23 November, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 17వ భాగం

 

భూమిపుత్ర దినపత్రిక, 23.11.2022, సంపుటి: 4, సంచిక 233, పుట: 02 సౌజన్యంతో 

ఆచార్య దార్ల ఆత్మకథ ( నెమలికన్నులు) 17వ భాగం 
 రజకులే నాకు ఆదర్శం
 
రోజూ మా అమ్మా నాన్న ఎప్పుడు నిద్రపోతున్నారో, ఎప్పుడు నిద్రలేస్తున్నారో అనిపించేది. ఎప్పుడు చూసినా ఏదొక పనిచేస్తూనే ఉండేవారు. 
నాకు మాత్రం పెందలకడనే నిద్రవచ్చేసేది. స్కూలుకి వెళ్ళి వచ్చి, ఇంట్లో పనులేమైనా ఉంటే చేసేవాణ్ణి. పొద్దున్నే మా పశువుల పాకలో పేడతీసి, అక్కడ శుభ్రం చేసి, మేత వేసి వచ్చేసి స్నానం చేసేవాణ్ణి.
 అప్పటికే మా అమ్మో, నాన్నో నీళ్ళు కాసి రెడీగా ఉంచేవారు. ఒక్కోసారి అమ్మా, నాన్న, చిన్నన్నయ్య పొద్దున్నే పనికి వెళ్ళిపోయేవారు. కాబట్టి మేము లేచేసరికే వంటలన్నీ చేసేసి, మిమ్మల్ని లేపకుండానే చీకటి ఉండగానే పనులకు వెళ్ళిపోయేవారు.
 మేము లేచి మా పనులు మేము చేసుకొని, సద్దన్నం తినేసి, మధ్యాహ్నానికి కొంచెం క్యారేజీలో కూర, అన్నం పెట్టుకొని వెళ్ళేవాణ్ణి. 
మా తమ్ముడు, చెల్లి వాళ్లిద్దరూ తర్వాత బడికి వెళ్ళేవారు.
ఒక్కోసారి అంతపొద్దున్నే నిద్రలేవాలంటే బద్దకంగా ఉండేది. 
శీతాకాలమైతే మరీ లేవబుద్దేసేదికాదు.
 కానీ అప్పటికే మా చెరువులో బట్టలు ఉతుకుతున్న శబ్దాలు మాత్రం వినబడేవి. 
అవి ప్రతిరోజూ తెల్లవారు ఝామునుండే మొదలయ్యేవి. నా కలలన్నీ చెదరగొట్టేస్తున్నారనిపించేది.
నా కలల్లో జీళ్లు రుచిని అమాంతగా లాగేసుకుంటున్నట్లనిపించేది. 
మా స్నేహితులతో కోతికొమ్మచ్చాట్లాడుతుంటే కొమ్మనెవరో విరిచేస్తున్నట్లు... 
సైకిల్ టైరుల్ని దొర్లించుకుంటూ కర్రపుల్లతో కొట్టుకొంటూ దానివెనుకే పరుగుపెడుతూ ఒక పెద్ద బండినేదో నడుపుతున్నాననుకునే నా సంతోషాన్ని ఎవరో చిదిమేస్తున్నట్లు... 
ముంజికాయలు తినేసి, ఆ ఖాళీ కాయల్ని మూడు చక్రాల బండి చేసుకొని, దానితో మాన్నేహితులతో పోటీపడి నడుపుకొంటుంటే వాటినెవరో మధ్యలోనే విరగ్గొట్టినట్లు... 
బడిలో పిల్లలతో కలిసి గొడ్లమూడి ఆకులు, రావి ఆకులతో అల్లుకున్న కిరీటాలు ధరించి, కొబ్బరి ఆకులతో చేసిన బూరల్ని ఊదుకొంటూ, అరిటి ఆకులతో పరుచుకున్న పరుపులపై కూర్చొని ఆడుకునే మా చిన్ననాటి నాటకాల్ని మధ్యలోనే ఆపేస్తునట్లు... 
తాటి ఆకుల్ని డ్రమ్ములుగా చేసుకొని, దానిపై వెదురుబద్దలతో కొడుతూ ఏవేవో చప్పుళ్ళు చేసుకొనే వాయిద్యాల్ని మధ్యలోనే ఏవరో తగలబెడుతున్నట్లు... 
పచ్చితాటిపొత్తుల్ని తెచ్చుకొని, ఆ పొదుగులతో కాళ్ళకు చెప్పుల్లా వేసుకొని నడుస్తుంటే జారిపోవడమో, కాళ్ళు పట్టక చిరిగిపోవడమో…
మళ్ళీ కొత్త పొత్తుల్ని తెచ్చుకోవడానికి వెళ్తే ఆ యజమానులు పట్టేసుకొని కొట్టినట్లో... 
ఆ రాయి మీద బట్టల్ని ఉతుకుతుంటే వచ్చే శబ్దాలు నా చిన్ననాటి ఆనందాల్ని మింగేస్తున్న కొండచిలువుల్లా వచ్చే కలలన్నీ ఆ శబ్దాలు చెదరగొడుతున్నట్లనిపించేవి.
 మళ్ళీ అవే శబ్దాలతో దేవతలెవరో నన్ను లేపి, నా పై పూలు చల్లుతూ, తెల్లని వస్త్రాల్ని నాకు బహూకరిస్తున్నట్లు కలల వచ్చేవి. 
అందుకే ఆ శబ్దాలు మొదలయ్యాయంటే లేచిపోయేవాణ్ణి. కొత్తబట్టల్నిచ్చి, నాపై పన్నీరు జల్లుతూ, నాపై పువ్వులు జల్లుతున్నట్లు కలలు వస్తుంటే మాత్రం లేవబుద్దేసేదేకాదు.
బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసే వాళ్ళను చాకలి అనకూడదనీ, రజకులు అన్నాలనీ మా హైస్కూల్ లో సోషల్ మాస్టారు ఆతుకూరు లక్ష్మణరావుగారు చెప్తుండేవారు. 
మాతో పాటే మా చెరువుగట్టు మీదే ఒకటో రెండో ఇళ్ళు రజకులవీ ఉండేవి.
 పొద్దున్నే బట్టలు ఉతికి, గంజిపెట్టి, నీళ్ళుమందుపెట్టి ఆరేసేవారు. తర్వాత వాటిని తీసి ఇస్త్రీ చేసి బ్రాహ్మలు, రాజులు, కామట్లు, కాపులు, గౌండ్ల ఇండ్లకు పట్టికెళ్ళి ఇచ్చేవారు. 
కానీ, వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చి ఉతకమన్నా, ఇస్త్రీ చెయ్యండని అడిగినా మాల, మాదిగల బట్టల్ని తీసుకొనేవారు కాదు.
మళ్ళీ మాతోనే ఉండేవారు.
 మాతో వాళ్ళు, వాళ్ళు మాతో వరుసలు పెట్టి పిలుచుకోవడం, కలిసి వ్యవసాయం పనులు చేయడం మామూలుగానే ఉండేవి. 
అప్పుడప్పుడూ ఎవ్వరూ చూడకుండా మాత్రం మా పెద్దన్నయ్య బట్టలు ఇస్త్రీ చేసిచ్చేవారు. ఆ బట్టల్ని ఇచ్చేటప్పుడు ఇంటి బయటకొచ్చి ఎవ్వరూ చూడటం లేదనుకున్నప్పుడు బ్యాగ్ లో ముందే పెట్టేసి గబగబా తీసుకెళ్ళమని ఇచ్చేసేవారు.
ఆ రజకుల కుటుంబంతో మానాన్నకు బాగా అనుబంధం ఉండేది. 
ఆ ఇంటి యజమాని పేరు రాముడు. అందరూ చాకలి రాముడు అనిపిలిచేవారు. వాళ్ళకు తెలియకుండా మావాళ్ళూ అలాగే పిలిచేవారు.
 కానీ, వాళ్ళముందుమాత్రం ఏనాడూ అలా పిలిచేవారు కాదు. ‘‘ఏమండీ...రాముడుగారూ’’ అనే పిలిచేవారు. మా నాన్న మాత్రం ఆయనతో సరదాగా పరస్పరం ఒకర్నొకరు '' ఒరేఒరే'' అని పిలుచుకునేవారు. 
ఆయన దగ్గరే మా నాన్న వల వేయడం, చిరిగిపోతే దాన్ని బాగుచేయడం నేర్చుకున్నాడు. ఇద్దరూ జోక్స్ వేసుకుంటూ సరదాగా ఉండేవారు. వాళ్ళు మా ఇంటికీ, మేము వాళ్ళింటికి వెళ్తూ, వస్తుండడం మామాలుగానే జరిగిపోయే ది.
మా నాన్నని వాళ్ళ పిల్లలు గౌరవంగానే అన్నయ్యా అనేవారు. అందువల్ల వాళ్ళు పిల్లల్ని మేము 'నాన్నగారు' అని పిలుస్తుండే వాళ్ళం.
ఆ కుటుంబం చాలా పెద్దది. ఉమ్మడి కుటుంబం.
వాళ్ళ ఇంటిలో నా వయసులో ఉన్న ఒక అబ్బాయితో పాటు మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య వయసులో ఉన్నవాళ్లు కూడా ఉండేవారు.
 వీళ్ళతో పాటు నాకంటే కొంచెం పెద్దవయసులో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు 'దుర్గమ్మ' అనుకుంటాను. 
మేమెప్పుడన్నా నీళ్ళు తాగాలని అడిగితే గ్లాసుతో ఇచ్చేది.  
నా వయసులో ఉన్న వాళ్ళబ్బాయి 'రాధాకృష్ణ' కూడా మాతో పాటే బడికి వచ్చేవాడు. కానీ, ఎక్కువగా మానేసేవాడు. 
బట్టలు ఉతికేటప్పుడు ఆ ఇంటిలో వాళ్ళకి సాయం చేయడం, ఆ బట్టలు మళ్ళీ వాళ్ళ వాళ్ల వాళ్ళ ఇండ్లకు పట్టుకొని వెల్లడం వంటి పనులే అతనికి సరిపోయేవి.
 ఆ చొరవతో మేము వాళ్లింటికి మేము, మా ఇంటికి వాళ్ళు వచ్చేవారు. దుర్గమ్మను నేను ఒక్కోసారి పిన్నిగారనీ 'అక్క' అనీ పిలిచేవాణ్ణి. 
ఆమెను మా పిల్లలు ఎవరైనా నీళ్ళు అడిగినప్పుడు అప్పుడప్పుడూ నిమ్మకాయ రసం, ఉప్పు కలిపి ఇచ్చేది. 
ఒకవేళ నిమ్మకాయ లేకపోతే కూడా ఉప్పు కలిపి ఇవ్వడం అలవాటైపోయింది. 
నాకిప్పటికీ అది గుర్తే. అలా ఇవ్వడం వల్ల రుచిగా ఉంటాయనేది.
ఆ గ్లాసుతోనే నీళ్ళు తాగేసి, దాన్ని కడిగేసి ఇచ్చేసేవాళ్ళం. 
మేమంతా బంధువాచకాలతోనే పరస్పరం పిలుచుకొనేవాళ్ళం.  
ఆ ఇంటిల్లిపాదీ చెరువులో దిగితే నాలుగైదు బల్లలు వేసుకొని కొంతమంది ఉతకడం, మరికొంతమంది వాటిని తీసుకెళ్లి గెంజీ, నీలిమందు పెట్టి ఆరేయడం… చూడ్డానికి ఆదృశ్యం ఎంతో అందంగా, సరదాగా ఉండేది. వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ చూసినా రంగురంగుల బట్టలే. దూరం నుండి వాటిని చూస్తుంటే భూమి అంతా రంగురంగుల బట్టలతో సింగారించుకున్నట్లనిపించేది. 
వాళ్ళెప్పుడన్నా ఊరెళ్ళాలంటే కొత్తబట్టల్లాంటివే వేసుకొనే వారు. అవన్నీ వాళ్ళవి కాకపోయినా, ఎవరి బట్టలు వాళ్ళకిచ్చేవరకూ అవన్నీ వాళ్ళనే అనేవారు.
అందుకనే వాళ్ళెప్పుడూ మెరుస్తున్న బట్టలే వేసుకొనే వారు. కొతబట్టలు కొనుక్కోనవసరం లేకుండానే ఖరీదైన కొత్తబట్టలు కట్టుకొనే వారు. 
అయితే, రాముడు కొడుకుల్లో మధ్య వాడు మాత్రం ''అవేసుకోవద్దు. మనమే కొనుక్కుని వేసుకుందాం…ఎవరెవరిచేతో మనమెందుకు మాటలనిపించుకోవాలి?'' అని వాడు. 
అంతే కాదు, అతను మంచి బట్టలు కొనుక్కునేవాడు. అతను బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం కంటే గుత్తగా వ్యవసాయ పనులు చేయడానికి బాగా ఆసక్తిని చూపించేవాడు. 
 నేను అప్పుడప్పుడూ వాళ్లని అడిగేవాణ్ణి. ‘‘మీరు అంత పొద్దున్నే లేచి బట్టలు ఉతుకుతారు కదా... ఎంత వస్తుంది?’’ అని. 
ఒకటి రెండు ఇళ్ళవాళ్లు తప్ప, మిగతావాళ్ళంతా యేడాదికి ఒకసారి కొంత ధాన్యమని ఇస్తారనీ, పండుగలకు బట్టలు పెడతారనీ, కొంతమంది వాళ్ళకు తోచినంత ఇస్తారనీ చెప్పారు. 
కొంతమందైతే పనిచేయించుకోవడమే తప్ప, ఏమీ ఇవ్వరని కూడా చెప్పేవారు. 
ఒక్కోసారి వాళ్లిచ్చే డబ్బులు, వాళ్లిచ్చే ధాన్యం వాళ్ల బట్టలకు పెట్టే సబ్బులు, షోడా, నీలిమందులకే సరిపోవనీ, అయినా చెయ్యడం తప్పట్లేదనేవారు. అందుకనే వ్యవసాయం పనులకు వెళ్తున్నామని అనేవారు. 
కొన్నిసార్లు ‘‘మా కంటే మీరే నయం.. మీకు నచ్చితే పనిచేస్తారు. లేకపోతే మానేస్తారు. అసహ్యంగా తయారు చేసి ఇచ్చే బట్టల్ని కూడా మేము ఉతికిపెట్టాలి. వాళ్ళ బట్టలు గట్టిగా ఉండడానికి గెంజి పెట్టాలి. అది తేవడానికి ఇళ్ళిళ్ళూ తిరిగి అడుక్కోవాలి. మేము వాళ్ల బట్టలు ఉతక్కపోతే మమ్మల్ని నానా బూతులూ తిడతారు. గర్వం వచ్చేసిందంటారు. చాకలోడికి చదువులెందుకంటారు. ఒక్కోసారి ఊరొదిలి పారిపోవాలనిపిస్తుంది...’’ ఇలా వాళ్ళ బాధలు చెప్పుకొని బాధపడేవారు.
 ఒకవిధంగా బయటకు ప్రకటించకపోయినా వీళ్ళు కూడా ఒక విధంగా వెట్టిపనినే చేస్తున్నారనిపించేది.
తెల్లవారకముందే వీళ్ళు లేవాలి. బట్టలన్నీ ఉతకాలి. అంతపొద్దున్నే లేచి పనిచేసినా అది ఆరోజుకి మాత్రమే. మళ్ళీ మర్నాడు మామూలే. ఆ పనికి తాలూకూ ఫలితం ఆ రోజుకే తప్ప, మరలా మర్నాడికి కొనసాగదు. 
కానీ, పొద్దున్నే వాళ్ళు లేచినప్పుడే నేను కూడా లేచి, చదువుకొంటే, అది నా జీవితాంతం వరకూ ఉపయోగపడుతుందనిపించింది. 
ఒక పద్యాన్నో, ఒక శ్లోకాన్నో ఒకసారి కంఠస్థం వచ్చేలా చదివేస్తే అది జీవితాంతం వరకూ మనకి ఉపయోగపడుతుంది.
 అదే ఒకసారి బట్టలు ఉతికినా మళ్ళీ మర్నాడు ఇంకొన్ని బట్టలు ఉతకవలసిందే. 
వాళ్ళూ పనిచేస్తారు. 
నేనూ పని చేస్తాను. 
కానీ, నేను చేసిన పని నా జీవితాంతం వరకూ ఉపయోగపడుతుంది. 
నన్ను నిలబెడుతుంది. 
అందువల్ల వాళ్లతో పాటు నేను కూడా లేవాలి.
 ప్రతిరోజూ ఉదయమే బాగా చదువుకోవాలి.
 పొద్దున్నే లేవడానికి వాళ్ళనే నేను వాళ్ళనే ఆదర్శంగా తీసుకోవాలనుకున్నాను.
ఆ నాటి నుండీ నాకు ప్రకృతి అందంగా కనిపించడం మొదలైంది. 
ఆనాటి నుండీ నాకు సూర్యోదయం కొత్తగా కనిపించేది. నాలో కొత్త జ్ఞానాన్ని తీసుకొస్తున్నట్లు, దానికోసమే నేను ఎదురు చూస్తున్నట్లనిపించేది.
 శీతాకాలంలో మంచుతో కప్పిన వరిచేలపై ఆ సూర్య కిరణాలపడినప్పుడు బంగారుచీరనెవరో పరిచినట్లనిపించేది. 
అంతవరకూ నిద్రమత్తు కప్పుకున్న మంచుదుప్పటి కరిగిపోయి, అమ్మ చనుబాలు తాగడానికి పసిపిల్లాడు తల్లి ఎదను వెతుక్కుంటూ దాహం తీర్చుకున్నట్లు సరస్వతీమాత ఒడిలో తన్మయత్వం చెందడం మొదలుపెట్టాను. 
అంతవరకూ కొబ్బరి ఆకులపై నుండి కారే మంచు చినుకులు పొద్దున్నే లేవలేకపోతూ ఏడుస్తున్నప్పుడు కారే ఒకప్పటి నా కన్నీళ్ళులా కనిపించేవన్నీ ఆనాటి నుండీ యువరాజు పట్టాభిషేకానికి సిద్ధమవుతుంటే పన్నీరు చిలకరించే చెలికత్తెల చేతుల్లా ఆ కొబ్బరి ఆకులు సంతోషంతో ఊగుతున్నట్లు మారిపోయాయి.
 నాలో జ్ఞానబీజాల్ని మొలకెత్తించిన ఆ రజకులంటే నాకు గౌరవం మొలైంది. 
నాలో నిత్యం జీవితమంటే యుద్ధమన్నట్లు విజయభేరీ మ్రోగించే శబ్దధ్వనులేవో వినిపించిన ఆ రజకులంటే నిలువెత్తు శ్రమసంకేతాలేవో వినిపిస్తున్నట్లనిపించింది 
వాళ్ళు పని పట్ల చూపే అంకితభావం నాలో గొప్ప ఆత్మవిశ్వాసానికి ప్రేరణ కలిగించింది. 
పొద్దున్నే పొద్దుని లేపే వాళ్ళ సమయపాలన నాకో ఆదర్శాన్నిచ్చింది.
                                                   (సశేషం)
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
 తెలుగు శాఖ అధ్యక్షులు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ – 500 046
ఫోన్: 9182685231
 
 
 


No comments: