"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

14 సెప్టెంబర్, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) 8వ భాగం

 ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) 8వ భాగం భూమి పుత్ర దినపత్రిక 14.9.2022సౌజన్యంతో) 



అరుంథతీదేవి మన ఆడపడుచే!

మహాభారతం రాసింది మీతాతగారే!!



నేనలా నాకు నేనే ప్రాథమిక పాఠశాలలో చేరిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకేమీ పెద్దగా పనులు చెప్పేవారు కాదు.

కానీ, పొద్దున్నే లేవాలి. అలా లేవలేకపోతే గుది దెబ్బలు తినాల్సిందే.

లేచిన తర్వాత ఎవరు కప్పుకున్న దుప్పట్లు వాళ్ళే మడతపెట్టాలి. దానితో పాటు ఎవరి చాపలు వాళ్ళే చుట్టి ఇంట్లో జాగ్రత్తగా పెట్టాలి. అలా పెట్టకపోతే ఆ నిద్ర మత్తు ఆ రోజంతా ఉంటుందని చెప్పేవారు.ఈ పద్ధతి మేము పెద్దవాళ్ళయ్యేవరకూ కొనసాగింది. 

క్రమేపీ తాటాకు చాపలు పోయి తుంగ చాపలు వచ్చాయి. ఇంకొన్నాళ్ళకి తుంగచాపలు పోయి నులక మంచాలు వచ్చాయి. నులకమంచాల స్థానంలో బద్దిమంచాలు వచ్చాయి. 

అప్పుడు కూడా మంచం ఎత్తి గోడకు చేసెయ్యాలి. అలా ఎవరైనా చెయ్యకపోతే గుది సిద్ధంగా ఉండేది.

పెద్దన్నయ్య పెళ్ళయ్యేవరకూ మాకు పరుపుల మంచం తెలియదు. 

అందరికీ మంచాలు వేసుకోవాలంటే ఇళ్ళు సరిపోయేది కాదు. అందువల్ల కొంతమంది వాకిలిలో ఆరు బయట మంచం వేసుకొని పడుకొనే వాళ్ళం. ఆ వెన్నెల రాత్రుల్లో అలా ఇంటి బయట మంచాలపైపడుకొని ఆకాశాన్ని చూస్తుంటే భలే సరదాగా ఉండేది. 

ఆకాశంలో చుదమామనీ, దాని చుట్టూ ఉండే నక్షత్రాల్నీ చూస్తూ రకరకాల కథలు వినేవాళ్ళం. 

పేదరాశి పెద్దమ్మ ఆ చందమామలో నూలు వడుకుతుందనీ, అందుకే ఆ చందమామలో ఆ నల్లని మచ్చలా ఆమె కనిపిస్తుందనీ చెప్పేవారు. 

అలా ఆకాశంలో చుక్కల్ని చూస్తూ లెక్కపెడుతుంటే మాతో పెద్దోళ్ళు అలా లెక్కపెట్టకూడదనేవారు. ఎన్ని చుక్కల్ని లెక్కపెడితే అన్ని పుట్టుమచ్చలు మన శరీరం మీద ఏర్పడతాయని భయపెట్టే వారు. 

అయినా సరే ఆకాశంలో చుక్కల్ని లెక్కపెట్టి, తెల్లవారిన తర్వాత మా పుట్టుమచ్చల్ని లెక్కపెట్టుకునేవాళ్ళం. అయితే ఎన్నిసార్లు చూసుకున్నా, ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవే ఉండేవి. మనం లెక్కపెట్టి నప్పుడు దేవుడు చూడలేదేమో అనుకోగానే వాళ్ళం. 

అదేమిటో గానీ, ఎంత సేపు చూసినా ఆకాశాన్నీ, ఆ నక్షత్రాల్నీ అలాగే చూడాలనిపించేది. 

అలా చూడగా చూడగా కొన్ని నక్షత్రాలు బాగా పెద్దవిగాను, మరికొన్ని చిన్నవిగాను కనిపించేవి. కొన్ని నక్షత్రాలు కదులుతున్నట్లు కనిపించేవి. కొంతదూరం వెళ్ళాక మాయమైపోయేవి. 

మా అన్నయ్య వాళ్ళు వాటిని విమానాలని చెప్పేవారు, కొన్ని నక్షత్రాలు అలా రాలిపోతుంటాయనీ అనేవారు.

ఆకాశంలో బాగా మెరుస్తూ, అన్నింటికంటే పెద్దవిగా కొన్ని నక్షత్రాలు కనిపించేవి. వాటికి దగ్గర్లో ఒక నక్షత్రం ఉంటుంది. దాని పేరు ఆరంజ్యోతి (అరుంధతి) అని మా అమ్మ చెప్పేది. 

''ఆ ఆరంజోతి మనింటి పిల్లే…అలా నక్షత్రంగా మారిపోయింది'' అని మా అమ్మ అనగానే మాకు ఆశ్చర్యమనిపించేది. వెంటనే మేము కుతూహలంగా  అడిగేవాళ్ళం.

 ''ఎందుకలా మారిపోయిందమ్మా'' అని!

'' ఆ యమ్మకి దేవతలు వరమిచ్చారట''

'' ఏం చేసిందని అలాంటి వరమిచ్చారు?''

''అదో పెద్ద కతలే. మీకు నిద్రవచ్చేస్తుంది. పడుకోండి. తర్వాత ఎప్పుడైనా చెప్తాను..''  అన్నప్పటికీ మేము ఆ కథేమిటో వినాలనిపించేది. చెప్పమనేవాళ్ళం.

మా ఆ కథ చెప్పేది.

***    

ఆరంజోతి ముందు జన్మలో  ఎంతో అందమైన పిల్ల. ఆమె పేరు సంధ్యాదేవి. అందరి కళ్ళూ ఆమె మీదే పడేవి. అందుకని ఆమె కోపంతో చూస్తే వాళ్ళంతా మాడి మసైపోయేవారు.

 అలా లోకంలో మగాళ్ళంతా చనిపోతుంటే రుషులంతా కలిసి దేవతల్ని ప్రార్థించారు. 

దేవతల్లో బాగా దయగలవాడు శివుడు. ఆయన  ప్రత్యక్షమయ్యాడు. 

వాళ్ళంతా కలిసి శివుడికి విషయమంతా వివరించారు. 

శివుడు తన మూడో కన్నుతో చూశాడు. ఇది బ్రహ్మగారు చేసిన పని అని తెలుసుకున్నాడు.

ఆ సంగతిని తాను సమయం వచ్చినప్పుడు చూసుకుంటానని అభయమిచ్చాడు. 

*** 

 ఈ ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు తనకు సహాయంగా తన మనో సంకల్పంతో మన్మథుణ్ణి సృష్టించాడు.అతనికి కొన్ని శక్తుల్ని ప్రసాదించాడు. ఆ శక్తుల్ని ఉపయోగించుకొని తన పనిని మన్మథుడు ఎవరినైనా తన వైపుకు లాక్కోవచ్చన్నమాట.

మన్మథుడితో పాటుబ్రహ్మ తన మనో సంకల్పంతోటే ఒక అమ్మాయిని కూడా సృష్టించాడు. ఆ పిల్ల అన్ని లోకాల్లోని ఆడపిల్లలకంటే అందంగా ఉండేది. ఆమె పేరే సంధ్యాదేవి. 

మన్మథుడు తనకున్న శక్తిని తెలుసుకోవాలనుకున్నాడు.

తన శక్తిని బాణాల్లా మార్చేసి, సంధ్యాదేవి మీద విసిరాడు. 

ఆమెను చూసి అక్కడున్నవాళ్ళంతా మోహంలో పడిపోయారు. 

వాళ్లతో పాటు బ్రహ్మ కూడా ఆమెను చూసి మోహంలో పడిపోయాడు.

క్షణ కాలంలో బ్రహ్మ తన మోహానికి గల కారణాన్ని తెలుసుకున్నాడు.

వెంటనే బ్రహ్మ మన్మథుణ్ణి …‘‘శివుని నేత్రాల నుండి వచ్చిన అగ్నిలో బూడిదవుతావు. అలాగే నీకు తెలిసో తెలియకో సహకరించిన సంధ్యాదేవి కూడా అగ్నిలో దహనం అయిపోతుంది’ అని శపించాడు. ఆయన బూడిదయ్యాడు. మళ్ళీ శివుడికి దయకలిగి అతన్ని బ్రతికించాడు. అదో కథ.

***

సంధ్యాదేవికి తాను చేయని నేరానికి కూడా తాను శిక్షను అనుభవించాల్సివచ్చింది. తానెంతో పవిత్రురాలు. మహాశక్తిశంపన్నురాలు. అందువల్ల అగ్నిని ప్రార్థించింది. అగ్ని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన దేహాన్ని బూడిదచెయ్యమని కోరింది. ఇది తెలిసిన శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు.

 ‘‘నువ్యు తీసుకున్న నిర్ణయానికి తిరుగులేదు. అలాగే ఆహుతి అవుతావు. నీకో వరం ఇస్తున్నాను. వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు ఆ అగ్ని గుండం నుండే జన్మిస్తావు. అందువల్ల నిన్ను అరుంధతీదేవి అనిపిలుస్తారు. నువ్వు లోకంలోని ఆడవాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తావు. నిన్ను ఒక పుణ్యాత్ముడు పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి చేసుకున్న ప్రతీవాళ్ళూ నిన్ను దర్శించడం పుణ్యంగా భావిస్తారు.’’ అని వరమిచ్చి మాయమైపోయాడు శివుడు.

 

శివుడు వరమిచ్చినట్లుగానే ఆ జన్మలో తనకు తాను అగ్నికి ఆహుతయ్యింది.

కొన్నాళ్ళకు ఒక దేశంలో మహారాజుకి పిల్లల్లేరు. యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. కొన్నాళ్ళకు రాజ దంపతులకు ఒక ఆడబిడ్డ పుట్టింది. మగపిల్లాడు పుట్టలేదని ఆ పిల్లని ఊరికి దూరంగా పడేశారు. ఆ పిల్లని పశువుల్ని మేపుకుంటున్నవాళ్ళు చూసి పెంచుకున్నారు. వాళ్ళని అందరితో కలవనిచ్చేవారు కాదు. అయినా ఆ పిల్లని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎప్పుడూ ఆ పిల్ల ఏదో ధ్యానంలో ఉండేది. తనకు తానే ఏదో మాట్లాడుకునేది. పెంచిన తల్లిదండ్రులు ఏమయ్యందని భయపడేవారు.

ఈలోగా  ఒక మహా ముని ఒక శపథం చేశాడు. దాన్ని చాటింపు వేశారు. ‘‘ఎవరైతే ఇసుకతో అన్నం వండుతారో, ఎవరైతే జల్లెడతో నీళ్ళు పట్టుకొస్తారో ఆమెను నేను వివాహం చేసుకుంటాను’’ అదీ అతను చేసిన శపథం.

ఆరంజోతి తాను చేసిచూపిస్తానని చెప్పింది.

‘‘నేనే పవిత్రురాలినైతే నేను దీన్ని నా మనసులో అనుకున్నట్లు చెయ్యి స్వామీ’’ అని దేవుడికి మ్రొక్కుకుని ఇసుకను తీసింది. అన్నం వండింది. జల్లెడతో నీళ్ళను తెచ్చింది. 

ఆమె మాహాత్య్మాన్ని తెలుసుకున్న ఆ ముని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆయన పేరే వశిష్ఠుడు. 

వీళ్ళిద్దరూ అనేక సంవత్సరాలు కాపురం చేశారు. వందమందిని కన్నారు. 

వశిష్ఠ మహర్షి, అరుంధతీదేవికి నూరుగురు పిల్లల్లో  పెద్దవాడు శక్తిమహర్షి. శక్తిమహర్షి భార్య అదృశ్యంతి. వీళ్ళిద్దరికీ పుట్టినవాడు పరాశరుడు. పరాశరుడికీ, సత్యవతికీ పుట్టివాడు వ్యాసుడు. 

ఆ వ్యాసుడే పాండవుల కథ రాశాడు. ఆ వంశానికి చెందినవాళ్ళమే మనమంతా…అందుకనే మీరు బాగా చదువుకోవాలి. 

అరుంధతీదేవి లాగే మన పిల్లలంతా అంత నీతిగా జీవించాలి. ఆమె అలా జీవించింది కాబట్టే ఋషులందరితో పాటు ఆకాశంలో ఓ నక్షత్రంలా మెరుస్తుంది.

అందరి  చేతా పూజలందుకుంటుంది…''

ఇలా మా అమ్మ అనేక కథలు చెప్పేది. 

ఆ కథల్లో స్ఫూర్తిని మాలో నింపేది. 

(సశేషం)


– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

 తెలుగుశాఖ అధ్యక్షులు, 

స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, 

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ), 

హైదరాబాద్ --500 046

ఫోన్: 9182685231, darlahcu@gmail.com


కామెంట్‌లు లేవు: