"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

15 September, 2022

మా పరిశోధక విద్యార్థి డా.బడిగే ఉమేష్ కి డాక్టరేట్ లో సెంట్రల్ వర్సిటీ స్వర్ణ పతకం


 పాఠకుల సౌలభ్యం కోసం భూమిపుత్ర పత్రిక వారి సౌజన్యంతో ....


#స్వర్ణపతకంసాధించినచింతర్లపల్లెసాహిత్యకుసుమం

#బడిగెఉమేశ్

#భూమిపుత్ర

     కాళ్ళకు చెప్పులు లేకుండా పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి, కేవలం కడుపు నింపుకోవడానికి హాస్టల్ ల్లో ఉన్న విద్యార్థి ఒకే జతతోనే ఏళ్ళు గడిపిన విద్యార్థి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు గానూ పసిడి పతకం సాధించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఆ యువకుడే అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మారు మూల గ్రామం చింతర్లపల్లెకు చెందిన బడిగె ఉమేశ్. 


     బడిగె ఉమేశ్ ‘రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ జీవితం, రచనలు: సమగ్ర పరిశీలన’  అనే అంశంపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (ప్రస్తుత హెచ్.సి.యు తెలుగుశాఖ అధ్యక్షులు) పర్యవేక్షణలో 2019లో తన పిహెచ్.డి., పూర్తి చేశారు. ఈ సిద్ధాంత గ్రంథం యూనివర్సిటీ వారు 2022 అక్టోబర్ 1న  నిర్వహించే స్నాతకోత్సవం సందర్భంగా బంగారు పతకానికి ఎంపికైంది. విశ్వవిద్యాలయంలో ప్రతి రెండేళ్ళలో  వచ్చిన సిద్ధాంత గ్రంథాలను పరిగణలోనికి తీసుకుని, నిష్ణ్మాతులచే ఎంపిక చేయబడిన ఉత్తమ పరిశోధనలకు బంగారు పతకాలు ఇస్తారు. అందులో భాగంగా 2019- 2020 కి గాను మానవీయ శాస్త్రాల విభాగంలో అంతర్భాగమైన తెలుగు శాఖ నుండి బడిగె ఉమేశ్ సిద్థాంత గ్రంథం అత్యుత్తమ పరిశోధనా గ్రంథంగా పరిగణించబడటం విశేషం. 2022 అక్టోబర్ 1 నాడు ‘డాక్టరేట్’ పట్టాతో పాటు ‘డా. కామేశ్వరీదేవి మెమోరియల్ మెడల్’ (గోల్డ్ మెడల్) ను అందుకోబోతున్న డా. బడిగె ఉమేశ్ కు భూమిపుత్ర పత్రిక సంపాదక వర్గం అభినందలు తెలుపుతోంది. 


     ఈ శుభ సంధర్భంలో బడిగె ఉమేశ్ భూమిపుత్ర పత్రికతో... తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు. ‘‘ఒక సాధారణ విద్యార్థినైన నేను 2011లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకీ చేరిన నాటి నుంచి అక్కడి వాతావరణం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఎం.ఏ కోర్సు రెండేళ్ళలో అక్కడి గురువుల బోధన చదువు పట్ల ఆసక్తిని, అనురక్తిని పెంచింది. ముఖ్యంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఎంతో చైతన్యవంతంగా పాఠాల్ని బోధించేవారు. వీరు ప్రాచీన, ఆధునిక విషయాలను ఎప్పటికప్పుడు క్రోఢీకరిస్తూ విద్యార్థులను బాగా బోధన చేసేవారు. అవి విని నేను పరిశోధన పట్ల ఆకర్షితుణ్ణయ్యాను. తదనంతరం ఎం. ఫిల్ ఎంట్రెన్స్ రాశాను. సీటు వచ్చిన వెంటనే ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు దగ్గర చేరాను. అక్కడ వారు పరిశోధనపై విశేషమైన మక్కువను కలిగించారు. అంతేకాకుండా పోటీ పరిక్షలకు కూడా బాగా చదవాలని ప్రోత్సహించడంతో నేను జె. ఆర్. ఎఫ్ సాధించగలిగాను. అలాగే నాకు ఆర్. జి. ఎన్. ఎఫ్ కూడా వచ్చింది. 


      ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో "రాళ్ళపల్లి పీఠికలు: పరిశీలన" అనే అశంపై 2014లో ఎం. ఫిల్ పూర్తి చేశాను. ఆ క్రమంలోనే పరిశోధన ప్రాథమిక సూత్రాల్ని, సిద్ధాంత వ్యాస మెళుకుల్ని బాగా నేర్చుకోగలిగాను. టెక్నాలజికి చెందిన అంశాలనూ, ప్రధానంగా తెలుగు టైఫింగ్ లాంటివి వారు నాకు చాలా సులభంగా అలవడేలా చేశారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే  పిహెచ్. డి., ప్రవేశ పరీక్ష కూడా రాశాను. సీటు వచ్చింది. ఎం. ఫిల్ ల్లో శర్మగారి పీఠికల పై పరిశోధన చేయడంతో వారి సాహిత్య మీద అమితమైన అభిరుచి కలిగింది. పైగా తెలుగు సాహిత్యంలో శర్మగారిపై ఇంతవరకు పిహెచ్.డి., జరకగక పోవడంతో మా పర్యవేక్షకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సూచనల మేరకు రాళ్ళపల్లి వారి జీవితం, మొత్తం సాహిత్యం మీద పరిశీలన చేయాలని నిర్ణయించుకున్నాను. "రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ జీవితం, రచనలు: సమగ్ర పరిశీలన" అనే అశంపై 2014 నుండి 2019 వరకు నా పరిశోధన కొనసాగించాను. ఈ విషయమై అధ్యయనం చేస్తున్న సందర్భంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఎన్నో సలహాలు, సూచనలు నా పరిశోధన పరిపుష్ఠిని విస్తృతం చేశాయి. అంతేకాదు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నాకు దైర్యం చెప్పి ముందుకు నడిపించారు. గురువుగారు పరిశోధన పాఠాలతో పాటు జీవితం పాఠాల్ని కూడా నేర్పించారు. నేను సెంట్రల్ యూనివర్శిటీకీ చేరినప్పుడు ఒక సాధారణ విద్యార్థినే కాని అక్కడి గురువుల బోధన, ప్రముఖంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సాన్నిహిత్యంతో రాయిగా ఉన్న నేను ఒక చిన్న శిల్పంగా రూపాంతరం చెందాను. 


    డా. బి. ఆర్. అంబేద్కర్ భావజాలాన్ని నమ్మి సదా ఆచరిస్తున్న మా గురుదేవులు ఆచార్య దార్ల వారు ప్రతిభా, పాఠవాలతో పాటు పేద విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో చేయూతను ఇస్తుంటారు. ఎందుకంటే! దళిత విద్యార్థులు ఎన్నో కష్టాల్ని అవమానాల్ని ఎదుర్కొని ఈస్థాయికి వచ్చింటారని వారికి బాగా తెలుసు. దీనికి కారణం వారు కూడా అదే స్థాయి నుంచే వచ్చారు కాబట్టి. ఇలా అన్ని రకాల విద్యార్థుల్ని వారు ప్రోత్సాహించే తత్త్వాన్ని నేను దగ్గరుండి చూశాను. ఈ రోజు నేను ఒక మారుమూల గ్రామం నుండి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో "బంగారు పతకం" అందుకో గలిగానంటే కారణం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారిచ్చి ప్రోత్సామే. 


    ఆలాగే నా తల్లిదండ్రులు రోజూ ఎండనకా, గాలనకా ఇప్పటికి కూడా వారు కష్టపడి పని చేస్తూ నన్ను నా తమ్ముల్నిద్ధర్నీ చదిస్తున్నారు. మాకోసం వారు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వారికి ఎటువంటి కష్టం రానియకండా చూసుకోవడానికి మేం నిరంతరం కృషి చేస్తాం. ఈ మధ్యనే నాకు వివాహం అయ్యింది. నా జీవిత భాగస్వామి ఎచ్. అశ్వినీ కూడా నా ఎదుగుదలకు ఎంతో తోడ్పాటును అందిస్తుండడం నా అదృష్టం. 


    అంతేకాకుండా ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత చదువుల వరకు నా అజ్ఞానాన్ని భరించి ఎంతో ఓపికగా పాఠాలు భోధించి విద్యాదానం చేసిన ప్రతి గురువుకి నేను ఈ సందర్భంగా కైమోడ్పులు సమర్పిస్తున్నాను. ముఖ్యంగా నేను హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చేరడానికి కారణమైన డా. కాటంరెడ్డి రామలింగం రెడ్డి (తెలుగు అధ్యాపకులు, కర్నూలు)గారికి, లోకాభిరామాయణాన్ని నిత్యం తమ అనుభవం నుంచి తెలుపుతున్న శ్రీఘట్టమరాజు అశ్వత్థనారాయణ (విశ్రాంత హిందీ అధ్యాపకులు, బెంగుళూరు) గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేక్షంగా, పరోక్షంగా నా అభ్యున్నతికి చేయూతనందిస్తున్న బంధుమిత్రులకూ, శ్రేయోభిలాషులకూ వినమ్ర మప్పిదాలు. 


     ఈ "బంగారం పతకం" నా బాధ్యతను ఎంతగానో పెంచిందని నేను భావిస్తున్నాను. అంతే కాకుండా ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది గోరంతే! ఇంకా తెలియాల్సింది కొండంతని నా అభిప్రాయం. మా గురువు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం నుండి హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుల వరకు ఎదిగిన విధానమే నాకు ఆదర్శం. వారి జీవితం నా లాంటి పేద విద్యార్థులకు ఒక గొప్ప గుణపాఠమని నా విశ్వాసం. ఈ సందర్భంగా మా గురువు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’ 


    పరిశోధకుడు డా. బడిగె ఉమేశ్ ఇప్పటివరకు ఒక అంతర్జాతీయ సదస్సు, ఎనిమిది జాతీయ సదస్సుల్లో తమ పరిశోధన పత్రాలను ఆయా అంశాలపై సర్పించారు. ఈయన రాసిన వ్యాసాలు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, ఆంధ్రభూమి, భూమిపుత్ర, దిటైమ్స్ టుడే, సృజన నేడు, పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అలాగే మాసపత్రికలైన రాయలసీమ జాగృతి, పాలపిట్ట, భావవీణ, సంశోధన, మూసీ, అమ్మనుడి లలో కూడా కొన్ని వ్యాసాలు అచ్చయ్యాయి. కొన్ని ప్రత్యేక గ్రంథాల్లో కూడా వచ్చాయి. ఉమేశ్ సుమారు 30 కి పైగా వ్యాసాలు రాయడం విశేషం. ప్రస్తుతం వీరు కేంద్ర ప్రభుత్వంలో భాగమైన ‘ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం’ నెల్లూరు లో అసోసియేట్ ఫెలో గా విధులు నిర్వర్తిస్తున్నారు. డా. బడిగె ఉమేశ్ ఈ చైతన్యంతోనే తెలుగు సాహిత్యంలో ఇంకా వెలుగు చూడని అంశాలపై పరిశోధన చేయాలని, తమ భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలని, వీలైనంతలో నలుగురికి సహాయం చేయాలని ‘భూమిపుత్ర’ పత్రిక ద్వారా ఆకాంక్షిస్తూ... శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

No comments: