దేశ సమైక్యత, సమగ్రతలను చాటేదే దేశభక్తి కవిత్వం
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.జ్ఞానమోతే, డా.ప్రకాశ్ లతో, విజేతలు
ఆజాదీ కా అమృతమహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి దేశభక్తి పద్య పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందీ, తెలుగు భాషల్లో తమకు నచ్చిన దేశభక్తి పద్యం, వచన కవిత్వం, గేయాల్లో దేనినైనా చదివి వినిపించివచ్చునని, అది భారతీయ సమైక్యతను, సమగ్రతను పెంపొందించే విధంగా ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించే మహత్తర కార్యక్రమంగా దీన్ని కొనసాగిస్తున్నామని ఈ కార్యక్రమ సమన్వయకర్త, హిందీ ఆఫీసర్ డాక్టర్ జ్ఞానమోతే అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని దేశభక్తిని ప్రతిఫలించే కవిత్వాన్ని వినిపించారు. మరి కొంత మంది దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన పద్యపఠన పోటీల్లో తెలుగు విభాగంలో శ్రీ రవి రత్నకిరణ్, శ్రీ కె.భాస్కర్ లకు వరుసగా ప్రథమ, ద్వితీయ బహుమతులు, శ్రీమతి ఆస్మాజమాల్, శ్రీమతి సంధ్యారాణి ఇరువురూ తృతీయ బహుమతి సాధించిన విజేతలుగా నిలిచారు. హిందీ విభాగంలో శ్రీమతి ఆశా సిద్ధికి, శ్రీ దుర్గేష్ కుమార్ సింగ్, డా.సచిన్ బళ్ళాల్
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి సాధించిన విజేతలుగా నిలిచారు. విజేతలకు ఒక్కొక్క విభాగంలోను
పదిహేను వందలు, వెయ్యి, ఐదు వందల రూపాయలు చొప్పున నగదు బహుమతులను ప్రకటించారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, హిందీ శాఖ నుండి అసోసియేట్ ప్రొఫెసర్ డా.ప్రకాశ్ కోపార్డే ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. భారతీయ కవులు విశ్వజనీన భావనలతో పాటు దేశభక్తి పూరితమైన కవిత్వాన్ని రాశారనీ, హిందీ భారతీయులనందరినీ కలిపే భాషగా ఉండాలని, దానితో పాటు ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకొనే విధంగా స్థానిక భాషలను ఆదరించే విధంగా త్రభాషా సూత్రాన్ని దేశం పాటిస్తుందని న్యాయ నిర్ణేతలు అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి