్లి, తాత, మామ్మ (నాయనమ్మ), అత్తలు, మేనమామలుఇంతమంది కలిసిమెలిసి ఒకరికొకరు జీవించడం సమాజంలో కలిసిమెలిసి జీవించడాన్ని నేర్పింది. పేదరికం  సర్దుబాటుని నేర్పితే, కుల, మతాలు మనుషుల మధ్య అంతరాల్ని, మనస్తత్వాల్ని అవగాహన చేసుకోవడం నేర్పాయి. కుల, మతాలతో మనుషుల్ని చూసే ఎక్కువ తక్కువలన్నీ నాలో అణుకువను, ఆలోచనను, ఆత్మగౌరవాన్ని నేర్పాయి.

కులం నుండి మతాన్ని, మతం నుండి కులాన్నీ విడదీసి చూడ్డం అసాధ్యం. వీటిని జయించి మనిషిగా నిలబడాలంటే హిందూ సమాజం నుండి వచ్చిన కొన్ని కులాలవారికి నిత్యం యుద్ఢం చేయడం లాంటిదే. ప్రత్యక్షంగా కనిపించకుండా జరిగే యుద్ధం. రక్తం కారని యుద్ధం. ఆయుధాలు లేని యుద్ధం. మాటలతో, చేతలతో మానసికంగా చంపేసే యుద్దం. ఆర్థికంగా నలిపేసే యుద్దం. ఆధిపత్యాన్ని చెలాయించే యుద్దం. పడిలేవడానికి చేసే యుద్ధం. నిలబడ్డం కోసం చేసే యుద్ధం. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి  చేసే యుద్ధం. జీవితం నిరంతరం కొనసాగించడమే ఒక యుద్ధం. జీవితం ఒక యుద్ధక్షేత్రం. యుద్ధంలో విజేతగానో పరాజితగానో తేలేవరకూ ఆ క్షేత్రాన్ని మనం విడిచిపోలేం.

***

బాల్యం ఒక చెలమ లాంటిది.

 నీళ్లు ఎన్నో లేవనిపిస్తుంది.

ఆ నీళ్లు తోడేయగానే మరలా నీళ్లు ఊరిపోతాయి.

జ్ఞాపకాలూ, ఆ బాల్య జీవితమూ అంతే.

ఇంకేముందిని అనిపిస్తుంది.

గతంలోకి వెళ్ళగానే మళ్ళీ

దొంతరదొంతరలుగా,

 అలలు అలలుగా,

పొరలు పొరలుగా

 కనిపించే జీవితంలా బయటకొస్తుంది.

 

                బాల్యం ఒక సముద్రం లాంటిది

 దాని లోతు , దాని తీరం కనుక్కోలేం .

బాల్యం నాటి చిలిపి చేష్టలు కష్ట దుఃఖాలు అలాంటివే.

తుది మొదలు అదేనని చెప్పలేం.

 

 బాల్యం ఒక ఆకాశంలాంటిది.

దాని ఎత్తూ, దాని వెడల్పూ ఇదేనని చెప్పలేం.

బాల్యం నాటి అనుభూతుల తీవ్రతనూ,

పెనవేసుకున్న అనుబంధాల్నీ ఇవేనని చెప్పలేం.

 

బాల్యం ఏముందనిపిస్తూనే,

ఎంతమహోన్నతమైనదో కనిపించీ కనిపించని 

ఒక దోబూచులాట లాంటిది. 

బాల్యాన్ని ఎన్నింటితోనైనా పోల్చగలం.

బాల్యాన్ని ఎన్నిరకాలుగానైనా ఉత్ప్రేక్షించగలం.

ప్రతి ఒక్కరి బాల్యం  కొత్త మెరుపులు కురిపిస్తూ

నిత్యం నవ్యంగా కనిపించే పాతవే అయినా

 కొత్తగా కనపడే నక్షత్రాల లెక్కింపు లాంటిది.

 

( ఆచార్యదార్ల ఆత్మకథ ‘నెమలికన్నులు’ తొలి భాగం ‘బాల్యం’ ఇంతటితో  సమాప్తం)

 

 

No comments: