21 September, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ 9 వ భాగం


 

‘‘నువ్వక్కడి నుండి వెనెక్కెళ్ళు’’

ఆ మాట లేత ఆకులాంటి గుండెల్నెవరో చీల్చేస్తున్నట్లనిపించింది


నేను హైదరాబాద్ లో చదువుకోవడానికి వచ్చేంతవరకూ ఏనాడూ సూర్యోదయాన్ని చూడ్డం మానలేదు. పైగా నాకు ఆ సూర్యుడెక్కడ నుండి వస్తున్నాడనీ, ఆ స్థలాన్ని కనిపెట్టాలనీ అనిపించేది.

సూర్యోదయానికి ముందు ఆ కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, ఇంకా రకరకాలైన చెట్టన్నీ నల్లగా, దుప్పట్లేవో కప్పుకున్నట్లు ఆ చెట్లేమిటో స్పష్టంగా గుర్తించలేనంతగా కనిపించేవి.

దూరం నుంచి చూస్తే ఆ గాలికి కదులుతున్నట్లు, రెండు మూడు చెట్లు అటూ, ఇటూ వంగి ఒకదానితో ఒకటి ఏవేవో మాట్లాడుకుంటున్నట్లు అనిపించేవి. 

రాత్రి పూట నాన్నో, అన్నయ్యో ఆ చలిలో కూడా పొలంలో నీళ్ళెంత వరకూ పారాయో, ఎవరైనా పొలం గట్టు గానీ కట్టేశారేమో అని అప్పుడప్పుడూ  చూడ్డానికి వెళ్ళేవారు.

అప్పుడు వాళ్ళు దుప్పటి కప్పుకొని, తలకి సైనికుడు కిరీటమేదో పెట్టుకున్నట్టు చెవుల్ని మూసేస్తూ తువ్వాలుతో తలకు చుట్టుకొని పొలం చుట్టూ తిరుగుతున్న దృశ్యాల్లా సూర్యోదయానికి ముందు నాకు చెట్లు కనిపించేవి.

ఇంకాస్త సేపు అలాగే ఆ సూర్యోదయాన్ని చూస్తుంటే, ఆ చెట్ల మధ్యలో నుండి సన్నని వెలుగు…అది  కోత కోసిన పంట పోలాల దగ్గర కాపలా కాస్తూ చేనుకి పెట్రోమాక్స్ లైట్ వేసి చూస్తున్నట్లు అంటూ ఇటూ నాలుగు వైపుల్లో ఏదొక వైపు ఆ కాంతి కిరణాలు కదులుతున్నట్లనిపించేవి.

దూరంగా ఓ మూలలోనో, చేనుకి మధ్యలోనో ఒక కంచె వేసి, దానిమీద ఎండిగడ్డి పరచుకొని, పడుకున్నా మెలకువతో ఉన్నట్లు, మెలకువతో ఉన్నా పడుకున్నట్లనిపించే మా కుక్కపిల్లలాగే మేమూ పొలంలో రాత్రుల మాటు కాపలా కాసే వాళ్ళం.

సూర్యోదయం అవుతున్నకొద్దీ చల్లని గాలీ, దానికి తోడు పక్షుల కిలకిల రావాలు నాలోని బద్దకాన్ని ఎలాగో తొలిగించేస్తూ, కొన్ని సార్లు వద్దన్నా చేలల్లోకి గట్లుతెంపుకుంటూ ప్రవహించే నీళ్ళలా పొద్దున్నే ఏదో నవ్యోత్సాహంతో లేవాలనిపించేది.

దీనికి తోడు అప్పటికే దేవాలయాలపై నుండి భక్తి గీతాలు కూడా వినిపించేవి.

నేను మా ఊళ్ళో ఉన్నంత వరకూ  మూడు కాలాల్లోనూ సూర్యోదయాన్ని చూసే అదృష్టం లభించేది.

పొద్దున్నే ఆ నల్లని మేఘాలెంత వేగంగా  నడిచేవో, అంత కంటే వేగంగా అనేకసార్లు దూరపు ఊళ్ళలో పని కోసం మా వాళ్ళతో పాటూ నేనూ నడిచేవాణ్ణి కదా అనిపించేది.

***

నాకు తెలిసినంతవరకూ గ్రామమంతా కులాల దొంతరగానే ఉంటుంది. ఫలానా వాళ్ళని గుర్తించాలన్నా ఆ కులంతోనే సూచిస్తారు. ఆ పూజారి గారబ్బాయనో, ఆ పంతులుగారనో పిలుస్తారు. ఆ రాజుగారనో, ఆ కామటాయననో, ఆ కాపు గారనో, ఆ కంసాలోడో, ఆ మంగలోడో,ఆ మాలోడో , ఆ మాదిగోడో…ఇంకా కాస్త స్పష్టంగా తెలియడానికి పేర్లని కూడా జత చేస్తుంటారు. అందుకే బడిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులది  ముందుగానే వాళ్ళదే కులమో చిన్న పిల్లలకి కూడా తెలుస్తుంది. గున్నేపల్లి నుండి కాపు కులానికి చెందిన త్రినాథరావుగారు, అదే కులానికి చెందిన శ్రీమతి ఆకులు రామలక్ష్మి గారు మా వూళ్ళో నే ఇళ్ళొకటి అద్దెకు తీసుకొని ఉండేవారు. మా ఊళ్ళోనే ఉండే శెట్టి బలిజ కులానికి చెందిన మట్టా వెంకట్రావు గారు, వీరితో పాటు ఆది ఆంధ్ర ( మాల) కులానికి చెందిన ఒకరు… ఆయన జెల్లగుంట నుండి మాకే వెంకటరెడ్డి గారు వచ్చేవారు. అలాగే, ఆ పంతుళ్లు కూడా తాము పాఠాలు చెప్పే పిల్లలు ఎవరెవరూ ఏ కులం వాళ్ళో, వాళ్ళ తల్లిదండ్రులు ఏయే వృత్తులు చేస్తారో ముందే తెలుసుకుంటారు. ఆ పిల్లల్ని తిట్టాలన్నా, ఒక వేళ మెచ్చుకోవాలన్నా ఆ కులాలు, ఆ కులవృత్తులకు అవేవీ దూరంగా ఉండవు. నేను చదువుకున్న ప్రాథమిక పాఠశాలలోనే నేను వాటిని గమనించాను. నాకు ఆ చిన్న వయసులో ఆ పంతుళ్ళలా ఎందుకన్నారో నాకు తెలిసేదికాదు. కానీ, వాటినిప్పుడు గుర్తు చేసుకుంటుంటే ఆ మాట్లోని అంతరార్థం కొంచెం కొంచెం బోధపడుతుంది.  

మా ఊళ్ళో, మా పేటకు, మా ఇంటికి దగ్గరలోనే ప్రాథమిక పాఠశాల ఉందని ఇంతకుముందే చెప్పాను కదా. నేను దానిలో చదువుకొనేటప్పటికి ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేవారు. వాళ్ళ పిల్లల్ని, అంత చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా తమతో పాటు అదే  పాఠశాలకు తీసుకొచ్చే వారు. అందరితో పాటు కూర్చోబెట్టేవారు. మేమంతా వాళ్ళతో కూడా కలిసి ఆడుకొనేవాళ్ళం. అయినా, మా మాస్టారు గారి పిల్లలని కొంచెం వాళ్ళతో జాగ్రత్తగానే ఉండేవాళ్ళం. రాజులు, కాముంట్లు, కాపులు, శెట్టి బలిజలు, మాల-మాదిగలు…ఇలా అంతా కలిసే చదువుకొనే వాళ్ళం. వాళ్ళే కులాలో వాళ్ళే చెప్పేవారు. ఒకవేళ ఒకరిద్దరు చెప్పకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల్ని బట్టి మాకు తెలిసిపోయేది. 

ముగ్గురు నన్ను బాగానే చూసేవారు. కానీ, వెంకటరెడ్డి మాస్టారు మాత్రం నన్నెందుకో ప్రత్యేక అభిమానంతో చూసేవారు. ఆయన ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు క్యారియర్ తీసుకుతెచ్చుకునేవారు. దానితో పాటు రెండు అరటి ఆకులు కూడా తెచ్చేవారు. నాలుగు అలలతో ఉండేదా క్యారియర్. ఒకటీ లేదా రెండింటిలో అన్నం, ఒకదానిలో పప్పు లేదా ఏదొక కూర, మరొక దాంట్లో మజ్జిగో, సాంబారో లేదా ఏదైనా స్వీటో ఉండేది. సాధారణంగా మధ్యాహ్నం బెల్ కొట్టిన వెంటనే మా ఇళ్ళకు వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళం. అందరి ఇళ్ళూ దగ్గరదగ్గరేకదా. మేడమ్ గారు, వెంకట్రావు మాస్టారు చాలు కూడా మా ఊళ్ళోనే ఉండేవారు గనుక, భోజనాలకు వెళ్ళి వచ్చేవారు. త్రినాథరావు మాస్టారు ఉదయమే ఇంటి దగ్గరే తినేసి వచ్చేవారు. ఇక, వెంకటరెడ్డి మాస్టారు మాత్రం క్యారియర్ తెచ్చుకునేవారు. మధ్యాహ్నం భోజనాలు చేయడానికి ఒక చిన్న గదిలోకి వెళ్ళి భోజనం చేసి వచ్చేవారు. ఒకరోజు నేను మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి వెళ్ళకుండా నాలాగే ఇంకొంతమంది పొద్దున్నే తినేసి వచ్చేసినవాళ్ళమంతా కలిసి ఆడుకుంటున్నాం. అప్పుడు వెంకటరెడ్డి మాస్టారు నన్ను పిలిచి, ''నా క్యారియర్ లో అన్నం ఉంది. ఒక అరిటాకు ఉంది. దానిలో పెట్టుకొని తిను'' అన్నారు. ముందు వద్దనీ, తినివచ్చాననీ చెప్పాను. '' ఫర్లేదు తిన్రా…ఎంతో లేదులే…మంచి కూరుంది…తిను…పొద్దున్నెప్పుడో తిన్నావు కదా…తిను'' అన్నారు. మారు మాట్లాడకుండా ఏదో సంతోషంతో వెళ్ళి తిన్నాను. ఆ క్యారియర్ ని నుయ్యి దగ్గరకు పట్టికెళ్ళి కడిగేసి మళ్ళీ అదింతకుముందెక్కడుందో అదే బ్యాగ్ లో పెట్టేశాను. ఆ రోజు ముద్ద పప్పు, ఆవకాయ ముక్కతో మాస్టారి క్యారియర్ తిన్నాను. తర్వాత మజ్జిగ కూడా వేసుకున్నాను. మాస్టారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ, వాటిని ఆయనకెలా చెప్పాలో నాకు తెలియలేదు. తిన్నానండీ…అంటూ మాత్రం ఆయన ముఖంలోకి చూస్తూ  తడిసి నా కళ్ళను మాత్రం తుడుచుకున్నాను.ఆయన నన్ను దగ్గరకు పిలిచారు. భుజమ్మీద చేయివేసి, దగ్గరకు తీసుకొని తెరమీదకు చేయి పోనిచ్చి నిమురుతూ 'రేపటి నుండి రోజూ మధ్యాహ్నం నా దగ్గరే తిను…ఇంటికొద్దులే' అన్నారు. అలాగే నండీ అనడానికి బదులు తలూపాను. 

ఆ రోజు జరిగిందంతా మా ఇంట్లో చెప్పాను. ''ఆయన తినమంటే మాత్రం అలా తినేయడమేనా?'' అంది మాయమ్మ. '' పోనివ్వే…ఆయనకేదో పెట్టాలనిపించింది…వాళ్ళ కొడుకులా అనుకున్నారేమో…' అన్నాడు నాన్న. 

వెంకటరెడ్డి మాస్టారు నన్నెంతో ప్రేమగా చూసేవారు. నన్ను పెద్ద చదువులకోసం కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ పంపిస్తాను అనేవారు. ఆ పట్టణాల్లో, ఆ నగరాల్లో ఎప్పుడెప్పుడు వెళ్ళి చుదువుకుంటానా…అని కలలు కనేవాణ్ణి. 

ఆ రోజుల నాటికే కోస్తా ప్రాంతంలో దళితుల్లో బాగా చైతన్యం వస్తుంది. ఒకవైపు క్రిష్టియన్ మిషనరీల వల్ల చాలా మంది విద్యావంతులయ్యారు. కమ్యూనిష్ట్ ఉద్యమాలు వల్ల భూమి కోసం పోరాటాలు జరుగుతున్నాయి. మరొకవైపు మా ప్రాంతంలో  బొజ్జా అప్పల స్వామి, పొలమూరి బాలకృష్ణ, డి.బి.లోక్, ఎన్. ఎమ్.ఋషి వంటి వారు  అంబేద్కరిజాన్ని వ్యాపింపజేయడం,  అప్పటికే కుసుమ ధర్మన్న రచనలు,  ఆది ఆంధ్ర ఉద్యమం,  బోయి భీమన్న పాలేరు నాటకం వంటి వాటి  వల్ల మాల, మాదిగ కులస్థులు చాలా మంది చదువుకోవడం, కావాలనే  రావు, శాస్త్రి, రెడ్డి వంటి విశేషణాలతో తమ పేర్లు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఆ ప్రభావంతో వచ్చిన పేరే ఆ మాస్టారికి వెంకటరెడ్డి కావొచ్చు. ఆ ప్రభావంతోనేనేమో  నా పేరు కూడా వెంకటేశ్వరరావు అయ్యింది. నన్ను బడిలో వేసేదాకా ఆగకుండా ఒక కోయిల ముందే కూసినట్లు నాను నేనుగా వెళ్ళిపోయినా ఆ తర్వాత మా అమ్మ బడిలో  చెప్పి మరీ రాయించానని చెప్పింది. ఆ చైతన్యం వల్లనే దళితుల పేర్లెలా రాయమంటారని కూడా ఆ యా పాఠశాలల్లో తల్లిదండ్రుల్ని ఆ యా హెడ్మాస్టర్లు అడిగేవారేమో. 

  • ఇంత చైతన్యం ఉన్నా విద్యార్థుల్ని వాళ్ళ కులాల్ని బట్టే సందర్భోచితంగా వ్యవహరించేవారనిపిస్తుంది. నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు విద్యార్థుల్ని ఊరేగింపుగా ఊరంతా నినాదాలు చేయించుకుంటూ తిప్పేవారు.  ఒకసారి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండాలు పట్టుకొని ఊరేగుతున్నాం. విద్యార్థులకు కొన్ని కరపత్రాల్ని ఇచ్చి పంచమనేవారు. ఆ ఊరేగింపు ప్రధాన వీధుల్లోనే జరిగేది. మా పేటల్లోకి వచ్చేది కాదు.

నేను అప్పుడు నాల్గో ఐదో తరగతో చదువుతున్నాననుకుంటాను. మా తరగతికి నేను క్లాసు లీడర్ని. క్లాస్ లీడర్స్ అంతా జెండాలు పట్టుకొని ముందు నడవాలి. వాళ్ళ వెనుక ఆ తరగతులు వాళ్ళు అనుసరిస్తూ నడవాలి. మాలో ఒకరికి మరేదైనా ముఖ్యమైన పని ఉంటే చెప్పేవారు. అంటే కరపత్రాలు పంచడం, పప్పు బెల్లాలు పంచడం, ఆ గ్రామ పెద్దలు ఏమైనా ఇస్తే తీసుకోవడం వంటివి.

 మా క్లాసులో లీడర్ని. అందువల్ల జెండా పట్టుకొని నేనే ముందు నడవాలి. అలా కాకపోతే ఊళ్ళో వాళ్ళకి మా పాఠశాలలో ఇచ్చిన స్వీట్స్ పంచాలి. మరికొంతమంది కరపత్రాలు ఇవ్వాలి.

ఒక సంవత్సరం పాఠశాలలో పోటీలు పెడుతున్నామని, ఊరి పెద్దల్ని రమ్మని ఆ కరపత్రాల్ని ఇవ్వాలి. నన్ను ఈ పనులేవీ చెయ్యొద్దన్నారు.

మేష్టార్లు నన్ను నినాదాలు ఇవ్వమన్నారు. ఆ రోజు వెంకటరెడ్డి మేష్టారు రాలేదు. మిగతా మేష్టార్లు నన్ను జై కొట్టుకున్నారు. క్లాస్ లో సరిగ్గా చదవలేనివాళ్ళు ముందుకొచ్చారు. నన్ను చూసి వాళ్ళు నవ్వుతూ నన్ను వెనుక నిలబడమన్నారు. మనసంతా శత్రువులెవరో పండిన పంటను కాల్చేస్తున్నంత బాధగా మూలిగింది. లేత అరిటాకు మీద వేడివేడి భోజనం పెట్టి తినడానికి కూర్చున్నప్పుడు అక్కడ నుండి లేపేసినట్లనిపించింది. ఆ మొవ్వు అరిటాకునెవరో మంటల్లో తగలబెట్టినట్లో, ఆ లేత ఆకులాంటి గుండెల్నెవరో చీల్చేస్తున్నట్లనిపించింది. నా ప్రమేయం లేకుండానే నా కాళ్ళూ, చేతులు వాళ్ళిచ్చే నినాదాలకు యాంత్రికంగా పనిచేశాయి. కన్నీళ్ళు మనసులోనే గడ్డకట్టించుకొని బరువుబరువుగా ఆ కార్యక్రమమంతా మోసినట్లనిపించింది. 

ఆ రోజు జెండా పండుగ ఇచ్చిన విషాదాన్నంతా కళ్ళల్లో మూటకట్టుకొని ఇంటికొచ్చాను. ఎప్పటిలాగే ఇంటిదగ్గరెవరూ లేరు. అమ్మా నాన్నా పనికెళ్ళి ఇంటికొచ్చేసరికి రోజూ అలాగే చీకటి పడుతుందనగానే వస్తారు.  కానీ ఆ రోజెందుకో వాళ్ళంతా తొందరగా వచ్చేస్తే బాగుణ్ణుననిపించింది. మా చెల్లికి పాలో మజ్జిగ బువ్వో పెట్టాను. సరదాగా ఆడిస్తూ పెడితేనే తినే మా చెల్లి నా మనసులోని బాధను గ్రహించిందేమో ఏమీ మాట్లాడకుండా పెట్టినా తినేసింది. 

అమ్మ పొద్దంతా అలసిపోయి వస్తుంది.అందువల్ల వాకిలి తుడిచేసేవాణ్ణి. కుండలు కడిగేసి అన్నం కూడా వండేసేవాణ్ణి. అమ్మ వచ్చి కూర వండేది. కానీ, ఆ రోజు ఏమీ చెయ్యబుద్ధి కాలేదు.ఈ లోగా మా చెల్లికి కునుకుపాట్లు వస్తున్నాయి. దాన్ని గమనించి తాటాకు చాప వేసుకొని , దానిమీద దుప్పటి కప్పుకొని కళ్ళుమూసుకొని పడుకున్నాను. కానీ ఆరోజు నన్ను మొదటి వరుస నుండి తప్పించి, వెనుక నిలబడమన్న మాటలే వినిపిస్తున్నాయి. మనకిష్టంలేనివారి స్పర్శ ఎంత అసహ్యంగా అనిపిస్తుందో '' నువ్వక్కడి నుండి వెనెక్కళ్ళు" అనే మాటలంత చిరాకుని కలిగిస్తున్నాయి. మా చెల్లి పడుకొని ఎందుకో మూలుగుతుంది. నా కష్టం మరిచిపోయాను. పక్కనే పడుకొని చేయివేసి బొజ్జోపెడితే పడుకుంది. నాకు కూడా ఎప్పుడు నిద్ర పట్టిందో నిద్రపోయాను.


( సశేషం)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

 తెలుగుశాఖ అధ్యక్షులు, 

స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, 

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ), 

హైదరాబాద్ --500 046

ఫోన్: 9182685231, darlahcu@gmail.com


No comments: