"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

07 సెప్టెంబర్, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు)- 7 వ భాగం

 ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలి కన్నులు) 7 వ భాగం (భూమి పుత్ర దినపత్రిక 14.9.2022సౌజన్యంతో)



మా పేర్లు మా ఇష్టం ప్రకారం ఉండవు!

మా పుట్టిన తేదీలు మా అభీష్టం ప్రకారం రాయరు!!


పిల్లల్ని బడిలో చేర్చేటప్పుడు చాలామంది ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో హడావిడి చేస్తారు.  అందరికీ స్వీట్స్ పంచుతుంటారు. మరికొంతమందికిలా ఉండదు. పిల్లలు బడికి దూరంగా బ్రతుకు భారంగా గడుపుతుంటారు.  తినగా మిగిలినవి పారేసిన చెత్త బుట్టల్లో దొరికినవి తింటుంటే ఆ పిల్లల కళ్ళల్లో మెరిసేకాకరపువ్వొత్తుల్లా ఆనందం కురుస్తున్నట్లుంటుంది. ఈ రెండు దృశ్యాల్లో దేన్ని చూసినా  నేను బడిలో చేరిన రోజులే గుర్తుకొస్తుంటాయి. అందరిలా నన్ను అమ్మా నాన్నా బడిలో చేర్చలేదు. చేర్చకూడదనేది కాదు వాళ్ళ ఆలోచన. ఇంకా బడిలో చేర్చే సమయం రాలేదనుకోవడమే దానికి కారణమేమో.  నా పాఠశాల ప్రవేశం విచిత్రంగా జరిగింది.

ఇంట్లో పెద్దన్నయ్య చదువుకుంటున్నాడు. రెండవ అన్నయ్య చదవడం లేదు.నేను మూడోవాణ్ణి. అప్పటికి నాకు నాలుగో, ఐదోయేడో ఉంటుందేమో. అప్పటికే నాకు ఓ తమ్ముడున్నాడు. చివరిగా పుట్టిన ఒక చెల్లి ఉంది. ఆ పిల్లకు ఇంకా పాలు తాగే వయసు. తమ్ముడు అమ్మానాన్నలకు గారాలపట్టి. కాబట్టి వాడు ఎప్పుడూ వాళ్ళతోనే ఉండేవాడు. ఇక నేను మా చెల్లిని ఎత్తుకోవడం నా డ్యూటీలో ఒక భాగం. మా చెల్లిని ఇప్పటికీ పాప అనే పిలుస్తుంటాం. అందరికంటే చివరిలో పుట్టింది. అందువల్ల పాప అని ముద్దుగా పిలుచుకునేవాళ్ళం. అమ్మానాన్నా పనికి వెళ్తే నేనే మా పాపను ఎత్తుకోవాలి.

 మేము శిస్తుకి చేసే పొలంలో సంవత్సరానికి ఒకసారి ఖరీఫ్ కి వరిపంట పండేది. తర్వాత రెండవపంటగా కూడా వరి వేయడానికి సరిపడా నీళ్ళు ఉండేవి కాదు. అందువల్ల రబీ పంటగా అపరాలు వేసేవారు. మరికొంతమంది వేరుశనగ పంట పండించేవారు. మేము కూడా ఇంటిల్లిపాదీ ఆ పొలంలో రాత్రనకా, పగలనకా వచ్చే కొద్దిపాటి నీటినీ గుల్లలతో గానీ, గూడలతో గానీ తోడుతూ పొలంలోకి నీళ్ళు పెట్టుకోగలిగేవాళ్ళం. కాబట్టి వేరుశనగ పంటవేసేవాళ్ళం. మాకు గేదెలతో పాటు రెండు ఒంగోలు గిత్తలుండేవి. వాటితో మా నాన్న అరక దున్నేవాడు. దానితోనే మా పొలమంతా దున్ని వేరుశెనగ పంటవేశాం. ఆ పంట వేసేముందు చేను చదును చేయడానికి అరకకు ఒక కంపకడతారు. దాని మీద రాళ్ళు పెట్టి ఈడుస్తారు. అలా ఈడ్చేటప్పుడు నేను, మా తమ్ముడు ’’నేనంటే...నేను‘‘ అనుకుంటూ ఆ కంపపై కూర్చొనేవాళ్ళం. కూర్చున్నవాళ్ళం అలా జాగ్రత్తగా కూర్చోవచ్చు కదా. అరకతోలుతున్న మా నాన్నకు తెలియకుండా కొన్ని రాళ్ళు తీసుకొని ఆ ఎద్దుల వెనుక రెండు కాళ్ళ వెనుకా తగిలేట్లు కొట్టేవాళ్ళం. దాంతో ఆ ఎద్దులు వేగంగా లాగేసేవి. అలాంటప్పుడు ఆ కంపమీదున్న మేము పడిపోయేవాళ్ళం. అలా కొట్టడం, పడిపోవడం అదో సరదాగా ఉండేది. 

వేరుశెనగ పంటకు విత్తనాలు వేసి, అవి మొలకొచ్చేదాకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పక్షులు, కోళ్ళు ఆ గింజల్ని తినేస్తాయి. మరొకవైపు చీమలు కూడా తినేస్తాయి. అందువల్ల ఆ విత్తనాలకు ఏవో కొన్ని ఫౌడర్స్ కూడా కలిపి చల్లుతారు. అందువల్ల మొక్కలు వచ్చేవరకూ చేనంతటినీ చంటిపిల్లలా చూసుకోవాలి. అలా చూడ్డంలో మానాన్న ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించేవాడు. 

మొక్క వచ్చేసిన తర్వాత నుండీ అప్పుడప్పుడూ నీళ్ళు పెట్టాలి. ఒక్కోసారి మేమే బకెట్లతో మొక్కలకు నీళ్ళు చల్లేవాళ్ళం. కొంచెం పెద్దవి అయిన తర్వాత నీళ్ళు పెట్టాలి. కాల్వలో నీళ్ళుండేవి కాదు. అందువల్ల మా చేను దగ్గర ఉండే బోదిలో కొద్ది కొద్దిగానే నీళ్ళు వచ్చేవి. వాటిని పెద్దరైతులు ఇంజన్లు పెట్టి తోడేసేవారు. మా పొలాలకు నీళ్ళు దొరికేవి కాదు. అందువల్ల రాత్రి వేళల్లో గుల్లలతో  నీళ్ళు తోడేవాళ్ళం. అలా నీళ్ళు తోడుతుంటే ఒక్కోసారి నిద్రవచ్చేసి ఆ గుల్లకు చేతులతో తిప్పడానికి ఉండే ఇనుప ఊస మా ముఖానికి తగిలేసేది. నిద్రను ఆపుకోవడానికి నీళ్ళతో ముఖాన్ని అనేకసార్లు కడుక్కొనేవాళ్లం. 

అలా ఒక యేడాది వేరుసెనగ పంట వేశారు. బాగా పండింది. వేరుశనగ కాయ కోసేసి, అమ్మడానికి ముందు దానికి తేమ లేకుండా చూసుకోవాలి. లేకపోతే సరైన రేటు రాదు. అందువల్ల ఆ కాయల్ని ఎండబెట్టాలి. మేము కూడా అలాగే కాయలు కోసేసి, వాటిని  అలా రాశులుగా పోసి ఎండబెట్టేవాళ్ళం. మా చెల్లిని ఎత్తుకొని ఆడిస్తూ, నేను దానికి కాపలా కాసేవాణ్ణి. 

మా పొలానికి ఆనుకొనే ప్రాథమిక పాఠశాల ఉండేది. ఆ బడిలో పిల్లలు కేరింతలు కొట్టుకుంటూ ఆడుకొనేవారు. నా ఈడు పిల్లలు కూడా ఆ బడిలో చదువుకొంటుండేవారు. ఆ రోజుల్లో దగ్గర్లో ప్రయివేట్ పాఠశాలలు లేవు. అందువల్ల ఊళ్ళో వాళ్లంతా ఆ బడిలోనే చదువుకొనేవారు. బడిలోకి వెళ్ళేటప్పుడు, ఇంటర్వెల్ కొట్టినప్పుడూ బడిలో పిల్లలంతా గువ్వల్లా బయటకొచ్చేవారు. వాళ్ళను రోజూ చూస్తుండేవాణ్ణి. నేను కూడా వాళ్ళతో కలిసి చదువుకోవాలనిపించేది. కానీ, నన్ను ఇంకా బడిలో వేసే వయస్సురాలేదని మా అమ్మానాన్నా బడికి పంపేవారు కాదు. 

ఎప్పటిలాగే  వేరుశెనగ రాశులు పోసి మా అమ్మా నాన్నా పనులకు వెళ్ళిపోయారు. నేను కూడా ఎప్పటిలాగే మా చెల్లిని ఎత్తుకొని వాటి దగ్గర కాపలా ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మా చెల్లిని ఎత్తుకొని పక్కనే ఉన్న బడిలోకి వెళ్ళిపోయాను.  ఆ సాయంత్రం మా అమ్మ నన్ను బాగా తిట్టింది. మా నాన్న కొట్టాడు. ఏదో అంటూ తిట్టడం, కొట్టేవారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది. ఆ రోజు రాశుల దగ్గర కాపలా లేకపోవడం వల్ల ఎవరికి కావలసినన్ని వాళ్ళు తువ్వాల్లోను, చీర కొంగుల్లోను, సంచుల్లోను తమకు దొరికినన్ని వేరుశెనగ కాయలు పట్టుకొనిపోయారని. అవి పోతే పోయాయి. ఆ రోజు దెబ్బలు తగిల్తే తగిలాయి కానీ, మళ్ళీ నన్ను బడికెళ్లొద్దనలేదు. నేనేనాడూ బడికెళ్ళడం మానలేదు. నారెలా రాశారో, నా పుట్టిన తేదీ ఎంత వేశారో, దేన్ని ఆధారంగా చేసుకొని నా పుట్టిన తేదీ ఎలానిర్ణయించారో ఆ నాటి మా బడి పంతుళ్లకే తెలుసు.  మా పేర్లు నిర్ణయించడం, మా పుట్టిన తేదీలు నిర్ణయించడానికి వాళ్ళే మాకు బ్రహ్మల్లా పనిచేసేవారు. అందుకే మా పుట్టిన తేదీలు, మా పేర్లు మా ఊహల్లోనుంచి వచ్చినవి కాదు. మా అభిరుచులనుండి ఏర్పడినవి కాదు. వాళ్ళకు నచ్చితే మంచి పేరు. వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళిష్టమొచ్చిన పేరే మా పేరుగా మారిపోయేది. అదృష్టం కొద్దీ నాకు మంచి పేరే పెట్టారు. మా అమ్మ చెప్పినట్లే రాయాలని పట్టుపట్టిందట. అంతకు ముందేపేరు పెట్టారో తెలియదు కానీ, నా పేరు మాత్రం వెంకటేశ్వరరావు అనే రాశారు. టీచర్స్ డే రోజునే నా పుట్టిన తేదీగా రాశారు. ఇది ఎలా నిర్ణయించారో నాకు తెలియదు. 

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగుశాఖ అధ్యక్షులు,

స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,

హైదరాబాద్ --500 046

ఫోన్: 9182685231, darlash@uohyd.ac.in


(సశేషం)


కామెంట్‌లు లేవు: