గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన రెండు రోజుల 'బహుజన స్పూర్తి ప్రదాతలు' పేరుతో నిర్వహించిన జాతీయ సదస్సులో నిన్న (18.11.2022) సమాపనోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
ఈ సదస్సుకి ఆ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డా.వెల్దండ శ్రీధర్ సమన్వయకర్త. కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీనివాసరెడ్డి సదస్సు సంచాలకులు. ఈ సదస్సు తెలుగు సాహిత్యాన్ని, తెలుగు వాళ్ళ చరిత్రనీ పునర్మూల్యాంకనం చేయడమెలాగో నేర్పిస్తుందనీ, చరిత్రలో విస్మరణకు గురైన బహుజనుల గురించి పరిశోధనలు ప్రారంభించాలనే స్పూర్తి మొదలవుతుందని చెప్పాను.
నన్నయ మహాభారతం కావ్యావతారికలో ఒక పద్యాన్ని ఉదాహరించి, రాజరాజనరేంద్రుడు చాతుర్వర్ణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నారంటూనే జగత్తు హితంగా పరిపాలిస్తున్నాడని మనమెలా అర్థం చేసుకుంటామో, అర్థం చేసుకోవాలో ఆలోచింపజేయడానికీ, నూతన ఆలోచనా విధానాన్ని బోధించడానికీ ఈ సదస్సు దోహదం చేయగలగాలి. అయితే ఇక్కడే ఒక విషయాన్ని గుర్తించాలి. నిజమైన బహుజన భావజాలం కులద్వేషాన్ని పెంచదనీ, ప్రేమతత్వాన్నే ప్రబోధిస్తుందని నా పుస్తకం 'బహుజన సాహిత్య దృక్పథం'లో రాసిన వాక్యాల్ని చదివి వినిపించాను. సాహిత్యంలోగానీ, సమాజంలో గానీ వాస్తవాన్ని తెలుసుకుంటూనే, ఆధునిక శాస్త్ర సాంకేతిక అభివృద్దిని అందరూ పొందాలంటే కేవలం కొన్ని కులాలు, మతాలు మాత్రమే ఏకమైతే సరిపోదని చెప్పాను. దళిత, బహుజన సాహిత్యం అంటే కేవలం ఈ కులాల వాళ్ళు రాసింది మాత్రమేకాదు. బహుజన, దళిత భావజాలంతో ఎవరు రాసినా దాన్ని స్వీకరించగలిగినప్పుడు మాత్రమే ఈ సమాజంలో కులనిర్మూలన సాధ్యమై, దళిత-బహుజనులు కూడా ప్రధాన జీవనస్రవంతిలోకి రాగలుగుతారని వివరించానుౠ. నిరుద్ధభారతం రాసిన మంగిపూడి వేంకటశర్మ , దళితుల జీవితాల్ని సాహిత్యీకరించి తన కాలానికి ముందు నిలిచిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అప్పుడు మాత్రమే సమాజంలో అందరూ సుఖసంతోషాలతో ఉండగలుగుతారని వివరించాను. తెలుగు సాహిత్యంలోనూ, చరిత్రలోనూ కొన్ని సామాజిక వర్గాలవారికి గౌరవం లేకుండా చేశారనీ, గొప్ప సాహితీవేత్తలు, యోధులు ఉన్నప్పటికీ వారిని గుర్తించ లేదనీ , ఒక ప్రధానమైన కులం వాళ్ళు కాకపోతే ఆ రచనల కర్తృత్వ సమస్యల పేరుతో సాహిత్యాన్ని గందరగోళం చేయడం కనిపిస్తుంది. మొల్ల రామాయణం మొల్లరాయలేదనడంలోగానీ, ఆముక్తమాల్యద ను శ్రీకృష్ణ దేవరాయలు రాసేటంతటి సమయం ఆయనకెక్కడ ఉంటుందనీ, అటువంటి వాదనే రంగనాథ రామాయణంలోనూ జరిగిందని సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేశాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి