"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

08 December, 2022

భారతీయ భాషా దినోత్సవం సందర్భంగా ఆచార్య దార్ల ప్రత్యేక ఇంటర్వ్యూ


 భాష జాతి ఆత్మగౌరవానికి, సమైక్యతకు దోహదకారి కావాలి

హెచ్.సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య



తమిళుల జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతి నవంబర్ 11 వ తేదీని కేంద్ర ప్రభుత్వం భారతీయ భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లోనూ జాతీయ సమైక్యత, సమగ్రతలను పెంపొందించే విధంగా  వివిధ కార్యక్రమాలు నిర్వహించతలపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుతో 'నినాదం' పత్రిక ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. 

భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు భాష స్థితి గతులను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మాతృభాషగా ఉన్న తెలుగు పట్ల కొంత నిర్లక్ష్యం కనిపిస్తుందనడంలో నిజంలేకపోలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ఫలితంగా ఆంగ్లభాషకు ప్రాధాన్యాన్నివ్వడంలో తప్పులేదనీ, కానీ తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు. 

స్థానిక అవసరాల రీత్యా తెలుగు భాష చదువుకున్న వారికి ఉపాథి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానం -2020 ప్రకారం మాతృభాషలకు అధికప్రాధాన్యాన్నిస్తున్నా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో వాటిని అమలు చేసినంతగా ప్రయివేటు, కార్పోరేట్ విద్యాసంస్థల్లోను ఈ విధానాన్ని ఎంతవరకు అమలు చేస్తారనే విషయంలో అనేక సందేహాలున్నాయి. ఒకవైపు ప్రభుత్వాలన్నీ ఇంచుమించు అన్నింటినీ ప్రయివేటు పరం చేస్తూపర్యవేక్షణ బాధ్యతల వైపే మొగ్గుచూపుతున్నాయి. తెలుగు భాష లేదా మాతృ భాషలను రక్షించుకోవడమంటే మన నిజమైన సృజనాత్మకతను, ఆత్మగౌరవాన్నీ కాపాడుకోవడం గానే భావించాలని అన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని విషయాలను తెలుసుకుందాం. 


ప్రశ్న: నమస్కారం…భారతీయ భాషా దినోత్సవం లక్ష్యమేమిటి?

 ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు: భాష అనేది మన భావాల్ని ఒకరికొకరు పరస్పరం శక్తివంతంగా వ్యక్తీకరించుకొనే ఒక వ్యవస్థ. మనం పుట్టి, పెరిగిన ప్రాంతంలో ఏ భాష అయితే వాడుకలో ఉంటుందో వాళ్ళంతా ఆ భాషలోనే మాట్లాడతారు. తనకు సహజంగా వచ్చిన భాషకున్నంత వ్యక్తీకరణ సామర్థ్యం, ఆ ఆత్మీయతా తాను నేర్చుకొని, దానిలో ఎంతో నైపుణ్యాన్ని సాధించినా, పుట్టుకతో వచ్చిన భాషకు అదేదీ సాటిరాదు. అదే ఆ భాషకున్న శక్తి. దాన్ని కాపాడుకోవడం కోసం చేయాల్సిన పనులను, ఆ భాషలను కాపాడుకోవాల్సి అవసరాల్ని లక్ష్యాలుగా భారతీయ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్ని సూచించింది.

ప్రశ్న: మాతృభాషల పరిరక్షణకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు?

ఆచార్య దార్ల: భారతదేశంలో సుమారు 800 భాషలు ఉన్నాయనీ, రెండు వేల యాసలు మాట్లాడే ప్రజలు ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. వీటిని కాపాడుకోవడం ద్వారా భారతీయ సంస్కృతినీ, వారసత్వాన్నీ కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థలు రకరకాల కార్యక్రమాల ద్వారా భాషా సమైక్యతను పెంపొందించే చర్చలు, సృజనాత్మకాంశాలను నిర్వహిస్తున్నాయి. 

దీనిలో భాగంగానే విద్యార్ధినీ, విద్యార్థులకు విశ్వవిద్యాలయ స్థాయిలో మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య వి.కృష్ణగారి ఆధ్వర్యంలో హిందీ, ఇంగ్లీష్, తమిళం మొదలైన భాషల్లో భాషకు గల శక్తిని తెలియజేసే కార్యక్రమాలు చేస్తున్నాం. , తెలుగుశాఖ ప్రత్యేకించి  వక్తృత్వం, వ్యాసరచన మొదలైన కార్యక్రమాలు చేస్తున్నాం. తెలుగు భాషకున్న ప్రాచీనత, సాంస్కృతిక వారసత్వం వంటి విషయాలపై నిష్ణాతులతో ప్రసంగాలు ఇప్పించడం వంటి కార్యక్రమాల్ని డిసెంబర్ 9 వతేదీన పెద్ద ఎత్తున చేస్తున్నాం. 

ప్రశ్న: తెలుగు భాషకు కూడా ప్రాచీన హోదా ఉన్నప్పుడు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతి రోజునే కేంద్ర ప్రభుత్వం భారతీయ భాషా దినోత్సవంగా ప్రకటించడం పట్ల మీ అభిప్రాయం?

ఆచార్య దార్ల:

బహుశా కేంద్ర ప్రభుత్వం వారు తమిళులకున్న భాషాభిమానాన్ని బాగా గుర్తించడమే దీనికి ప్రధాన కారణం కావచ్చు. దీనికి తోడు సుబ్రహ్మణ్యభారతి భారతసమైక్యతను ఆకాంక్షిస్తూ అనేక సందర్బాల్లో కవిత్వం చెప్పారు. ఇది కూడా మరొక ప్రధానకారణం కావచ్చు. అయినప్పటికీ, ఆ సందర్భంగా అన్ని భారతీయ భాషల ప్రాధాన్యాన్నీ వివరిస్తూనే జాతీయ సమగ్రత, జాతీయ సమైక్యత, భారతీయ సంస్కృతులను ప్రతిబింబించేలా కార్యక్రమాల్ని చేయాలని ప్రకటించారు కదా… మరొక్క విషయం ఇప్పటికే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో హిందీ పట్ల వ్యతిరేకత బహిరంగంగానే వ్యక్తమవుతూ ఉంటుంది. అందువల్ల ఏదైనా ఉత్తర భారతదేశానికి సంబంధించిన భాషను లేదా కవిని ఆధారం చేసుకొని భారతీయ భాషా దినోత్సవాన్ని ప్రకటిస్తే బాగుండదనీ, దక్షిణ భారతదేశం నుండి ప్రాచీన భాషా హోదా కలిగిన భాషల్లో తమిళం కూడా ఒకటి కా డం వంటివన్నీ కారణాలు కావచ్చు.

ప్రశ్న: సుబ్రహ్మణ్యభారతికి సుమారు 32 భాషలు వచ్చినా తమతమిళ భాషనే గొప్పగా భావించడం, ఆయన తమ తమిళ కవినే గొప్ప వాడుగా ప్రశంసించారని అంటారు. వాటిలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి? 

ఆచార్య దార్ల: మీరే అన్నారు కదా…అన్ని భాషలు తెలిసిన కవి అని. ఆ అధికారం, ఆ పరిశీలనలతో పాటు సహజంగా ఉండే మాతృభాషాభిమానంతో అలా చెప్పడం ఇతర భాషల్ని తక్కువ చేసినట్లుగా అర్ధం చేసుకోకూడదు.

ఆయన ఒక గేయంలో…

మాకు తెలిసిన భాషలలో 

మరెక్కడా కనిపించదు 

తమిళంలా మధురమైనది

…. ….  ….

మాకు తెలిసిన కవులలో 

కంబరు వళువరు ఇళంగోలవలె

 జగతిలో ఎక్కడా జన్మించలేదు. 

ఇది సత్యం; వట్టి ప్రశంస కాదిది' అని 'తమిళం' అనే గేయంలో వర్ణించడం నిజమే. కానీ అది తమ భాష, తమ కవులు మాత్రమే గొప్పవాళ్ళనే దురభిమానం కాదు, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మాత్రమే.

 ఆ మాటకొస్తే మన తెలుగు కవులు కూడా తెలుగు భాష గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో వర్ణించారు. దీన్ని భాషా ద్వేషంతో కాకుండా ఆత్మాభిమానంగా మాత్రమే చూడాలి. ఆ మాత్రం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ప్రతి భాషలోనూ ఏదొక సందర్భంలో వ్యక్తమవుతుంది. అయినంత మాత్రాన ఇతర భాషల్ని ద్వేషించడమో, వ్యతిరేకించడంగానో దాన్ని వ్యాఖ్యానించడం సంకుచిత ఆలోచనలవుతాయనడానికి ఆయన వర్ణించి అనేక రచనల్లో సమైక్య భారతదేశాన్ని ప్రశంసించారనేవే నిదర్శనాలు. ఆయన వర్ణించిన 'భారతదేశం' అనే దీర్ఘ గేయంలో ఆసేతు హిమాలయాలు మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్న జాతుల్నీ, సమైక్యశక్తినీ పొగుడుతూ కవిత్వం రాశారు. 

మరొక చోట భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇలా చెప్పారు.

'ఎన్నో జాతులు మనలో ఉండేను

ఏమది న్యాయం ఇతరుల జోక్యం?

 ఒక తల్లి పిల్లలు కలహించుకున్నా

 అన్నదమ్ములే వారెన్నటికీ''

ప్రశ్న: తెలుగు భాష లేదా జాతి గురించి సుబ్రహ్మణ్య భారతి ఏమని చెప్పారు?

ఆచార్య దార్ల:  భారతదేశం అనే గేయంలో ..

'సింధునదిని పండు వెన్నెలలో

చేరదేశపువయసు కన్నెల తో

తేట తెలుగులో పాటపాడుతూ

పడవ నడిపి తిరిగి వచ్చేము'' అని తెలుగు భాషలోని కమ్మదనాన్ని ప్రశంసించారు కవి.  అందువల్ల సుబ్రహ్మణ్య భారతిని భారతీయ సమైక్యశక్తికి ప్రతీకగా భావించి ఉంటారు.

ప్రశ్న: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్ధికంటే సంస్కృత భాషకు ప్రాధాన్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి కదా?

ఆచార్య దార్ల: మార్కుల కోసం ఇంటర్మీడియట్ లో సంస్కృతాన్ని ప్రయివేట్ విద్యాసంస్థలు ప్రోత్సహిస్తుంటాయి. కానీ, ఈ మధ్య కాలంలో డిగ్రీ స్థాయిలో కూడా ప్రభుత్వమే ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. మరొకవైపు తెలుగు మాధ్యమాన్ని తగ్గించే చర్యలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు భాష సంపద్వంతం కావడానికి సంస్కృత భాషాపరిచయం అవసరమే. కానీ, సంస్కృతం తెలుగు భాష అస్తిత్వాన్ని నాశనం చేసేలా మారకూడదు. 

ప్రశ్న: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మాతృ భాష తెలుగు అయినప్పటికీ సంస్కృత భాషకింత ప్రాధాన్యాన్నివ్వడంలో గల ఆంతర్యం?

ఆచార్య దార్ల: మొదటి నుండీ సంస్కృత భాష అందరి భాషగా లేదు. దాన్నొకప్పుడు దేవభాషగా అభివర్ణించారు.  ఏవేవో కొన్ని కారణాలు చెప్పి దాన్ని అందరూ చదువుకొనే అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొనిరావాలని అంటున్నారు. దానిలో విస్తృతమైన విజ్ఞానం ఉన్నా, దాన్ని ఒకమత భావాలకు పరిమితం చేసి చూడ్డానికి ఆ భాషలో వెలువడిన సాహిత్యం కూడా ఒక కారణమైంది. పాలకవర్గాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అది లాభం చేకూర్చవచ్చనే భావన ఉండొచ్చు. సంస్కృత సాహిత్యంలో ప్రస్తావనకు వచ్చే వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ, కులవృత్తులు, చాతుర్వర్ణ వ్యవస్థ వంటివాటిని కొనసాగించాలనే ఒక వర్గం ఉన్నట్లే, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలనే మరొక వర్గం కూడా ఉంది. ఒకప్పుడు తెలుగు అధికారభాషాసంఘానికి అధ్యక్షులుగా ఉండి తర్వాత కాలంలో రాజ్యసభ ద్వారా ఎం.పీ. అయినా డా.సినారె కూడా తన ఎంపి నిధులను సంస్కృత భాష అభివృద్ధికి కేటాయించారు. దీన్నిబట్టి అర్ధం చేసుకోవాల్సిందేమిటంటే కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర స్థాయిలో నిధుల రూపంలోనో, మరొక రూపంలోనో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంస్కృతాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టమనడమే కారణం కావచ్చునేమో అనుకుంటున్నాను. 

ప్రశ్నః ఇంగ్లీష్ భాషను కూడా తొలిదశలో అలాగే వ్యతిరేకించిన వాళ్ళే ఆ భాషలో పట్టుసాధించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగారు. ఆ పరిస్థితి సంస్కృతానికి లేదా?

ఆచార్య దార్ల: సంస్కృత భాషను ఇంగ్లీషుతో పోల్చలేం. అది ఇప్పటికే అనేక కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక అనుసంధాన భాషగా మారింది. సంస్కృత భాషకు ఆ సరళత లేదు. అది ఇప్పటికే చాలా చోట్ల మృతభాష అని భాషాశాస్త్ర వేత్తలే వ్యాఖ్యానించారు. 

ప్రశ్న: అయితే, ఈ సంస్కృత భాష వల్ల ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భాషాభిమానులు అంత ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి?

ఆచార్య దార్ల: భాషతో సంస్కృతి ముడిపడి ఉంటుంది. నిత్యజీవితంలో అత్యధికులు ఉపయోగించుకొనే మాతృభాషల స్థానంలో మరేదో భాషను బలవంతంగా రుద్దేప్రయత్నం మంచిదికాదు. ప్రజల జీవన విధానం అస్తవ్యస్థంగా తయారవుతుంది. తెలంగాణాలో ఉర్దూ భాషను బలవంతంగా రుద్దేప్రయత్నం చేశారు. అయినా దాన్నెంతమంది నేర్చుకోగలిగారు? దాన్నెంతమంది తమ భాషగా స్వంతం చేసుకోగలిగారు? పాలకులెప్పుడూ భాష విషయంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అత్యధికుల అభిప్రాయాల్ని గౌరవించాలి. తెలుగు భాష మాట్లాడేవారి గణాంకాలు పాలకులకు తెలియవా? తమ నిజమైన సృజనాత్మక ప్రతిభను మాతృభాషల్లోనే ప్రదర్శిఃచగలుగుతారని పాలకులకు సలహాలిచ్చే నిపుణులకు తెలియవా? అన్నీ తెలిసినప్పటికీ తెలుగు మాధ్యమాలు తీసేసి ఇతర భాషా మాధ్యమాల్ని ప్రోత్సహించడంలో అనేక రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు దాగున్నాయి. ఏవో తాత్కాలికంగా నాలుగు అన్యభాషా పదాలో, వాక్యాల్లో మాట్లాడినంత మాత్రాన తమ జీవనవిధానమంతా ఆ భాషలతోనే ముడిపడి ఉందనే భ్రమల్ని మేధావులు ఒప్పుకోలేరు. జాతి భవిష్యత్తుని దార్శినికంగా ఆలోచిస్తారు. అలాంటి వారికి ఆందోళన తప్పదు.


ప్రశ్న: పోనీ, సంస్కృత భాషను ప్రక్కన పెడదాం. మీరే అన్నారు- ఇంగ్లీష్ ప్రపంచ అనుసంధాన భాష అని. ఈ పరిస్థితుల్లో ఇంగ్లీషు భాష నేర్చుకోవడం, ఇంగ్లీషు భాషా మాధ్యమాల్లో చదువుకోవడం తప్పంటారా?

ఆచార్య దార్ల: తప్పుకాదు, కానీ బలవంతంగా చిన్నప్పటినుండీ మాతృభాషను చదువుకోకుండా చేస్తూ, ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రమే చదువుకోవాలని ఆదేశించడం తప్పంటాను. మనకు త్రిభాషా సూత్రం ఉంది. దీని ప్రకారం మాతృభాషను నేర్చుకోవాలి. దీనితోపాటు భారతీయులందరి భాషగా హిందీ నీ, ప్రపంచ అవసరాల రీత్యా ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఉత్తమమైన భాషా విధానం ఉంది. దీనిలో హిందీని మాపై బలవంతంగా రుద్దవద్దని అనేక రాష్ట్రాల్లో వ్యతిరేకత వచ్చింది. కానీ విద్య వ్యాపారంగా మార్చిన తర్వాత హిందీని మాత్రమే కాకుండా ఇతర మాతృభాషల్నీ విస్మరించారు. ప్రయివేటు విద్య, కార్పోరేట్ విద్యావ్యాపారంగా మారిన క్రమంలో భాషా విధానం అస్తవ్యస్థంగా తయారైంది. 

ప్రశ్నః ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల వచ్చినన్ని అవకాశాలు మాతృభాషలో ఉన్నాయా?

ఆచార్య దార్ల: లేని మాట నిజమేననిపించవచ్చు.  కానీ, అది వాస్తవంకాదు. ఇది తెలియాలంటే ముందు మనం ఒకటి స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉండటంతో పాటు సంబందించిన సబ్జెక్టులో కూడా నైపుణ్యం ఉండాలి. ఒకటి భావవ్యక్తీకరణకు సంబంధించిన అంశం. అది అవసరమే. కానీ ఆ భాషలో మాత్రమే ఆ విషయ నైపుణ్యం కూడా ఉంటుందనేలా తయారు చేశారు. బ్రిటిష్ పాలనాకారణాలవల్ల ఇంగ్లీషుని ఇంచుమించు ప్రపంచదేశాల్లో ముందుగా వ్యాపించేలా చేశారు. ఆ తర్వాత ఆ భాష తెలిసిన వాళ్ళను సంఖ్యాపరంగా అత్యధికులయ్యారు. ఆ స్థితిలో కొన్నాళ్ళు వాళ్ళందరి సమస్యల పరిష్కారానికి వీలుగా అవసరాలు, వాటిని తీర్చే ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ నేటికీ ఇంగ్లీషు ద్వారా మాత్రమే అన్ని అవసరాలు తీరిపోతున్నాయని చెప్పలేం. ఆ ఇంగ్లీషు తెలిసిన వాళ్ళు మాత్రమే అన్నింటికీ ఉపయోగపడతారనో, ఉపయోగపడుతున్నాయనో అనుకునేవాళ్ళు ప్రతి దేశంలోనూ నిత్యం ఆధారపడే సామాన్య, మధ్యతరగతి ప్రజల అవసరాలను గమనిస్తే తెలుస్తుంది. నిత్యం కోట్లాదిమంది ఇంగ్లీషు భాషతో సంబంధం లేకుండా చేసే కుటీర పరిశ్రమల్ని చూస్తే తెలుస్తుంది. ఒకవేళ పెద్దపెద్ద ప్రభుత్వ కార్యాలయాలకు గానీ, కార్పోరేట్ ఆఫీస్ లకు వెళ్ళి పరిశీలిస్తే తెలుస్తుంది. వాళ్ళంతా ఏ ప్రజల అవసరాలమీద ఆధారపడి వాళ్ళ విధానాలు రూపకల్పన చేస్తున్నారో, వాళ్ళంతా ఎవరి అవసరాలకోసం తమ ఉత్పత్తులను రూపొందిస్తున్నారో అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఎప్పుడూ కూడా అత్యధికులు ప్రపంచవ్యాప్తంగా తమ మాతృభాషల్ని మాట్లాడే వాళ్ళే ఉంటారు. వాళ్ళంతా ఆ యా దేశాలకు చెందిన మాతృ భాషలకు చెందినవాళ్ళై ఉంటారు. వారి సంఖ్యతో పోలిస్తే ఇంగ్లీషు చదువుకున్నవాళ్ళెంత తక్కువగా ఉంటారో స్పష్టమవుతుంది. వీళ్ళందరికీ కేవలం ఇంగ్లీషు వల్లనే ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని చెప్పగలమా? ఇంగ్లీషు లేకపోతే స్ధానిక 

ఉపాధిఅవకాశాలే లేవనుకోవాలా? మనకి ఉపాధి అంటే నెలవారీ వచ్చే జీతంతో కూడిన ఉద్యోగం అనే ఒక సంప్రదాయ భావన ఉంది. దాని నుండి మనం బయటపడితే తప్ప ఉపాధి అవకాశాల్ని సరిగ్గా నిర్వచించుకోలేం. 

 ప్రభుత్వాలు తీసుకొనే విధానాల వల్ల లక్షలాది మందికి ఉన్న ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతారు. ఉదా.తెలుమాధ్యమాల్లో బోధనను ఆపేయడం, 

ప్రశ్నః తెలుగు భాష అభివృద్ధికి, ఉపాధి అవకాశాల్ని పెంపొందించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి?

ఆచార్య దార్ల: ముందుగా విద్యారంగంలో తెలుగు భాషను నిర్లక్ష్యం చెయ్యకుండా చర్యలు తీసుకోవాలి. నిజమైన జ్ఞానాన్ని ఆర్జించడానికీ, స్థానిక, ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ వ్యాప్తంగా అన్నింటిలోను  పౌరులు శక్తివంతమైన పాత్ర నిర్వహించే సామర్ధ్యాలను పెంచే విధంగా విద్యావిధానం ఉండాలి. మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలి. అదే సమయంలో ఇంగ్లీషు, ఇతర భాషలను చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి. అలా కానప్పుడు పేద, మధ్యతరగతి వర్గాలవారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అటు ఇంగ్లీషు రాదు, ఆ మీడియంలో చదివించాలంటే రు. ఇటు మాతృభాషల్లో చదువుకుందామంటే అవకాశాలు ఉండవు. అప్పుడు రెండింటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది పరిస్థితి. ఇది వెంటనే కనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో దీని దుష్ఫలితాలను సమాజం ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే నూతన విద్యా విధానం (NEP- 2020) లో మాతృ భాషలకు ప్రాధాన్యాన్నిచ్చే విధానాన్ని ప్రతిపాదించారు. కానీ, దాని అమలు ప్రశ్నార్ధకంగా కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యావ్యవస్థలో విద్య పట్ల స్పష్టమైన విభజన రేఖలు కనిపిస్తున్నాయి. 


ప్రశ్నః ఐక్యరాజ్యసమితి ప్రకారం రానున్న కాలంలో అనేక మాతృభాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు కదా. ఆ జాబితాలో తెలుగు కూడా ఉంటుందా?

ఆచార్య దార్ల: విస్తృతమైన సాహిత్యం, దాని ద్వారా వచ్చిన సంస్కృతీ సంప్రదాయాలను నిత్యవ్యవహారంలో తమ మాతృభాష ద్వారా కాపాడుకున్నంతవరకూ ఆ మాతృభాష అంతరించదు. దీనికి అత్యంత ముఖ్యకారకులు ప్రజలే, దీనికి తోడు ప్రభుత్వ విధానాలు కూడా కొంతవరకూ దోహదం చేస్తాయి. తెలుగు భాషకు ఎంతో చరిత్ర, విశిష్టమైన సాహిత్యం ఉంది. నిత్యజీవితంలో దీన్ని విడదీయలేనంత అనుబంధాన్ని పెనవేసుకొనుంది. అందుకనే తెలుగు భాషకు కూడా ప్రాచీన విశిష్ట హోదానిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వాలు తెలుగు భాష ప్రోత్సహించకపోయినా, నిర్లక్ష్యం చేయకూడదు. భాష కూడా వ్యాపారంలో భాగమైపోయి తెలుగు భాష నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ పరిస్థితి కొంత ఆందోళననే కలిగిస్తుంది. 

ప్రశ్న:ఈమధ్య కాలంలో తెలుగు భాషను ఇంగ్లీషులో రాయడం కనిపిస్తుంది. ఇది తెలుగు లిపి, భాషా అంతరించడానికి కారణమయ్యే అంశం కాదా?

ఆచార్య దార్ల: దీనిలో రెండు కోణాలున్నాయి. తెలుగు లిపి తెలిసి, దాన్ని మొబైల్, కంప్యూటర్ లలో ఉన్న  సాంకేతిక అంశాలు తెలియక ఇతరలిపిలో రాసేవాళ్ళుంటారు. వాళ్ళ ఉద్దేశం తెలుగు లిపిని వాడకూడదని కాదు. సాంకేతికత తెలియడం పరస్సర వినియోగంలో ఉండటం సాధ్యం కానప్పుడు ఇతర భాషల లిపులను వాడుకొనేవారు ఒకరకం. వీరి వల్ల ప్రమాదం లేదు. రెండవ కోణంలో తెలుగు భాష నిత్యవ్యవహారంలో ఉన్నా, వాళ్ళు తెలుగు లిపి నేర్చుకోకపోవడం వల్ల ఇతర భాషల లిపుల్లో రాస్తుంటారు. సంస్కృతాన్ని దేవనాగరి లోనే రాయడం లేదు. అలాగే ఇంగ్లీషుని కూడా రాస్తుంటారు. తెలుగు లిపి తెలిసిన వాళ్ళు కూడా ఇతర భాషల లిపులలో రాస్తుంటారు. వీళ్ళవల్లే లిపికి ప్రమాదం. వీటిని మేధావులు గుర్తించి హెచ్చరిస్తున్నారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం  తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమబీజాలు కనిపిస్తున్నాయి. 


(నినాదం దినపత్రిక, https://epaper.ninadam.co.in/media/2022-12/hyderabad3.pdf 8.12.2022, మహానగరం అనుబంధం, పుట: 3 సౌజన్యంతో)




No comments: