"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

14 December, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 20వ భాగం

 
భూమిపుత్ర దినపత్రిక, సంపుటి:4, సంచిక 252, తేది 14.12.2022 సౌజన్యంతో 

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 20వ భాగం

పాలేరుతనం

'పాలేరు' అనే పేరు వినగానే చదువుకున్న వాళ్ళకి వెంటనే గుర్తొచ్చేది బోయి భీమన్న గారి 'పాలేరు' నాటకం. దీనిలోని వస్తువు కోనసీమ ప్రాంతంలో ఒకప్పుడు మాత్రమే కాదు, నేటికీ అది అవశేషంగా కనిపిస్తుంది. 
ఈ ప్రాంతంలో పాలేరుతనమనేది ఒక రకమైన ఒప్పందం. 
భూస్వాములకు, పేదవాళ్ళకూ మధ్య ఏర్పరచుకునే ఆర్థిక లావాదేవీల నిర్దిష్ట కాలంపాటు ఒప్పందంగా దీన్ని చెప్పుకోవచ్చు.
 
ఇంటి యజమాని లేదా తమ పిల్లల్ని కొన్నాళ్ళపాటు (నెల, ఆరు నెలలు, సంవత్సరం, రెండేళ్ళు, ఐదేళ్ళు…) వారి దగ్గరే పనులు చేయడానికి, దానికి ప్రతిఫలంగా కొంత డబ్బు గానీ, ధాన్యం గానీ ముందుగానే తీసుకోవడంతో ఈ పాలేరు తనం మొదలవుతుంది. 
పాలేరుగా వెళ్ళిన వ్యక్తిని తొలుత ఆ యజమానులు బాగానే చూస్తారు. 
తర్వాత తర్వాత తామెలా చూసినా పడి ఉండే పనిమనిషిగా, తమ బానిసగా ఆ పాలేరుని భావిస్తుంటారు. 
ఆ పాలేరు తమ ఒప్పందాన్ని మధ్యలో రద్దు చేసుకోవడానికి ఉండదు.
ఎవరైనా ఆ పాలేరుతనాన్ని ఒప్పుకున్న తర్వాత దాన్ని చెయ్యనని మానేస్తే, ఒప్పందం ప్రకారం రెట్టింపు చెల్లించేలా లేదా ఆ కుటుంబంలో ఎవరైనా ఆ పాలేరు తనం చెయ్యాలని పెద్దమనుషులు తీర్పు చెప్తారు.
సాధారణంగా ఆ పెద్దలంతా భూస్వాములకు అనుకూలంగానే వ్యవహరిస్తుంటారు. 
ఒకవేళ ఎవరైనా ఆ తీర్పుని వ్యతిరేకిస్తే వాళ్ళని ఊరు నుండి వెలేస్తారు. 
ఇక ఆ ఊరిలో వాళ్ళెవరూ ఆ కుటుంబం వాళ్ళతో మాట్లాడరు. 
వాళ్ళని ఏపనికీ పిలవరు. 
సాంఘికంగాను, ఆర్థికంగాను వాళ్ళని నష్టపరుస్తూ, మానసికంగా శిక్షిస్తారు. 
వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే పెద్ద ఎత్తున తప్పు వేస్తారు. 
పాలేరుతనాన్ని ఒప్పుకున్నతర్వాత దాన్ని వ్యతిరేకించి, మరలా ఆ కుటుంబం ఆ గ్రామంలో బ్రతికాలంటే ఎంతో సాహసంతో కూడిన పనే అవుతుంది. 
సాధారణంగా కేవలం వ్యవసాయ పనులు మీదే ఆధారపడేవాళ్ళు రైతుల దగ్గర రాబోయే పంట సమయంలో పని చేస్తామని ముందుగానే కొంత డబ్బు, మరికొంత ధాన్యం ముందస్తుగా అప్పు తీసుకొనేవారు. 
 వ్యవసాయ పనులు మొదలు పెట్టిన తర్వాత వాళ్ళకి రోజువారీ ఇచ్చే కూలీరేటు డిమాండ్ చేయడానికి ఉండదు. 
వాళ్ళు రైతులు ఎంతిస్తే అంతేతీసుకోవాలి.
    వ్యవసాయంలో దుక్కి దున్నడం, వరినాట్లు వేయడం వంటి పనులన్నీ ఇంచుమించు అందరికీ ఒకే సమయంలో వస్తుంటాయి. కాబట్టి కూలీలకు డిమాండ్ ఉంటుంది. 
అయినా, ముందస్తుగా అప్పు తీసుకున్నవాళ్ళు రైతులు ఏరేటుకడితే ఆ రేటుకే కూలి పని చెయ్యాలి. 
సాధారణంగా ఆ రోజుల్లో వ్యవసాయ పనులకు రోజుకి ధాన్యమైతే ఒక కుంచెడు, డబ్బులైతే పది నుండి పదిహేను రూపాయలు వరకూ ఇచ్చేవారు. 
మగవాళ్ళకైతే ఒక కుంచెడు ధాన్యం, బేటాగా ఒకరూపాయో, అర్థరూపాయో అదనంగా ఇచ్చేవారు.
 మా అమ్మా, నాన్న మాత్రం అలా ముందస్తుగా డబ్బులు గానీ, ధాన్యం గానీ ఎప్పుడూ తీసుకొనేవారు కాదు. 
     వ్యవసాయంలో ఏడాదికి అన్ని రోజులూ పనులుండవని తెలిసినందువల్లనేనేమో నాన్న ఇతర పనులెన్నో నేర్చుకున్నాడు.
 కొబ్బరికాయల దింపు తీయడం, తాటాకులు కొట్టడం, కమ్మరకొలుములో ఇనుముని సాగగొట్టడానికి పెద్ద సుత్తితో కొట్టడం, ఇనుము కాల్చేటప్పుడు ఆ పొయ్యి మండడానికి గాలి వచ్చేలా ఏర్పాటు చేసిన చక్రాన్ని తిప్పడం వంటి పనులెన్నో చేసేవాడు. 

వాళ్ళు అడిగినా అడక్కపోయినా ఖాళీ ఉంటే కమ్మరకొలుము దగ్గరకు వెళ్ళేవాడు.
 వాళ్ళకు ఆ యా పనుల్లో సాయం చేసేవాడు.
 దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చేవారు. 
ఇన్ని పనులు చేస్తున్నా మేమెందుకు రెండు పూటలా అన్నం తినలేక పోతున్నామని అమ్మని అప్పుడప్పుడూ అడిగేవాణ్ణి. 
''ఇప్పుడు ఉన్నాదని అంతా ఒకేసారి తినేస్తే, పని లేనప్పుడు ఎలా వస్తాయి? కొంత దాచుకోవాలి. మనం జాగ్రత్త పెట్టుకునెటప్పుడు ఒక్కోగింజచొప్పున పొదుపు చేసుకోవాలి. తినేటప్పుడు ఒక ముద్దగా నోట్లో పెట్టుకోవాలి.'' ఇలా పదేపదే చెప్పేది. అంతే కాదు, 
''మనమూ మంచి ఇళ్ళు కట్టుకోవాలి. 
ఈ గుడిసె బదులు మనమూ గోడల ఇల్లులో ఉండాలి. 
గోడల ఇల్లు పెంకిటిల్లు కావాలి. 
పెంకుటిల్లు డాబా ఇల్లుగా మారాలి….
మీరంతా మహారాజుల్లా బ్రతకాలి…
మీకు పండగలకి కొత్త బట్టలు కొనాలి. పండుగకి మనమూ పిండి వంటలు వండుకోవాలి. 
దీనితో పాటు పొలం కొనుక్కుంటే, అప్పుడు మనమూ సన్నబియ్యం పండించుకొని రెండు పూటలా అన్నమే తినొచ్చు. 
పైగా మనకేదైనా జబ్బు చేస్తే డబ్బులు అప్పడికప్పుడెలా వస్తాయి? …'' అంటూ చెప్పేది.
 ఆ డబ్బుల్ని మట్టితో చేసిన డిబ్బీలో కొంచెం కొంచెం తీసి దాచేది. 
ఆ డిబ్బీని ఇంటిలో ఒకచోట గొయ్యి తీసి, దానిలో పెట్టి, దానిపై ఎప్పుడూ కదపకుండా ఉంచే కుండనో, బిందెనో పెట్టేది. 
మా అమ్మ చాలా తెలివైనదనీ, అమ్మ చెప్పిన మాటల్లో నిజముందని, ఏనాడూ ఇంక మన డబ్బులేమవుతున్నాయని గానీ, రెండు పూటలా అన్నమే కావాలని గానీ అడిగేవాణ్ణి కాదు.
నాన్న మాకు అప్పుడప్పుడూ కాట్రేనికోనలో జరిగే శనివారం సంతలో పాతబట్టలు కొనుక్కొచ్చేవాడు. అవి కొంచెం రంగు వెలిసిపోయి ఉండేవి. ఆ బట్టలకు కొన్ని బటన్స్ ఉండేదికాదు, మరికొన్ని చిన్న చిన్న చిరుగులు కూడా ఉండేవి. 
కొత్త బట్టలకు కూడా బటన్స్ ఊడిపోవా? 
కొత్త బట్టలు కూడా ఆడుకొనేటప్పుడు చిరిగిపోయేవి కదా. 
మరి కొన్ని టీ, కాఫీలు పడి మరకలు పడిపోవా
అయినా వాటిని వేసుకొనేవాళ్ళం. 
అసలే బట్టల్లేకుండా ఉండే కంటే, చిన్న చిన్న లోపాలుంటే నష్టమేంటనిపించేది.
 ఒక్కోసారి ఆ బట్టలు చాలా లూజుగా ఉండేవి. 
వాటిని వేసుకొని నేను పెద్దోణ్ణైపోయానంటూ గంతులెసేవాళ్ళం. 
అలాంటప్పుడు మమ్మల్ని చూసి నాన్న నవ్వుతూ నవ్వుతూ కళ్ళు తుడుచుకొనేవాడు. ''ఎందుకేడుస్తున్నావు నాన్నా…'' అని అడిగితే అవి ''మీ సంతోషం చూసి వచ్చే ఆనందభాష్పాలురా'' అనేవాడు. కానీ, నాకెందుకో నాన్న కన్నీళ్ళే పెట్టుకుంటున్నాడనిపించేది.  
ఈ పరిస్థితుల్లో ఇంట్లో గడవడం కొంచెం కష్టంగా ఉండేది. 
ఆ రోజుల్లో చాలా మంది పాలేరుతనం చేసేవారు. 
తాము బతకాలంటే తమ కుటుంబంలో ఎవరొకరు భూస్వాములు దగ్గర పాలేరులుగా మారాల్సిందే. 
అలా పాలేరుతనం ఉంచితే యేడాదికి ఒక బస్తా ధాన్యం వేస్తే, ఆ కుటుంబం ఆ కాలంలో బ్రతికి పోతుంది.. 
 పాలేరు పొద్దున్నే ఆరు గంటలకంటే ముందే వెళ్ళి వాళ్ళకున్న పశువుల్ని మేపాలి. 
పచ్చ గడ్డి కోసి వెయ్యాలి. 
ఆ పశువుల్ని కడగాలి. 
పాలు తీసివ్వాలి. 
వాటితో పాటు వాళ్ళ పొలంలో పని చెయ్యాలి. 
ఖాళీ దొరికితే వాళ్ళు చెప్పిన పనులన్నీ చెయ్యాలి.
  వాళ్ళే పొద్దున్నే సద్ధన్నం, మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం ఏడు గంటల వరకూ వాళ్ళ పని చేసి మరలా సొంత ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి. 
ఒకపూటైనా కాస్త అన్నం దొరుకుతుందని కొంతమంది, తమ ఇల్లు గడుస్తుందని మరికొంతమంది, తమ దగ్గర పిల్లలు మాట వినకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్నా వాళ్ళని పాలేరుతనానికి పంపేసేవారు. 
మా ఇంట్లో మా చిన్నయ్య చిన్నప్పటి నుండీ పాఠశాలకు వెళ్ళేవాడు కాదు. 
చుట్ట కాల్చడం, సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు. 
మా నాన్న చుట్ట కాల్చేవాడు.
అమ్మ కూడా చుట్ట కాల్చేది. అడ్డపొగ పెట్టుకొని మరీ పొగత్రాగేది.
పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆ చలికి, వర్షానికి అలా అడ్డపొగ పెట్టుకుంటే వేడిగా ఉండేదట.
వాళ్ళ నాన్న అంటే మా తాత నేర్పాడట. దగ్గురాకుండా ఉండాలంటే కొద్దిగా చుట్టకాల్చమని డాక్టర్ చెప్పారనీ, అందుకే తనకి ఈ అలవాటు వచ్చిందని అమ్మ చెప్పేది.
 ఇలా అమ్మా, నాన్నా ఇద్దరూ చుట్ట కాల్చేవారు. 
చర్చికి వెళ్ళేవరకూ అలాగే కాల్చేవారు. చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకు ఇద్దరూ పొగతాగడం మానేశారు. దాని పొగ వాసనే గిట్టని స్థాయికి వచ్చారు.
 అమ్మా, నాన్నా పొగతాగేటప్పుడు వాళ్ళు అప్పుడప్పుడూ పొయ్యిలో నిప్పు పట్టుకొని రమ్మనేవారు. 
ఒక్కోసారి చుట్టని వెలిగించుకొని రమ్మనడం వంటి పనులు చిన్నన్నయ్యతో పాటు మేమూ చేస్తుండేవాళ్ళం. 
అలాంటప్పుడు అమ్మా, నాన్నలు చూడకుండా చిన్నన్నయ్య ఆ చుట్టని తానూ నోట్లో పెట్టుకొని పొగపీల్చేవాడు.  
రింగులు రింగులుగా ఆ పొగని వదులుతూ సినిమాలో హీరోగారిలాగే వదులుతాను తెలుసా అనేవాడు. 
దీనికి తోడు పాఠశాలకు వెళ్ళనంటే పశువుల్ని మేలుకొని రమ్మనే వారు ఇంటిలో. 
''ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారు తన ఆత్మకథ ద్వారా కంటతడి పెట్టంచారనడం కంటే దుఃఖం ఆగకుండా గుండెలోతుల్లోనుండి తన్నుకొచ్చేలా చేశారనిపిస్తుంది. ప్రారంభంలోనే స్పూర్తిధాత, ఓమహాకవి, ఓరచయిత బోయి భీమన్న గారి రచనను ప్రస్తావిస్తూ తన ఆత్మకథను ప్రారంభించడం ఓగొప్ప ప్రారంభం. భీమన్నగారి పాలేరు నాటకం అప్పట్లో ఒక గొప్ప స్పూర్తినిచ్చి ,ఆ నాటి యువతరంలో గొప్ప చైతన్యాన్ని నింపింది.ఆ నాటకం చూసిన ఎంతో మంది దళితులు తమ బిడ్డల్ని ఐ.ఏ.యస్. ,ఐ.పి.యస్.లు చేయించారు. ఇహ మనం ఆత్మకథలో కి వెళితే, పాలేరు తనం గురించి చాలా వివరంగా చెప్పారు. ఎందుకంటే రైతుల దగ్గర నేను కూడా పాలేరు తనం చేశాను. కాబట్టి దీన్ని చదువుతుంటే నేను అందులో ఇమిడిపోయినా బాల్యం గుర్తొచ్చింది.అమ్మ పొదుపును చూసే వ్యవస్థ బ్యాంకులు పెట్టడం నేర్చుకుంది కాబోలు. అమ్మపొదుపు సూత్రానికి నా వందనం.ఆత్మకథలోకి ఇంకా కొంచెం ముందుకెళితే సంతలో సెకండ్ హ్యాండ్ బట్టలతో సరిపెట్టుకోవడం …నా బాల్యంలో మా అమ్మ మూడున్నర రూపాయలు ఇచ్చి మా అన్నయ్యకు, నాకు సంతలో బట్టలు తెచ్చుకోవడం… అవినాకు పొడవవడం, ఓ యాబై ఏళ్ళ క్రితం సంఘటన మరలా గుర్తుకు తెచ్చి నన్ను కంటతడిపెట్టించారు ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారు. నీటి కాడా, కూటికాడా అంటరానితనం ఓ దౌర్భాగ్యం.
ఇంత గొప్ప ఆత్మకథను పాఠకులకు అందించిన డా.సాకే శ్రీహరిమూర్తి గారికి, రచయిత ఆచార్య దార్లవెంకటేశ్వరావు గారికి శుభాభినందనలు. జయహో భూమిపుత్ర!''... ఎజ్రాశాస్త్రి. కవి, రచయిత.

అక్కడ వాళ్ళ స్నేహితులు గడ్డితోను, జీలుగు కర్రలు, జనుముతోను సిగరెట్ కాల్చినట్లు కాల్చేవారు. 
తర్వాత బీడీలు, సిగరెట్లు కాల్చడం, వాళ్ళతో పాటు చిన్నయ్య కూడా జత పట్టి, ఆ అలవాట్లే నేర్చుకునేవాడు. 
పశువుల్ని మేపుతూ సిగరెట్ ఖాళీ పెట్టెల్ని చింపి, వాటితో బెచ్చాలాటలు ఆడేవారు. సరదాగా మొదలైన ఆ ఆటల్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు పశువుల్ని ఏ పొలాల్లోకైనా వెళ్ళిపోతే వాటిని మరలా తోలుకొని రావాలి. 
ఆ తర్వాత బెచ్చాల బదులు డబ్బులకి ఆటలాడే వారు. 
ఆ తర్వాత బెచ్చాలకు బదులు పేకాట కూడా ఆడేవారు. 
వీటన్నింటినూ చిన్నన్నయ్య పాల్గొంటున్నాడని తెలిసి, తిడుతూ కొట్టేవారు. 
కానీ, ఆ జూదంతో చెడిపోతాడని భయపడుతూ వాణ్ణెలా దారిలో పెట్టాలో తెలియక తలపట్టకొనేవారు. 
ఈ పరిస్థితుల్లో కొన్నాళ్ళపాటు పాలేరుతనం పెడితేనైనా మనమాట వింటాడేమో… అప్పుడైనా స్కూల్ కి వెళతాడేమో అనుకున్నారు అమ్మా నాన్నా. 
పెద్దపెద్ద పొలాలు ఉన్నవాళ్ళ దగ్గర పాలేరుగా పెడితే పిల్లాడు చెయ్యలేడు. 
ఆ కష్టాన్ని చూడలేపోతామని, ఒక ఎకరం రెండు ఎకరాల భూమి ఉండేవాళ్ళ దగ్గర పాలేరు తనం పెడితేమంచిదనుకున్నారు. 
నానాజీ గారని ఒక కోమటి కుటుంబం ఉండేది. 
వాళ్ళకి ఒక ఆవు, ఒక గేదె ఉండేది. 
వాళ్ళకి ఒకటో రెండు ఎకరాలో వ్యవసాయ పొలం ఉండేది.
దానితో పాటు కొద్దిగా కొబ్బరి తోటకూడా ఉండేది. 
నానాజీ గారెప్పుడూ తన కిరాణా కొట్టు, వారపు సంతలతో బిజీగా ఉండేవాడు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నా, అప్పుడప్పుడూ కొట్టుమీద కూర్చొనేవారు. 
చదువుతో పాటు కిరాణా వ్యాపారం కూడా నేర్చుకొనే వారు. ఎప్పుడన్నా మేము ధాన్యం అమ్మడానికి వాళ్ళ కొట్టుకి పట్టుకొని వెళితే ''అక్కా కుంచం తీసురా'' అనేవారు. 
నానాజీ గారైతే ''పెద్దమ్మాయ్ కుంచం తీసుకురా'' అనేవారు.
 మాకు బియ్యం అమ్మడానికైతే ''చిన్నమ్మాయ్ మానిక తీసుకురా'' అనేవారు. 
అప్పుడప్పుడూ నానాజీ గారి తల్లి అమ్ములు గారు కూడా కిరాణా కొట్టు మీద కూర్చొనేవారు. 
ఆమెకు వయసులో ఉండగానే భర్త పోయారని చెప్తుంటారు. 
ఆమె కోడల్ని బాగా ఏడిపించేదనీ, కొడుకు ఏమన్నా అంటే ఊరుకొనేది కాదనీ ఊరంతా చెప్పుకునేవారు. 
మేమేవైనా సరుకులు కొనుక్కోవడానికి వెళితే మాకు కూడా ఏదొక పని చెప్పేది. చెయ్యకపోతే మాకు కావల్సిన సరుకులు లేవనేది. 
ఆ ప్రక్క నున్న కాపులతో కూడా ఎప్పుడూ గొడవలు పడేది.

ఆమే ఆ ఇంట్లో మకుటం లేని మహారాణిలా వ్యవహరించేది. 
ఆ ఇంట్లో మా చిన్నన్నయ్యని పాలేరుగా పెట్టారు. 
యేడాదికి ఒక బస్తా ధాన్యం ఇస్తామనారు. రోజూ పాలేరతనానికైనా ఇష్టంగా వెళ్ళేవాడు గానీ, స్కూల్ కి వెళ్తాననే వాడు కాదు. 
ఆదివారం లేదా మాకు సెలవులు న్నాయని తెలిసినప్పుడు మాత్రం తాను వెళ్ళననేవాడు. తనకి ఒళ్ళంతా నొప్పులనో, బద్దకంగా ఉందనో మానేసేవాడు. 
చిన్నన్నయ్య వెళ్ళకపోతే వాడికి బదులు మా ఇంట్లో ఎవరొకరు వెళ్ళాలి. లేకపోతే పెద్దమనుషుల్లో పెట్టి ఆ రోజుకి అయ్యే దానికి డబుల్ కట్టాలి. 
అలా కాకుండా ఉండాలంటే, ఇంట్లో ఎవరొకరు వెళ్ళి పని చెయ్యాలి. 
మా పెద్దన్నయ్యని వెళ్ళమనేవారు కాదు. తమ్ముడు చిన్నవాడు కాబట్టి, వాణ్ణీ వద్దనే వారు. 
ఇక మిగిలింది నేనే. 
అందువల్ల నేను ఆ పాలేరు పని చెయ్యడానికి వెళ్ళాలి. 
ఆ పరిస్థితుల్లో ఒక ఆదివారం నాడు నేను వెళ్ళాను. 
నాకెలాగూ పశువుల దగ్గర పేడతీసి, పశువుల పాకను బాగు చేయడం అలవాటే కనుక, ఆ పనులేవీ నాకు కొత్తనిపించలేదు. 
ఆ ఆవు గాని, గేదె గానీ నన్నేమీ చెయ్యలేదు. దగ్గరకు వెళ్తే మొదట కొంచెం అనుమానించినా, తర్వాత నాకు అలవాటైపోయాయి. 
ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత సద్ధన్నం తినడానికి కంచం తెచ్చుకోమన్నారు అమ్ములు గారు.
సత్తు కంచం, సత్తు గ్లాసు పాకలో పైన దూలానికీ తాటాకులకు మధ్యలో పాలేరులు ఎవరైనా అలాగే దాన్ని దాచిపెట్టుకుంటారు. 
వాటిలో కామందులు పెట్టిన భోజనం తిని, దానిలో పోసిన నీళ్ళు తాగి, మళ్ళీ కడిగేసుకొని జాగ్రత్తగా మళ్ళీ పాకలోనే దాచుకోవాలి. 
నన్నూ ఆ కంచం, గ్లాసు తెచ్చుకోమన్నారు. నాకు వద్దన్నాను. సద్ధన్నం తినడం అలవాటు లేదన్నాను. అయితే ''నీ ఇష్ట''మంటూ, పశువుల్ని తోలుకెళ్ళి మేపమన్నారు. 
''అలాగే'' అని తలూపాను. కానీ, తలలో వెయ్యి ఆలోచనలు సంఘర్షణ పడుతున్నట్లనిపించింది. అమ్మ అయితే నేను తిననంటే ఎలా బ్రతిమలాడేదో గుర్తొచ్చింది. పొద్దున్నే సద్దన్నమో, వాయి కుడుమో పెట్టేది.
ఇక్కడ తిననంటే మళ్ళీ అడిగేవాళ్ళే లేరు.
  అలా ఆలోచించుకుంటూ ఆకలితోనే పశువుల్ని మేపడానికి తోలుకెళ్ళాను. మధ్యాహ్నం దాకా వాటిని మేపి, కాల్వలో కడిగి, వాటితో పాటూ నేనూ కాసేపు ఈతకొట్టి ఇంటికి తోలుకొచ్చాను. ఆకలి నకనకలాడిపోతుంది. 
భోజనం తినడానికి పిలుస్తారేమోనని కంచం, గ్లాసు కడుక్కోవడానికి వెళ్తుంటే 'ముందు ఆ తోటలో కొబ్బరి ఆకులన్నీ పోగేయ''మన్నారు.
 ఆకలి దంచేస్తుంది. 
గబగబా ఆకులన్నీ తెచ్చి ఓ చోటేశాను. మధ్యాహ్నం వెళ్ళి పచ్చగడ్డి కోసుకొని రావాలంటూ, గిన్నె తెచ్చుకోమన్నారు.
 
తెచ్చుకున్నాను.
 దాన్ని కడగడానికి నీళ్ళు పొయ్యమంటే, ఆ పశువుల దగ్గరున్న బకెట్ లో ఉన్నాయికదా తీసుకొని కడుక్కోమన్నారు. 

మామూలుగా అయితే వాళ్ళింటిలోకి నీళ్ళు కావాలంటే వాళ్ళ నుయ్యిలో మేమే చేతదతో తోడి ఇంట్లో పెడతాం. కానీ, మా కంచం కడుక్కోవడానికి గానీ, తాగడానికి గానీ నీళ్లు కావాలంటే అదేమిటో వాళ్ళే తోడి పోసేవారు.
 
అలాగే నా కంచం కడుక్కోవడానికి కూడా కొన్ని మంచినీళ్ళు వేస్తారనుకున్నాను. కానీ అలా జరగలేదు. 
జరిగితే ఆశ్చర్యపోవాలి. 
అందుకనే నేనేమీ ఆశ్చర్యపోలేదు. 
పశువులు, పక్షులతో కలిసిమెలిసి జీవించే మాకు అవి తాగగా మిగిలిన నీళ్ళలో కడుక్కోమంటే, ఒక్క క్షణం ఏదోలా అనిపించినా, పెద్దగా బాధనిపించలేదు.
 బోధుల్లో ప్రవహించే నీళ్ళని ఆ పశువులు ఒక వైపు, మేము మరొకవైపు తాగిన రోజులెన్నిలేవనుకుంటూ కంచాన్ని కడిగేసుకున్నాను. 
వాళ్ళ ఇంటి చూరు దగ్గర కూర్చోమన్నారు. 
 ఈలోగా ఒక గిన్నెలో అన్నం, మరొక చిన్న గిన్నెలో కూర పట్టుకొచ్చారు. కంచంలోకి వాటిని పైనుండే వేశారు. 
దానిలోనే ఏదో కూర కూడా పైనుంచే వేశారు.
 కింద పడిపోకుండా జాగ్రత్తగా వాటిని నా కంచంలో పడేటట్లు పట్టుకున్నాను.
 గబగబా కలిపేసుకొని ఒక ముద్ద నోటిలో పెట్టుకోవడం, వెంటనే కక్కేసుకోవడం ఒకేసారి జరిగిపోయాయి. 
అది నిన్న రాత్రో, అంతకు ముందో మిగిలినదని దాని వాసనే చెప్పేస్తుంది. 
దాన్ని తీసుకెళ్ళి పారేద్దామనుకున్నాను.
 కడుపు ఆకలితో మెలితిప్పేస్తుట్లనిపిస్తుంది.
ఒళ్ళంతా కరిగించుకొంటూ ఇలా మేమంతా కన్నీళ్ళెంతకాలం కార్చుకుంటూ కూర్చోవాలి.
కోపం, ఆకలి కలగలిసిన ఆలోచనలు…
 ''మామ్మగారూ… దీన్నే మీ మనవలకీ పెట్టారా?'' అని అడిగాను నాలోని ఆకల్నీ, కోపాన్నీ అలాగే అణుచుకొంటూ. 
అంతే అమ్ములుగార్కి ఎక్కడలేని కోపం వచ్చేసింది. 
‌''మా వాళ్ళకంత కర్మేమొచ్చిందిరా. మీరంతా ఏజన్మలోనో పాపం చేసుకున్నారు. కాబట్టే మాలాంటోళ్ళకి సేవచేయాలని దేవుడే‌ ఆదేశించాడు. మా దగ్గర పని చేస్తున్నారు కనుకనే ఈ పాచిమెతుకులైనా దొరుకుతున్నాయి. లేకపోతే అవీ మీకు దిక్కేలేదు. 
బళ్ళోకెళ్తున్నావు కదా …అందుకే నీకీ గీర..ఆ గీర తీర్చడానికేరా నీకీ అన్నం పెట్టాను…''
 ఇంకా ఏదేదో అంటూ మీది మీదికొచ్చేస్తుంది. 

కొట్టడానికే నా దగ్గరకు వస్తుందని అర్థమైపోయింది.
ఆమె ఏమంటుందో నాకు ఇంకేమీ వినిపించడం లేదు. ఆ చుట్టూ ఎవరున్నారో కూడా పట్టించుకోలేదు.
నా గిన్నె తీసుకున్నాను. 
ఏమైతే అయ్యిందుకున్నాను.
నాకంచంలోని అన్నంతో సహా ఆమె ముఖానికి తగిలేటట్టు గట్టిగా విసిరేశాను. 
గబగబా పాకలోకి వచ్చి ఆవునీ, గేదెనీ ఇప్పేశాను. 
అవి ఒక్కోసారిగా బయటకు పరిగెట్టడం మొదలు పెట్టాయి.
వాటి వెనుకే నేనూ పరుగు పెట్టుకుంటూ, కొంత దూరం వెళ్ళాక, వాటిని వదిలేసి, నేను మాఇంటికొచ్చేశాను. 
(సశేషం)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖ అధ్యక్షులు, 
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ 
ఫోన్: 9182685231






No comments: