ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 19వ భాగం
మా ఇంటి కల్పవృక్షం
ఏరోజుకారోజు కడుపు నింపుకోవాల్సిన వాళ్ళు రకరకాల పనుల్ని నేర్చుకోవాలి. దీనికి తోడు అది పెద్ద కుటుంబమైతే ఆ కుటుంబ యజమానులకు మామూలు నరకం కాదు. తాతలనాటి నుండీ వారసత్వంగా వచ్చిన ఆస్తులేమీ లేని వాళ్ళకి ఏలోటూ లేకుండా కుటుంబం గడవడమంటే మాటలు కాదు.
అంతే కాదు, పేదరికానికి కులం తోడైతే అది కొంతమందికి సమాజంలో ఆత్మగౌరవ సమస్యగా మారుతుంది. ఇంకొంతమందికి ఆత్మగౌరవాల్ని కాపాడుకుంటూనే ఆ కుటుంబాన్ని ముందుకి లాక్కెళ్ళాలంటే వాళ్ళంతా ఏదొక పని చేయక తప్పని పరిస్థితి. ఇది మా కుటుంబానికి కూడా అనుభవం నేర్పిన పాఠం లాంటిది.
సూర్యుడితో పోటీపడి మరీ ఆ సూర్యుడికంటే ముందే లేచేవాడు నాన్న. ఆ సూర్యుడే అలసిపోయి సాయంత్రానికి విశ్రాంతి తీసుకునేవాడేమో కానీ, మా అమ్మా నాన్నా మాత్రం అవిశ్రాంతంగా ఏదొక పని చేస్తూనే ఉండేవారు.
అంతమంది పిల్లల్ని ఎందుకు కనాలి;అంతకష్టమెందుకు పడాలని ఎవరైనా అంటే మా అమ్మగానీ నాన్న గానీ ఊరుకొనేవారుకాదు.
'పిల్లలంటే దేవుడిచ్చిన వరం. ఎంతోమందికి కావాలన్నా పిల్లలు పుట్టట్లేదు. మాపై దేవుడి దయ ఉంది. మాకంతమంది పిల్లల్నిచ్చాడు' అనేవారు.
అది వాళ్ళ నమ్మకమో, అది వాళ్ళ అమాయకత్వమో నాకు ఆ వయసులో తెలిసేది కాదు.
కానీ అలా మమ్మల్ని ఎన్ని కష్టాలొచ్చినా కాపాడుకుంటామనే మాటన్నప్పుడల్లా అమ్మనీ, నాన్ననీ కౌగించుకొని వీళ్ళే నాకు పెద్ద అండ అన్నంత ఆత్మవిశ్వాసం కలిగేది.
అప్పుడు వాళ్ళెంతో ప్రేమగా ఎత్తుకొనేవారు. ఆ సందర్భంలో నాకు దేవుళ్ళూ, దేవతలూ వీళ్ళేనేమో అనిపించేది. మాకే కష్టం రాదనిపించేది. వాళ్ళేమి చెప్తే అది చెయ్యాలనిపించేది. వాళ్ళ మాటకెప్పుడూ ఎదురు చెప్పకూడదనిపించేది.
పొద్దున్నే లేచి నా చేయి నేనే చూసుకొనే నాకు, అమ్మ ముఖమో, నాన్న ముఖమో చూడాలని పించేది. అలా చూస్తే ఆ రోజంతా నాకే కష్టమూ రాదని నమ్మేవాణ్ణి. నిజాయితీగా కష్టపడే నిష్కల్మషమైన మనుషులే దేవుళ్ళు లాంటివారు. అమ్మా, నాన్నా మా వాళ్ళందరితో నిజాయితీతో, నిష్కల్మషంగా వ్యవహరించేవారు.
ఏనాడూ వాళ్ళకంటే ముందు నేనే లేచి వాళ్ళనే చూడాలనే కోరికమాత్రం తీరేది కాదు.
అయినా సరే లేచిన వెంటనే అమ్మనో, నాన్ననో మాత్రమే ముందుగా చూడాలనుకునేవాణ్ఢి.
ఒక్కోసారి మేము పెందలకడనే లేవకపోతే నాన్న తువ్వాలుతోనో, గుదితోనే కొట్టి లేపినా, అలాగైనా ముందు నాన్ననే చూస్తున్నానులే అని మనసులో సంతోషడుతూ, పైకి మాత్రం ఏడ్చే వాణ్ణి.
క్రమేపీ హైస్కూల్ కొచ్చేసరికి మా ఊరి చెరువులో రజకులు బట్టలు ఉతుకుతుంటే వినబడే శబ్దాలకు లేవడం, అమ్మనో, నాన్ననో చూడ్డం, కాసేపు చదువుకోవడం, తర్వాత గేదెల దగ్గర బాగుచేయడం ప్రతి ఉదయం చేసే నాదినచర్యలో భాగంగా మారిపోయింది.
ఆ రోజుల్లో కొన్ని సంవత్సరాలపాటు వ్యవసాయంలో రెండు సార్లూ వరిపంట పండించడం సాధ్యపడేది కాదు.
వర్షాధారంగానో, నీరు అందుబాటులో ఉన్న కాలంలోనో ఖరీఫ్ పంట పండించేవారు. ఆ వరిపంట కూడా అక్కళ్ళు, ఫాల్గుణ వంటి రకాలు నీటిని తట్టుకోవడం వల్ల వాటినే ఎక్కువగా పండించేవారు.
మైసూరు, సన్నమైసూరు, గిద్దలు, చిట్టి ఒడ్లు వంటి రకాలు చాలా తక్కువగా వేసే వారు. అవి వరదలు, తుఫాన్ వంటివి వచ్చినా, ఎక్కువగా నీళ్లు నిల్వ ఉన్నా అవి తట్టుకోలేవు. పంటంతా నాశనమై పోతుంది. అందువల్ల వాటిని తక్కువగా వేసే వారు. వాటిని రైతులు తినడానికి మాత్రమే ఉంచుకొనే వారు.
కూలీలకు మిగతా రకాల ఒడ్లు ఇచ్చేవారు. అక్కుళ్ళు బియ్యం లావుగా ఉండేవి. ఫాల్గుణ రకం బియ్యం కూడా పొడవుగా, కొంచెం లావుగానే ఉంటాయి. అన్నం పెద్ద రుచిగా ఉండదు. ఇంకొన్ని రకాల వరి కూడా పండించేవారు. ఆ బియ్యం వండితే అన్నం ఎర్రగా అయ్యేది. వాటినే కూలిపని చేసేవారికిచ్చేవారు.
ఎవరన్నా తమ ఇంట్లో పండుగకో, పెళ్ళిళ్ళకో రుచి చూడ్డానికి అన్నట్లు సన్నగా ఉండే మైసూరు ధాన్యాన్ని బ్రతిమాలి తీసుకొనేవారు. కొనాలంటే చాలా ఖరీదు.
''రచయిత ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారి తన కుటుంబం పెద్దదికావడం వలన పడిన కష్టాలను కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అన్నపూర్ణగా పేరుపొందిన కోనసీమలోనే పేదవారి పరిస్థితి అలా ఉంటే,వర్షాధారప్రాంతాలలో పేదవారి పరిస్థితి ఇక వర్ణనాతీతం.రచయిత చెప్పినట్టు రెండుపూటలా సన్నబియ్యం తినే వెసులుబాటు లేనివాళ్ళు ఎసల్వా 470 రకాలు లేకపోతే నూకలన్నం తినాల్సివచ్చేది.కడుపునిండితే అంతే చాలు. అవి ఏ బియ్యమనే తేడాలు ఉండేవి కాదు.రచయిత తాటిచెట్టును కల్పవృక్షంతో పోల్చారు అది వాస్తవం. తాటిపండ్లు ,తేగలు ,ఇంకా దానినుండి వచ్చే ఆహారపదార్థాల గురించి రచయిత పూసగూర్చినట్టు సవివరంగా చెప్పిన విధానం ఎక్సలెంట్. ఇంత చక్కటి ఆత్మకథను పాఠకలోకానికి అందిస్తున్న ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారికి ,వారం వారం విడవకుండా దార్లవెంకటేశ్వరావు గారి ఆత్మకథ ను ప్రచురిస్తున్నా భూమిపుత్ర దినపత్రిక సాకే శ్రీహరిమూర్తి గారికి ధన్యవాదాలు. అందరూ చదవాల్సిన అద్భుతమైన ఆత్మకథ''- ఎజ్రా శాస్త్రి
ఆ రోజుల్లో రెండు పూటలా బియ్యం వండుకొని అన్నం తినాలంటే పేదవాళ్ళకు సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల ఒకపూట నూకలతో జావకాసుకొనేవారు. మరొక పూట ఆ లావు బియ్యంతో అన్నం తినేవారు. మేము కూడా అలాగే చేసేవాళ్ళం.
పెద్దన్నయ్య, మా తమ్ముడు కృష్ణ మాత్రం ఒక్కోసారి జావను తినేవారు కాదు. వాళ్ళకు మాత్రం కొంచెం అన్నం వండి, మిగతా వాళ్ళమంతా జావ తినేవాళ్ళం. ఆ జావలో కొంచెం ఉప్పేసుకొని ఒక ఉల్లిపాయో, ఒక పచ్చిమిరపకాయో నంజుకొని తింటుంటే అమృతంలా అనిపించేది. అలాగైనా రెండు పూటలా తినాలంటే ప్రతిరోజూ పని ఉండాలి.
తాటికాయల రోజుల్లో మేము వాటితో రకరకాల వంటలు వండుకునే వాళ్ళం.
కొన్ని తాటి పండ్లు తియ్యగా ఉంటాయి. కొన్నింటిని కాల్చుకొని తినేవాళ్ళం.
మేమే కాదు ఆ సీజన్ లో చాలా మంది తాటిపండ్లు తింటారు. కాల్చుకుని, దాని పేశం నోటితో మామిడిపండు తిన్నట్టు తింటే చాలా బాగుంటుంది. పెద్దకాయలైతే వాటి గుంజుని కోసుకొని తినేవాళ్ళం.
కొంచెం దోరగా ఉండే తాటికాయలైతే వాటిని ముక్కలు కోసి, వాటిలో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టిన తర్వాత ఆ ముక్కల్ని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
తీపి తాటికాయలు దొరికినప్పుడు వాటి పేశం తీసి, దానిలో నూకల్ని గానీ, పిండిని గానీ కలిపి కుడుములు, రొట్టెలు వండుకుంటారు.
మేము అలా చాలా సార్లు వండుకొని తినేవాళ్ళం. మరీ ఎక్కువ కాయలు దొరికితే వాటి పేశాన్ని తీసి మామిడి తాండ్ర చేసేవాళ్ళం.
కొన్ని రోజుల పాటు ఎండలో తాటాకు చాపమీద పూసి, దాన్ని జాగ్రత్తగా తీస్తే అది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.
దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని నోట్లో వేసుకుంటే ఆ రుచే వేరు.
అలా పేశం తీసేసిన టెంకల్ని భూమిలో కొంచెం లోతుగా మట్టి తీసి, దానిలో వాటిని పెట్టి, మరలా వాటిపై మట్టి వేసి కప్పెట్టాలి. అలా చేయడాన్ని పాతరవేయడం అంటారు.
అప్పుడప్పుడూ వాటి మీద కొన్నాళ్ళ పాటు కొంచెం నీళ్ళు వెయ్యాలి. అప్పుడు అవి మొలకలు వచ్చి, ఆ మొలకలు భూమిలోకి వెళ్తాయి. కొన్నాళ్ళ తర్వాత అవే తేగలవుతాయి.
వాటిని జాగ్రత్తగా తవ్వి ఒక్కో తేగనీ ఆ మట్టిలో నుండి బయటకు లాగాలి. మట్టి కొంచెం ఇసుక ఒండ్రు లాంటిదైతే తేగలు బాగా ఊరతాయి. అంటే లావుగా తయారవుతాయి. వాటిని లాగి, దానికి ఉన్న టెంకను బుర్ర అంటారు. దాన్ని తేగనుండి వేరు చేస్తారు. అంటే కత్తితో గానీ కొడవలితో గానీ వాటిని కొట్టేసి తేగను వేరు చేస్తారు. వాటిని కాల్చుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. అది పీచు పదార్థం. కాబట్టి మలబద్ధకం లేకుండా చేస్తుంది. కానీ, దగ్గు, ఆస్తమా ఉన్నవాళ్ళకు మంచిదికాదని మా తాత చెప్పేవాడు.
పాతరేసిన తేగల్ని సరైన సమయంలో తవ్వుకోకపోతే మట్టలు పాతరమీద నుండి భూమి పైకి వచ్చేస్తాయి. అలాంటి వాటికి తేగలు ఉండవు. అందువల్ల తేగల్ని సరైన సమయంలో మాత్రమే తవ్వుకోవాలి. ముందుగా తవ్వితే అవెందుకూ పనిచేయవు. కానీ, వాటి బుర్రలు కత్తితో రెండు బద్దలుగా కొడితే దానిలో తెల్లని గుంజు ఉంటుంది. దాన్ని తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తేగలు తవ్వేటప్పుడు కొన్ని టెంకలు భూమిలోపలికి వెళ్ళలేవు. వాటిని మడదకొక్కులు అంటారు. వాటిని బద్దలుగా కొట్టుకొంటే తియ్యగా ఉండే గుజ్జు వస్తుంది. చాలా బాగుంటుంది. అది తీసుకున్నతర్వాత కూడా ఆ టెంకను అంటిపెట్టుకొని సన్నని మీగడలాంటి పదార్థం ఉంటుంది. అది గోరుతో తీసుకొని, ఆవేలుని నోట్లో పెట్టుకొని చీకుతూ తింటే ఆరుచీ, అది నోట్లో పెట్టుకొని గాలితో లోనికి పీల్చేటప్పుడు వచ్చే తీయదనాన్ని మాటల్లో చెప్పలేం. అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకనే బుర్రలోని గుంజు తిన్న తర్వాత ఆ బుర్రచెక్కలోనే వేళ్ళు పెడుతూ, ఆ వేళ్ళను నోట్లో పెట్టుకుంటూ దాన్ని వదల్లేకపోయేవాణ్ణి.
బుర్ర గుంజు సరిగ్గా నవలకపోతే మాత్రం కడుపు నొప్పి వస్తుంది. అలా నాకు చాలా సార్లు కడుపు నొప్పి వచ్చింది కూడా.
మా తేగలు పాత్ర చిన్నన్నయ్యో, నాన్నో తవ్వుతుంటే, నేను, మా తమ్ముడు దాని దగ్గరే కూర్చొని చూస్తుండే వాళ్ళం. మడదకొక్కులు కనపడితే ఒకటి నాకు, ఇంకొకటి నీకూ అంటూ పంచుకొనేవాళ్ళం.
తేగలు బాగా లావుగా ఊరితే దానికుండే బుర్రల్లో ఏ గుజ్జూ ఉండదు. నీళ్ళే ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాటిని నీలకచ్చికలు అంటారు. వాటిని తినకూడదని పెద్దవాళ్ళు చెప్పేవారు. తింటే జలుబు చేస్తుంది.
అలా గుజ్జు తీసేసిన తాటి బుర్రలు ఎండబెట్టి పొయ్యిలో పెడితే బాగా కాల్తాయి. కొంచెం పిడకల మధ్యలో వేస్తే చాలాబాగా మండుతాయి. నీళ్ళు కాచుకోవడానికీ, చలికాలంలో కుంపటిలో వేసుకోవడానికీ అవి బాగా ఉపయోగపడతాయి.
తాటి ఆకులతో ఇంటిమీద వేసుకుంటారు. అలా కట్టిన ఇండ్లను తాటాకు ఇండ్లు అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తాటాకు ఇండ్లే ఉంటాయి.
కోనసీమ ప్రాంతంలో ఎటుచూసినా కొబ్బరి చెట్లు, తాటాకు చెట్లు పోటాపోటీగా కనిపిస్తుంటాయి. కొబ్బరి చెట్లను ప్రత్యేకంగా పెంచుతారు. తాటి చెట్లను ప్రత్యేకంగా పెంచనవసరం లేదు. అక్కడక్కడా కొన్ని తాటికాయ టెంకల్ని పడేసినా అప్పుడప్పుడూ పడే వర్షంతో, వాతావరణంలో ఉండే తేమతో పెరిగిపోతాయి. వాటిని రకరకాలుగా ఉపయోగించుకుంటారు.
తాటి ఆకులతో ఇళ్ళు కట్టుకోవడంతో పాటు, ఆ ఆకుల్ని రకరకాలైన వాటికి ఉపయోగిస్తారు. ఒకప్పుడు తాటాకులమీదే కావ్యాల్ని రాశారనీ, వాటిని తాళపత్రాలు అంటారనీ ఎంతో మందికి తెలుసు కదా.
ఆ తాటాకులతోనే నాన్న చేపల బుట్లలు అల్లేవాడు. వర్షానికి తాటాకు గొడుగులు చేసేవాడు. బల్లకట్టినప్పుడు తన నిచ్చెనతో పాటు ఆ నిచ్చెనకు మనిషి చాతి వరకు పొడుగు ఉన్న ఒక బుట్ట కట్టుకుంటారు. దాన్ని ఎంతో నైపుణ్యంతో నాన్న బుట్ట అల్లే వాడు. దానిలోనే మాకు ముంజికాయలు, కొబ్బరికాయలు, మామిడికాయలు వంటివన్నీ తెచ్చేవాడు. ముంజులు తినేసిన కాయల్ని తిన్న తర్వాత మేము చిన్నప్పుడు వాటితోనే మూడు చక్రాల బండి చేసి ఆడుకునేవాళ్ళం.
ఆలోచిస్తే తాడి చెట్టుని కలియుగ కల్పవృక్షం అంటారు గానీ, మా లాంటి పేదవాళ్ళకి నిజంగానే కల్పవృక్షమని అనుభవంలో తెలుసుకున్నాను.
నాన్న కష్టపడి తెచ్చిన దాన్ని మా అమ్మ ఎలా మాకెవరెవరికి ఏమి కావాలో, ఎప్పుడెవరికేమి ఇవ్వాలో తెలిసిన కామధేనువులా నాకు అనిపించేది. మనం జాగ్రత్తలు తీసుకొనేటప్పుడు ఒక్కొక్క గింజనూ ఏరి సమకూర్చుకోవాలి. కానీ, తినేటప్పుడు ముద్దగా తినాలి. మనం ఉన్నదని ఒకేసారి ఖర్చు చేసే రాకూడదు. లేదని మానేయకూడదు.ఇలాంటి మా అమ్మ మాటలే మమ్మల్ని ఎవరి దగ్గరా చేయి చాచేలా చెయ్యకుండా కాపాడాయని మాత్రం కచ్చితంగా చెప్పగలను.
(సశేషం)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ అధ్యక్షులు,
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
ఫోన్: 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి