"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

30 November, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 18వ భాగం


 భూమిపుత్ర దినపత్రిక, 29.11.2022, సంపుటి: 4, సంచిక 240, పుట: 02 సౌజన్యంతో 
ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 18వ భాగం


అమ్ముదామంటే అడవి…కొందామంటే కొరివి! 

మాకు ఒక గేదె, రెండు మైసూరు జాతి ఎడ్లూ ఉండేవి.అవి చాలా ఖరీదైనా, నాన్నెంతో ఇష్టపడి వాటిని కొన్నారు. ఆ ఎద్దులకు పొడవైన కొమ్ములు సూదిగా ఉండేవి. నాన్న బండి కట్టడానికి వాటిని ఆ బండి కాడి దగ్గరకు వెళ్ళగానే ఒక్కోసారి వాటికవే కాడిని పెట్టుకోవడానికి ప్రయత్నించేవి. మేమెవరైనా వాటి దగ్గరకు వెళ్తే అమాంతంగా కొమ్ములు విసురుతూ మీదకొచ్చేవి. అందువల్ల మేమెవరిమైనా మేటి నుండి కొంచెం ఎండుగడ్డి లాగి దాన్ని మాత్రమే వాటికి వేసేవాళ్ళం. 

వాటిని రోజూ బయటకు తోలుకెళ్ళకపోయినా పర్లేదు. పచ్చిగడ్డి వేసినా వేయకపోయినా, దాణా మాత్రం కచ్చితంగా పెట్టాలి. ఉడకబెట్టిన ఉలవలు, వేరుశనగ పిండి అచ్చులు, ఊక, మెత్తని తౌడు నీటిలో కలిపి పెట్టడాన్నే దాణా పెట్టడం అంటారు. ఆ దాణాలో వేసే ఉలవలు చాలా రుచిగా ఉండేవి. అందువల్ల వాటిని అప్పుడప్పుడూ కొన్ని తీసుకుని నేనూ తినేవాణ్ణి. . 

గేదెలకు కూడా దాణా పెడతారు. కానీ తౌడు, ఊక కలిపితే సరిపోతుంది. దీనితోపాటు ప్రతిరోజూ ఒకపూటైనా గేదెను మేపాలి. పచ్చగడ్డి వెయ్యాలి.స్కూల్ కి వెళ్ళేముందు గానీ, వచ్చిన తర్వాత గానీ దాన్ని తప్పనిసరిగా మేపాలి. అప్పుడు మాత్రమే రెండు పూటలా పాలు ఇస్తుంది. 

ఆ గేదెని పొలాల్లోకి గానీ, కాల్వగట్టుకి గానీ తోలుకెళ్ళి మేపేవాణ్ణి. గేదెలను తోలుకెళ్తూ, ఒక పుస్తకం కూడా పట్టుకొనివెళ్ళేవాణ్ణి. అది మేస్తుంటే గట్టుమీద కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉండేవాణ్ణి. ఆ పుస్తకంలో పడి ఒక్కోసారి ఆ గేదె ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలిసేది కాదు. అది ఒక్కోసారి ఆ వరిచేలల్లో పడి మేసేసేది. దానితో ఆ పొలం రైతులు నన్ను తిట్టేసేవారు. కొంతమందైతే కొట్టడానికీ వెనుకాడే వారు కాదు. మాకే పొలాలు లేవు. వాళ్ళ పొలాలు, భూములదగ్గరే మేపేవాళ్ళం.కనుక, తిట్టినా, కొట్టినా ఏదో అనాలని ఎదిరించడం తప్ప, అవన్నీ మౌనంగా భరించాల్సి వచ్చేది.కానీ, గవర్నమెంట్ భూముల్లో…అంటే కాలువ గట్టు మీద మేపినా అలాగే తిడుతుంటే తట్టుకోలేకపోయేవాళ్ళం. అయినా సరే తమ పొలాలు ఉన్న కాలువగట్టంతా తమదే అన్నట్లు వ్యవహరించేవారు. కొంతమందైతే ఆ గట్టుని చదును చేసేసి కొబ్బరిచెట్లు పాతేశారు. అలా ఆ కాలువ గట్లు కూడా కొబ్బరి తోటలైపోయాయి. అందువల్ల అక్కడ మా పశువుల్ని మేపాలంటే వాళ్ళతో గొడవపడాల్సి వచ్చేది. వాళ్ళతో గొడవలు పడలేక, మనకి భూమేమి లేనప్పుడు మనం పశువుల్నెలామెపాలని, దానికంటే ఎవరొకరికి పనిచేస్తే గౌరవంగా ఉంటుందని మా ఇంట్లో గొడవపడేవాణ్ణి. నిజానికి ఆ పశువుల్ని మేపడానికి వెళ్ళినప్పుడల్లా ఏదొక సమస్య రావడం, దానివల్ల చదువు మీద మనసు లగ్నం చేయలేకపోవడం…ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకెలా చెప్పాలో తెలిసేది కాదు. నాలో నేనే తిట్టుకొంటూ అలాగే కొన్నాళ్ళు తప్పదనుకున్నాను. 

అది వేసవి కాలమైతే వరికోసేసి, అపరాలు తీసేసిన తర్వాత చేలన్నీ ఖాళీగా ఉంటాయి. అలాంటప్పుడు ఆ పొలాల్లో ఎవరి పశువుల్ని మేపుకున్నా ఎవరూ ఏమనరు. పైగా అవి వేసే పేడవల్ల ఆ పొలాలకు బలమైన ఎరువు చల్లినట్లయ్యేది. అలాంటప్పుడు గెదెలు, దున్నపోతులను, ఎద్దులు, లేగదూడలతో ఆ పొలాలన్నీ కళకళలాడుతుండేవి. ఒక్కోసారి మేము ఆ గేదెలమీద కూర్చొని మేపుతుండేవాళ్ళం. మా గేదె మీద నేనూ ఎక్కి పడుకొని ఆకాశంలో చూస్తుంటే వాణ్ణి. 

పశువుల్ని మేపడానికి వచ్చిన పిల్లలమంతా కలిసి రకరకాల ఆటలు ఆడుకునే వాళ్ళం. కొన్ని చోట్ల చేలల్లో రెండో పంట వేసే వారు కాదు. అలాంటప్పుడు కొంతమంది వేరుసెనగ, జీలుగు, జనపనార వంటివాటిని వేసేవారు. ఆ జీలుగు మొక్కలు పెద్దగా పెరిగిపోయేవి. పశువులు ఆ జీలుగు చేల్లోకి వెళితే కనిపించేవి కాదు. లేత జీలుగుని తింటూ ఆ చేలల్లో ఉండే గడ్డిని మేసుకొంటూ కొన్ని సార్లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవి. మా పిల్లలం ఆడామగా తేడా లేకుండా ఆ జీలుగు చేలల్లో దాగుడుమూతలు ఆటలాడుకొంటూ దాక్కొనేవాళ్ళం. కొంతమంది జంటలు జంటలుగా ఆ చేలల్లో మాయమైపోయి, చాలా సేపటికి గానీ కనిపించే వారు కాదు! అలాంటప్పుడు వాళ్ళని అనుమానిస్తూ ఆటపట్టించేవాళ్ళం. దాగుడు మూతల ఆటలతో పాటు గోణీ బిల్ల ఆంటీ ఆడేవాళ్ళం. ఒక చిన్న కర్రపుల్లను కర్రమొదలు పట్టేంత గుంత మీద పెట్టి పైకి ఎగరేసి దాన్ని కర్రతో కొట్టాలి. ఎవరెంత గట్టిగా, దూరం వెళ్ళేలా కొట్టగలరో దాన్ని బట్టి పాయింట్లు ఉంటాయి. అలా కొట్టేటప్పుడు ఎగిరి వచ్చే కర్రబిళ్ళను అందుకుంటే కొట్టేవాళ్ళు ఔట్. ఇది బాగా ఆడేవాళ్ళం.దెబ్బలు కూడా తగిలేవి. అలా మాలో మేము కొట్టుకొని, ఆ దెబ్బలాటలు పెద్దవాళ్ళదగ్గరకీ వెళ్ళిపోయేవి.

 నాన్న గానీ, చిన్నన్నయ్యగానీ మా గేదెలకు పాలుతీసేవారు. మా నాన్న తీసేటప్పుడే నేనుకూడా తీస్తానని సరదాపడేవాణ్ణి. ఆ పొదుగు పట్టుకొని పిండేవాణ్ణి. కానీ, పాలు వచ్చేవి కాదు. నేను ముట్టుకుంటుండగానే ఆ గెదెకెలా తెలిసిపోయేదో నా వైపు చూస్తూ, కాళ్ళు విదిల్చేది. పాలు తీసేముందూ, చివరలోనూ లేగదూడను తల్లి గేదే దగ్గర వదలుతారు. మొదట కొన్ని పాలు తాగడానికి వదిలేసరికి పాలు సేపుకొస్తాయి. అప్పడు ఆ లేగదూడను తీసేసి పాలు పిండేసి, కొంచెం పాలు ఉన్నాయనగా వాటిని తాగడానికి మళ్ళీ లేగదూడను తల్లిదగ్గర వదిలేస్తారు. అప్పుడు మా నాన్న లేదా మా చిన్నన్నయ్య పాలు పట్టుకొని వెళ్లి పోయేవారు.

 నేను లేగదూడను కట్టేస్తానని, దానితో ఆడుకుంటూ, పాలు తాగేసాక గుంజకు కట్టేసేవాణ్ణి. అప్పుడప్పుడు మా నాన్న, చిన్నన్నయ్య చూడకుండా ఆ లేగదూడతో పాటు ఆ గేదె పొదగుదగ్గర కూర్చొని నేను కూడా ఒక సనుకట్టుని నోట్లో పెట్టుకొని పొదుగుదగ్గర నోరుపెట్టి పాలు తాగాలని ప్రయత్నించేవాణ్ణి. అంతే ఆ గేదెకెలా తెలిసిపోయేదో ఒక్కతాపు తన్నేది. నేనెక్కడో పడేవాణ్ణి. మళ్ళీ చాలా సేపటిదాకా నన్ను మళ్ళీ దగ్గరకు రానిచ్చేదికాదు. మళ్ళీ నెమ్మదిగా గేదె గమనించకుండా పొదుగు దగ్గరకు వెళ్ళి నోటితో పీల్చుకోనివ్వకపోతే గ్లాసులో పాలు పిండుకొని ఆ పచ్చిపాలు సరదాగా తాగాలనుకునేవాణ్ణి. కొంచెం పాలు వచ్చేవో లేదో మళ్ళీ గేదె నన్ను గమనించి తన్నేసేది. అది బలే సరదాగా ఉండేది. ఆ పాలు వేడిగా చాలా రుచిగా ఉండేవి. అందుకే నాన్న పాలు తీసే సమయానికి నేను కూడా లేచి, నాన్న చేతితో పాటు ఆ గేదె పొదుగుని నేనూ పట్టుకుంటాననేవాణ్ణి. 

పాలు తీసి మేము వాటిని మజ్జిగ, పెరుగు బాగా తిందామనుకుంటే, వాటిని అమ్మేసి కొద్దిగా ఉంచేవారు. మాకు పాలు లేనప్పుడు మాకు పాలు కావాలంటే రాజులో, కాపుల దగ్గరకు వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ మేము పాలు అమ్మాలంటే వాళ్ళ ఇండ్లకు పట్టుకొని వెళ్ళి ఇవ్వాలి. డబ్బులివ్వడానికి కూడా బాగా తిప్పుకొనేవారు. పాలల్లో నీళ్ళే ఉన్నాయని సరిగ్గా డబ్బులే ఇచ్చేవారు కాదు. కానీ, మాకు కావాలంటే నీళ్ళెక్కవగా ఉండే పాలుపోసినా బ్రతిమాలి తెచ్చుకోవాలి. డబ్బులు కూడా ఎప్పటికప్పుడే ఇవ్వాలనే వారు. ఇదంతా నాకు బాధగా అనిపించేది. పాలు వాళ్ళింటికి నేను లేదా మా చిన్నన్నయ్యో, తమ్ముడో పట్టుకొని వెళ్ళి ఇవ్వాలి. అది మాకు పెద్ధపనిగా అనిపించేది. అలా మా సమయమంతా వృధా అయిపోతుందనీ, చదువుకోవడానికి టైముండడంలేదనీ , పోనీ అంత జాగ్రత్తగా పాలు పోసినా మనకివ్వవలసిన డబ్బులివ్వడం లేదనీ, అవి మనమే తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇంట్లో వాదించాల్సి వచ్చేది. అయినా నామాట పట్టించుకొనేవారు కాదు. చిత్రమేమిటంటే ఆ పాలు మేము కొందామంటే కరువు. అమ్ముదామంటే కొనే వాళ్ళు కూడా కరువే అన్నట్లుండేది. అది నాకు సంతోషమే అనిపించేది. అలాగైనా ఇంట్లోవాళ్లకి ఉపయోగపడతాయని తృప్తిగా అనిపించేది. అలా పాలు మిగిలిపోతుంటే అమ్మ వాటిని కాచి తోడు పెట్టి గడ్డపెరుగు చేసేది. ఒక్కోసారి నన్ను తోడు వేయమని చెప్పేది. అప్పుడు పాలు కాచి, వాటిని చల్లార్చిన తర్వాత తోడు వెయ్యాలి. అలాంటప్పుడు ఆ పాలు మీద మీగడ ఉండేది. అది బలే రుచిగా ఉండేది. మా పాలుకి వెన్న చాలా వచ్చేది. మజ్జిగ చిలకరించేటప్పుడు అమ్మ మాకు తినండని కొంచెం పెట్టేది. అది చాలా రుచిగా ఉండేది. దాన్ని ఒక ముంతలో వేసి కొంచెం ఎక్కువైనతర్వాత వేడిచేసి నెయ్యి చేసేది. ఆ నెయ్యి ఉట్టిమీద పెట్టేది. చల్లారిన తర్వాత అది తింటే కూడా చాలా రుచిగా ఉండేది. నాకు చిన్నప్పటి నుండి పాలు పదార్థాలు చాలా ఇష్టంగా తినే వాణ్ణి. ఇంట్లో వాళ్ళు నెయ్యి చాలా మంది ఇష్టంగా తినేవారు కాదు. నాకు మాత్రం అది చాలా ఇష్టంగా తినే వాణ్ణి. దానికోసం మైనా గేదెల్ని బాగా మేపాలనుకొనేవాణ్ణి. పచ్చగడ్డి కూడా కోసే వాణ్ణి. పాలు అమ్ముదామంటే మాత్రం నా మనసు చివుక్కుమనేది. 

(సశేషం)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ 

ఫోన్: 9182685231




 



No comments: